బీజేపీ అగ్రనేతల మరణం: వారే చేతబడి చేస్తున్నారు! | Sadhvi Pragya Says Opposition Using Marak Shakti To Harm BJP Leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు!

Published Mon, Aug 26 2019 2:50 PM | Last Updated on Mon, Aug 26 2019 3:37 PM

Sadhvi Pragya Says Opposition Using Marak Shakti To Harm BJP Leaders - Sakshi

భోపాల్‌ : వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు మూటగట్టుకునే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. తమ పార్టీకి చెందిన సీనియర్‌ నేతల మరణాన్ని ఆకాంక్షిస్తూ ప్రతిపక్షం చేతబడి చేయిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాజ్‌ చెప్పినట్లుగానే తాము ఇప్పుడు విపత్కర కాలం ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. కాగా దాదాపు ఇరవై రోజుల వ్యవధిలో బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా...‘ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేయిస్తున్నాయని మహారాజ్‌ గారు నాకు ఒకానొక సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మాకు ఇప్పుడు చెడుకాలం జరుగుతోంది. అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయాను. కానీ మా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కక్కరుగా మమ్మల్ని విడిచి వెళ్తున్నారు. మహారాజ్‌ చెప్పింది నిజమేనేమోనని నాకు ఇప్పుడు అనినిపిస్తోంది’ అని పేర్కొన్నారు. 

చదవండి: ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!

కాగా 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రఙ్ఞా సింగ్‌ అనూహ్యంగా భోపాల్‌ ఎంపీ టికెట్‌ దక్కించుకుని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ సింగ్‌ను మట్టికరిపించి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ అధిష్టానం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేయడంతో.. వెనక్కి తగ్గిన ఆమె ఇకపై క్రమశిక్షణతో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం తనదైన శైలిలో మరోసారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement