భోపాల్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రచార ర్యాలీలో డిగ్గీరాజా.. ప్రఙ్ఞాసింగ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ప్రసంగిస్తూ... ‘ దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ప్రఙ్ఞా ఠాకూర్ చెబుతున్నారు. నిజంగా ఆమె శాపనార్థాలకు అంత బలమే ఉంటే మసూద్ అజహర్(జైషే మహ్మద్ చీఫ్)ను శపించవచ్చు కదా. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవసరమే ఉండేది’ కాదు అని ఎద్దేవా చేశారు.
500 ఏళ్లు పాలించారు.. ఏమైనా అయ్యిందా?
పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులను ప్రస్తావిస్తూ.. ‘ కలుగులో దాక్కున్నా సరే ఉగ్రవాదులను వెదికి అంతమొందిస్తామని మోదీ అంటున్నారు. మరి పుల్వామా దాడి జరిగినపుడు ఆయన ఎక్కడున్నారు. పటాన్‌కోట్, యురీల్లో దాడులు జరిగినపుడు ఆయన ఏం చేస్తున్నారు. హిందువాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను విభజించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ వాళ్లకు నేను ఒక్కటే చెబుతున్నా వినండి. దాదాపు 500 ఏళ్ల పాటు ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఏ మతస్థులకు కూడా వారు ఎలాంటి హానీ చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అనే తేడాలేవీ లేవని అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారని పేర్కొన్నారు. కాగా మే 12న భోపాల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment