Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్‌ సీట్లు | Lok Sabha Election 2024: 5 Hot Seats In Seventh Phase Lok Sabha Polls, More Details Inside | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్‌ సీట్లు

Published Sat, Jun 1 2024 12:39 AM | Last Updated on Sat, Jun 1 2024 4:37 PM

Lok Sabha Election 2024: 5 hot seats in seventh phase lok sabha polls

సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. చివరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్‌ జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాల్లో ఐదు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ హాట్‌ సీట్లపై ఫోకస్‌...              

వారణాసి... మోదీ మేజిక్‌ 
కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో తొలిసారి ప్రధాని అభ్యరి్థగా ఇక్కడ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన ఆయన 2019లో మెజారిటీని 4.8 లక్షల ఓట్లకు పెంచుకున్నారు. 

ఈసారి దాన్ని రికార్డు స్థాయికి పెంచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్‌ అజయ్‌ రాయ్‌ ప్రధానిని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. రాయ్‌ ఒకప్పుడు బీజేపీ నేతే కావడం విశేషం. బీఎస్పీ నుంచి అథర్‌ జమాల్‌ లారీ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటైన వారణాసిలో 1991 నుంచి బీజేపీ పాతుకుపోయింది. 2004లో కాంగ్రెస్‌ గెలిచినా మళ్లీ 2009లో బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్‌ జోషి ఇక్కడ విజయం సాధించారు.

హమీర్‌పూర్‌.. అనురాగ్‌ విన్నింగ్‌ షాట్‌!
ఇది బీజేపీ కంచుకోట. 1989 నుంచి ఏకంగా 10సార్లు కాషాయ జెండా ఎగిరింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆ విజయ పరంపరను ధుమాల్‌ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కొనసాగిస్తున్నారు. రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఠాకూర్‌ 2019లో ఏకంగా 4 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 

అది ఆయనకు వరుసగా నాలుగో విజయం. కాంగ్రెస్‌ నుంచి సత్పాల్‌ రైజాదా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. వాటిలో 4 స్థానాలు హమీర్‌పూర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.

మండీ... కింగ్‌ వర్సెస్‌ క్వీన్‌ 
ఆరుసార్లు సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్‌ నేత వీరభద్రసింగ్‌ రాజ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట. ఆయన, భార్య ప్రతిభా సింగ్‌ ఇద్దరూ ఇక్కడి నుంచి మూడేసిసార్లు గెలవడం విశేషం! 2014, 2019ల్లో బీజేపీ నేత రామ్‌ స్వరూప్‌ శర్మ గెలిచి కాంగ్రెస్‌ హవాకు అడ్డుకట్ట వేశారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్‌ స్వల్ప మెజారిటీతో నెగ్గారు.

 ఈసారి బీజేపీ నుంచి ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి ప్రతిభకు బదులు ఆమె కుమారుడు విక్రమాదిత్యసింగ్‌ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆయన ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంగన, విక్రమాదిత్య పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. కంగనా నాన్‌ లోకల్‌ అని, వరదలప్పుడు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని కాంగ్రెస్‌ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.

డైమండ్‌ హార్బర్‌... అభిషేక్‌ హవా 
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 నుంచి తృణమూల్‌ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ వారసునిగా చెబుతున్న సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ విజయం సాధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్‌కు బీజేపీ అభ్యర్థి అభిజిత్‌ దాస్‌ (బాబీ) గట్టి పోటీ నేపథ్యంలో ఈసారి విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అభిషేక్‌ హ్యాట్రిక్‌ కొడతారా, డైమండ్‌ హార్బర్‌పై కాషాయ జెండా ఎగురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సీపీఎం కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.

పట్నా సాహిబ్‌... రవిశంకర్‌కు సవాల్‌ 
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పటా్నసాహిబ్‌ పేరుతో 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానం. 2009, 2014ల్లో బీజేపీ నుంచి నెగ్గిన బాలీవుడ్‌ షాట్‌గన్‌ శత్రుఘ్న సిన్హా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ గూటికి చేశారు. దాంతో ఆయన్ను ఢీకొనేందుకు బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో శత్రుఘ్నపై భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి అన్షుల్‌ అవిజిత్‌ నుంచి రవిశంకర్‌ ప్రసాద్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అన్షుల్‌ లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తనయుడు. కాంగ్రెస్‌తో పాటు దాని భాగస్వామి ఆర్జేడీకి కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకుంది. దాంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కఠిన పరీక్షగా మారింది.  
 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement