Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు! | Lok Sabha Election 2024: Godda, Dumka And Rajmahal Constituencies Going To Polls On 1st June 2024 | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!

Published Sat, Jun 1 2024 12:29 AM | Last Updated on Sat, Jun 1 2024 1:48 PM

Lok Sabha Election 2024: Godda, Dumka and Rajmahal constituencies going to polls on 1 June 2024

జార్ఖండ్‌లో చివరి విడతలో నువ్వా నేనా  

 బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీ

సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్‌ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో 
విడతలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్‌...

గొడ్డా.. బీజేపీ అడ్డా 
ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్‌ మండల్‌ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్‌ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్‌ మండల్‌ పేరు మార్మోగింది. కాంగ్రెస్‌ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. 

హ్యాట్రిక్‌ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ నిశికాంత్‌ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్‌ వికాశ్‌ మోర్చా (ప్రజాతాంత్రిక్‌) నేత ప్రదీప్‌ యాదవ్‌ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది.  

దుమ్కా... సోరెన్‌ ఫ్యామిలీ వార్‌
ఈ ఎస్టీ రిజర్వుడ్‌ స్థానం జార్ఖండ్‌ ముక్తి మోర్చా చీఫ్‌ శిబు సోరెన్‌ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్‌ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్‌దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్‌ సోరెన్‌ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు.

 బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీని కాదని శిబు సోరెన్‌ కోడలు సీతా సోరెన్‌కు టికెటిచి్చంది. ఆమె సోరెన్‌ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్‌ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్నాయి.

     రాజ్‌మహల్‌... హోరాహోరీ 
ఈ స్థానంపై కాంగ్రెస్‌ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్‌కుమార్‌ హన్స్‌డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్‌లాల్‌ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్‌మహల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్‌ సోరెన్‌ కూడా తలపడుతున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement