భోపాల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ ఇకపై క్రమశిక్షణతో మెలుగుతానని పేర్కొన్నారు. పార్టీ విధానాలను గౌరవిస్తూ విధేయతతో ఉంటానని స్పష్టం చేశారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రఙ్ఞా సింగ్ అనూహ్యంగా భోపాల్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 23న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ సింగ్‌ను మట్టికరిపించి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వి ప్రఙ్ఞా సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్ర కాల్పుల్లో మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించి చిక్కుల్లో పడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు.ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సాధ్వి ప్రఙ్ఞా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ఆమె ఇకపై క్రమశిక్షణతో ఉంటానని స్పష్టం చేశారు. అవకాశం వస్తే ప్రధాన నరేంద్ర మోదీని కూడా కలుస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment