ఉసెండి నుంచి కీలక సమాచారం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గుడ్సా ఉసెండి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై దాడికి తెగబడిన వివరాలను ఉసెండి నుంచి రాబట్టారు. గతేడాది మే 25న పరివర్తన ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తున్న ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న కాన్వాయిపై జరిగిన దాడికి తనతోపాటు దర్భా డివిజనల్ కమిటీ అధ్యక్షుడు సురేందర్, ఆ డివిజనల్ ఉపాధ్యక్షుడు జలీల్ నేతృత్వం వహించినట్లు ఉసెండి వెల్లడించాడని సమాచారం. అలాగే దాదాపు 200 నుంచి 300 మంది మావోయిస్టులు ఆ దాడిలో పాల్గొన్నారని ఎన్ఐఏ అధికారులకు వివరించాడు. ఈ మేరకు శుక్రవారం ఛత్తీస్గఢ్లోని ప్రముఖ అంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
పీసీసీ అధ్యక్షుడు నంద కుమార్ పటేల్, మాజీ మంత్రి, సల్వాజుడం నిర్మాత మహేంద్ర కర్మ కాన్వాయిపై మావోయిస్టుల దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో వారిద్దరితో పాటు మరో 25 మంది అక్కడికక్కడే మరణించారు. మావోయిస్టులు సృష్టించిన మారణహోమంలో కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం రాయ్పూర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుముడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఉసెండిని తమకు అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.