గాడ్సే దేశ భక్తుడైతే గాంధీ జాతి వ్యతిరేకా? | Pragya Thakur sparks another controversal coments | Sakshi
Sakshi News home page

గాడ్సే దేశభక్తుడు

Published Fri, May 17 2019 3:36 AM | Last Updated on Fri, May 17 2019 6:52 AM

Pragya Thakur sparks another controversal coments - Sakshi

అగర్‌ మాల్వా, ఉజ్జయిని, భోపాల్‌/న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఆ పార్టీ భోపాల్‌ లోక్‌సభ అభ్యర్థి, మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ గురువారం మధ్యప్రదేశ్‌లోని అగర్‌ మాల్వాలో రోడ్‌ షో సందర్భంగా తాజా వివాదానికి తెరతీశారు.

ఓ న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. గాడ్సే దేశ భక్తుడని, ఆయన ఎప్పటికీ దేశ భక్తుడిగానే ఉంటారని అన్నారు. ఆయన్ను ఉగ్రవాది అంటున్నవారు తమను తాము ఒకసారి పరీక్షించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూ అంటూ గాడ్సేని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతగా మారిన నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు.. ప్రజ్ఞ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మండిపడ్డాయి.

బీజేపీ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తాయి. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజ్ఞను ఆదేశించింది. దీంతో క్షమాపణ చెప్పిన ఆమె తాను చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకున్నారు. భోపాల్‌లో మే 12న ఎన్నికల ప్రచారం ముగించిన ప్రజ్ఞ.. 19న ఎన్నికలు జరగబోయే మాల్వా ప్రాంతంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు.

బీజేపీ అసలు రంగు బయటపడింది: ఎన్సీపీ
అమిత్‌ షా నేతృత్వంలోని బీజేపీ అసలు రంగును ప్రజలిప్పుడు చూస్తున్నారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సే.. ప్రజ్ఞ పేర్కొన్నట్టుగా దేశ భక్తుడేనా? అన్న సంగతి ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. మాలెగావ్‌ పేలుళ్ల నిందితురాలు కూడా ఉగ్రవాది గాడ్సే కోవలోకే వస్తారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవ్‌హద్‌ అన్నారు. గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  
ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామన్న బీజేపీ
ప్రజ్ఞ వ్యాఖ్యలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని బీజేపీ పేర్కొంది. మహాత్మా గాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడని తెలిపింది. ఆమె అలాంటి ప్రకటన ఎలా చేశారో వివరణ కోరతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పడం సమంజసమని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజ్ఞ క్షమాపణలు చెప్పడం నెలలో రెండోసారి. గతంలో కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె క్షమాపణ చెప్పారు. తాజా వ్యాఖ్యలకు సైతం ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఆమె ప్రతినిధి, బీజేపీ నేత డాక్టర్‌ హితేష్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు.  ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు.

గతంలోనూ...
ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ఐపీఎస్‌ అధికారి, ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే తాను పెట్టిన శాపంతోనే ముంబై ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. ఏటీఎస్‌ చీఫ్‌గా మాలెగావ్‌ పేలుళ్ల కేసు విచారించిన కర్కరే తనను హింసించారని ప్రజ్ఞ అప్పట్లో ఆరోపించారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని మరోసారి వ్యాఖ్యానించారు.

అది బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది : కాంగ్రెస్‌
ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ, అమిత్‌ షాల అభిమాన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్‌ మరోసారి జాతి యావత్తును అవమానించారని పేర్కొంది. హింసా సంస్కృతి, అమరులను కించ పరచడమనేది బీజేపీ డీఎన్‌ఏలోనే ఉందని విమర్శించింది. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను దండించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రధానిని కోరారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులనేది స్పష్టమయ్యిందని అన్నారు. వారు గాడ్సేని దేశ భక్తుడని, వీర మరణం పొందిన కర్కరేని దేశ ద్రోహి అని అంటారన్నారు.

తమ నేతల ద్వారా బీజేపీ.. జాతిపిత సిద్ధాంతాలు, ఆలోచనా విధానంపై ‘హానికారక దాడులు’ చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘ఇది గాంధేయ సూత్రాలను కించ పరిచేందుకు జరుగుతున్న కుట్ర. దేశం క్షమించజాలని క్షమాపణార్హం కాని నేరం..’ అని అన్నారు. మోదీకి ఎంత మాత్రం తెలివి ఉన్నా ప్రజ్ఞా సింగ్‌ను దండించి, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భోపాల్‌లో బీజేపీ ప్రత్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ కూడా ప్రజ్ఞ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గాడ్సేని ప్రశంసించడం దేశ భక్తి కాదని, అదొక జాతి వ్యతిరేక చర్య అని అన్నారు. మోదీ, అమిత్‌ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement