భోపాల్/న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(48) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించినందునే ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని చెప్పారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ..‘మాలేగావ్ పేలుడు కేసులో ముంబై జైలులో ఉన్న నన్ను విచారించడానికి హేమంత్ కర్కరే వచ్చారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరక్కుంటే దానిని సృష్టించేందుకు ఎందాకైనా వెళ్తానన్నాడు.
అప్పటిదాకా జైలు నుంచి బయటకు వదిలేది లేదన్నాడు. దుర్భాషలాడుతూ తీవ్రంగా హింసించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నాకేమీ తెలియదు, అంతా ఆ దేవుడికే తెలుసని బదులిచ్చా. తెల్సుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్లాలా? అని ప్రశ్నించాడు. కావాలనుకుంటే వెళ్లాలన్నాను. నువ్వు నాశనమైపోతావని శపించా. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆయన్ను ఉగ్రవాదులు చంపేశారు’ అని అన్నారు. మోసకారి, దేశద్రోహి, మత వ్యతిరేకి అంటూ కర్కరేను ఆమె దూషించారు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు అందిందని, విచారణ చేయిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాని క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్
తను శపించడంతోనే కర్కరే చనిపోయారన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరేను ద్రోహిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ నేతలు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్‌సభ స్థానంలో ఆమె ప్రత్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన్ను చూసి మనమంతా గర్వపడాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించింది. ‘అశోక్ చక్ర అవార్డు గ్రహీత కర్కరే త్యాగాన్ని అందరూ గౌరవించాలి.
ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలి’ అని ట్విట్టర్‌లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది’అని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆమె వంటి వ్యక్తులతో జరిగిన పోరాటంలోనే కర్కరే చనిపోయారు. ఆయన మృతికి ఉగ్రదాడి కేసు నిందితురాలు శాపం కారణం కాదు. ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనకున్న హక్కులను కాపాడే క్రమంలోనే ఆయన పోరాడుతూ చనిపోయారు. వీర జవాన్లను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంతధైర్యం?’ అంటూ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం: బీజేపీ
తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. ‘నేను వ్యక్తిగతంగా అనుభవించిన బాధతో ఆ వ్యాఖ్యలు చేశా. నా మాటలను దేశ వ్యతిరేకులు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ వ్యాఖ్యలతో బాధ కలిగితే క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపారని ఆమె సహాయకుడు తెలిపారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జైలులో ఉండగా శారీరకంగా, మానసికంగా అనుభవించిన వేదనతో ప్రజ్ఞా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ తెలిపింది. ‘ఉగ్రవాదులను సాహసంతో ఎదుర్కొని పోరాడుతూ కర్కరే ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆయన్ను వీర జవానుగానే భావిస్తుంది’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment