మాలెగావ్ కేసు: సాధ్వి ప్రజ్ఞకు బెయిల్ మంజూరు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 2008 నాటి మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు మాత్రం బెయిల్ నిరాకరించింది. వీళ్లిద్దరూ ఈ కేసులో గత ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్నారు. ఇటీవలే చికిత్స కోసం సాధ్వి ప్రజ్ఞను భోపాల్ ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం వీళ్లిద్దరూ దాఖలుచేసిన బెయిల్ దరఖాస్తులను దిగువ కోర్టు కొట్టేయడంతో ఇద్దరూ బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు.
2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞను, నవంబర్‌లో కల్నల్ పురోహిత్‌ను అరెస్టుచేశారు. అభినవ్ భారత్‌కు చెందిన వీళ్లిద్దరే పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. కానీ ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం ఎన్ఐఏ చర్యను ప్రశ్నిస్తూ బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.