sadhvi pragya singh thakur
-
ప్రఙ్ఞా సింగ్‌కు చేదు అనుభవం
భోపాల్: బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధర్నా చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడేందుకు వెళ్లగా.. వెనక్కివెళ్లి పోవాలంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీలో జరిగింది. వివరాలు.... తమకు అటెండన్స్ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. శ్రేయా పాండే, మను శర్మ అనే విద్యార్థుల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన.. ప్రఙ్ఞా సింగ్ విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అక్కడికి చేరుకుని.. ‘ఉగ్రవాది వెనక్కి వెళ్లిపో’ అంటూ ప్రఙ్ఞా ను ఉద్దేశించి నినాదాలు చేశారు. దీంతో బీజేపీ మద్దతుదారులు సైతం వీరికి దీటుగా బదులివ్వడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక ఈ విషయం గురించి ప్రఙ్ఞా మాట్లాడుతూ.. ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రఙ్ఞా సింగ్ బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగి భోపాల్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వి ప్రఙ్ఞా సింగ్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. (స్పైస్‌జెట్ సిబ్బంది దురుసు ప్రవర్తన; ప్రగ్యా ఫిర్యాదు) #WATCH Bhopal: NSUI workers raise "aatankwadi wapas jayo" & "Pragya Thakur, go back" slogans at Makhanlal Chaturvedi University. BJP MP Pragya Thakur had gone there to meet female students who were sitting on a 'dharna' against the university, over attendance issue. (25.12.19) pic.twitter.com/HKU1tZqoBY — ANI (@ANI) December 25, 2019 -
‘ఆమెను సజీవ దహనం చేస్తా’ : ఎమ్మెల్యే
భోపాల్ : భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అసలైన దేశభక్తుడంటూ బుధవారం పార్లమెంటులో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు ఖండించారు. దీని ఫలితంగా రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి ప్రజ్ఞాను బీజేపీ తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తానని బయోరా ఎమ్మెల్యే గోవర్థన్ డంగీ ప్రకటించారు. మరోవైపు సాధ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌లో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. చదవండి : (లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు) -
ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు
న్యూఢిల్లీ: గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని లోక్‌సభ సాక్షిగా దేశభక్తుడని కొనియాడిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను రక్షణ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగిస్తున్నట్టుగా పార్టీ కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ దఫా పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో దుమారం ప్రజ్ఞా గాడ్సే వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు మండిపడ్డాయి. ఆరెస్సెస్, బీజేపీ మనసులో ఉన్న మాటలనే ప్రజ్ఞా బయటకు చెప్పిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. స్పీకర్ ఆమె వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. ఇక దీనిపై సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజ్ఞా ఒక ఉగ్రవాది: రాహుల్ అంతకు ముందు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞాపై విరుచుకుపడ్డారు. ఆమెని ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ‘ఒక ఉగ్రవాదైన ప్రజ్ఞా మరో ఉగ్రవాది గాడ్సేని దేశభక్తుడని చెబుతోంది. భారత పార్లమెంటులోనే ఇదో దుర్దినం. ఆమె వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్ అసలు సిసలు ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రజ్ఞాను జాతి క్షమించదని ఆమెను బీజేపీ ఎప్పుడు పార్టీ నుంచి తరిమేస్తుందని ప్రశ్నించారు. -
ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలో ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంట్‌లోనే కీర్తించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై క్రమశిక్షణ పేరిట పాలక బీజేపీ పక్షం కంటి తుడుపు చర్యలు చేపట్టింది. ఆమె గాడ్సేను కీర్తించడం ఆశ్చర్యమూ కాదు, ఇదే మొదటి సారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేస్తూ ‘గాడ్సే నిజమైన దేశ భక్తుడు’ అంటూ అభివర్ణించారు. అప్పుడే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిన బీజేపీ అధిష్టానం, ‘ఆమె అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ఆ అభిప్రాయాలతో మేం ఏకీభవించడం లేదు’ అని స్పష్టం చేసింది. ‘ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెను నేనెన్నడూ క్షమించలేను’ అని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాడు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యకు అసలు అర్థం ఏమిటి? తాజాగా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన మరునాడు గురువారం నాడు, క్రమ శిక్షణా చర్యల కింద ఆమెను రక్షణ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగిస్తున్నామని, ఆమెను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నుంచి బహిష్కరిస్తున్నామని బీజేపీ వర్కింగ్ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడం హాస్యాస్పదం! దొంగకు తాళం చెవిచ్చి, దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామని చెప్పడం లాంటిదే ఇది. అసలు ఆమెను పార్లమెంట్లోకే ఎందుకు అనుమతించారు? నరేంద్ర మోదీ నాటి వ్యాఖ్యలకు అసలు అర్థం ఇది కాదా? విజయం సాధించి వచ్చారు కనుక పార్లమెంట్‌లోకి అనుమతించారని సర్దుకోవచ్చు! మరి పార్లమెంటరీ ప్యానెల్లోకి ఎందుకు తీసుకున్నారు? ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పటికీ ఓ టెర్రరిజం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరనే విషయం తెలిసిందే. 2008, మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన మోటార్ సైకిల్ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఆ మోటారు సైకిల్ ఆమె పేరుతో రిజిస్టరై ఉండంతోపాటు మరికొన్ని ఆధారాలు దొరకడంతో బాంబు పేలుడు కుట్రదారుల్లో ఒకరిగా ఆమెపై కేసు నమోదు చేశారు. నాటి నుంచి నేటికీ ఆ కేసు నత్తడక నడుస్తూనే ఉంది. అది వేరే సంగతి. కానీ ఠాకూర్ ఇదే నేపథ్యంలో గాడ్సేను టెర్రరిస్టుగా చూడరాదని, ఆయన నిజమైన దేశభక్తుడని వ్యాఖ్యానించారు. అంటే, ఆమె తనను తాను నిజమైన దేశభక్తురాలిగా అంతర్లీనంగా అభివర్ణించుకుంటున్నారేమో! ఆమె వ్యాఖ్యను పలువురు బీజేపీ ఎంపీలు ఆన్లైన్లో సమర్థించడం చూస్తుంటే ఆ పార్టీలోని ద్వంద్వ ప్రమాణాలు కూడా బయటపడుతున్నాయి. -
లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞా లోక్‌సభలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. అయితే ప్రజ్ఞా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. వివరాల్లోకి వెళితే.. బుధవారం లోక్‌సభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై నాథురామ్ గాడ్సే చేసిన ప్రకటనను ఉదహరించారు. ఈ సమయంలో రాజా ప్రసంగానికి ప్రజ్జా అడ్డుతగిలారు. ‘దేశభక్తి గురించి మీరు సలహాలు ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలతో లోక్‌సభలో ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది. ఆమె వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో బీజేపీ సభ్యులు కూడా ప్రజ్ఞాను తన స్థానంలో కూర్చోవాల్సిందిగా సూచించారు. అనంతరం ప్రజ్ఞా వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. గతంలో కూడా ప్రజ్ఞా.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, బీజేపీ సైతం ప్రజ్ఙా వ్యాఖ్యలకు మద్దతుగా నిలవకపోవడంతో అప్పుడు ఆమె క్షమాపణ చెప్పారు. కాగా, రాజా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీపై 32 ఏళ్లుగా తాను కోపం పెంచుకున్నానని, అందుకే ఆయన్ని చంపానని గాడ్సే ఒప్పుకున్నాడని రాజా చెప్పారు. భద్రత అనేది రాజకీయ కారణాలతో కాదని.. వారికి ఉన్న బెదిరింపులను బట్టి కల్పించాల్సి ఉంటుందని, మాజీ ప్రధానులు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై హోం మంత్రి అమిత్ షా పునరాలోచించాలని కోరారు. -
‘రక్షణ’ కమిటీలో ప్రజ్ఞా, ఫరూక్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి వచ్చే బీజేపీ ఎంపీ సాథ్వి ప్రజ్ఞాసింగ్‌కు పార్లమెంట్ కీలక కమిటీలో ప్రభుత్వం చోటు కల్పించింది. ఈమెతోపాటు ప్రజా భద్రత చట్టం(పీఎస్ఏ)కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా(81)పేరును పార్లమెంట్ రక్షణ రంగ సంప్రదింపుల సంయుక్త కమిటీకి ప్రతిపాదించినట్లు తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్, మాజీ రక్షణ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులు ఉన్నారు. 21 మంది ఉండే ఈ కమిటీలో 12 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ కమిటీలో చోటు లభించిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు. మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తీవ్రభావ జాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఒక సభ్యురాలికి ఎంతో ముఖ్యమైన రక్షణ సంబంధ కమిటీలో స్థానం కల్పించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అదేవిధంగా, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం ఫరూక్ అబ్దుల్లాను మూడు నెలలుగా పీఎస్ఏ కింద గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా పలువురిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. -
‘గాంధీ జాతిపిత కాదు.. ఈ దేశం కన్న బిడ్డ’
భోపాల్ : హిందుత్వ భావజాలంతో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోమారు వార్తల్లో నిలిచారు. భోపాల్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే, బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో మీరెందుకు పాల్గొనడం లేదన్న మీడియా ప్రశ్నకు.. ‘గాంధీ జాతిపిత కాదు. ఈ దేశం కన్న గొప్ప బిడ్డ. ఈ దేశం కోసం కష్టపడ్డారు. అందుకు మేం ప్రశంసిస్తాం. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తాం. ఇంతకుమించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’అని సూటిగా సమాధానమిచ్చారు. కాగా, ప్రజ్ఞాసింగ్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో గాంధీని హత్యచేసిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నాయకత్వం ఆ వ్యాఖ్యలపై వివరణనివ్వాలని ఆదేశించింది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల ఆమెకు ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఎదురవలేదు. భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ఆమె భారీ మెజార్టీతో గెలిచారు. -
బీజేపీ అగ్రనేతల మరణం: వారే చేతబడి చేస్తున్నారు!
భోపాల్ : వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు మూటగట్టుకునే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల మరణాన్ని ఆకాంక్షిస్తూ ప్రతిపక్షం చేతబడి చేయిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాజ్ చెప్పినట్లుగానే తాము ఇప్పుడు విపత్కర కాలం ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. కాగా దాదాపు ఇరవై రోజుల వ్యవధిలో బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన భోపాల్ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా...‘ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేయిస్తున్నాయని మహారాజ్ గారు నాకు ఒకానొక సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మాకు ఇప్పుడు చెడుకాలం జరుగుతోంది. అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయాను. కానీ మా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కక్కరుగా మమ్మల్ని విడిచి వెళ్తున్నారు. మహారాజ్ చెప్పింది నిజమేనేమోనని నాకు ఇప్పుడు అనినిపిస్తోంది’ అని పేర్కొన్నారు. చదవండి: ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే! కాగా 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రఙ్ఞా సింగ్ అనూహ్యంగా భోపాల్ ఎంపీ టికెట్ దక్కించుకుని.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ సింగ్‌ను మట్టికరిపించి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వి ప్రఙ్ఞా సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ అధిష్టానం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడంతో.. వెనక్కి తగ్గిన ఆమె ఇకపై క్రమశిక్షణతో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం తనదైన శైలిలో మరోసారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
సాధ్విని మందలించిన జేపీ నడ్డా!
సాక్షి, న్యూఢిల్లీ: మరుగుదొడ్లు కడగడం కోసమో.. వీధులు ఊడ్చడం కోసమో తాను ఎంపీగా ఎన్నికవ్వలేదంటూ బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మానస పథకంగా ‘స్వచ్ఛ భారత్’కు విశేషమైన ప్రాచుర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఆయన సొంత పార్టీ ఎంపీ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్ ఎంపీ సాధ్విపై కన్నెర్ర జేసింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సాధ్వి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. ఆమెను మందలించినట్టు తెలుస్తోంది. ఇకముందు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఆమెకు సూచించినట్టు సమాచారం. టాయిలెట్ వ్యాఖ్యల నేపథ్యంలో జేపీ నడ్డాతోపాటు బీజేపీ ఆర్గనైజషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఆమెను పిలిపించుకొని.. ఈ వ్యాఖ్యల విషయమై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
‘సాధ్వి ప్రజ్ఞా.. మోదీ వ్యతిరేకురాలు’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం పార్టీ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ. మమ్మల్ని ఎన్నుకుంది టాయిలెట్లు శుభ్రం చేయడానికి కాదు అంటూ సాధ్వి ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ.. సాధ్వి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. సాధ్వి ఉన్నత కులానికి చెందిన వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడారని ఆరోపించారు. మరగుదొడ్లు శుభ్రం చేసేవారిని ఆమె తనతో సమానంగా చూడలేకపోతున్నారని.. ఇలాంటి వారు నూతన భారతదేశాన్ని ఎలా సృష్టిస్తారని ఒవైసీ ప్రశ్నించారు. వర్షాకాలం కావడంతో.. సాధ్వి ప్రాతినిథ్యం వహిస్తోన్న భోపాల్ పరిసర ప్రాంతాలు అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సాధ్వి తీవ్రంగా మండి పడుతూ.. ‘ఒకటి గుర్తుంచుకోండి.. నన్ను ఎన్నుకున్నది మురికి కాలువలు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కాదు. నన్ను దేనికోసం అయితే ఎన్నుకున్నారో ఆ బాధ్యతల్ని నిజాయతీగా నిర్వర్తిస్తాను. ఒక ఎంపీగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయడమే నా విధి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం
భోపాల్: వివాదాస్పద బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ఈసారి విపక్షనేతలపై కాకుండా తన సొంత నియోజకవర్గ పార్టీ కార్యకర్తలపైనే. వర్షాకాలం కావడంతో.. సాద్వీ ప్రాతినిథ్యం వహిస్తున్న భోపాల్ పరిసర ప్రాంతాల్లో అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీంతో వారిపై ప్రజ్ఞా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ఎన్నికకాలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. ‘మీ మురికివాడలను శుభ్రం చేయడానికి నేనేం పారిశుధ్య కార్మికురాలిని కాదు. డ్రైనేజీ, టాయిలెట్లను పరిశుభ్రం చేయడానికి కాదు నేను పార్లమెంట్‌కు ఎన్నికయింది. నేను స్థానిక ప్రజాప్రతినిధులను సమస్వయం చేసి పని చేయచేయిస్తాను’ అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు, కార్మికులకు, స్థానిక ఎమ్మెల్యేలకు తాను కేవలం ఆదేశాలు జారీ చేస్తానని, వారితో పనిచేయించుకోండని ప్రజ్ఞా ఉచిత సలహా ఇచ్చారు. ఎంపీ సమాధానంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అంటూ.. గంటల కొద్ది ప్రసంగాలు ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర్ర ప్రభుత్వాలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చినా అది ఏమాత్రం అమలుకావడంలేదు. ప్రజ్ఞా సమాధానంపై స్థానిక కాంగ్రెస్ నేత తారీక్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. ఇది ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దీనిపై ప్రధాని మోదీ వెంటనే కల్పించుకుని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వివాదాస్పద నేతగా పేరొందిన సాద్వీ ప్రజ్ఞా.. ఎన్నికల సమయంలో ఎన్నోసార్లు నోరుజారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. -
మాలేగావ్ కేసు :సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు షాక్
ముంబై : మాలెగావ్ పేలుళ్ల కేసులో వారానికి ఒకసారి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడాన్ని శాశ్వతంగా మినహాయించాలని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ దాఖలు చేసిన అప్పీల్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. తాను ఎంపీ కావడంతో రోజూ పార్లమెంట్‌కు హాజరు కావాల్సి ఉన్నందున కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ప్రజ్ఞా సింగ్ కోర్టుకు సమర్పించిన అప్లికేషన్లో పేర్కొన్నారు. అయితే 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి గురువారం ఒక్కరోజే ఆమెను వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయించింది. కాగా తనకు ముంబై పరిసరాల్లో ఎక్కడా నివాస గృహం లేదని, ముంబైలో ఉండగా తనకు భద్రతా ఏర్పాట్లు చేపట్టడం అసౌకర్యంగా ఉంటుందని కూడా ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రసాద్ పురోహిత్, మేజర్ రిటైర్డ్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు బెయిల్‌పై ఉన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక మాలెగావ్ పేలుళ్ల కేసులో 2008లో అరెస్ట్ అయిన ప్రజ్ఞా సింగ్‌కు తొమ్మిదేళ్ల తర్వాత అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. -
ఆ కుర్చీలో కూర్చుంటే అంతే: సాధ్వి ప్రజ్ఞాసింగ్
ముంబై: భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ శువ్రవారం మొదటిసారిగా 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు హాలులో నిలుచునే ఉన్నారు. జడ్జి పలుమార్లు కూర్చోవచ్చని చెప్పినా ఆమె నిరాకరించారు. విచారణ ముగిసి, జడ్జి వెళ్లి పోయిన తర్వాత ప్రజ్ఞ కోర్టురూమ్‌లో సౌకర్యాలు సరిగా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన కుర్చీని చూపిస్తూ.. ‘దీనిపై అంతా దుమ్మే. ఇందులో కూర్చుంటే నేను పడక్కే పరిమితమవుతా..’ అని అన్నారు. ‘ముందు కనీసం కూర్చునే చోటు చూపించండి. కావాలనుకుంటే తర్వాత ఉరి తీయండి’ అని వ్యాఖ్యానించారు. -
గాంధీజీపై ట్వీట్‌కు ఇదేమి శిక్షా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆహా, గాంధీజీ 150వ జయంతి ఎంత అద్భుతంగా జరుగుతోంది. కరెన్సీ నోట్ల పై నుంచి ఆయన చిత్రాలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన విగ్రహాలను తొలగించేందుకు ఇదే అదను. ఆయన పేరుతో ఉన్న సంస్థలు, రోడ్ల పేర్లను మార్చండీ, అదే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అవుతోంది. థ్యాంక్యూ గాడ్సే ఫర్ 30–1–1948’.. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి నిధి చౌధరి మే 17వ తేదీన చేసిన ఈ ట్వీట్‌పై ఎంతో రాద్ధాంతం జరిగిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవ్హాద్ అయితే తక్షణం ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నాయకుడు శరద్ పవార్, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఏకంగా లేఖ కూడా రాశారు. ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ కాంగ్రెస్ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఆమె ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేనే నిజమైన దేశభక్తుడంటూ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే (మే 17న) నిధి చౌధరి గాంధీజీపై ట్వీట్ చేయడం గమనార్హం. తనపై ఇంత రాద్ధాంతం జరగుతుండడంతో ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించిన నిధి, అవి తాను వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలని ఎన్నో వివరణలు ఇచ్చారు. ఆ ట్వీట్‌కు ‘విలపిస్తోన్న ఎమోజీ’ చిహ్నాన్ని పెట్టాను చూడండంటూ మొత్తుకున్నారు. తాను గాంధీజీని స్మరించుకోనిదే ఏ రోజు ఇంటి నుంచి బయటకు పోనని చెప్పుకున్నారు. 2011 సంవత్సరం నుంచి గాంధీజీ సూక్తులను తాను వరుసగా ట్వీట్ చేస్తూ వస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. గాంధీజీ రాసిన పుస్తకాల్లో ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ తనకు నచ్చిన దాంట్లో ఒకటంటూ గత ఏప్రిల్ తాను ట్వీట్ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందుకు రుజువుగా పాత ట్వీట్లన్నింటిని ఆమె రీట్వీట్లు చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియా కూడా ఇప్పటికీ ఆమెపై తప్పుడు ప్రచారాన్నే సాగిస్తున్నాయి. ఫలితంగా ఇంతకుముందే ఆమెకు షోకాజ్ నోటీసును జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ముంబైలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నిధి చౌధరిని, వాటర్ సానిటేషన్ డిపార్ట్మెంట్కు డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ ఉత్తర్వులు అందుకునేందుకు ఆమె ప్రస్తుతం అందుబాటులో లేరు. తనపై అనవసర వివాదం చెలరేగడంతో ఆమె సెలవుపై విదేశాలకు వెళ్లారు. గాంధీజీ హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ బీజేపీ తరఫున పోటీచేస్తే నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో పార్లమెంట్‌కు ఎన్నుకున్నాం. ఆమెపైన ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమె వ్యాఖ్యలకు నొచ్చుకొని వ్యంగోక్తులు చేసినందుకు నిధి చౌధరికి శిక్ష పడింది. -
ఇకపై క్రమశిక్షణతో మెలుగుతా : సాధ్వి ప్రఙ్ఞా
భోపాల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ ఇకపై క్రమశిక్షణతో మెలుగుతానని పేర్కొన్నారు. పార్టీ విధానాలను గౌరవిస్తూ విధేయతతో ఉంటానని స్పష్టం చేశారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రఙ్ఞా సింగ్ అనూహ్యంగా భోపాల్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 23న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ సింగ్‌ను మట్టికరిపించి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వి ప్రఙ్ఞా సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్ర కాల్పుల్లో మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించి చిక్కుల్లో పడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు.ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సాధ్వి ప్రఙ్ఞా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ఆమె ఇకపై క్రమశిక్షణతో ఉంటానని స్పష్టం చేశారు. అవకాశం వస్తే ప్రధాన నరేంద్ర మోదీని కూడా కలుస్తానని పేర్కొన్నారు. -
28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..
న్యూఢిల్లీ: 41 మంది సిట్టింగ్ మహిళా ఎంపీల్లో 28 మంది మహిళా ఎంపీలు ముందంజలో ఉన్నారు. సోనియా గాంధీ, హేమ మాలిని, కిరణ్ ఖేర్ వం టి సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని పదిల పరచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే స్మృతీ ఇరానీ, ప్రజ్ఞా ఠాకూర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాయ్ బరేలి నుంచి కాంగ్రె స్ ఎంపీ సోనియా గాంధీ, పిలిభిత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ మేనకా గాంధీ, మధుర బీజేపీ ఎంపీ మాలిని, చంఢీగఢ్ బీజేపీ అభ్యర్థి ఖేర్, కనౌజ్ ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి వంటి ప్రముఖులు ముందంజ లో ఉన్నారు. కాగా, అసన్సోల్ నుంచి బంకుర టీఎమ్సీ ఎంపీ మున్ మున్ సేన్, కాంగ్రెస్ సిల్చర్ ఎంపీ సుస్మితా దేవ్, సుపాల్ కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్, బర్ధమాన్–దుర్గాపూర్ టీఎంసీ అభ్యర్థి మమ్తాజ్ సంఘమిత్ర, హూగ్లీ టీఎంసీ ఎంపీ అభ్యర్థి రత్న డే, లాల్గంజ్ ఎంపీ నీలం సోన్కార్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ నుంచి లీడింగ్‌లో ఉన్న మహిళా సిట్టింగ్ ఎంపీలు 16 మంది కాగా, కాంగ్రెస్ నుంచి కేవలం సోనియా గాంధీ మాత్రమే లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలా భావించే అమేథీలో స్మృతి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ రాహుల్ గాంధీపై చారిత్రక విజయాన్ని నమోదు చేయనున్నారు. కాగా భోపాల్ వివాదాస్పద బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా తన ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ముందంజలో ఉన్నారు. అలాగే తూత్తుకూడి డీఎంకే అభ్యర్థి కనిమొళి కరుణానిధి, ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ గెలుపుబాటలో ఉన్నారు. టీఎంసీ తరపున పోటీ పడుతున్న బెంగాళీ నటి లాకెట్ చటర్జీ హూగ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 54 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 53 మంది మహిళలు పోటీపడ్డారు. యూపీ నుంచి అత్యధికంగా 104 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌కు భారీ షాక్!
భోపాల్ : బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్ ఠాకూర్‌కు షాకిచ్చేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రఙ్ఞాసింగ్ నిందితురాలిగా ఉన్న ఆరెస్సెస్ ప్రచారక్ హత్యకేసును రీఓపెన్ చేసేందుకు కమల్‌నాథ్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాదాపు 12 ఏళ్ల క్రితం అనగా 2007, డిసెంబరు 29న సునీల్ జోషి అనే ఆరెస్సెస్ ప్రచారక్ దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ నాయకుడి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ జోషి.. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ క్రమంలో ప్రఙ్ఞా సింగ్ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా 2017లో కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును తిరగదోడాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో భోపాల్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని వెల్లడైన నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం పాత కేసును తెరపైకి తేవడం గమనార్హం. ఈ విషయం గురించి రాష్ట్ర న్యాయశాఖా మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ.. సునీల్ జోషి హత్య కేసును తిరిగి ఓపెన్ చేసేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో దేవాస్ కలెక్టర్ తన సొంత నిర్ణయాల మేరకు కేసును మూసి వేశారని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు ఫైల్‌ను సమర్పించాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించామని తెలిపారు. రివేంజ్ పాలిటిక్స్.. సునీల్ జోషి హత్యకేసు తిరగదోడటంపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై ప్రఙ్ఞా పోటీ చేసినందుకు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాగా ప్రఙ్ఞాసింగ్ ఠాకూర్ భోపాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆమె 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కూడా నిందితురాలిగా ఉన్నారు. తాజాగా మహత్మా గాంధీ హంతకుడు గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించి సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. -
అభ్యర్థిపై హీరో ట్వీట్ : చాలా లేటైంది బాస్!
ముంబై: మహాత్మాగాంధీ హంతకుడైన నాథురాం గాడ్సేను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఆదివారం ట్వీట్ చేశారు. గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించిన సాధ్వికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన భోపాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ప్రియమైన భోపాల్ ఓటర్లారా.. మరో గ్యాస్ ట్రాజెడీ నుంచి మీ నగరాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రగ్యాకు నో చెప్పండి. గాడ్సేకు నో చెప్పండి. మహాత్ముడిని గుర్తుచేసుకోండి. ద్వేషాన్ని కాదు ప్రేమను ఎంచుకోండి’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఆరో దఫా ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న భోపాల్‌లో జరిగిన పోలింగ్‌లో నిజానికి రికార్డుస్థాయిలో 65.69శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన తర్వాత తీరిగ్గా ప్రగ్యాకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ఫర్హాన్‌ను నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పడే ట్వీట్ చేయడం.. చాలా తొందరపడటం అవుతుందని ఓ నెటిజన్ చమత్కరించగా.. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను మార్చుకోండి.. మీ ట్వీట్ పోస్టు అవ్వడానికి పదిరోజుల సమయం తీసుకుంటోందని మరొకరు కామెంట్ చేశారు. భోపాల్‌లో బీజేపీ నుంచి సాధ్వి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్‌సింగ్ పోటీ చేస్తుండటంతో ఇక్కడ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. -
సాధ్విపై సిద్ధూ ఫైర్..!
బెంగళూరు: భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. మహాత్మాగాంధీ ప్రాణాలు తీసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించే ప్రతిఒక్కరినీ ఉగ్రవాదిగానే ప్రజలు భావిస్తారని అన్నారు. ‘మహాత్మా గాంధీని హతమార్చిన గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఒక ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించారు. గాంధీజీపై ఉన్న అభిమానంతో ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అంటూ పిలుస్తారని గుర్తు చేశారు. గాంధీ హంతకున్ని దేశభక్తుంటూ అభివర్ణించిన వారందరూ ఉగ్రవాదుల కోవాలోకే వస్తారని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అదేక్రమంలో గాడ్సేపై అభిప్రాయం తెలపాల్సిందిగా మీడియా అడగడంతో.. ‘గాడ్సే నిజమైన దేశభక్తుడు’ అంటూ అభివర్ణించి సాధ్వి సరికొత్త వివాదానికి తెరతీశారు. ఆమె వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకున పడింది. గాడ్సేను కీర్తిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారడంతో.. తప్పు తెలుసుకున్న సాధ్వి క్షమాపణలు కోరింది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన బీజేపీ ఆమె వివరణివ్వాలని కోరింది. ఇక మహాత్మా గాంధీని అవమానించిన సాధ్విని క్షమించబోనని మోదీ పేర్కొనడం గమనార్హం. -
‘బాపూను అవమానించిన సాధ్వీని సహించం’
సాక్షి, న్యూఢిల్లీ : తుదివిడత పోలింగ్‌కు ముందు పార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. గాడ్సేను సమర్ధిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ చీఫ్ అమిత్ షా పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని, ఆమెను పార్టీ వివరణ కోరుతుందని చెప్పారు. మరోవైపు గాడ్సేను దేశభక్తుడిగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ అభివర్ణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీని అవమానించేలా మాట్లాడిన సాధ్విని ఎన్నటికీ క్షమించమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ సహా పలువురు బీజేపీ నేతలు సైతం తప్పుపట్టారు. -
‘తాలిబన్లుగా మారకూడదు’
ముంబై : నాథురామ్ గాడ్సేని దేశభక్తుడంటూ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్ని సాధ్వి వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర కూడా ఈ అంశంపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మన విలువల్ని మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదంటూ హితవు పలికారు. ‘75 ఏళ్లుగా ప్రపంచం, భారతదేశాన్ని మహాత్ముడి జన్మభూమిగానే గుర్తిస్తుంది. ప్రపంచం నైతికతను కొల్పోయినప్పుడు మన దేశమే ముందుండి దారి చూపిస్తుంది. ప్రపంచం అంతా మనల్ని పేదవారిగా చూస్తారు. కానీ బాపు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. కొన్ని విషయాలు పవిత్రంగానే ఉండాలి. మనకోసం మనం ఏర్పాటు చేసుకున్న విలువల్ని మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదు’ అంటూ ట్వీట్ చేశారు. For 75 yrs,India’s been the land of the Mahatma;a beacon when the world lost its morality.We used to be pitied for being poor but we were always rich since Bapu inspired billions globally.Some things must remain sacred.Or we become the Taliban,destroying statues that sustain us — anand mahindra (@anandmahindra) May 17, 2019 ఆనంద్ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోన్న నేపథ్యంలో సమాజానికి సరైన సందేశం ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
‘గాడ్సే’ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా ముగ్గురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. గాడ్సేపై కాషాయ నేతలు అనంత్ కుమార్ హెగ్డే, ప్రజ్ణా సింగ్ ఠాకూర్, నళినీ కుమార్ కతీల్‌లు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, పార్టీ వైఖరితో వారి వ్యాఖ్యలకు సంబంధం లేదని అమిత్ షా శుక్రవారం తేల్చిచెప్పారు. బీజేపీ సిద్ధాంతం, విధానాల ప్రాతిపదికన వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వారి వ్యాఖ్యలపై వివరణ కోరతామని తెలిపారు. కాగా ఈ నేతలు ఇప్పటికే తమ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారని, అయితే వీరి వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణా కమిటీకి నివేదించామని అమిత్ షా ట్వీట్ చేశారు. పది రోజుల్లో కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. కాగా మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాధ్వి వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ సహా, పలువురు బీజేపీ నేతలూ తప్పుపట్టారు. -
‘ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆ పార్టీ గుర్తింపు’
లక్నో : బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ప్రజల్లో మిగిలిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలపై మండి పడ్డారు. గాడ్సే, ఖాకీ నిక్కర్ ఆర్ఎస్ఎస్కు గుర్తింపు తెచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇన్నాళ్లు ఆర్ఎస్ఎస్ అనగానే ఖాకీ నిక్కరు ఎలా గుర్తుకు వచ్చేదో.. ఇక మీదట గాడ్సే కూడా అలానే గుర్తుకు వస్తాడు. ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆర్ఎస్ఎస్ అస్థిత్వాలు. ఇప్పుడిక నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని గాంధీ పేరుతో గుర్తుంచుకోవాలో.. గాడ్సే పేరుతో గుర్తుంచుకోవాలో అనే నిర్ణయాన్ని ప్రజలే తీసుకోవాలి. మానవత్వం కావాలో.. ఖాకీ నిక్కరు కావాలో ఓటర్లే తేల్చుకోవాల’న్నారు. అంతేకాక గాడ్సే మద్దతుదారురాలు అయినందుకు గాను ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
గాడ్సే దేశ భక్తుడైతే గాంధీ జాతి వ్యతిరేకా?
అగర్ మాల్వా, ఉజ్జయిని, భోపాల్/న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఆ పార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ గురువారం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో రోడ్ షో సందర్భంగా తాజా వివాదానికి తెరతీశారు. ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. గాడ్సే దేశ భక్తుడని, ఆయన ఎప్పటికీ దేశ భక్తుడిగానే ఉంటారని అన్నారు. ఆయన్ను ఉగ్రవాది అంటున్నవారు తమను తాము ఒకసారి పరీక్షించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూ అంటూ గాడ్సేని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతగా మారిన నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు.. ప్రజ్ఞ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడ్డాయి. బీజేపీ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తాయి. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజ్ఞను ఆదేశించింది. దీంతో క్షమాపణ చెప్పిన ఆమె తాను చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకున్నారు. భోపాల్‌లో మే 12న ఎన్నికల ప్రచారం ముగించిన ప్రజ్ఞ.. 19న ఎన్నికలు జరగబోయే మాల్వా ప్రాంతంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది: ఎన్సీపీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ అసలు రంగును ప్రజలిప్పుడు చూస్తున్నారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సే.. ప్రజ్ఞ పేర్కొన్నట్టుగా దేశ భక్తుడేనా? అన్న సంగతి ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు కూడా ఉగ్రవాది గాడ్సే కోవలోకే వస్తారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవ్హద్ అన్నారు. గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామన్న బీజేపీ ప్రజ్ఞ వ్యాఖ్యలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని బీజేపీ పేర్కొంది. మహాత్మా గాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడని తెలిపింది. ఆమె అలాంటి ప్రకటన ఎలా చేశారో వివరణ కోరతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పడం సమంజసమని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజ్ఞ క్షమాపణలు చెప్పడం నెలలో రెండోసారి. గతంలో కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె క్షమాపణ చెప్పారు. తాజా వ్యాఖ్యలకు సైతం ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఆమె ప్రతినిధి, బీజేపీ నేత డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. గతంలోనూ... ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ఐపీఎస్ అధికారి, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తాను పెట్టిన శాపంతోనే ముంబై ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. ఏటీఎస్ చీఫ్‌గా మాలెగావ్ పేలుళ్ల కేసు విచారించిన కర్కరే తనను హింసించారని ప్రజ్ఞ అప్పట్లో ఆరోపించారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. అది బీజేపీ డీఎన్ఏలోనే ఉంది : కాంగ్రెస్ ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ, అమిత్ షాల అభిమాన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ మరోసారి జాతి యావత్తును అవమానించారని పేర్కొంది. హింసా సంస్కృతి, అమరులను కించ పరచడమనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించింది. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను దండించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రధానిని కోరారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులనేది స్పష్టమయ్యిందని అన్నారు. వారు గాడ్సేని దేశ భక్తుడని, వీర మరణం పొందిన కర్కరేని దేశ ద్రోహి అని అంటారన్నారు. తమ నేతల ద్వారా బీజేపీ.. జాతిపిత సిద్ధాంతాలు, ఆలోచనా విధానంపై ‘హానికారక దాడులు’ చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘ఇది గాంధేయ సూత్రాలను కించ పరిచేందుకు జరుగుతున్న కుట్ర. దేశం క్షమించజాలని క్షమాపణార్హం కాని నేరం..’ అని అన్నారు. మోదీకి ఎంత మాత్రం తెలివి ఉన్నా ప్రజ్ఞా సింగ్‌ను దండించి, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో బీజేపీ ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా ప్రజ్ఞ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గాడ్సేని ప్రశంసించడం దేశ భక్తి కాదని, అదొక జాతి వ్యతిరేక చర్య అని అన్నారు. మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
గాడ్సే వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన ప్రజ్ఞా సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని ఆమె వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. బీజేపీ సైతం ఆమె వ్యాఖ్యలతో పార్టీ ఏకీభవించదని, ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరడంతో సాధ్వి ప్రజ్ఞా సింగ్ వెనక్కితగ్గారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆమె క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై ప్రజ్ఞాజీ క్షమాపణలు తెలిపారని ఆమె ప్రతినిధి, బీజేపీ నేత హితేష్ వాజ్‌పేయి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. -
‘ఆమె వ్యాఖ్యలు దేశానికి అవమానకరం’
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా భోపాల్ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ కొనియాడటం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతంపై దాడి అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఆక్షేపించారు. భారత ఆత్మను నాథూరాం గాడ్సే వారసులు, పాలక బీజేపీ శ్రేణులు దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేను నిజమైన జాతీయవాదిగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారని..ఇది దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతానికి తూట్లుపొడవడమేనని సుర్జీవాలా పేర్కొన్నారు. సాధ్వి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీని చంపిన గాడ్సే ఓ హంతకుడని, ఆయనను కీర్తించడం దేశభక్తి కాదని, రాజద్రోహమని దిగ్విజయ్ సింగ్ అన్నారు. బీజేపీ వివరణ.. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని, దీనిపై పార్టీ ఆమె వివరణ కోరుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. కాగా మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ఉంటారని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
సాధ్వి ప్రజ్ఞా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్ : ఫైర్‌బ్రాండ్ నేత, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే దేశప్రజల్లో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో దీటుగా బదులిస్తారని అన్నారు. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోశాయి. కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
కంప్యూటర్ బాబా పూజలు; ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నామ్‌దేవ్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా హఠ యోగ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్ ఠాకూర్ ఓటమిని ఆకాంక్షిస్తూ మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమంలో సుమారు ఏడు వేల మంది సాధువులు పాల్గొన్నారు. అదే విధంగా దిగ్విజయ్ సింగ్‌కు ఓటు వేయాలంటూ వందల మంది సన్యాసులు ప్రజలను కోరుతారని కంప్యూటర్ బాబా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్యూటర్ బాబా కార్యకలాపాలపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. భోపాల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల కమిషనర్‌కు ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పూజా కార్యక్రమాలకు కంప్యూటర్ బాబాకు అనుమతి ఎవరు ఇచ్చారు.. తన విజయం కోసం దిగ్విజయ్ సింగే సాధువులను ఆహ్వానించారా... ఏ పార్టీ కోసం బాబా ప్రచారం చేస్తున్నారు.. అందుకు ఎంత మొత్తం అంతదుకుంటున్నారు.. పూజా కార్యక్రమాలకు అయ్యే ఖర్చు ఎంత తదితర అంశాలపై విచారణ చేపట్టాల్సింగా పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి హోదాను అనుభవించిన కంప్యూటర్ బాబా..ప్రస్తుతం అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించలేదని, మందిర్ లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్ బాబా మండిపడ్డారు. కాషాయ వస్ర్తాలను ధరించినందుకే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం తగదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉందని, హత్య కేసులోనూ ఆమె నిందితురాలని కంప్యూటర్ బాబా ఆరోపించారు. -
ముల్లును ముల్లుతోనే...
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాషాయపక్షాన్ని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ సైతం అదే కాషాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పదేళ్ళ పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ని ఓడించాలని బీజేపీ, ఎలాగైనా విజయతీరాలకు చేరాలని సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్ ప్రచారానికి కాషాయాన్ని జోడించారు. భోపాల్‌లో మే 12న జరిగే ఆరోదశ లోక్‌సభ పోలింగ్‌లో నియోజకవర్గంలో దిగ్విజయ్‌సింగ్ వర్సెస్ ప్రగ్యాసింగ్ ఠాకూర్ల మధ్య పోల్వార్ హోరు పూజలూ, యజ్ఞాలతో రంజుగా మారింది. ఈ ఇరువురూ భోపాల్‌లో గెలుపుకోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ని కట్టడి చేయడం కోసం మాలెగాం కేసులో జైలుపాలై అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్వి ని బరిలోకి దింపింది. అదే కాషాయ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న కాంగ్రెస్ ప్రగ్యాసింగ్‌కి ప్రతిగా దిగ్విజయ్ సింగ్ తరఫున కంప్యూటర్ బాబాని స్క్రీన్‌పైకి తెచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రగ్య, వివాదాస్పద కార్యక్రమాలతో దిగ్విజయ్‌సింగ్ ఇరువురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో భోపాల్ ఎన్నికల ప్రచారం కాషాయంతో కలగాపులగంగా మారింది. ఏది బీజేపీ యజ్ఞమో, ఏది కాంగ్రెస్ ప్రచారమో తెలుసుకోలేనంతగా ఇప్పుడు భోపాల్‌లో పరిస్థితి తారుమారయ్యింది. ఇటీవలే కంప్యూటర్ బాబా దిగ్విజయ్ విజయం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో 5000 మంది సాధువులతో భారీ యాగాన్ని నిర్వహించారు. దీనికి ప్రతిగా ప్రగ్యా ఠాకూర్ అక్షయ తృతీయ సందర్భంగా పరశురామ్ జయంతి పూజలు భారీగా నిర్వహించడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నామ్‌దేవ్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ గెలుపుకోసం విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. దిగ్విజయ్ తరఫున యజ్ఞాలతో పాటు ప్రచారం కూడా చేస్తోన్న బాబా ప్రగ్యని ఉద్దేశించి బీజేపీ నాయకులు ప్రగ్యని బలిపశువుని చేశారని వ్యాఖ్యానిస్తే, సాధ్వి ప్రగ్య మాత్రం ఒకప్పుడు రాముడే మిథ్య అన్న వారు ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారనీ, అంతకు మించిన అచ్చాదిన్ ఏముంటాయంటూ తనపై విమర్శలను తిప్పి కొడుతున్నారు. -
కాంగ్రెస్ ప్రచారంలో ‘కాషాయ’ స్కార్ఫులు!
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ రోడ్‌షోలో మహిళా పోలీసలు కాషాయ రంగు స్కార్పులు ధరించడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిగ్గీ రాజా బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు కాషాయ రంగు గల స్టోల్స్ ధరించారు. కాంగ్రెస్ నాయకుడి సభలో కాషాయ రంగు మెరవడంతో మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వెంటనే అక్కడున్న మహిళలను ప్రశ్నించగా.. వారిలో కొంతమంది తాము పోలీసులమని చెప్పగా.. మరికొందరు మాత్రం తమను తాము ఎండ నుంచి కాపాడుకోవడానికి స్టోల్స్ ధరించామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జాతీయతకు ఈ రంగు చిహ్నమని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. పోలీసులను తన రోడ్‌షో కోసం వాడుకుంటున్న దిగ్విజయ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విఙ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో ఇరుపార్టీల నాయకులు విమర్శల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ డీఐజీ ఇష్రాద్ వలీ.. సదరు మహిళలను తాము రిక్రూట్ చేసుకోలేదని.. వారు పోలీసులు కాదని స్పష్టతననిచ్చారు. వారు కేవలం వాలంటీర్లు మాత్రమేనని, డ్యూటీలో ఉన్న పోలీసులెవరూ కాషాయం ధరించరని పేర్కొన్నారు. కాగా తన ప్రత్యర్థి అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్(బీజేపీ)ను బలంగా ఢీకొట్టేందుకు గత కొన్నిరోజులగా డిగ్గీరాజా హిందూవాదాన్ని ప్రధానంగా హైలెట్ చేస్తున్నారు. కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో ఆయన..మంగళవారం ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు వివిధ సాధువులు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఇక కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. -
సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 72 గంటల నిషేధాన్ని ఆమె ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై ప్రజ్ఞా సింగ్‌కు బుధవారం ఈసీ క్లీన్చిట్ ఇచ్చింది. ప్రజ్ఞా సింగ్ ప్రచారంపై ఈసీ 72 గంటలు నిషేధం విధించినా ఆమె దేవాలయాలు సందర్శించడం, భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం వంటి చర్యలతో ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఆమె తన ఉద్యమాల గురించి కరపత్రాలను పంచారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఈసీ ఆమెను వివరణ కోరగా ఈ ఆరోపణలను ప్రజ్ఞా సింగ్ తోసిపుచ్చారు. తన తరపున కరపత్రాలు ఎవరు పంచారో తనకు తెలియదని బదులిచ్చారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసం, మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపై ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆమె 72 గంటల పాటు ప్రచారం చేయరాదని నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈసీ నోటీసులు
-
నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సాధ్వి ప్రచారం!
న్యూఢిల్లీ : భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 72 గంటల నిషేధాజ్ఞలను జవదాటి ప్రచారం నిర్వహించినందుకు ప్రజ్ఞాసింగ్‌ని ఈసీ వివరణ కోరింది. బాబ్రీ మసీదుకు సంబంధించి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు... 72గంటలపాటు ప్రచారం చేయకుండా సాధ్విపై ఈసీ నిషేధం విధించింది. గురువారం ఉదయం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే శుక్రవారం ప్రజ్ఞాసింగ్ ఓ ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తులతో ముచ్చటించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఈసీ ప్రజ్ఞాసింగ్‌కి నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన సాధ్వి.. ఆలయాల సందర్శన సన్యాసి జీవితంలో భాగమని తెలిపారు. -
సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌పై కేసు లేదా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘2014 ఎన్నికల నాటికి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై ఓ కేసుకు సంబంధించి కుట్ర అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని రెండు కోర్టులు కొట్టివేశాయి’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రిపిబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అర్నాబ్ గోస్వామికి ఏప్రిల్ 25వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అదేరోజు ఆ విషయాన్ని బీజేపీ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు కూడా. అది అబద్ధం. 2008, సెప్టెంబర్ 29వ తేదీన మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించడం, దాదాపు వంద మంది గాయపడడం తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద నమోదు చేసిన అభియోగాలను ఎన్ఐఏ కోర్టు 2017, డిసెంబర్ 27వ తేదీన కొట్టి వేసింది. ఇండియన్ పీనల్ కోడ్ కింద దాఖలు చేసిన అభియోగాలను కొట్టి వేయలేదు. పైగా ‘ఇండియన్ పీనల్ కోడ్‌కు సంబంధించి మాలేగావ్ బాంబు పేలుళ్లకు కుట్రపన్నారనడానికి ప్రజ్ఞాసింగ్, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నేను ఇదివరకే చెప్పాను’ అని ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక జడ్జీ వీఎస్ పడాల్కర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు హత్య, నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య వైషమ్యాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ, ప్రజల ఆస్తికి నష్టం కలిగించడం తదితర అభియోగాలపై సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌తోపాటు మరో ఆరుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 302, 307, 326, 324, 427,153ఏ, 120 బీ సెక్షన్ల కింద, 1908 నాటి పేలుడు పదార్థాల చట్టంలోని 3,4,5,6 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు 2018, అక్టోబర్ 30 నాడు ఎన్ఐఏ కోర్టు తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కోసం మూడుసార్లు ఆపరేషన్ చేయించుకున్న ప్రజ్ఞాసింగ్ అనారోగ్య కారణాలపై ఎప్పుడో బెయిల్ తీసుకున్నారు. ఈ కోర్టుతోపాటు సుప్రీం కోర్టు కూడా ఆమెపై అభియోగాలను కొట్టివేసిందని అమిత్ షా ప్రకటించారు. సుప్రీం కోర్టు కూడా మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల కింద అభియోగాలు మోపడం సబబేనా అంటూ సందేహం వ్యక్తం చేసిందీ తప్ప కేసును కొట్టివేయలేదు. తీవ్రమైన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇచ్చారని ఓటర్లు భావించే అవకాశం ఉందన్న కారణంగా అమిత్ షా తప్పుడు ప్రచారాన్ని అందుకొని ఉండవచ్చు. భోపాల్ నుంచి ప్రజ్ఞాసింగ్ పోటీ చేస్తున్నట్లు ఏప్రిల్ 20వ తేదీన బీజేపీ ప్రకటించిన విషయం తెల్సిందే. అంతకు మూడు రోజుల ముందే ఆమెను బీజేపీ లాంఛనంగా పార్టీలో చేర్చుకుంది. -
‘బిడ్డా.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం’
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు ఆమెను హత్యచేశారు. అనంతరం ఆనవాలు దొరకకుండా ఉండేందుకు తలపై బండరాళ్లతో మోదారు. ఈ దుర్ఘటన మంగళవారం భోపాల్‌లో చోటుచేసుకుంది. ఆరోజు సాయంత్రం తన పిన్ని(16)తో కలిసి బాధితురాలు గుడికి వెళ్లిన సమయంలో నిందితులు ఆమెను అపహరించారని పోలీసులు తెలిపారు. వారు బాధితురాలి పిన్ని ఇంటి పక్కనే ఉంటారని.. దీంతో నిందితులిద్దరితో పాటు ఆమెకు కూడా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ మేరకు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్ ఠాకూర్ కమల్‌నాథ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపు తప్పాయి. చింద్వారాకు మాత్రమే సీఎం కమల్‌నాథ్ పరిమితమై పోయారు. బేటీ.. నీ తరపున మేము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రఙ్ఞా.. కూతురి హత్యతో కుంగిపోయిన బాధితురాలి తల్లిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
500 ఏళ్లు పాలించారు.. ఒక్కరికీ హాని చేయలేదు!
భోపాల్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రచార ర్యాలీలో డిగ్గీరాజా.. ప్రఙ్ఞాసింగ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ప్రసంగిస్తూ... ‘ దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ప్రఙ్ఞా ఠాకూర్ చెబుతున్నారు. నిజంగా ఆమె శాపనార్థాలకు అంత బలమే ఉంటే మసూద్ అజహర్(జైషే మహ్మద్ చీఫ్)ను శపించవచ్చు కదా. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవసరమే ఉండేది’ కాదు అని ఎద్దేవా చేశారు. 500 ఏళ్లు పాలించారు.. ఏమైనా అయ్యిందా? పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులను ప్రస్తావిస్తూ.. ‘ కలుగులో దాక్కున్నా సరే ఉగ్రవాదులను వెదికి అంతమొందిస్తామని మోదీ అంటున్నారు. మరి పుల్వామా దాడి జరిగినపుడు ఆయన ఎక్కడున్నారు. పటాన్‌కోట్, యురీల్లో దాడులు జరిగినపుడు ఆయన ఏం చేస్తున్నారు. హిందువాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను విభజించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ వాళ్లకు నేను ఒక్కటే చెబుతున్నా వినండి. దాదాపు 500 ఏళ్ల పాటు ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఏ మతస్థులకు కూడా వారు ఎలాంటి హానీ చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అనే తేడాలేవీ లేవని అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారని పేర్కొన్నారు. కాగా మే 12న భోపాల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
‘నరేంద్ర మోదీని, నన్ను టార్చర్ చేశారు’
భోపాల్ : ప్రధాని నరేంద్ర మోదీని, తనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేసిందని భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కాంగ్రెస్ ఎంచుకున్న హింసకు తాను, మోదీ గుర్తులమని వ్యాఖ్యానించారు. దేశ భక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. దేశభక్తులను చూస్తే వణికిపోయే కాంగ్రెస్‌కు మరోసారి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. కాగా చేయని తప్పులకు తమను బాధ్యులిగా చూపి కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ ప్రధాని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సాధ్వీ ప్రఙ్ఞా మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ కాంగ్రెస్ హయాంలో అందరికీ అన్యాయమే జరిగింది. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నిందించింది. కానీ అవన్నీ అవాస్తవాలని తేలాయి. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నన్ను కూడా నిందించింది. మోదీని, నన్ను వాళ్లు ఎంతగానో టార్చర్ చేశారు’ అని పేర్కొన్నారు. చదవండి : సాధ్వి ప్రఙ్ఞాసింగ్ క్షమాపణ చెప్పాల్సిందే : బీజేపీ నేత ఇక ఆజ్‌తక్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా...2008 మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రఙ్ఞాకు టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించగా.. కాంగ్రెస్ తనను కూడా ఎన్నో విషయాల్లో నిందితుడిగా చిత్రీకరించిందని బదులిచ్చారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ పోస్టులుంటాయని, అలాంటి వారి వల్ల అమెరికా తనకు వీసా నిరాకరించిందని పేర్కొన్నారు. అయితే వాస్తవాలు వెల్లడైన తర్వాత తనకు వీసా నిరాకరించిన వారే స్వయంగా అమెరికాకు రావాలంటూ ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. ఇటీవల కపిల్ సిబల్ బ్రిటన్‌లో ఈవీఎంల గురించి అవాస్తవాలు ప్రచారం చేశారని, ఆధారాల్లేకుండా మాట్లాడటం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు. కాగా సాధ్వి ప్రఙ్ఞా నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ప్రజ్ఞా సింగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించలేమని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. -
సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌కు సొంత పార్టీ నేత ఝలక్
భోపాల్ : ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకురాలు ఫాతిమా రసూల్ సిద్దిఖి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేదాకా ఆమెకు మద్దతుగా నిలిచేది లేదని, ప్రచారంలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నిలబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రఙ్ఞా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డిసెంబర్ 6, 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసంలో మసీదును కూల్చిన బృందంలో తానూ ఉన్నానని, ఈ ఉద్యమంలో పాలుపుంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ విషయం గురించి సిద్దిఖి మాట్లాడుతూ.. ‘వాళ్లు(బీజేపీ) చాలా మంచివాళ్లు. శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినందువల్లే బీజేపీలో చేరాను. ప్రఙ్ఞా కారణంగా ముస్లింలతో సత్సంబంధాలు కలిగి ఉన్న బీజేపీ నేతల ఇమేజ్ కూడా దెబ్బతిన్నది. ఆ విధంగా మాట్లాడి ముస్లింల మనోభావాలను కించపరిచారు. అందుకే ఆమె క్షమాపణ చెప్పేంత వరకు ప్రచారంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. అలోక్ సంజార్, సురేందర్ సింగ్, అలోక్ శర్మ, విశ్వాస్ సారంగ్ వంటి ఎంతో మంది మంచి నాయకులు ఉన్నప్పటికీ ఆమెకు టికెట్ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా ఫాతిమా సిద్ధిఖీ నిర్ణయం పట్ల కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి రసూల్ అహ్మద్ కూతురైన ఫాతిమా 2018 నవంబరులో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భోపాల్ నార్త్ నుంచి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆరిఫ్ అక్వీల్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక ఆరో దశ పోలింగ్‌లో భాగంగా మే12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రికల ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. -
ప్రజ్ఞ అప్పట్లో ఒకరిని పొడిచింది
జబల్పూర్: మాలేగావ్ కేసులో నిందితురాలు, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001లో ఆమె ఒక వ్యక్తిని పొడిచారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రజ్ఞా ఠాకూర్‌కు ఛత్తీస్‌గఢ్‌తో ఒక సంబంధం ఉంది. ఆమె మరిది బిలాయ్‌గఢ్‌లో పనిచేసేవారు. అప్పట్లో ఆమె దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉండేది. 2001లో బిలాయ్‌గఢ్‌లో శైలేంద్ర దేవ్‌గణ్ అనే వ్యక్తి ఛాతీపై ఆమె కత్తితో పొడిచింది. ఆమె తరచూ గొడవల్లో తలదూర్చేది. ఆమెది నేర స్వభావం. అంతేతప్ప, సాధ్వి మాదిరిగా మాత్రం కాదు’ అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి హితేశ్ బాజ్‌పేయి తీవ్రంగా స్పందించారు. ‘సీఎం సారీ చెప్పాలి. లేదంటే మేం వేసే పరువునష్టం కేసుకు సిద్ధపడాలి’ అని హెచ్చరించారు. -
సాధ్వికి రాందేవ్ మద్దతు
డెహ్రడూన్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను యోగా గురువు రాందేవ్ వెనకేసుకొచ్చారు. అనుమానం పేరుతో ఆమెను తొమ్మిదేళ్ల పాటు జైలులో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. హరిద్వార్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సాధ్వి ప్రజ్ఞా 9 ఏళ్ల పాటు కఠిన కారాగార జీవితం అనుభవించారు. జైల్లో అనుభవించిన బాధల కారణంగానే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరానికి పాల్పడ్డారన్న అనుమానంతో జైలులో ఆమె పట్ల అవమానవీయంగా ప్రవర్తించడం సమంజసం కాద’ని అన్నారు. ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా రాందేవ్ పైవిధంగా జవాబిచ్చారు. తాను శపించినందునే హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని భోపాల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా దేశం ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోందని రాందేవ్ పేర్కొన్నారు. ఈ సవాళ్లు అన్నింటినీ అధిగమించి 2040 నాటికి మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం మాత్రమే సమస్యలు కాదని.. ‘రాముడు, జాతీయవాదం’ కూడా ప్రధానాంశాలేనని స్పష్టం చేశారు. -
‘ఆవు మూత్రంతో క్యాన్సర్ నయమైంది’
భోపాల్ : ఆవు పాల పదార్థాలతో పాటు ఆవు మూత్రం సేవించడం వల్ల తనకు బ్రెస్ట్ క్యాన్సర్ నయమైందని భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తెలిపారు. భోపాల్ లోక్‌సభకు సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆమె ఓ జాతీయ చానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో ఆవుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. ఆవు మూత్రం అమృతమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆవుతో, ఆవుకు సంబంధించిన పదార్థలతో ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఆవు మూత్రం, ఆవు పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయని, తన బ్రెస్ట్ క్యాన్సర్.. ఆవు మూత్రంతోనే నయమైందన్నారు. ఆవుకు సంబంధించిన ఐదు పదార్థాలు (ఆవు పేడ, పాలు, మూత్రం, నెయ్యి, పెరుగు)తో తయారు చేసే పంచగవ్యతో చాలా లాభాలున్నాయన్నారు. దీనికి తానే ఓ ఉదాహరణని చెప్పుకొచ్చారు. సరైన పద్దతిలో ఆవును మర్థన చేస్తే బీపీ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. గోమాత వెనుక నుంచి మెడల వరకు మర్థన చేస్తే ఆవు సంతోషంగా ఉండటమే కాకుండా.. రోజు చేస్తే మన బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. తపస్సు చేసుకోవడానికి గోశాలను మించిన మరో ప్రదేశం లేదన్నారు. వేదమంత్రాల మధ్య ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలైన ఆమె కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు పోటీగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజ్ఞా సింగ్ ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. -
విద్వేష రాజకీయాలకు చైతన్యమే విరుగుడు
పదిహేడవ లోక్‌సభకు జరిగే ఎన్నికలు పూర్తిగా నూతన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సరికొత్త పరిస్థితులు తెరమీదకొస్తోంది. ఈ పరిస్థితుల గురించి రేఖా మాత్రంగా తెలుసుకోవటానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. భోపాల్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పరమ భక్తురాలైన తనను హింసించినందుకు ప్రతీకారంగా ముంబై పోలీసు ఉన్నతాధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళ ముఖ్య బాధ్యుడు హేమంత్ కర్కరే సర్వనాశనమవుతాడని శపించాననీ, తన శాపం ఫలితంగా నెలన్నర తిరక్కుండానే కర్కరే ఉగ్రవాద ముష్కర దాడిలో చనిపోయాడని ప్రకటించింది. బహుశా తనకు ఓటు వేయకపోయినా, తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడుకున్నా ఓటర్లు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్న ముందస్తు హెచ్చరిక కాబోలు. కౌశాంబి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వినోద్ సేన్కర్ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు, ప్రత్యేకించి పంచాయతీ సర్పంచులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తే ఎన్నికల తర్వాత సరికొత్త వినోద్‌ను చూస్తారని, ఓడిపోతే తాను 2014 నాటి వినోద్‌గా ఉండనని బాహాటంగా బెదిరించారు. సాక్షి మహరాజ్‌ది మరో ఎత్తుగడ. తనకు ఓటు వేయకపోతే శపిస్తానని, తన శాపాల బారిన పడకుండా ఉండాలంటే మళ్లీ తనకు ఓటేసి తీరాలన్నది ఆయన అల్టిమేటం. ఉత్తరప్రదేశ్‌లోని ఎటవా లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న రాం శంకర్ కథేరియా ‘కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. ఎవరైనా బీజేపీ కార్యకర్తల వంక వేలెత్తి చూపితే ఆ వేళ్లు విరగదీస్తా’మని హెచ్చరించారు. మరో గమ్మత్తయిన విష యం ఏమిటంటే బాబ్రీ మసీదు కూల్చివేత నాటికి ప్రజ్ఞా ఠాకూర్ వయస్సు నాలుగేళ్లు. ఆ వయస్సులో ఆమె బాబ్రీ మసీదు గోపురాల మీదకెక్కి వాటిని కూల్చివేశానని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఈ సరికొత్త పరిస్థితుల్లో మరో కోణం కూడా ఉంది. అది పాకిస్తాన్ వ్యతిరేకత రంగరించి పోసే ప్రయత్నం. గత ఐదేళ్ల పాటు అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీతో దోబూచులాడిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పాకిస్తాన్‌పై దాడి చేసే సామర్థ్యం ఒక్క మోదీకి మాత్రమే ఉన్నందున ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఔరంగాబాద్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో వెల్లడించారు. బహుశా తిరిగి అధికారానికి వస్తే పాకిస్తాన్‌పై యుద్ధం చేయాలన్నది బీజేపీ–శివసేనల మధ్య కుదిరిన కనీస ఉమ్మడి కార్యక్రమం కావచ్చు. ప్రధాని కూడా తక్కువేమీ తినలేదు. 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగటానికి రెండ్రోజుల ముందు ప్రధాని మోదీ రాజస్తాన్‌లోని చిత్తోడ్గఢ్లో జరిగిన సభలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరుస్తుంది. బీజేపీ శక్తివంతమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది’ అన్నారు. అంతే కాదు, అదేరోజు గుజరాత్‌లోని పఠాన్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ భారతీయ వైమానిక దళ పైలట్ అభినందన్ పాకిస్తాన్ భూభాగంలో బందీ అయ్యాక భారతదేశం పాకిస్తాన్‌పై ప్రయోగించటానికి 12 క్షిపణులు సిద్ధం చేసిందనీ, ఆ భయంతోనే పైలట్‌ను పాకిస్తాన్ విడుదల చేసిందనీ చెప్పుకున్నారు. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ ‘‘ముస్లిం ఓటర్లు తనకు ఓటు వేయటం తమ విధి అనీ, పనిచేస్తేనే ఓటు వేస్తా మని చెప్పే స్వేచ్ఛ వారికి లేదనీ’’ హెచ్చరించింది. ఈ పరిణామాలన్నీ నూతన రాజకీయ పరిస్థితుల్లో రెండు కోణాలను ముందుకు తెస్తున్నాయి. మొదటిది వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఓటు వేయటమే తప్ప కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా ఓటర్లు చేయరాదనీ, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దిగువ స్థాయి నేతలు చెప్తుంటే, పాలక పార్టీ జాతీయ నాయకులు మాత్రం పాకిస్తానే లక్ష్యంగా రాజకీయ ప్రచారం సాగిస్తున్నారు. సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, నైతికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన రాజకీయ నాయకులే అత్యంత విద్వేష పూరిత విలువల ప్రచారానికి దిగజారితే ఈ రాజకీయాల నుండి భావితరాలు నేర్చుకునేది ఏమిటి? ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏ మౌలిక అంశాన్ని తీసుకున్నా ఈ పరిస్థితులకు కారకులవుతున్న వారిపై నిషేధం విధించటానికి కావల్సినన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అవకాశాలను వినియోగంలోకి తేవాల్సిన ఎన్నికల సంఘం అచేతనంగా పడి ఉంది. ఈ పరిస్థితుల్లో నూతన పరిస్థితిని అధిగమించటానికి ప్రజా ప్రయోజన రాజకీయాలు నెరపటానికి వీలుగా నూతన ప్రజా చైతన్యంతోనే పార్టీల, నాయకుల మెడలు వంచాలి. ఈ కర్తవ్య నిర్వహణకు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తేల్చుకోవాల్సింది ఓటర్లయిన ప్రజలే. వ్యాసకర్త రాజకీయ వ్యాఖ్యాత కొండూరి వీరయ్య -
సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ షాక్
భోపాల్ : బాబ్రీ మసీదు కూల్చివేతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఆదివారం ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 6, 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసంలో మసీదును కూల్చిన బృందంలో తానూ ఉన్నానని, ఈ ఉద్యమంలో పాలుపుంచుకున్నందుకు గర్వపడుతున్నానని శనివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాబ్రీ విధ్వంసంలో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు గర్వంగా ఉందని, అలదే ప్రాంతంలో రామ మందిర నిర్మాణం జరిగేలా చూస్తామని ఆ ఇంటర్వ్యూలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ చెప్పుకొచ్చారు. భోపాల్ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ ఖరారు చేసిన అనంతరం ఈసీ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఇది రెండవసారి కావడం గమనార్హం. తనను వేధించిన మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తాను శపించడం వల్లే ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఈసీ వివరణ కోరిన సంగతి తెలిసిందే. -
సంఘ్ ఆశీస్సులతో సమరానికి సాధ్వి
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులే కరువవుతున్నారా? పదిహేనేళ్లపాటు అధికారం చెలాయించినా.. ఈసారి సీట్ల ఎంపికలోనూ పార్టీ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ఎస్) ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఉందా?. సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి పెట్టడం సత్ఫలితాల నిస్తుందా? బీజేపీతో పాటు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కూడా తొలిచేస్తున్న ప్రశ్నలివి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి నాలుగు దశల్లోనూ పోలింగ్ జరుపుకోనున్న మధ్యప్రదేశ్‌లో సీట్ల ఎంపిక ఆర్ఎస్ఎస్ నిర్ణయాల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను భోపాల్ స్థానం నుంచి బరిలోకి దింపడం బీజేపీ కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్టీ ఎన్నికల వ్యూహం ఏమిటన్నది అర్థం కాక మద్దతుదారులూ తలలు పట్టుకుంటున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుండటాన్ని బట్టి చూస్తే.. రాజకీయాల కంటే తన హిందుత్వ ఎజెండాకే ఆర్ఎస్ఎస్ పెద్ద పీట వేస్తోందన్న అంచనాలున్నాయి. సాధ్వికి ఎంత అనుకూలం? మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి ఒకప్పుడు భోపాల్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అక్కడి నుంచి వివాదాస్పద ప్రజ్ఞా ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ‘దిగ్విజయ్ సింగ్ హిందూ వ్యతిరేకి. హిందువులు ఉగ్రవాదులని కించపరిచారు’ అని ప్రజ్ఞా ఇటీవలే వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ కారణంగానే తాను భోపాల్ నుంచి బరిలోకి దిగుతున్నానని, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతు తనకే ఉందని ప్రజ్ఞా అంటున్నారు. అయితే రాష్ట్ర పరిస్థితులు, సమస్యలపై ఈమెకు ఉన్న అవగాహన ఏమిటి? నిరుద్యోగం మొదలుకొని సాగు, తాగునీటి సమస్యలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రజ్ఞా ఆధ్యాత్మిక గురువు అవధేశానంద గిరి తన శిష్యురాలికి దూరంగా జరగడం. ప్రజ్ఞా తరఫున ప్రచారం కూడా చేయకపోవడం. కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ మాటే చెల్లుబాటు ఇండోర్‌తోపాటు భోపాల్, గ్వాలియర్, విదిశ, ఖజురహో లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థులను పరిశీలిస్తే.. పార్టీ మాటకన్నా ఆర్ఎస్ఎస్ మాటే ఎక్కువగా చెల్లుబాటైందన్న అభిప్రాయం కలగకమానదు. పార్టీ ప్రచారంలోనూ గ్రామీణ ప్రాంతాల్లోని అసంతృప్తి, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలకు తక్కువ ప్రాధాన్యం లభిస్తున్నాయి. శివరాజ్‌సింగ్ చౌహాన్, కైలాశ్ విజయ్ వర్గియా, ఉమాభారతి వంటి సీనియర్ నేతలను కూడా పోటీ పెట్టలేని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. ఇండోర్ నుంచి ప్రజలకు పెద్దగా పరిచయం లేని శంకర్ లాల్వానీని నిలబెట్టారు. సీనియర్ నేత, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఈ స్థానం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో అటు సుమిత్ర.. ఇటు ఆమె ప్రత్యర్థి కైలాశ్ విజయ్ వర్గియాలు ఇద్దరూ శంకర్ లాల్వానీకి మద్దతిచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా పెట్టని కోట లాంటి ఇండోర్‌లో బీజేపీ ఈసారి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఖజురహో విషయాన్ని తీసుకుంటే ఈ స్థానం అభ్యర్థి విష్ణుదత్ శర్మ కూడా ఆర్ఎస్ఎస్ ఎంపికే. ముందు భోపాల్ స్థానానికి ఈయనను ఎంపిక చేసినా బీజేపీ సభ్యుల వ్యతిరేకతతో ఖజురహో స్థానాన్ని కేటాయించారు. అయితే ఆయన ఈ స్థానంలోనూ పార్టీ కార్యకర్తల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజ్ఞాకు టికెట్‌పై సీనియర్ల గుర్రు భోపాల్‌లో ప్రజ్ఞాకు టికెట్ ఇవ్వడంపై కూడా సీనియర్లు బాబూలాల్ గౌర్, ఉమాశంకర్ గుప్తా గుర్రుగానే ఉన్నారు. స్థానికులకు కాకుండా బయటివారికి ఎలా టికెట్ ఇస్తారన్న ధిక్కార స్వరాలు ఇక్కడ వినపడుతున్నాయి. అయితే హిందూ ఓటర్లను తమ వైపునకు మళ్లించేందుకు ప్రజ్ఞా అభ్యర్థిత్వం ఉపయోగపడుతుందని.. అదే సమయంలో నియోజకవర్గంలో ఉన్న దాదాపు 4.5 లక్షల ఠాకూర్ ఓట్లను కూడా ప్రజ్ఞా చీలుస్తుందని మరికొందరు అంటున్నారు. దాదాపు 18 లక్షల ఓటర్లు ఉన్న భోపాల్ నుంచి 1984లో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గెలవగా ఆ తరువాత అంటే 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఎత్తులు.. పై ఎత్తులు హిందూ వ్యతిరేకిగా బీజేపీ నేతల విమర్శలకు గురవుతున్న దిగ్విజయ్ సింగ్ ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కొంతకాలం క్రితమే ఈయన నర్మద నదీ తీరం వెంబడి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అంతేకాకుండా తరచూ దేవాలయాలను సందర్శిస్తూ తాను హిందూ వ్యతిరేకిని కాదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో విజయం వరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ఆమె నామినేషన్ సందర్భంగా, ‘ప్రజ్ఞాను పోటీకి ఆహ్వానిస్తున్నాను. ఆమె కోసం కూడా ప్రార్థిస్తా’ అని చేసిన ఒక ట్వీట్ కూడా దిగ్విజయ్‌పై ఉన్న చెడు అభిప్రాయాన్ని తగ్గించేదే. ప్రజ్ఞా ఎంపిక బీజేపీ కార్యకర్తల్లోనూ కొంత అయోమయం సృష్టిస్తోంది. భోపాల్‌ను హిందూత్వ భావజాలానికి ఒక పరీక్షా వేదికగా ఆర్ఎస్ఎస్ పరిగణిస్తుంటే.. అధికారం కోసం రామమందిర అంశాన్ని కూడా పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీ ప్రజ్ఞా ఎంపికను జీర్ణించుకోలేకపోతోంది. కానీ ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆర్ఎస్ఎస్ వ్యూహాలను 130 ఏళ్ల పార్టీ గమనించకుండా ఉంటుందా? అన్నది ప్రశ్న. మాయావతి, యోగీ ఆదిత్యనాథ్, ఆజంఖాన్ వంటి వారికి ఎన్నికల కమిషన్ కూడా కళ్లాలు వేస్తున్న ఈ తరుణంలో ప్రజ్ఞా లాంటి వారు ఏదైనా విద్వేషపూరిత ప్రసంగం చేస్తే అడ్డుకోకుండా ఉంటుందా?. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సహాయకులపై ఐటీ దాడులు భారీ మొత్తంలో నగదు పట్టుబడటం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలపై కన్నేసి ఉంచామన్న సంకేతాలు పంపింది. ఈ– టెండర్ల స్కామ్‌ను తిరగదోడి విచారణ ప్రారంభించింది. ఇందులో కొంతమంది బీజేపీ పార్లమెంటు సభ్యులపై కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌమ్యా నాయుడు, డేట్లైన్ – ఇండోర్ -
ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు
భోపాల్: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులిచ్చింది. ప్రజ్ఞాతో పాటు బీజేపీ భోపాల్ యూనిట్ అధ్యక్షుడు వికాస్ విరానీకి నోటీసులు ఇచ్చినట్లు భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదామ్ చెప్పారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో) ను కోరామన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ నివేదికను అందించారని.. దీనిపై ప్రజ్ఞా, వికాస్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏఆర్వో ఇచ్చిన నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు పంపనున్నామని వెల్లడించారు. కాగా, గురువారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రజ్ఞామాట్లాడుతూ.. తన శాపం వల్లనే హేమంత్ చనిపోయారని వ్యాఖ్యానించారు. -
సాధ్వి ప్రజ్ఞ ..రాయని డైరీ
మే పన్నెండున భోపాల్ పోలింగ్. ప్రచారానికి తగినంత సమయం ఉన్నట్లేమీ కాదు. అయినప్పటికీ, ఉగ్రవాదుల తూటాలకు బలైన హేమంత్ కర్కరేను అమరవీరుడేనని కీర్తించడానికి నేను గత రెండు రోజులుగా నా ప్రచారసభలలో ఎక్కువ సమయం కేటాయిం చవలసి వస్తోంది. ఇది నేను కొనితెచ్చుకున్న పరిస్థితేమీ కాదు. విధి కొన్నిసార్లు అలా జరిపిస్తుంది. భోపాల్‌లో ముప్పై ఏళ్లుగా వరుసగా బీజేపీ వస్తోంది. తొలిసారి బీజేపీ వచ్చినప్పుడు నా వయసు ఏడాది. ముప్పై ఏళ్ల బీజేపీకి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మరో ముప్పై ఏళ్లయినా నేను, నాతో పాటు బీజేపీ విజయం సాధిస్తూ పోవాలి. మోదీ ఆకాంక్ష అది. మోదీ ఆకాంక్షను నెరవేర్చడం కోసం భోపాల్ ఎంపీగా గెలిచి తీరడం అన్నది నేను ఆచరిస్తున్న హైందవ ధర్మంలోని ఒక కనీసం విధి మాత్రమే. ఆ మాత్రమైనా నా విధిని నేను నిర్వహించే దారిలో అవరోధాలు సృష్టించ డానికి నా ప్రత్యర్థి దిగ్విజయ్ సింగ్, ఆయన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అశోక చక్ర అవార్డు గ్రహీత హేమంత్ కర్కరే ఆత్మను ఆశ్రయించడం నా మనసుకు బాధ కలిస్తోంది. ‘నా శాపంతోనే కర్కరే బలి అయ్యారు’ అని ఆవేదనతో నేను అన్న మాటను ఒక జాతి విద్రోహ వ్యాఖ్యగా చిత్రీకరించి వీళ్లంతా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడం ఏమంత సముచితం?! జాతి విద్రోహం అంటే దేశ విద్రోహమే కదా. దేశ విద్రోహం అంటే హైందవ విద్రోహ మేగా! హైదవ సాధ్విని నేను. నేనెందుకలా నన్ను నేను విద్రోహించుకుంటాను. ఆ మాత్రం ఆలోచించరా? సాధువు గానీ, సాధ్వి గానీ.. రాగద్వేషా లకు, భావోద్వేగాలకు అతీతమైనవారు. అయితే మాలెగావ్ పేలుడు కేసులో ముంబై జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఒక సాధ్విగా నేనిప్పుడు నా నియోజక వర్గ ప్రజల దృష్టికి తీసుకురాలేదు. ఆనాటి ఇరవై ఏళ్ల బాధిత యువతిగా మాత్రమే మాట్లాడాను. అవును శపించాను. ఆ రోజు కర్కరేకు, నాకు మధ్య జైల్లో జరిగిన సంభాషణే కర్కరేను నేను శపించేలా చేసింది. అయితే పైకేమీ నేను శపించలేదు. కమండలంలోని నీళ్లు ఆయన నెత్తిపై చల్లేమీ శపించలేదు. మనసులోనే శపించాను. శపించినట్లు ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడైనా శపించా నని చెప్పలేదు. శాపానికి గురయ్యేలా కర్కరే నన్ను ఎంత హింసించిందీ చెప్పాను. ఒక సాధ్వి పడిన హింసను పక్కన పెట్టి, ఒక సాధ్వి పెట్టిన శాపం గురించే అంతా మాట్లాడుతున్నారు. నిర్బంధంలో ఉన్న ఇరవై ఏళ్ల ఆడపిల్ల.. తనెంత సాధ్వి అయినా.. శపించడం తప్ప ఏం చేయగలదు?! ఉగ్రవాదుల దగ్గర బాంబులు ఉంటాయి. పోలీసుల దగ్గర తూటాలు ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గర మాటలు ఉంటాయి. అవమానంతో క్షోభిస్తున్న స్త్రీ హృదయంలో శాపనార్థాలు తప్ప ఏముంటాయి?! నిజం చెప్పమంటాడు కర్కరే! ‘పేలుళ్లతో నాకు సంబంధం లేదన్నదే నిజం’ అన్నాను. నమ్మలేదు. ‘సంబంధం ఉన్నదీ లేనిదీ ఆ దేవు డికి తెలుసు’ అన్నాను. ‘అంటే ఏంటి! నేనిప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలా?!’ అని బెల్టు తీశాడు. సాధ్వి తిరగబడ గలదా? దేవుణ్ణి వేడుకుంటుంది. నేను చేసిందీ అదే. ‘ఆప్ కి అదాలత్’ షోలో రజత్ శర్మ నన్ను ఒకమాట అడిగారు. ‘రాజకీయాల్లోకి వస్తు న్నారా?’ అని. దేశం కోరుకుంటే వస్తాను అన్నాను. ఆయనే ఇంకో మాట.. రాహుల్ గాంధీ గురించి.. అడిగారు. ‘స్మాల్ చైల్డ్’ అని అన్నాను. నా వంటి పరిత్యాగులకు ఏదీ పెద్ద విషయంగా అనిపించదు. ఎవరూ పెద్ద నాయ కులుగా అనిపించరు. మోదీ ఇందుకు అతీతం. ఆయన నాయకుడే అయినప్పటికీ ఈ దేశంలో అందరికన్న పెద్ద పరిత్యాగి. -
నా శాపంతోనే కర్కరే బలి
భోపాల్/న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(48) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించినందునే ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని చెప్పారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ..‘మాలేగావ్ పేలుడు కేసులో ముంబై జైలులో ఉన్న నన్ను విచారించడానికి హేమంత్ కర్కరే వచ్చారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరక్కుంటే దానిని సృష్టించేందుకు ఎందాకైనా వెళ్తానన్నాడు. అప్పటిదాకా జైలు నుంచి బయటకు వదిలేది లేదన్నాడు. దుర్భాషలాడుతూ తీవ్రంగా హింసించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నాకేమీ తెలియదు, అంతా ఆ దేవుడికే తెలుసని బదులిచ్చా. తెల్సుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్లాలా? అని ప్రశ్నించాడు. కావాలనుకుంటే వెళ్లాలన్నాను. నువ్వు నాశనమైపోతావని శపించా. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆయన్ను ఉగ్రవాదులు చంపేశారు’ అని అన్నారు. మోసకారి, దేశద్రోహి, మత వ్యతిరేకి అంటూ కర్కరేను ఆమె దూషించారు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు అందిందని, విచారణ చేయిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ తను శపించడంతోనే కర్కరే చనిపోయారన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరేను ద్రోహిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ నేతలు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్‌సభ స్థానంలో ఆమె ప్రత్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన్ను చూసి మనమంతా గర్వపడాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించింది. ‘అశోక్ చక్ర అవార్డు గ్రహీత కర్కరే త్యాగాన్ని అందరూ గౌరవించాలి. ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలి’ అని ట్విట్టర్లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది’అని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆమె వంటి వ్యక్తులతో జరిగిన పోరాటంలోనే కర్కరే చనిపోయారు. ఆయన మృతికి ఉగ్రదాడి కేసు నిందితురాలు శాపం కారణం కాదు. ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనకున్న హక్కులను కాపాడే క్రమంలోనే ఆయన పోరాడుతూ చనిపోయారు. వీర జవాన్లను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంతధైర్యం?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం: బీజేపీ తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. ‘నేను వ్యక్తిగతంగా అనుభవించిన బాధతో ఆ వ్యాఖ్యలు చేశా. నా మాటలను దేశ వ్యతిరేకులు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ వ్యాఖ్యలతో బాధ కలిగితే క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపారని ఆమె సహాయకుడు తెలిపారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జైలులో ఉండగా శారీరకంగా, మానసికంగా అనుభవించిన వేదనతో ప్రజ్ఞా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ తెలిపింది. ‘ఉగ్రవాదులను సాహసంతో ఎదుర్కొని పోరాడుతూ కర్కరే ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆయన్ను వీర జవానుగానే భావిస్తుంది’ అని పేర్కొంది. -
నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా: సాధ్వి
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలొదిలిన ఐపీఎస్ ఆఫీసర్ హేమంత్ కర్కర్‌పై బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడంతో ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని, తాను అన్నమాటల్ని వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ముంబై దాడుల సమయంలో టెర్రరిస్టులతో పోరాడి అసులుబాసిన హేమంత్ కర్కరే అమరవీరుడని కొనియాడారు. మనం చేసిన వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఆనందం కలిగించకూడదనే ఉద్దేశంతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. ముంబై 26ఝ11 దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేపై బీజేపీ భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి విచారణలో హేమంత కర్కరే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ సాధ్వి ప్రగ్యా సింగ్ ఆరోపించారు. అంతేకాదు తాను శపించిన కారణంగానే కర్కరే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించారు. ఏ పాపం తెలియని తనని వేధించినందుకే భగవంతుడు ఆగ్రహించాడు.. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధ్వి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, బీజేపీకి సంబంధం లేదని పార్టీ నాయకులు అధికారికంగా చెప్పిన సంగతి తెల్సిందే. కానీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ఆమె క్షమాపణ చెప్పారు. -
సాధ్వి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై ఈసీ ఆరా
భోపాల్ : ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ కర్కారేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఆమెపై ఫిర్యాదు అందిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్దారించారు. ప్రజ్ఞా సింగ్‌పై తాము స్వీకరించిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని సీఈఓ స్పష్టం చేశారు. కాగా, 2008 మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణలో కర్కారే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ దర్యాప్తు అధికారి, మాజీ ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారేపై అంతకుముందు ఆమె మండిపడ్డారు. తాను శపించిన కారణంగానే కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. నిరపరాధిని, సన్యాసిని అయిన తనను వేధించినందుకు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడని, ఉగ్రవాదులు ఆయనను హతమార్చారని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కర్కారేపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
ముంబైపై ఉగ్రవాద ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారే పై బీజేపీ భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణలో తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు కేసును దర్యాప్తు అధికారి మాజీ ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారేపై మండిపడ్డారు. అంతేకాదు తను శపించిన కారణంగానే కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. నిరపరాధిని, సన్యాసిని అయిన తనను వేధించినందు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సాక్ష్యాలు లేకుండా జైల్లో పెట్టడం అన్యాయని, విడిచిపెట్టాలని కోరాం. కానీ ఆయన (హేమంత్ కర్కారే) వినలేదు.. ఎలాగైనా సాక్ష్యాలు సంపాదిస్తానని ఘీంకరించాడు. నా పై కుట్ర చేశాడు. ఇది ధర్మానికి విరుద్ధం. దేశ ద్రోహం. దాడి ఎలా జరిగింది...ఎందుకు జరిగిందని పదే పదే ప్రశ్నించాడు. నాకేమీ తెలియదు..అంతా ఆ భగవంతుడికే తెలుసని చెప్పారు. అయితే ఆ భగవంతుడి దగ్గరికెళ్లి అడగమంటావా అని గేలి చేశాడు. అందుకే పోయాడు.. కొంచెం ఆలస్యమైనాగానీ, నువ్వు సర్వనాశనం అయిపోతామని కర్కారేని శపించాను. సరిగ్గా నెలన్నర రోజుల్లోనే ఉగ్రవాదులు కర్కారేని అంతం చేశారని’ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ స్పందిస్తూ సైన్యం, అమరవీరులపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయరాదని ఈసీ స్పష్టంగా చెప్పిందన్నారు. ముంబై ప్రజల కోసం బలిదానం చేసిన నిజాయితీగల అధికారి హేమంత్ కర్కారేపై ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు అనుచితమైనవని, ఈ నేపథ్యంలో ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపడాన్ని ప్రశ్నించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యల్ని తప్పు బడుతూ ట్వీట్ చేశారు. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తాను జైలులో ఉండగా పోలీసు వేధింపులపై గురువారం మీడియతో మాట్లాడారు. తాను గడిపిన జైలు జీవితం అత్యంత దుర్భరంగా గడిచిందని చెప్పారు. 13 రోజుల అక్రమ కస్టడీలో మొదటి రోజు నుంచే తనను బెల్ట్‌లతో తీవ్రంగా హింసించారనీ ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ భోపాల్ నుంచి ఎంపీగా బీజేపీ బరిలోకి దింపడపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా బీజేపీ సాధ్వి అస్త్రాన్ని ప్రయోగించింది. #WATCH Pragya Singh Thakur:Maine kaha tera (Mumbai ATS chief late Hemant Karkare) sarvanash hoga.Theek sava mahine mein sutak lagta hai. Jis din main gayi thi us din iske sutak lag gaya tha.Aur theek sava mahine mein jis din atankwadiyon ne isko maara, us din uska anth hua (18.4) pic.twitter.com/COqhEW2Bnc — ANI (@ANI) April 19, 2019 -
‘దాంతో మా నాన్న మాకు ముస్లిం పేర్లు పెట్టారు’
న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు యోగేంద్ర యాదవ్ తన జీవితంలోని చీకటి కోణాన్ని తొలిసారి బహిరంగంగా ఆవిష్కరించారు. తన తాతపై కొందరు ముస్లింలు దాడి చేసి దారుణంగా హత్య చేశారని తెలిపారు. అదంతా కూడా తన తండ్రి కళ్ల ఎదుటే జరిగిందని.. దాంతో తన తండ్రి తమకు ముస్లిం పేర్లు పెట్టారని పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ చేసిన ఆరోపణల ఫలితంగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఇంతకు విషయం ఏంటంటే.. మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బీజేపీ తరఫున భోపాల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాంతో ఆమె అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇండియా టుడే చానెల్లో ప్రజ్ఞా సింగ్ అభ్యర్థిత్వంపై డిబేట్ జరిగింది. దీనికి బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియా కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అమిత్.. యోగేందర్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన మత రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. దీనిపై స్పందించిన యోగేంద్ర యాదవ్ తన జీవితంలో జరిగిన విషాదాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘గాంధీ గారి కాలంలో కొందరు ముస్లిం వ్యక్తులు మా కుటుంబంపై దాడి చేశారు. మా నాన్న కళ్లెదుటే ఆయన తండ్రి అంటే మా తాతను అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దాడితో మా నాన్నకు గాంధీ మార్గం మీద నమ్మకం పోయింది. ఆయన తన మనసు మార్చుకున్నాడు. తన తండ్రి హత్యను కళ్లారా చూసిన ఆయన.. తన పిల్లలకు తన తండ్రిని చంపిన మతం వారి పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు. అంతేకాక ‘ఇదే సంఘటన వేరే ఏ దేశంలో జరిగినా ఇపాటికే దీని గురించి నవలలు, బుక్స్ రాసేవారు. కానీ మా తండ్రి చర్యల వల్ల వచ్చిన పేరు ప్రతిష్టలను నేను తీసుకోవాలనుకోవడం లేదు. ఈ క్రెడిట్ 90 ఏళ్ల మా నాన్న గారికే దక్కాల’ని యోగేంద్ర తెలిపారు. అంతేకాక తనను మత రాజకీయాలు చేస్తాడని ఆరోపించిన అమిత్ మాలావియాకు ఒక సవాల్ కూడా విసిరారు. తాను రాజకీయాల్లో లబ్ది పొందడం కోసం గతంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఈ సంఘటన గురించి మాట్లాడినట్లు ఆడియో కానీ, వీడియో కానీ చూపిస్తే ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. అమిత్ మాలవియా అలా రుజువు చేయలేకపోతే.. నోరు ముసుకుని ఉంటే మంచిదని హెచ్చరించారు. -
పోలీసు వేధింపులపై ప్రజ్ఞా సింగ్ కంటతడి
భోపాల్ : బీజేపీ తరపున భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ గురువారం మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు.2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తాను జైలులో ఉండగా పోలీసు వేధింపుల గురించి చెబుతూ ఆమె కళ్లనీళ్లపర్యంతమయ్యారు. తాను గడిపిన జైలు జీవితం అత్యంత దుర్భరంగా గడిచిందని చెప్పారు. పోలీసులు తనను 13 రోజుల పాటు అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు. మొదటి రోజు నుంచే తనను ఏమీ అడగకుండానే బెల్ట్‌లతో తీవ్రంగా కొట్టారని, తన శరీరమంతా వాతలు తేలిందని చెప్పుకొచ్చారు. ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని అన్నారు. తనను పోలీసులు హింసిస్తూ దుర్భాషలాడేవారని గుర్తుచేసుకున్నారు.మాలెగావ్ పేలుళ్లలో తనకు సంబంధం ఉందని అంగీకరించాలని పోలీసులు ఒత్తిడి చేసేవారని చెప్పారు. తనను బలవంతంగా ఒప్పించేందుకు వారు ఎంతటి హింసకైనా వెనుకాడలేదని, తనను కొట్టేవారు డ్యూటీలు మారినా వారి చేతిలో మాత్రం శిక్ష ఒకేలా ఉండేదని వాపోయారు. -
బీజేపీలోకి సాధ్వి ప్రజ్ఞా
భోపాల్/న్యూఢిల్లీ: మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం బీజేపీలో చేరారు. భోపాల్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తో పోటీ పడనున్నారు. అతివాద భావాలున్న సాధ్విని మాలెగావ్ బాంబు పేలుడు కేసులో మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్ 2008లో అరెస్టు చేసింది. కాగా, ఇటీవలే ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. బీజేపీకి కంచుకోటలా భావించే భోపాల్‌లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. 4.5 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో హిందూత్వ భావాలున్న నేత సాధ్విని కాంగ్రెస్‌పై పోటీకి దింపింది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జన్మించిన ప్రగ్యా ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందించారు. సాధ్వి పోటీపై పీడీపీ అధ్యక్షురాలు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా స్పందిస్తూ.. ‘నేను ఒకవేళ ఉగ్రవాద నిందితుడిని పోటీలో దింపితే ఎలాంటి ఆగ్రవేశాలు వెల్లడవుతాయో ఊహించండి. టీవీ చానెళ్లు మెహబూబా టెర్రరిస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వార్తలు ఇస్తాయి. వారిమటుకు కాషాయం ప్రస్తావన వస్తే మతం ప్రస్తావన రాదు. ముస్లింల విషయమొచ్చే సరికి ఉగ్రవాదులు అంటారు’ అని అన్నారు. -
బీజేపీలో చేరిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్
-
బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞాసింగ్
భోపాల్ : మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ప్రజ్ఞాసింగ్ భోపాల్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ప్రభాత్ ఝా, నరోత్తమ్ మిశ్రా, రామ్ లాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను అధికారికంగా బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. మంగళవారమే తాను బీజేపీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్లు చెప్పిన ఆమె పార్టీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమన్నారు. తాను పోటీ చేయడం ఖాయమని, గెలుస్తానని కూడా ప్రజ్ఞాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజ్ఞాసింగ్ లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం ఆమె పేరును అధికారికంగా ప్రకటించమే మిగిలి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై ప్రజ్ఞాసింగ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. సుమారు ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆమె ఈ కేసులో ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు. -
దిగ్విజయ్ సింగ్ వర్సెస్ సాధ్వి ప్రజ్ఞా సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, విదిశ, గుణ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన కాషాయ పార్టీ భోపాల్‌లో డిగ్గీరాజాకు దీటైన అభ్యర్ధిని పోటీలో నిలపాలని భావిస్తోంది. కాగా,పార్టీ ఆదేశిస్తే తాను భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని సాధ్వి ప్రగ్యా స్పష్టం చేశారు. తాను జాతీయవాదినని, దిగ్విజయ్ సింగ్ మాత్రం తరచూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని డిగ్గీరాజాను దుయ్యబట్టారు. తనకు దిగ్విజయ్ సింగ్ ఎంతమాత్రం పోటీ కాదని అన్నారు. -
సాధ్వి ప్రజ్ఞ, పురోహిత్‌కు స్వల్ప ఊరట
ముంబై: మాలెగావ్ బాంబుపేలుడు కేసులో నిందితులు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు బుధవారం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సాధ్వి, పురోహిత్ సహా 8 మందిపై ‘మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం’ కింద నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం కింద మాత్రం విచారణ కొనసాగుతుందన్టి స్పష్టం చేసింది. మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించిన కోర్టు వారికి కేసు నుంచి విముక్తి కల్పించింది. మిగిలిన నిందితులందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. -
సాధ్వీ ప్రజ్ఞాకు బెయిల్
ముంబై: 2008నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు మంగళ వారం బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాకు ప్రమేయమున్నట్లు ఎటువంటి సాక్ష్యాలు లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. సాధ్వీ రూ. 5 లక్షల పూచీకత్తు చెల్లించడంతో పాటు ఆమె పాస్‌పోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇదే కేసులో సహ నిందితుడు ప్రసాద్ పురోహిత్ చేసుకున్న బెయిల్ అభ్యర్థనను మాత్రం కోర్టు తిరస్కరించింది. విచారణ నిమిత్తం సాధ్వీని జాతీయ దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడల్లా ఎన్ఐఏ ఎదుట హాజరుకావాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సాధ్వీ కేన్సర్‌తో బాధపడుతుండ టంతో మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. -
మాలెగావ్ కేసు: సాధ్వి ప్రజ్ఞకు బెయిల్ మంజూరు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 2008 నాటి మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు మాత్రం బెయిల్ నిరాకరించింది. వీళ్లిద్దరూ ఈ కేసులో గత ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్నారు. ఇటీవలే చికిత్స కోసం సాధ్వి ప్రజ్ఞను భోపాల్ ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం వీళ్లిద్దరూ దాఖలుచేసిన బెయిల్ దరఖాస్తులను దిగువ కోర్టు కొట్టేయడంతో ఇద్దరూ బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞను, నవంబర్‌లో కల్నల్ పురోహిత్‌ను అరెస్టుచేశారు. అభినవ్ భారత్‌కు చెందిన వీళ్లిద్దరే పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. కానీ ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం ఎన్ఐఏ చర్యను ప్రశ్నిస్తూ బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.