న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు యోగేంద్ర యాదవ్ తన జీవితంలోని చీకటి కోణాన్ని తొలిసారి బహిరంగంగా ఆవిష్కరించారు. తన తాతపై కొందరు ముస్లింలు దాడి చేసి దారుణంగా హత్య చేశారని తెలిపారు. అదంతా కూడా తన తండ్రి కళ్ల ఎదుటే జరిగిందని.. దాంతో తన తండ్రి తమకు ముస్లిం పేర్లు పెట్టారని పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ చేసిన ఆరోపణల ఫలితంగా ఈ విషయాలు వెలుగు చూశాయి.
ఇంతకు విషయం ఏంటంటే.. మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బీజేపీ తరఫున భోపాల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాంతో ఆమె అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇండియా టుడే చానెల్‌లో ప్రజ్ఞా సింగ్ అభ్యర్థిత్వంపై డిబేట్ జరిగింది. దీనికి బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియా కూడా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా అమిత్.. యోగేందర్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన మత రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. దీనిపై స్పందించిన యోగేంద్ర యాదవ్ తన జీవితంలో జరిగిన విషాదాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘గాంధీ గారి కాలంలో కొందరు ముస్లిం వ్యక్తులు మా కుటుంబంపై దాడి చేశారు. మా నాన్న కళ్లెదుటే ఆయన తండ్రి అంటే మా తాతను అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దాడితో మా నాన్నకు గాంధీ మార్గం మీద నమ్మకం పోయింది. ఆయన తన మనసు మార్చుకున్నాడు. తన తండ్రి హత్యను కళ్లారా చూసిన ఆయన.. తన పిల్లలకు తన తండ్రిని చంపిన మతం వారి పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు.
అంతేకాక ‘ఇదే సంఘటన వేరే ఏ దేశంలో జరిగినా ఇపాటికే దీని గురించి నవలలు, బుక్స్ రాసేవారు. కానీ మా తండ్రి చర్యల వల్ల వచ్చిన పేరు ప్రతిష్టలను నేను తీసుకోవాలనుకోవడం లేదు. ఈ క్రెడిట్ 90 ఏళ్ల మా నాన్న గారికే దక్కాల’ని యోగేంద్ర తెలిపారు. అంతేకాక తనను మత రాజకీయాలు చేస్తాడని ఆరోపించిన అమిత్ మాలావియాకు ఒక సవాల్ కూడా విసిరారు. తాను రాజకీయాల్లో లబ్ది పొందడం కోసం గతంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఈ సంఘటన గురించి మాట్లాడినట్లు ఆడియో కానీ, వీడియో కానీ చూపిస్తే ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. అమిత్ మాలవియా అలా రుజువు చేయలేకపోతే.. నోరు ముసుకుని ఉంటే మంచిదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment