malegaon blasts case
-
నా శాపంతోనే కర్కరే బలి
భోపాల్/న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(48) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించినందునే ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని చెప్పారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ..‘మాలేగావ్ పేలుడు కేసులో ముంబై జైలులో ఉన్న నన్ను విచారించడానికి హేమంత్ కర్కరే వచ్చారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరక్కుంటే దానిని సృష్టించేందుకు ఎందాకైనా వెళ్తానన్నాడు. అప్పటిదాకా జైలు నుంచి బయటకు వదిలేది లేదన్నాడు. దుర్భాషలాడుతూ తీవ్రంగా హింసించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నాకేమీ తెలియదు, అంతా ఆ దేవుడికే తెలుసని బదులిచ్చా. తెల్సుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్లాలా? అని ప్రశ్నించాడు. కావాలనుకుంటే వెళ్లాలన్నాను. నువ్వు నాశనమైపోతావని శపించా. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆయన్ను ఉగ్రవాదులు చంపేశారు’ అని అన్నారు. మోసకారి, దేశద్రోహి, మత వ్యతిరేకి అంటూ కర్కరేను ఆమె దూషించారు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు అందిందని, విచారణ చేయిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ తను శపించడంతోనే కర్కరే చనిపోయారన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరేను ద్రోహిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ నేతలు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్‌సభ స్థానంలో ఆమె ప్రత్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన్ను చూసి మనమంతా గర్వపడాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించింది. ‘అశోక్ చక్ర అవార్డు గ్రహీత కర్కరే త్యాగాన్ని అందరూ గౌరవించాలి. ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలి’ అని ట్విట్టర్లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది’అని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆమె వంటి వ్యక్తులతో జరిగిన పోరాటంలోనే కర్కరే చనిపోయారు. ఆయన మృతికి ఉగ్రదాడి కేసు నిందితురాలు శాపం కారణం కాదు. ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనకున్న హక్కులను కాపాడే క్రమంలోనే ఆయన పోరాడుతూ చనిపోయారు. వీర జవాన్లను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంతధైర్యం?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం: బీజేపీ తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. ‘నేను వ్యక్తిగతంగా అనుభవించిన బాధతో ఆ వ్యాఖ్యలు చేశా. నా మాటలను దేశ వ్యతిరేకులు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ వ్యాఖ్యలతో బాధ కలిగితే క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపారని ఆమె సహాయకుడు తెలిపారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జైలులో ఉండగా శారీరకంగా, మానసికంగా అనుభవించిన వేదనతో ప్రజ్ఞా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ తెలిపింది. ‘ఉగ్రవాదులను సాహసంతో ఎదుర్కొని పోరాడుతూ కర్కరే ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆయన్ను వీర జవానుగానే భావిస్తుంది’ అని పేర్కొంది. -
మాలెగావ్ కేసు: సాధ్వి ప్రజ్ఞకు బెయిల్ మంజూరు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 2008 నాటి మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు మాత్రం బెయిల్ నిరాకరించింది. వీళ్లిద్దరూ ఈ కేసులో గత ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్నారు. ఇటీవలే చికిత్స కోసం సాధ్వి ప్రజ్ఞను భోపాల్ ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం వీళ్లిద్దరూ దాఖలుచేసిన బెయిల్ దరఖాస్తులను దిగువ కోర్టు కొట్టేయడంతో ఇద్దరూ బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞను, నవంబర్‌లో కల్నల్ పురోహిత్‌ను అరెస్టుచేశారు. అభినవ్ భారత్‌కు చెందిన వీళ్లిద్దరే పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. కానీ ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం ఎన్ఐఏ చర్యను ప్రశ్నిస్తూ బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
‘మాలెగావ్’లో ప్రజ్ఞకు క్లీన్చిట్
అభియోగాలు ఉపసంహరించుకున్న ఎన్ఐఏ ముంబై: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) క్లీన్చిట్ ఇచ్చింది. 2008 నాటి ఈ పేలుళ్ల కేసులో ఆమెపైన, మరో ఐదుగురి పైన చేసిన అన్ని అభియోగాల్ని ఎన్ఐఏ శుక్రవారం ఉపసంహరించుకుంది. అదే సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌సహా మరో పదిమందిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(మోకా) చట్టం కింద చేసిన అభియోగాలను సైతం ఉపసంహరించుకుంది. తమ దర్యాప్తులో ప్రజ్ఞ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఏవిధమైన సాక్ష్యాలు లభించలేదని ఎన్ఐఏ ప్రకటించింది. వారిపై అభియోగాలు కొనసాగించదగినవి కావంటూ అనుబంధ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మరణించడం తెలిసిందే. ఇది హిందూ అతివాద గ్రూపుల చర్యగా భావించారు. ముంబై యాంటీ టై స్క్వాడ్(ఏటీఎస్) జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కరే నేతృత్వంలో తొలుత ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. 26/11 దాడుల్లో ఆయన మరణించారు. 2011లో ఈ కేసును ఎన్ఐఏ చేపట్టింది. అప్పటికే ఏటీఎస్ 16 మందిని నిందితులుగా తేల్చి ముంబై కోర్టులో చార్జిషీటు వేసింది. ఈ చార్జిషీటును, తమపై మోకా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పురోహిత్, ప్రజ్ఞ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లారు. ఈ నేపథ్యంలోతాజాగా సాధ్వితోపాటు మరో ఐదుగురు నిందితులు శివ్ నారాయణ్ కల్సంగ్రా, శ్యామ్ భవర్లాల్ సాహు, ప్రవీణ్ తక్కల్కి, లోకేశ్ శర్మ, ధన్సింగ్ చౌధురిలపై అభియోగాలను ఎన్ఐఏ ఉపసంహరించుకుంది. ఈ కేసులో మోకా చట్టం కింద అభియోగం మోపేందుకు తావులేదని, ఏటీఎస్ చార్జిషీట్లో లోపాలున్నాయని పేర్కొంది. నేరాన్ని అంగీకరించేలా నిందితులపై వేధింపులకు పాల్పడడమేగాక, మోకా చట్టంలోని నిబంధనలను వారిపై మోపినట్టు ఆరోపించింది. ఈ నేపథ్యంలో పురోహిత్, మరో తొమ్మిదిమందిపై యూఏపీఏ, ఐపీసీ, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగనుంది. బలహీనపరిచే ప్రయత్నం: కాంగ్రెస్ ఎన్ఐఏ నిర్ణయం కేసును బలహీనపరిచే ప్రయత్నంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఉగ్రవాద కేసుల్లో ఉన్న సంఘ్ కార్యకర్తలను రక్షించే ప్రక్రియను బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేపట్టాయని ఎప్పుడో ఊహించానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. -
మాలెగావ్ కేసులో ప్రజ్ఞాసింగ్ కు క్లీన్ చీట్!
న్యూఢిల్లీ: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ లభించనుంది. కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసులో యూటర్న్ తీసుకుంది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆక్ట్(మోకా) చట్టం ప్రకారం ఆమెపై విచారణ జరుగుతోంది. చట్టవిరుద్ధ చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగానికి అవకాశం ఉన్నా మోకా కింద విచారణకు అర్హత లేదని, మోకాను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ఎన్ఐఏ అభిప్రాయపడింది. దీంతో సాధ్వి త్వరలోనే జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. సాధ్వీతో పాటే ఆర్మీ లెఫ్టనెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ పైనా ఎన్ఐఏ విత్ డ్రా తీసుకుంది. సాధ్వి, పురోహిత్ లతో సహా మరో 12 మందిపై ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారని కేసు నమోదైంది. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే దాఖలు చేసిన చార్జిషీట్ లోపాలున్నాయని ఎన్ఐఏ అభిప్రాయపడింది. పురోహిత్ పైన దాఖలు చేసిన అభియోగాలు కల్పితంగా ఉన్నాయని, బలప్రయోగంతో చేసినవిగా ఉన్నాయాని ఎన్ఐఏ తెలిపింది. ఈకేసును రెండు బృందాలు విచారణ చేస్తున్నాయి. మొదటి బృందానికి ఐజీ సంజయ్ సింగ్, రెండో బృందానికి ఐజీ జీపీసింగ్ నేతృత్వం వహిస్తున్నారు. వీరు సైతం ఈ కేసులో ఆధారాలు బలహీనంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాజీ కేంద్రహోంమంత్రి చిదంబరం ఎన్ఐఏ కేసును ఉపసంహరించుకోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 29న మాలెగావ్ లోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంతో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా వంద మంది గాయపడ్డారు. -
‘మాలెగావ్’ నిందితులు నిర్దోషులు
ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు ముంబై: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులైన 8మంది ముస్లిం యువకులకు వ్యతిరేకంగా ఆధారాల్లేవంటూ ముంబై ప్రత్యేక కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిని వె ంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 2006 సెప్టెంబర్ 8న మాలెగావ్‌లోని మసీదు దగ్గరున్న ముస్లిం శ్మశానం వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా 100కు పైగా గాయాల పాలయ్యారు. రయిస్ అహ్మద్, ఫరోగ్ మగ్దుమి, ఆసీఫ్ ఖాన్, అబ్రర్ అహ్మద్, నురుల్ హుడా, శబ్బీర్ అహ్మద్, సల్మాన్ ఫార్సీ, శేఖ్ మహ్మద్ అలీ, మహ్మద్ జాహిద్‌లు మొత్తం 9 మందిని ఉగ్రవాద వ్యతిరేక విభాగం(ఏటీఎస్) అరెస్టు చేసి చార్జిషీట్ న మోదు చేసింది. వీరిలో ఒకరు కేసు దర్యాప్తులో ఉండగా మృతి చెందాడు. 2011లో వీరందరికి బెయిల్ మంజూరైంది. వారు నేరం చేశారని చెప్పినా సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించ లేకపోయింది. ఆ 8 మంది నేరం చేశారని నిరూపించేలా సీబీఐ, ఏటీఎస్‌లు ఆధారాలు సంపాదించలేకపోయాయని, తాము జరిపిన విచారణలో లభించిన ఆధారాలకు సీబీఐ, ఏటీఎస్‌లు ఇచ్చిన ఆధారాలకు చాలా వ్యత్యాసముందని పిటిషన్ విచారణ సమయంలో కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది.