సంఘ్‌ ఆశీస్సులతో సమరానికి సాధ్వి | RSS pushed Pragya Thakur for Bhopal battle | Sakshi
Sakshi News home page

సంఘ్‌ ఆశీస్సులతో సమరానికి సాధ్వి

Published Sun, Apr 21 2019 5:05 AM | Last Updated on Sun, Apr 21 2019 5:33 AM

RSS pushed Pragya Thakur for Bhopal battle - Sakshi

మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులే కరువవుతున్నారా? పదిహేనేళ్లపాటు అధికారం చెలాయించినా.. ఈసారి సీట్ల ఎంపికలోనూ పార్టీ.. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ ఎస్‌ఎస్‌) ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఉందా?. సాధ్వీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ను మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌పై పోటీకి పెట్టడం సత్ఫలితాల నిస్తుందా? బీజేపీతో పాటు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కూడా తొలిచేస్తున్న ప్రశ్నలివి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి నాలుగు దశల్లోనూ పోలింగ్‌ జరుపుకోనున్న మధ్యప్రదేశ్‌లో సీట్ల ఎంపిక ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ను భోపాల్‌ స్థానం నుంచి బరిలోకి దింపడం బీజేపీ కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్టీ ఎన్నికల వ్యూహం ఏమిటన్నది అర్థం కాక మద్దతుదారులూ తలలు పట్టుకుంటున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో  కీలక పాత్ర పోషిస్తుండటాన్ని బట్టి చూస్తే.. రాజకీయాల కంటే తన హిందుత్వ ఎజెండాకే ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద పీట వేస్తోందన్న అంచనాలున్నాయి.

సాధ్వికి ఎంత అనుకూలం?
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి ఒకప్పుడు భోపాల్‌ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అక్కడి నుంచి వివాదాస్పద  ప్రజ్ఞా ఠాకూర్‌ పోటీ చేస్తున్నారు. ‘దిగ్విజయ్‌ సింగ్‌ హిందూ వ్యతిరేకి. హిందువులు ఉగ్రవాదులని కించపరిచారు’ అని ప్రజ్ఞా ఇటీవలే వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ కారణంగానే తాను భోపాల్‌ నుంచి బరిలోకి దిగుతున్నానని, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మద్దతు తనకే ఉందని ప్రజ్ఞా అంటున్నారు. అయితే రాష్ట్ర పరిస్థితులు, సమస్యలపై ఈమెకు ఉన్న అవగాహన ఏమిటి? నిరుద్యోగం మొదలుకొని సాగు, తాగునీటి సమస్యలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రజ్ఞా ఆధ్యాత్మిక గురువు అవధేశానంద గిరి తన శిష్యురాలికి దూరంగా జరగడం. ప్రజ్ఞా తరఫున ప్రచారం కూడా చేయకపోవడం.

కీలక స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ మాటే చెల్లుబాటు
ఇండోర్‌తోపాటు భోపాల్, గ్వాలియర్, విదిశ, ఖజురహో లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థులను పరిశీలిస్తే.. పార్టీ మాటకన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ మాటే ఎక్కువగా చెల్లుబాటైందన్న అభిప్రాయం కలగకమానదు. పార్టీ ప్రచారంలోనూ గ్రామీణ ప్రాంతాల్లోని అసంతృప్తి, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలకు తక్కువ ప్రాధాన్యం లభిస్తున్నాయి. శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కైలాశ్‌ విజయ్‌ వర్గియా, ఉమాభారతి వంటి సీనియర్‌ నేతలను కూడా పోటీ పెట్టలేని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. ఇండోర్‌ నుంచి ప్రజలకు పెద్దగా పరిచయం లేని శంకర్‌ లాల్వానీని నిలబెట్టారు.

సీనియర్‌ నేత, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఈ స్థానం టికెట్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో అటు సుమిత్ర.. ఇటు ఆమె ప్రత్యర్థి కైలాశ్‌ విజయ్‌ వర్గియాలు ఇద్దరూ శంకర్‌ లాల్వానీకి మద్దతిచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా పెట్టని కోట లాంటి ఇండోర్‌లో బీజేపీ ఈసారి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఖజురహో విషయాన్ని తీసుకుంటే ఈ స్థానం అభ్యర్థి విష్ణుదత్‌ శర్మ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపికే. ముందు భోపాల్‌ స్థానానికి ఈయనను ఎంపిక చేసినా బీజేపీ సభ్యుల వ్యతిరేకతతో ఖజురహో స్థానాన్ని కేటాయించారు. అయితే ఆయన ఈ స్థానంలోనూ పార్టీ కార్యకర్తల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ప్రజ్ఞాకు టికెట్‌పై సీనియర్ల గుర్రు
భోపాల్‌లో ప్రజ్ఞాకు టికెట్‌ ఇవ్వడంపై కూడా సీనియర్లు బాబూలాల్‌ గౌర్, ఉమాశంకర్‌ గుప్తా గుర్రుగానే ఉన్నారు. స్థానికులకు కాకుండా బయటివారికి ఎలా టికెట్‌ ఇస్తారన్న ధిక్కార స్వరాలు ఇక్కడ వినపడుతున్నాయి. అయితే హిందూ ఓటర్లను తమ వైపునకు మళ్లించేందుకు ప్రజ్ఞా అభ్యర్థిత్వం ఉపయోగపడుతుందని.. అదే సమయంలో నియోజకవర్గంలో ఉన్న దాదాపు 4.5 లక్షల ఠాకూర్‌ ఓట్లను కూడా ప్రజ్ఞా చీలుస్తుందని మరికొందరు అంటున్నారు. దాదాపు 18 లక్షల ఓటర్లు ఉన్న భోపాల్‌ నుంచి 1984లో డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ గెలవగా ఆ తరువాత అంటే 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు.

ఎత్తులు.. పై ఎత్తులు
హిందూ వ్యతిరేకిగా బీజేపీ నేతల విమర్శలకు గురవుతున్న దిగ్విజయ్‌ సింగ్‌ ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కొంతకాలం క్రితమే ఈయన నర్మద నదీ తీరం వెంబడి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అంతేకాకుండా తరచూ దేవాలయాలను సందర్శిస్తూ తాను హిందూ వ్యతిరేకిని కాదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో విజయం వరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ఆమె నామినేషన్‌ సందర్భంగా, ‘ప్రజ్ఞాను పోటీకి ఆహ్వానిస్తున్నాను. ఆమె కోసం కూడా ప్రార్థిస్తా’ అని చేసిన ఒక ట్వీట్‌ కూడా దిగ్విజయ్‌పై ఉన్న చెడు అభిప్రాయాన్ని తగ్గించేదే. ప్రజ్ఞా ఎంపిక బీజేపీ కార్యకర్తల్లోనూ కొంత అయోమయం సృష్టిస్తోంది.

భోపాల్‌ను హిందూత్వ భావజాలానికి ఒక పరీక్షా వేదికగా ఆర్‌ఎస్‌ఎస్‌ పరిగణిస్తుంటే.. అధికారం కోసం రామమందిర అంశాన్ని కూడా పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీ ప్రజ్ఞా ఎంపికను జీర్ణించుకోలేకపోతోంది. కానీ ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాలను 130 ఏళ్ల పార్టీ గమనించకుండా ఉంటుందా? అన్నది ప్రశ్న. మాయావతి, యోగీ ఆదిత్యనాథ్, ఆజంఖాన్‌ వంటి వారికి ఎన్నికల కమిషన్‌ కూడా కళ్లాలు వేస్తున్న ఈ తరుణంలో ప్రజ్ఞా లాంటి వారు ఏదైనా విద్వేషపూరిత ప్రసంగం చేస్తే అడ్డుకోకుండా ఉంటుందా?. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సహాయకులపై ఐటీ దాడులు భారీ మొత్తంలో నగదు పట్టుబడటం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలపై కన్నేసి ఉంచామన్న సంకేతాలు పంపింది. ఈ– టెండర్ల స్కామ్‌ను తిరగదోడి విచారణ ప్రారంభించింది. ఇందులో కొంతమంది బీజేపీ పార్లమెంటు సభ్యులపై కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


సౌమ్యా నాయుడు, డేట్‌లైన్‌ – ఇండోర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement