కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా నియామకంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీలో సీనియర్లకు మాత్రం కొన్ని మధుర స్మృతులు కళ్ల ముందు మెదులుతున్నాయి. మోదీ–షా ద్వయాన్ని చూస్తున్న వారందరూ ఒక్కసారిగా రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి అటల్‌జీ రోజుల్లో విహరిస్తున్నారు. 1998లో ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో లక్నో నియోజకవర్గం నుంచి వాజపేయి ఎన్నికైతే, గుజరాత్‌లో గాంధీనగర్ నుంచి ఎన్నికైన ఎల్.కె. అడ్వాణీ హోం మంత్రి పదవిని అందుకున్నారు. ఆ తర్వాత ఉప ప్రధాని పదవిని చేపట్టారు.
వాజపేయి–అడ్వాణీ జోడీ తమకున్న పరస్పర సహకారంతో బీజేపీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనతో విసిగిపోయిన జనంలో వాజపేయి–అడ్వాణీ జోడీ పట్ల ఎనలేని నమ్మకం ఏర్పడింది. బీజేపీ తొలిసారిగా స్వర్ణయుగం అనుభవించిన రోజులవి. మళ్లీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, హోంమంత్రి అమిత్ షా ఇన్నాళ్లుగా అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచే నెగ్గారు. యూపీ పీఏం, గుజరాత్ హెచ్‌ఎం ఫార్ములా అప్పట్లో బీజేపీని తారాపథంలోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు హోం మంత్రిగా షా నియామకంతో అదే యూపీ, గుజరాత్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది
మోదీ షా ద్వయం ఎదుర్కోనున్న సవాళ్లు
అప్పట్లో వాజపేయి అడ్వాణీ జోడి ఎదుర్కొన్న సవాళ్లే ఇప్పుడూ మోదీ, షా ఎదుట ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది. వికాస్ పురుష్‌గా పేరుతెచ్చుకున్న వాజపేయి, లోహ్‌పురుష్ అని పిలుచుకునే అడ్వాణీ కాంబినేషన్ అందరినీ ముచ్చటగొలిపింది. బీజేపీకి ఒక గుర్తింపు తేవడానికి వారు ఎంతో కృషి చేశారు. వాళ్లిద్దరు వేసిన బాటలోనే నడుస్తున్న మోదీ–షా ద్వయం దృష్టంతా ఇప్పుడు మోదీ తరహా రాజకీయాలను తిరస్కరిస్తున్న రాష్ట్రాల్లో పట్టు బిగించడంపైనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపజేయడమే మోదీ–షా ద్వయం ముందున్న అసలు సిసలు సవాల్. రాష్ట్రాల్లో పట్టుబిగిస్తే తప్ప రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ దక్కదు. కొత్త చట్టాలు చేసి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలన్నా, బూజుపట్టిన పాత చట్టాలకు సవరణలు చేయాలన్నా పెద్దల సభలో బీజేపీకి మెజార్టీ అత్యవసరం. అప్పుడే ఈ జోడీ తాము అనుకున్నది సాధించగలదు. యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే పెద్దల సభలో పట్టు బిగించగలరు.
Comments
Please login to add a commentAdd a comment