సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంట్‌లోనే కీర్తించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై క్రమశిక్షణ పేరిట పాలక బీజేపీ పక్షం కంటి తుడుపు చర్యలు చేపట్టింది. ఆమె గాడ్సేను కీర్తించడం ఆశ్చర్యమూ కాదు, ఇదే మొదటి సారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేస్తూ ‘గాడ్సే నిజమైన దేశ భక్తుడు’ అంటూ అభివర్ణించారు. అప్పుడే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిన బీజేపీ అధిష్టానం, ‘ఆమె అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ఆ అభిప్రాయాలతో మేం ఏకీభవించడం లేదు’ అని స్పష్టం చేసింది.
‘ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెను నేనెన్నడూ క్షమించలేను’ అని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాడు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యకు అసలు అర్థం ఏమిటి? తాజాగా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన మరునాడు గురువారం నాడు, క్రమ శిక్షణా చర్యల కింద ఆమెను రక్షణ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగిస్తున్నామని, ఆమెను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నుంచి బహిష్కరిస్తున్నామని బీజేపీ వర్కింగ్ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడం హాస్యాస్పదం! దొంగకు తాళం చెవిచ్చి, దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామని చెప్పడం లాంటిదే ఇది. అసలు ఆమెను పార్లమెంట్‌లోకే ఎందుకు అనుమతించారు? నరేంద్ర మోదీ నాటి వ్యాఖ్యలకు అసలు అర్థం ఇది కాదా? విజయం సాధించి వచ్చారు కనుక పార్లమెంట్‌లోకి అనుమతించారని సర్దుకోవచ్చు! మరి పార్లమెంటరీ ప్యానెల్‌లోకి ఎందుకు తీసుకున్నారు?
ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పటికీ ఓ టెర్రరిజం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరనే విషయం తెలిసిందే. 2008, మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన మోటార్ సైకిల్ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఆ మోటారు సైకిల్ ఆమె పేరుతో రిజిస్టరై ఉండంతోపాటు మరికొన్ని ఆధారాలు దొరకడంతో బాంబు పేలుడు కుట్రదారుల్లో ఒకరిగా ఆమెపై కేసు నమోదు చేశారు. నాటి నుంచి నేటికీ ఆ కేసు నత్తడక నడుస్తూనే ఉంది. అది వేరే సంగతి. కానీ ఠాకూర్ ఇదే నేపథ్యంలో గాడ్సేను టెర్రరిస్టుగా చూడరాదని, ఆయన నిజమైన దేశభక్తుడని వ్యాఖ్యానించారు. అంటే, ఆమె తనను తాను నిజమైన దేశభక్తురాలిగా అంతర్లీనంగా అభివర్ణించుకుంటున్నారేమో! ఆమె వ్యాఖ్యను పలువురు బీజేపీ ఎంపీలు ఆన్‌లైన్‌లో సమర్థించడం చూస్తుంటే ఆ పార్టీలోని ద్వంద్వ ప్రమాణాలు కూడా బయటపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment