కర్కారేపై ప్రజ్ఞా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు | Hemant Karkare Died Because I cursed him, Sadhvi Pragya  | Sakshi
Sakshi News home page

దివంగత హేమంత్‌ కర్కారేపై ప్రజ్ఞా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Apr 19 2019 2:13 PM | Last Updated on Fri, Apr 19 2019 2:50 PM

Hemant Karkare Died Because I cursed him, Sadhvi Pragya  - Sakshi

ముంబైపై ఉగ్రవాద ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్‌ కర్కారే పై బీజేపీ భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణలో తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు కేసును దర్యాప్తు అధికారి మాజీ ఎటిఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కారేపై మండిపడ్డారు. అంతేకాదు తను శపించిన కారణంగానే  కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.  నిరపరాధిని, సన్యాసిని  అయిన తనను వేధించినందు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

‘సాక్ష్యాలు లేకుండా  జైల్లో పెట్టడం అన్యాయని, విడిచిపెట్టాలని కోరాం. కానీ  ఆయన (హేమంత్‌ కర్కారే) వినలేదు.. ఎలాగైనా సాక్ష్యాలు సంపాదిస్తానని ఘీంకరించాడు.  నా పై కుట్ర చేశాడు.  ఇది ధర్మానికి విరుద్ధం. దేశ ద్రోహం. దాడి ఎలా జరిగింది...ఎందుకు జరిగిందని పదే పదే  ప్రశ్నించాడు. నాకేమీ తెలియదు..అంతా ఆ భగవంతుడికే తెలుసని చెప్పారు. అయితే ఆ  భగవంతుడి దగ్గరికెళ్లి అడగమంటావా అని గేలి చేశాడు. అందుకే పోయాడు.. కొంచెం ఆలస్యమైనాగానీ, నువ్వు సర్వనాశనం అయిపోతామని కర్కారేని శపించాను. సరిగ్గా నెలన్నర రోజుల్లోనే ఉగ్రవాదులు కర్కారేని అంతం చేశారని’ ప్రజ్ఞా సింగ్‌  వ్యాఖ్యానించారు. 

దీనిపై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ స్పందిస్తూ సైన్యం, అమరవీరులపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయరాదని ఈసీ స్పష్టంగా చెప్పిందన్నారు. ముంబై ప్రజల కోసం బలిదానం చేసిన నిజాయితీగల అధికారి హేమంత్‌ కర్కారేపై  ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలు అనుచితమైనవని,  ఈ  నేపథ్యంలో ఆమెపై ఈసీ  చర్యలు తీసుకోవాలని  కోరారు.  అటు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపడాన్ని ప్రశ్నించిన  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యల్ని తప్పు బడుతూ ట్వీట్‌ చేశారు. 

2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసుకు సంబంధించి తాను జైలులో ఉండగా పోలీసు వేధింపులపై  గురువారం మీడియతో మాట్లాడారు. తాను గడిపిన జైలు జీవితం అత్యంత దుర్భరంగా గడిచిందని చెప్పారు.  13 రోజుల  అక్రమ కస్టడీలో  మొదటి రోజు నుంచే తనను బెల్ట్‌లతో తీవ్రంగా  హింసించారనీ ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి  తెలిసిందే. 

కాగా సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ భోపాల్‌ నుంచి ఎంపీగా బీజేపీ బరిలోకి దింపడపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజ‌య్ సింగ్‌కు పోటీగా బీజేపీ సాధ్వి అస్త్రాన్ని  ప్రయోగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement