
న్యూఢిల్లీ: నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ శుక్రవారం రెండుసార్లు లోక్‌సభకు క్షమాపణ చెప్పారు. తాను గాడ్సేను దేశభక్తుడని అనలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె మొదటి సారి క్షమాపణలు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆమె అలా చెప్పే బదులు చెప్పకపోతే నయమన్నట్టుగా ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ‘నా వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బ తిన్నందుకు చాలా విచారిస్తున్నాను.
అందుకు క్షమాపణ చెబుతున్నా. అయితే సభలో నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తప్పుగా అర్థం చేసుకున్నారు’అని ఆమె అన్నారు. తనని ఉగ్రవాది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ని ఆమె తప్పు పట్టారు. కోర్టు తనని దోషిగా నిర్ధారించకుండా ఉగ్రవాది అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మహిళలు, సా«ధ్విలను అవమానపరచడమేనని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. మరోవైపు బీజేపీ రాహుల్‌కి హక్కులు నోటీసు ఇవ్వాలని పట్టుబట్టింది.
ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా చాంబర్‌లో అన్ని పార్టీల లోక్‌సభ పక్ష నాయకులు హాజరై మరోసారి ప్రజ్ఞా క్షమాపణలు చెప్పాలని తీర్మానించారు. దీంతో ముందుగా తయారు చేసిన క్షమాపణ ప్రకటనను ఆమె చదివి వినిపించారు. ‘నవంబర్ 27న ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ కోరుకుంటున్నా’అని అన్నారు. అయితే తాను గాడ్సేని దేశభక్తుడని అనలేదని మళ్లీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని, జాతికి ఆయన చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు. దీంతో సభలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీ ప్రజ్ఞా సభా హక్కుల ఉల్లంఘన నోటీసుని లోక్‌సభ స్పీకర్‌కి సమర్పించారు.
రైతు కుటుంబాలకు సాయం లేదు
ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు చెందిన కుటుంబాలకు సాయం అందించే నిబంధనలేవీ ప్రస్తుత చట్టాల్లో లేవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా ఈ విషయం తెలిపారు. అయితే, రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు రుణాల మంజూరు వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వైద్యుల కొరత లేదు
► ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్
దేశంలో వైద్యుల కొరత, నర్సుల కొరత లేదని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో వెల్లడించారు. విదేశాలకు వెళ్ళే వైద్యులను బలవంతంగా అడ్డుకోవడం కుదరదన్నారు.
క్రమంగా రైల్వే విద్యుదీకరణ
పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్‌లో అన్ని రైల్వేలైన్లను క్రమేణా విద్యుదీకరిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు చెప్పారు.
ప్రైవేటు బిల్లులు బుధవారం?
ప్రైవేటు బిల్లులను శుక్రవారం బదులు బుధవారం సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్‌ను కోరారు. జాతీయ స్థాయి అంశాలు ఉంటే తప్ప ప్రైవేటు బిల్లుల చర్చ కోసం సమయాన్ని తగ్గించకూడదని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీలంతా తమ నియోజకవర్గాలకు వెళ్లే హడావిడిలో ఉంటారు గనుక చర్చ పూర్తి స్థాయిలో జరగదని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment