‘మాలెగావ్’లో ప్రజ్ఞకు క్లీన్‌చిట్
అభియోగాలు ఉపసంహరించుకున్న ఎన్‌ఐఏ
ముంబై: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) క్లీన్‌చిట్ ఇచ్చింది. 2008 నాటి ఈ పేలుళ్ల కేసులో ఆమెపైన, మరో ఐదుగురి పైన చేసిన అన్ని అభియోగాల్ని ఎన్‌ఐఏ శుక్రవారం ఉపసంహరించుకుంది. అదే సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌సహా మరో పదిమందిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(మోకా) చట్టం కింద చేసిన అభియోగాలను సైతం ఉపసంహరించుకుంది. తమ దర్యాప్తులో ప్రజ్ఞ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఏవిధమైన సాక్ష్యాలు లభించలేదని ఎన్‌ఐఏ ప్రకటించింది. వారిపై అభియోగాలు కొనసాగించదగినవి కావంటూ అనుబంధ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మరణించడం తెలిసిందే.
ఇది హిందూ అతివాద గ్రూపుల చర్యగా భావించారు. ముంబై యాంటీ టై స్క్వాడ్(ఏటీఎస్) జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కరే నేతృత్వంలో తొలుత ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. 26/11 దాడుల్లో ఆయన మరణించారు. 2011లో ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది. అప్పటికే ఏటీఎస్ 16 మందిని నిందితులుగా తేల్చి ముంబై కోర్టులో చార్జిషీటు వేసింది. ఈ చార్జిషీటును, తమపై మోకా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పురోహిత్, ప్రజ్ఞ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లారు. ఈ నేపథ్యంలోతాజాగా సాధ్వితోపాటు మరో ఐదుగురు నిందితులు శివ్ నారాయణ్ కల్సంగ్రా, శ్యామ్ భవర్‌లాల్ సాహు, ప్రవీణ్ తక్కల్కి, లోకేశ్ శర్మ, ధన్‌సింగ్ చౌధురిలపై అభియోగాలను ఎన్‌ఐఏ ఉపసంహరించుకుంది. ఈ కేసులో మోకా చట్టం కింద అభియోగం మోపేందుకు తావులేదని, ఏటీఎస్ చార్జిషీట్‌లో లోపాలున్నాయని పేర్కొంది. నేరాన్ని అంగీకరించేలా నిందితులపై వేధింపులకు పాల్పడడమేగాక, మోకా చట్టంలోని నిబంధనలను వారిపై మోపినట్టు ఆరోపించింది. ఈ నేపథ్యంలో పురోహిత్, మరో తొమ్మిదిమందిపై యూఏపీఏ, ఐపీసీ, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగనుంది.
బలహీనపరిచే ప్రయత్నం: కాంగ్రెస్
ఎన్‌ఐఏ నిర్ణయం కేసును బలహీనపరిచే ప్రయత్నంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఉగ్రవాద కేసుల్లో ఉన్న సంఘ్ కార్యకర్తలను రక్షించే ప్రక్రియను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టాయని ఎప్పుడో ఊహించానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు.