భోపాల్ : భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్, కంప్యూటర్ బాబాతో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో మహిళా పోలీసులు పాల్గొన్నారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. అవన్నీ అసత్య ఆరోపణలేనని తేల్చింది. డిగ్గీరాజా రోడ్‌షోలో పాల్గొన్నది పోలీసులు కాదని స్పష్టం చేసింది. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిగ్విజయ్ సింగ్ గత బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు కాషాయ రంగు గల స్టోల్స్ ధరించి ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడి సభలో కాషాయ రంగు మెరవడం మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వెంటనే అక్కడున్న మహిళలను ప్రశ్నించగా.. వారిలో కొంతమంది తాము పోలీసులమని చెప్పగా.. మరికొందరు మాత్రం తమను తాము ఎండ నుంచి కాపాడుకోవడానికి స్టోల్స్ ధరించామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జాతీయతకు ఈ రంగు చిహ్నమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులను తన రోడ్‌షో కోసం వాడుకుంటున్న దిగ్విజయ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై ఈసీ కలెక్టర్‌ను నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నది పోలీసులు కాదని, బీజేపీ నేతల ఆరోపణలు అసత్యమని భోపాల్ కలెక్టర్, సీఈవో నివేదిక ఇచ్చారు. ఇక మధ్యప్రదేశ్ డీఐజీ ఇష్రాద్ వలీ..దిగ్విజయ్ సింగ్ రోడ్‌షోలో పాల్గొన్న మహిళలను తాము రిక్రూట్ చేసుకోలేదని.. వారు పోలీసులు కాదని స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే.
కాగా తన ప్రత్యర్థి అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్(బీజేపీ)ను బలంగా ఢీకొట్టేందుకు డిగ్గీరాజా తన ప్రచారంలో హిందూవాదాన్ని ప్రధానంగా హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో ఆయన.. ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు వివిధ సాధువులు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఇక కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్‌లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం బీజేపీపై అసంతృప్తిగా ఉన్న ఆయన అధికార పార్టీకి చేరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment