సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా ముగ్గురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. గాడ్సేపై కాషాయ నేతలు అనంత్ కుమార్ హెగ్డే, ప్రజ్ణా సింగ్ ఠాకూర్, నళినీ కుమార్ కతీల్‌లు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, పార్టీ వైఖరితో వారి వ్యాఖ్యలకు సంబంధం లేదని అమిత్ షా శుక్రవారం తేల్చిచెప్పారు.
బీజేపీ సిద్ధాంతం, విధానాల ప్రాతిపదికన వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వారి వ్యాఖ్యలపై వివరణ కోరతామని తెలిపారు. కాగా ఈ నేతలు ఇప్పటికే తమ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారని, అయితే వీరి వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణా కమిటీకి నివేదించామని అమిత్ షా ట్వీట్ చేశారు. పది రోజుల్లో కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.
కాగా మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాధ్వి వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ సహా, పలువురు బీజేపీ నేతలూ తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment