ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్.. హిమాచల్‌ప్రదేశ్‌లోని తషిగంగ్ వద్ద బారులు తీరిన ఓటర్లు
57 స్థానాలకు ముగిసిన ఓటింగ్
బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు
చివరి విడతతో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
న్యూఢిల్లీ/కోల్‌కతా/దుమ్కా: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11.50 గంటలకు అందిన సమాచారం మేరకు 62 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు.
దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఏడో దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సహా ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మూడోసారి అధికారం చేపట్టాలని ఉవి్వళూరుతున్న ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలోనూ శనివారం పోలింగ్ నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 73.47 శాతం పోలింగ్ నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని మిత్ర ఇన్‌స్టిట్యూట్ స్కూల్ బూత్‌లో ఓటేశారు.
బేరామరీలో బాహాబాహీ
పశి్చమబెంగాల్‌లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసీర్‌హాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని సందేశ్‌ఖాలీ పరిధిలోని బేరామరీలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భాంగర్‌లో టీఎంసీ, ఐఎస్‌ఎఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నాటుబాంబులతో దాడిచేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నుంచి మధ్యాహ్నం రెండుగంటల్లోపు 1,900 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. ఈవీఎంలు మొరాయించడం, బూత్‌లోకి రాకుండా ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లను ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయని టీఎంసీ, బీజేపీ తదితర పార్టీలు ఫిర్యాదుచేశాయి.
కుటుంబాన్ని మించిన కర్తవ్యం
80 ఏళ్ల తల్లి మరణం ఓవైపు, తప్పక ఓటేయాల్సిన బాధ్యత మరోవైపు ఉన్నా తొలుత ఓటేసి కన్నతల్లికన్నా భరతమాతకు ఎక్కువ గౌరవం ఇచ్చారు ఒక వ్యక్తి. బిహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో దేవ్‌కులీ గ్రామంలో మిథిలేశ్ యాదవ్ తల్లి శనివారం కన్నుమూశారు. ‘ చనిపోయిన అమ్మ ఎలాగూ తిరిగిరాదు. అంత్యక్రియల్ని కొద్దిసేపు ఆపొచ్చు. కానీ పోలింగ్‌ను ఆపలేం. ఎన్నికలు మళ్లీ ఐదేళ్లదాకా రావు. అందుకే ఓటేశాక అంతిమయాత్ర చేపట్టాలని మా కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాం’ అని మిథిలేశ్ చెప్పారు. ఓటేశాక వెంటనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment