Hemant karkare
-
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు
భోపాల్: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులిచ్చింది. ప్రజ్ఞాతో పాటు బీజేపీ భోపాల్ యూనిట్ అధ్యక్షుడు వికాస్ విరానీకి నోటీసులు ఇచ్చినట్లు భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదామ్ చెప్పారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో) ను కోరామన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ నివేదికను అందించారని.. దీనిపై ప్రజ్ఞా, వికాస్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏఆర్వో ఇచ్చిన నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు పంపనున్నామని వెల్లడించారు. కాగా, గురువారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రజ్ఞామాట్లాడుతూ.. తన శాపం వల్లనే హేమంత్ చనిపోయారని వ్యాఖ్యానించారు. -
నా శాపంతోనే కర్కరే బలి
భోపాల్/న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(48) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించినందునే ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని చెప్పారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ..‘మాలేగావ్ పేలుడు కేసులో ముంబై జైలులో ఉన్న నన్ను విచారించడానికి హేమంత్ కర్కరే వచ్చారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరక్కుంటే దానిని సృష్టించేందుకు ఎందాకైనా వెళ్తానన్నాడు. అప్పటిదాకా జైలు నుంచి బయటకు వదిలేది లేదన్నాడు. దుర్భాషలాడుతూ తీవ్రంగా హింసించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నాకేమీ తెలియదు, అంతా ఆ దేవుడికే తెలుసని బదులిచ్చా. తెల్సుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్లాలా? అని ప్రశ్నించాడు. కావాలనుకుంటే వెళ్లాలన్నాను. నువ్వు నాశనమైపోతావని శపించా. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆయన్ను ఉగ్రవాదులు చంపేశారు’ అని అన్నారు. మోసకారి, దేశద్రోహి, మత వ్యతిరేకి అంటూ కర్కరేను ఆమె దూషించారు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు అందిందని, విచారణ చేయిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ తను శపించడంతోనే కర్కరే చనిపోయారన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరేను ద్రోహిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ నేతలు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్‌సభ స్థానంలో ఆమె ప్రత్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన్ను చూసి మనమంతా గర్వపడాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించింది. ‘అశోక్ చక్ర అవార్డు గ్రహీత కర్కరే త్యాగాన్ని అందరూ గౌరవించాలి. ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలి’ అని ట్విట్టర్లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది’అని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆమె వంటి వ్యక్తులతో జరిగిన పోరాటంలోనే కర్కరే చనిపోయారు. ఆయన మృతికి ఉగ్రదాడి కేసు నిందితురాలు శాపం కారణం కాదు. ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనకున్న హక్కులను కాపాడే క్రమంలోనే ఆయన పోరాడుతూ చనిపోయారు. వీర జవాన్లను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంతధైర్యం?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం: బీజేపీ తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. ‘నేను వ్యక్తిగతంగా అనుభవించిన బాధతో ఆ వ్యాఖ్యలు చేశా. నా మాటలను దేశ వ్యతిరేకులు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ వ్యాఖ్యలతో బాధ కలిగితే క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపారని ఆమె సహాయకుడు తెలిపారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జైలులో ఉండగా శారీరకంగా, మానసికంగా అనుభవించిన వేదనతో ప్రజ్ఞా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ తెలిపింది. ‘ఉగ్రవాదులను సాహసంతో ఎదుర్కొని పోరాడుతూ కర్కరే ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆయన్ను వీర జవానుగానే భావిస్తుంది’ అని పేర్కొంది. -
నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా: సాధ్వి
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలొదిలిన ఐపీఎస్ ఆఫీసర్ హేమంత్ కర్కర్‌పై బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడంతో ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని, తాను అన్నమాటల్ని వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ముంబై దాడుల సమయంలో టెర్రరిస్టులతో పోరాడి అసులుబాసిన హేమంత్ కర్కరే అమరవీరుడని కొనియాడారు. మనం చేసిన వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఆనందం కలిగించకూడదనే ఉద్దేశంతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. ముంబై 26ఝ11 దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేపై బీజేపీ భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి విచారణలో హేమంత కర్కరే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ సాధ్వి ప్రగ్యా సింగ్ ఆరోపించారు. అంతేకాదు తాను శపించిన కారణంగానే కర్కరే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించారు. ఏ పాపం తెలియని తనని వేధించినందుకే భగవంతుడు ఆగ్రహించాడు.. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధ్వి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, బీజేపీకి సంబంధం లేదని పార్టీ నాయకులు అధికారికంగా చెప్పిన సంగతి తెల్సిందే. కానీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ఆమె క్షమాపణ చెప్పారు. -
సాధ్వి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై ఈసీ ఆరా
భోపాల్ : ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ కర్కారేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఆమెపై ఫిర్యాదు అందిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్దారించారు. ప్రజ్ఞా సింగ్‌పై తాము స్వీకరించిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని సీఈఓ స్పష్టం చేశారు. కాగా, 2008 మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణలో కర్కారే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ దర్యాప్తు అధికారి, మాజీ ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారేపై అంతకుముందు ఆమె మండిపడ్డారు. తాను శపించిన కారణంగానే కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. నిరపరాధిని, సన్యాసిని అయిన తనను వేధించినందుకు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడని, ఉగ్రవాదులు ఆయనను హతమార్చారని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కర్కారేపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
ముంబైపై ఉగ్రవాద ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారే పై బీజేపీ భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణలో తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు కేసును దర్యాప్తు అధికారి మాజీ ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారేపై మండిపడ్డారు. అంతేకాదు తను శపించిన కారణంగానే కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. నిరపరాధిని, సన్యాసిని అయిన తనను వేధించినందు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సాక్ష్యాలు లేకుండా జైల్లో పెట్టడం అన్యాయని, విడిచిపెట్టాలని కోరాం. కానీ ఆయన (హేమంత్ కర్కారే) వినలేదు.. ఎలాగైనా సాక్ష్యాలు సంపాదిస్తానని ఘీంకరించాడు. నా పై కుట్ర చేశాడు. ఇది ధర్మానికి విరుద్ధం. దేశ ద్రోహం. దాడి ఎలా జరిగింది...ఎందుకు జరిగిందని పదే పదే ప్రశ్నించాడు. నాకేమీ తెలియదు..అంతా ఆ భగవంతుడికే తెలుసని చెప్పారు. అయితే ఆ భగవంతుడి దగ్గరికెళ్లి అడగమంటావా అని గేలి చేశాడు. అందుకే పోయాడు.. కొంచెం ఆలస్యమైనాగానీ, నువ్వు సర్వనాశనం అయిపోతామని కర్కారేని శపించాను. సరిగ్గా నెలన్నర రోజుల్లోనే ఉగ్రవాదులు కర్కారేని అంతం చేశారని’ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ స్పందిస్తూ సైన్యం, అమరవీరులపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయరాదని ఈసీ స్పష్టంగా చెప్పిందన్నారు. ముంబై ప్రజల కోసం బలిదానం చేసిన నిజాయితీగల అధికారి హేమంత్ కర్కారేపై ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు అనుచితమైనవని, ఈ నేపథ్యంలో ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపడాన్ని ప్రశ్నించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యల్ని తప్పు బడుతూ ట్వీట్ చేశారు. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తాను జైలులో ఉండగా పోలీసు వేధింపులపై గురువారం మీడియతో మాట్లాడారు. తాను గడిపిన జైలు జీవితం అత్యంత దుర్భరంగా గడిచిందని చెప్పారు. 13 రోజుల అక్రమ కస్టడీలో మొదటి రోజు నుంచే తనను బెల్ట్‌లతో తీవ్రంగా హింసించారనీ ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ భోపాల్ నుంచి ఎంపీగా బీజేపీ బరిలోకి దింపడపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా బీజేపీ సాధ్వి అస్త్రాన్ని ప్రయోగించింది. #WATCH Pragya Singh Thakur:Maine kaha tera (Mumbai ATS chief late Hemant Karkare) sarvanash hoga.Theek sava mahine mein sutak lagta hai. Jis din main gayi thi us din iske sutak lag gaya tha.Aur theek sava mahine mein jis din atankwadiyon ne isko maara, us din uska anth hua (18.4) pic.twitter.com/COqhEW2Bnc — ANI (@ANI) April 19, 2019 -
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్‌లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్‌పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్‌లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓ బోటు కెప్టెన్‌ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్‌ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్‌ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్‌ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్‌కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం
‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’. ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ అని! పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్. ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి! 2008 నవంబర్ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిపించి, 174 మంది దుర్మరణానికి, మూడొందల మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన లష్కరే తోయిబా టెర్రరిస్ట్. అతడి చివరి మాటలివి. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. అంతకు నాలుగేళ్ల క్రితమే.. ముంబై పేలుళ్లు జరిగిన మరుసటి రోజు.. మళ్లీ ఇలాంటి ఘోరం జరగనిచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రతిన పూనింది. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా? మారిందని మనకు అనిపించవచ్చు. అయితే టెర్రరిస్టులను సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీస్ అధికారుల కుటుంబాల పరిస్థితి మాత్రం ఏం మారలేదని అంటున్నారు. అసలు పరిస్థితిని మార్చుకోవలసినంతగా ఎందుకు మనం నిర్లక్ష్యం వహించామని అడుగుతున్నారు. ఆ ఐదుగురి గురించి ఒక మననం. ఆ కుటుంబాల గురించి ఒక అవలోకనం. హేమంత్ కర్కరే ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్. దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం! కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్బ్లెస్ హాస్పిటల్‌కి మూవ్ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్బ్లెస్కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్ క్వాలిస్ జీప్ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్లెస్లో ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి Ðð ళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు. హేమంత్ కర్కరే, కవిత కుటుంబం: భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని కవిత ఎప్పుడూ అంటుండేవారు. పోలీస్ సిబ్బందికి అధునాతనమైన ఆయుధాలను ఇవ్వాలని, వాళ్లను ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేసే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. తుకారామ్ ఆంబ్లే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. టెర్రరిస్టులు మెరైన్ డ్రైవ్ వైపు వెళుతున్నారని సమాచారం రావడంతో.. ఆ దారిని బ్లాక్ చేసే డ్యూటీని తుకారామ్‌కి అప్పజెప్పింది డిపార్ట్మెంట్. కారును ఆపాడు. ఒట్టి చేతుల్తో కసబ్‌తో కలియబడి అతడి దగ్గరున్న బుల్లెట్లన్నీ లాగేసుకున్నాడు. తుకారామ్ ఆ పని చేయకపోయుంటే.. కసబ్ తనని తను కాల్చుకుని ఉండేవాడేమో. టెర్రరిస్టులతో జరిగిన ఆ ఘర్షణలోనే తుకారామ్ మరణించాడు. తుకారామ్ ఆంబ్లే, తారాబాయి కుటుంబం: తుకారామ్ ఆంబ్లేకి నలుగురు కూతుళ్లు. పవిత్ర, వందన, వైశాలి, భారతి. కొడుకులు లేరు. భార్య తారాబాయి. ఉగ్రదాడుల్లో తుకారామ్ చనిపోయే నాటికి పవిత్రకు, వందనకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ ఇంట్లో ప్రస్తుతం తారాబాయి, వైశాలి, భారతి ఉంటున్నారు. ‘‘ఇప్పటికీ.. మా నాన్న డ్యూటీ అయిపోయాక, ఇంట్లోకి రాగానే తలపై నుంచి టోపీ తీసి రోజూ పెట్టే చోటే తగిలించి, మా వైపు చూసి నవ్వుతూ ‘ఏంటి విశేషాలు..’ అని అడుగుతున్నట్లే ఉంటుంది. కానీ మాకు తెలుసు మా నాన్న తిరిగి రారని. వస్తే బాగుండని అనిపిస్తుంది’’ అని అంటుంది వైశాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సందీప్ ఆర్మీ ఆఫీసర్. తాజ్ హోటల్లోని ఆరో ఫ్లోర్లో ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్.ఎస్.సి. (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) టీమ్‌ని లీడ్ చేసింది సందీపే. మొత్తం పదిమంది కమాండోలు. వారికి గైడ్‌లైన్స్ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగిన కాల్పుల్లో సందీప్ చనిపోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, అమ్మ ధనలక్ష్మి కుటుంబం: అమ్మ ధనలక్ష్మి, నాన్న ఉన్నికృష్ణన్.. సందీప్, వీళ్ల ముగ్గురే. సందీప్ ఒకడే సంతానం. పెళ్లి కావలసి ఉంది. ఉగ్రవాదులతో తలపడుతున్నప్పుడు.. ‘‘ముందుకు వెళ్లకండి. నేను హ్యాండిల్ చేస్తాను’’ అన్నవి అతడి చివరి మాటలు. ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా కమాండోలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ‘‘నా కొడుకు చనిపోలేదు. బతికే ఉన్నాడు’’ అని అంటుంటారు ధనలక్ష్మి.. ఎవరు ఆనాటి సంఘటనను ప్రస్తావించినా. అశోక్ కామ్తే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎటాక్ జరుగుతున్న ఏరియా అతడి పరిధిలోని కాదు. కానీ టెర్రరిస్టులు అనగానే అక్కడి ఆఫీసర్స్కి సహకారం అందించడానికి బయల్దేరాడు. సి.ఎస్.ఎం.టి. రైల్వే స్టేషన్లో హేమంత్ కర్కరేకి, విజయ్ సలాస్కర్కి జత కలిశాడు. వారితో కలిసి క్వాలిస్ జీప్ ఎక్కాడు. వీళ్ల జీప్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుంటే.. చివరి వరకు అతడి తుపాకీ గర్జిస్తూనే ఉంది. కర్కరే, సలాస్కర్, తర్వాత అశోక్ కామ్తే టెర్రరిస్టుల బులెట్లకు బలి అయ్యాడు. అశోక్ కామ్తే, వినీత కుటుంబం: అశోక్, ఆయన భార్య వినీత, ఇద్దరు కొడుకులు రాహుల్, అర్జున్, అశోక్ తల్లిదండ్రులు, చెల్లి షర్మిల అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. అశోక్ మరణంతో ఆ కుటుంబం ఆత్మస్థయిర్యం సడలింది కానీ, అశోక్ భార్య ధీశాలిగా కుటుంబం కోసం నిలబడ్డారు. భర్త జీవిత చరిత్రను ‘టు ద లాస్ట్ బుల్లెట్’ అనే పుస్తకంగా తెచ్చారు. వినీత లా చదివారు. కార్మికుల కేసులను వాదిస్తుంటారు. అశోక్ చనిపోయాక, ఆయన ఉండే గదికి ఆ కుటుంబం ఒక బోర్డును పెట్టింది. ‘‘మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం. మీరు మా హీరో’ అని అందులో రాసి ఉంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే తన భర్త.. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడని వినీత ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విజయ్ సలాస్కర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. యాంటీ–ఎక్స్టార్షన్ (బలవంతపు వసూళ్ల నిరోధం) హెడ్డు. కర్కరే, కామ్తేలతో పాటు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. విజయ్ సలాస్కర్ భార్య స్మిత కుటుంబం: విజయ్ సలాస్కర్ భార్య స్మిత. కూతురు దివ్య ఏకైక సంతానం. విజయ్ చనిపోయేటప్పటికే ఆమె వయసు 21. ‘‘డాడీ ఎప్పుడూ త్వరగా ఇంటికి రారు. కానీ ఆ రోజు రాత్రి (నవంబర్ 26) త్వరగా వచ్చారు. ‘‘త్వరగా వచ్చారేంటి డాడీ’’ అన్నాను. ‘‘నిన్ను సర్ప్రైజ్ చేద్దామనీ’’ అని నవ్వుతూ అన్నారు. ‘‘అయితే లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తినాల్సిందే’’ అన్నాను. మమ్మీ తిట్టింది. ‘‘ముందు ఆయన్ని భోజనం చెయ్యనివ్వు. తర్వాత వెళ్దువు’’ అంది. నేను.. నా బెడ్రూమ్లోకి వెళ్లాను. అంతే. ఆ తర్వాత డాడీకి ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్లిపోయారు. 11.57 కి ‘‘ఎక్కడున్నారు?’’ అని మమ్మీ డాడీకి ఫోన్ చేసింది. ‘‘స్పాట్’లో అని చెప్పారట డాడీ. చెప్పుడూ చెప్పే జవాబే! ‘‘ఇదేం బాగోలేదు’’ అంటోంది మమ్మీ. కొంతసేపటి తర్వాత టీవీ స్క్రోలింగ్‌లో డాడీ చనిపోయినట్లు వచ్చింది’’.. అని మాత్రం షేర్ చేసుకోగలుగుతున్నారు దివ్య. ఆ తర్వాతి ఘటనలు గుర్తు చేసుకోడానికి ఆమె ఇష్టపడడం లేదు. వీళ్లైదుగురే కాదు. బ్రేవ్ హార్ట్స్ ఇంకా ఉన్నాయి. హవల్దార్ గజేంద్రసింగ్, నాగప్ప మహాలే, కిశోర్, షిండే, సంజయ్ గోవిల్కర్ వంటి ఎందరో ఉగ్రమూకలతో ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షతగాత్రులయ్యారు. పాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షత గాత్రులయ్యారు. -
కవితా... హాట్సాఫ్!
ముష్కర మూకలను మట్టుబెట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను ఒకరయితే, తాను చనిపోతూ ముగ్గురికి జీవితాన్నిచ్చిన చిరంజీవి మరొకరు. వీరెవరో కాదు హేమంత్ కర్కరే, ఆయన సతీమణి కవితా కర్కరే. దేశం కోసం హేమంత్ ప్రాణాలు తృణప్రాయంగా ఆర్పించగా, ఆయన భార్య అనారోగ్యంతో చనిపోతూ ముగ్గురు ప్రాణాలు నిలబెట్టారు. మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్‌గా వ్యవహరించిన హేమంత్ కర్కరే దేశ ఆర్థిక రాజధాని ముంబైపై దండెత్తిన దుర్మార్గులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 26/11 దాడిలో ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కర్కరే కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. హేమంత్ మరణించిన ఆరేళ్లకు ఆయన సతీమణి కవితను కానరాని దూరాలకు తీసుకుపోయింది, అవయవ దానం చేసి కవిత చిరంజీవిగా నిలిచారు. కవితా కర్కరే- బ్రెయిన్ హెమరేజితో సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అయితే కవిత ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఆమె అవయవాలను దానం చేయడానికి అంగీకరించి పెద్ద మనసు చాటుకున్నారు. త్యాగనిరతిలో తమ తల్లిదండ్రులకు తగినవారమని నిరూపించుకున్నారు. కవిత రెండు మూత్రపిండాలను ఇద్దరికి అమర్చారు. కాలేయాన్ని 49 ఏళ్ల రోగికి అమర్చారు. ఆమె కళ్లను ఐబ్యాంకుకు దానం చేశారు. కర్కరే కుటుంబం త్యాగనిరతిని అందరూ ప్రశంసిస్తున్నారు. అవయవదానంపై అవహగాన లేకపోవడంతో మనదేశంలో దాతలు ముందుకురాని పరిస్థితి నెలకొంది. అవయవాలు పాడైపోయి ఏటా దేశంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదాతులు ముందుకు వస్తే ఈ పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు. మరణానికి సార్థకత కావాలంటే అవయవదానమొక్కటే దారి. చనిపోయిన తర్వాత కూడా జీవించాలనుకుంటే అవయవదానం చేయండి. -
26/11 హీరో హేమంత్ కర్కరే భార్య కన్నుమూత
-
26/11 హీరో హేమంత్ కర్కరే భార్య కన్నుమూత
హేమంత్ కర్కరే.. ఈ పేరు వినగానే ఒక్కసారి ఒళ్లు గగుర్పొడుస్తుంది. 26/11 దాడులు గుర్తుకొస్తాయి. గుండెలు తీసిన బంటులా ధైర్యంగా ముందుకెళ్లి కొంతమంది ఉగ్రవాదులను హతమార్చి, మిగిలిన వాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర కిశోరం హేమంత్ కర్కరే. ఆయన భార్య కవితా కర్కరే బ్రెయిన్ హెమరేజితో మరణించారు. హిందూజా ఆస్పత్రిలో శనివారం చేరేసరికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు ఆమె పరిస్థితిని బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. ఆమెకు జూయి, సయాలీ అనే ఇద్దరు కూతుళ్లు, ఆకాశ్ అనే ఒక కొడుకు ఉన్నారు. ఆమె మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, చర్మం.. ఇలా ఉపయోగపడే అన్ని అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్‌గా వ్యవహరించిన హేమంత్ కర్కరే ఒకేసారి పదిమంది ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. మరికొందరు పోలీసు అధికారులతో పాటు ఆయన్ను కూడా కామా ఆస్పత్రి సమీపంలో ఉగ్రవాదులు హతమార్చారు. అయితే.. సరైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాలు లేకపోవడం వల్లే ఆయన మరణించారంటూ కవితా కర్కరే అప్పట్లో ఆరోపించారు. కనీసం మిగిలిన సిబ్బందికైనా వాటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు.