విద్వేష రాజకీయాలకు చైతన్యమే విరుగుడు | BJP Bhopal Candidate Sadhvi Pragya Singh Controversial Comments | Sakshi
Sakshi News home page

విద్వేష రాజకీయాలకు చైతన్యమే విరుగుడు

Published Tue, Apr 23 2019 12:48 AM | Last Updated on Tue, Apr 23 2019 12:48 AM

BJP Bhopal Candidate Sadhvi Pragya Singh Controversial Comments - Sakshi

పదిహేడవ లోక్‌సభకు జరిగే ఎన్నికలు  పూర్తిగా నూతన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సరికొత్త పరిస్థితులు తెరమీదకొస్తోంది. ఈ పరిస్థితుల గురించి రేఖా మాత్రంగా తెలుసుకోవటానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. భోపాల్‌ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ పరమ భక్తురాలైన తనను హింసించినందుకు ప్రతీకారంగా ముంబై పోలీసు ఉన్నతాధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళ ముఖ్య బాధ్యుడు హేమంత్‌ కర్కరే సర్వనాశనమవుతాడని శపించాననీ, తన శాపం ఫలితంగా నెలన్నర తిరక్కుండానే కర్కరే ఉగ్రవాద ముష్కర దాడిలో చనిపోయాడని ప్రకటించింది. బహుశా తనకు  ఓటు వేయకపోయినా, తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడుకున్నా ఓటర్లు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్న ముందస్తు హెచ్చరిక కాబోలు.

కౌశాంబి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వినోద్‌ సేన్‌కర్‌ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు, ప్రత్యేకించి పంచాయతీ సర్పంచులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తే ఎన్నికల తర్వాత సరికొత్త వినోద్‌ను చూస్తారని, ఓడిపోతే తాను 2014 నాటి వినోద్‌గా ఉండనని బాహాటంగా బెదిరించారు. సాక్షి మహరాజ్‌ది మరో ఎత్తుగడ. తనకు ఓటు వేయకపోతే శపిస్తానని, తన శాపాల బారిన పడకుండా ఉండాలంటే మళ్లీ తనకు ఓటేసి తీరాలన్నది ఆయన అల్టిమేటం. ఉత్తరప్రదేశ్‌లోని ఎటవా లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న రాం శంకర్‌ కథేరియా ‘కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. ఎవరైనా బీజేపీ కార్యకర్తల వంక వేలెత్తి చూపితే ఆ వేళ్లు విరగదీస్తా’మని హెచ్చరించారు. మరో గమ్మత్తయిన విష యం ఏమిటంటే బాబ్రీ మసీదు కూల్చివేత నాటికి ప్రజ్ఞా ఠాకూర్‌ వయస్సు నాలుగేళ్లు. ఆ వయస్సులో ఆమె బాబ్రీ మసీదు గోపురాల మీదకెక్కి వాటిని కూల్చివేశానని చెప్పుకోవడం హాస్యాస్పదం.

ఈ సరికొత్త పరిస్థితుల్లో మరో కోణం  కూడా ఉంది. అది పాకిస్తాన్‌ వ్యతిరేకత రంగరించి పోసే ప్రయత్నం. గత ఐదేళ్ల పాటు అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీతో దోబూచులాడిన శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే పాకిస్తాన్‌పై దాడి చేసే సామర్థ్యం ఒక్క మోదీకి మాత్రమే  ఉన్నందున ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఔరంగాబాద్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో వెల్లడించారు. బహుశా తిరిగి అధికారానికి వస్తే పాకిస్తాన్‌పై యుద్ధం చేయాలన్నది బీజేపీ–శివసేనల మధ్య కుదిరిన కనీస ఉమ్మడి కార్యక్రమం కావచ్చు. ప్రధాని కూడా తక్కువేమీ తినలేదు. 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగటానికి రెండ్రోజుల ముందు ప్రధాని మోదీ రాజస్తాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ  ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బలహీనపరుస్తుంది. బీజేపీ శక్తివంతమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది’ అన్నారు. అంతే కాదు, అదేరోజు గుజరాత్‌లోని పఠాన్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ భారతీయ వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ భూభాగంలో బందీ అయ్యాక భారతదేశం పాకిస్తాన్‌పై ప్రయోగించటానికి 12 క్షిపణులు సిద్ధం చేసిందనీ, ఆ భయంతోనే పైలట్‌ను పాకిస్తాన్‌ విడుదల చేసిందనీ చెప్పుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత కేంద్ర మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ ‘‘ముస్లిం ఓటర్లు తనకు ఓటు వేయటం తమ విధి అనీ, పనిచేస్తేనే ఓటు వేస్తా మని చెప్పే స్వేచ్ఛ వారికి లేదనీ’’ హెచ్చరించింది.
 
ఈ పరిణామాలన్నీ నూతన రాజకీయ పరిస్థితుల్లో రెండు కోణాలను ముందుకు తెస్తున్నాయి. మొదటిది వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఓటు వేయటమే తప్ప కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా ఓటర్లు చేయరాదనీ, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దిగువ స్థాయి నేతలు చెప్తుంటే, పాలక పార్టీ జాతీయ నాయకులు మాత్రం పాకిస్తానే లక్ష్యంగా రాజకీయ ప్రచారం సాగిస్తున్నారు. సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, నైతికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన రాజకీయ నాయకులే అత్యంత విద్వేష పూరిత విలువల ప్రచారానికి దిగజారితే ఈ రాజకీయాల నుండి భావితరాలు నేర్చుకునేది ఏమిటి?  

ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏ మౌలిక అంశాన్ని తీసుకున్నా ఈ పరిస్థితులకు  కారకులవుతున్న వారిపై నిషేధం విధించటానికి కావల్సినన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అవకాశాలను వినియోగంలోకి తేవాల్సిన ఎన్నికల సంఘం అచేతనంగా పడి ఉంది. ఈ పరిస్థితుల్లో నూతన పరిస్థితిని అధిగమించటానికి ప్రజా ప్రయోజన రాజకీయాలు నెరపటానికి వీలుగా నూతన ప్రజా చైతన్యంతోనే పార్టీల, నాయకుల మెడలు వంచాలి. ఈ కర్తవ్య నిర్వహణకు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తేల్చుకోవాల్సింది ఓటర్లయిన ప్రజలే.

వ్యాసకర్త రాజకీయ వ్యాఖ్యాత
కొండూరి వీరయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement