బెంగళూరు: భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. మహాత్మాగాంధీ ప్రాణాలు తీసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించే ప్రతిఒక్కరినీ ఉగ్రవాదిగానే ప్రజలు భావిస్తారని అన్నారు. ‘మహాత్మా గాంధీని హతమార్చిన గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఒక ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించారు. గాంధీజీపై ఉన్న అభిమానంతో ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అంటూ పిలుస్తారని గుర్తు చేశారు. గాంధీ హంతకున్ని దేశభక్తుంటూ అభివర్ణించిన వారందరూ ఉగ్రవాదుల కోవాలోకే వస్తారని అభిప్రాయపడ్డారు.
స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అదేక్రమంలో గాడ్సేపై అభిప్రాయం తెలపాల్సిందిగా మీడియా అడగడంతో.. ‘గాడ్సే నిజమైన దేశభక్తుడు’ అంటూ అభివర్ణించి సాధ్వి సరికొత్త వివాదానికి తెరతీశారు. ఆమె వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకున పడింది. గాడ్సేను కీర్తిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారడంతో.. తప్పు తెలుసుకున్న సాధ్వి క్షమాపణలు కోరింది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన బీజేపీ ఆమె వివరణివ్వాలని కోరింది. ఇక మహాత్మా గాంధీని అవమానించిన సాధ్విని క్షమించబోనని మోదీ పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment