బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ థాకూర్
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలొదిలిన ఐపీఎస్ ఆఫీసర్ హేమంత్ కర్కర్‌పై బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడంతో ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని, తాను అన్నమాటల్ని వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ముంబై దాడుల సమయంలో టెర్రరిస్టులతో పోరాడి అసులుబాసిన హేమంత్ కర్కరే అమరవీరుడని కొనియాడారు. మనం చేసిన వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఆనందం కలిగించకూడదనే ఉద్దేశంతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.
ముంబై 26ఝ11 దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేపై బీజేపీ భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి విచారణలో హేమంత కర్కరే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ సాధ్వి ప్రగ్యా సింగ్ ఆరోపించారు. అంతేకాదు తాను శపించిన కారణంగానే కర్కరే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించారు. ఏ పాపం తెలియని తనని వేధించినందుకే భగవంతుడు ఆగ్రహించాడు.. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధ్వి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, బీజేపీకి సంబంధం లేదని పార్టీ నాయకులు అధికారికంగా చెప్పిన సంగతి తెల్సిందే. కానీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ఆమె క్షమాపణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment