YogendraYadav
-
బెంగాల్ రాజకీయాల్లో సమూలమార్పు
బెంగాల్లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో సుదీ ర్ఘంగా సాగుతున్న శాసనసభ ఎన్నికల ముగింపు సందర్భంగా ఒక విషయం మాత్రం తేటతెల్లమైంది. అదేమిటంటే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి.. నేను ఇక్కడ ఎన్నికల ఫలితం గురించి జోస్యం చెప్పబోవడం లేదు. త్వరలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రానున్నాయి. అప్పుడు బెంగాల్ రాజకీయ రణరంగంలో జరిగిన సంకుల సమరం ఎలా ముగుస్తుందో మనకు స్పష్టత కలగవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీగానే జరిగాయి. కాంగ్రెస్ పార్టీతో, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కూటమి గట్టిన వామపక్ష కూటమి బెంగాల్ రాజకీయ రంగస్థలంపై మరోసారి ప్రభావం చూపవచ్చన్న అంచనా తేలిపోయినట్లే చెప్పవచ్చు. బెంగాల్ మూడో శక్తిగా చెబుతున్న ఈ కూటమి 10 శాతం పాపులర్ ఓట్లతో అధికారానికి ఆమడదూరంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఓట్లు ప్రతిఫలించనప్పటికీ బెంగా>ల్లో అత్యంత తీవ్రమైన ఎన్నికల పోటీ ఈసారి మాత్రమే చోటు చేసుకుందని నా అంచనా. టీఎంసీ, బీజేపీలు మొత్తం ఓట్లలో 80 శాతం వరకు కైవసం చేసుకోనున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరొక 40:40 నిష్పత్తిలో ఓట్లు వచ్చినట్లయితే బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. మమతకు అనుకూలంగా 42:38 నిష్పత్తిలో ఓట్లు వస్తే ఆమె నాయకత్వం గురించి, ప్రశాంత్ కిషోర్ మైక్రో మేనేజ్మెంట్ ఘనత గురించి మీడియా విజయగీతాలు మొదలెడతాయి. దీనికి భిన్నంగా బీజేపీకి అనుకూలంగా ఇదే నిష్పత్తిలో ఓట్లు వస్తే మోదీ– అమిత్ షా ద్వయం సృష్టించిన మహా కాషాయ దళ ప్రభంజనం గురించి టీవీ స్టూడియోలు చెక్కభజన మొదలెడతాయి. నూతన రాజకీయ కూటములకు నాంది మే 2న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేదానితో నిమిత్తం లేకుండానే, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం మౌలికంగానే రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ సాధించిన అసాధారణ విజయం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. 2011 ఎన్నికల్లో కూడా బీజేపీకి బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 4.1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో 10.2 శాతం ఓట్లు సాధించినప్పటికీ బీజేపీకి అదనంగా 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడం గమనార్హం. అంటే ఇటీవలి కాలం వరకు బెంగాల్లో బీజీపీ ఉనికి కనీసమాత్రంగానే కనిపించేది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకుగాను 18 సీట్లతో, 40.2 శాతం ఓట్లు కొల్లగొట్టిన బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజాదరణ కారణంగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి ప్రధాన పోటీదారుగా సవాల్ చేసే స్థాయికి ఎగబాకింది. స్పష్టంగానే టీఎమ్సీ, బీజేపీల మధ్య రాజకీయ స్పర్థ కొంత కాలంపాటు కొనసాగనుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటిది బెంగాల్లో సంభవిస్తుందని ఊహామాత్రంగా కూడా భావించేవారు కాదు. కొత్త సామాజిక ఏకీకరణ ఈ పరిస్థితి బెంగాల్లో సామాజిక శక్తుల పునరేకీకరణకు చోటు కల్పించింది. ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజిక బృందాలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ బెంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఉత్తర బెంగాల్, పశ్చిమ బెంగాల్‌లోని జంగిల్ మహల్ లోని వెనుకబడిన ప్రాంతాలలో బీజేపీ ప్రారంభ విజయాలను సాధించింది. దళితులు, ఆదివాసీలు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు, పట్టణ ప్రాంతాల్లోని హిందీ మాట్లాడే వారిని ఆకర్షిం చడం ద్వారా బీజేపీ బెంగాల్లో తనదైన పునాదిని సృష్టించుకుంది. 2019 నుంచి ఈ సెక్షన్లను దాటి బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. ఈసారి అది గ్రామీణ దక్షిణ బెంగాల్ కేంద్ర స్థానంలోకి చొచ్చుకుపోయింది. పైగా బెంగాల్ మధ్యతరగతి భద్రలోక్ ప్రజల్లో కాస్త చోటు సంపాదించుకుంది. చాలాకాలంగా పశ్చిమబెంగాల్లో అణ చిపెట్టిన కుల రాజకీయాలను ప్రేరేపించడం ద్వారా బీజేపీ ఈసారి కొత్త తరహా అస్తిత్వ రాజకీయాలను సృష్టించవచ్చు. ఈ తరహా రాజకీయాలకు ఆధారం హిందూ సమీకరణే కావచ్చు. పాపులర్ ఓటు ఎక్కడైనా సరే 40 శాతానికి దగ్గరగా వచ్చిందంటే దానర్థం.. రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న హిందూ ఓటర్లలో మూడింట రెండు వంతుల మందిని తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందనే. 30 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో హిందువులను తారస్థాయిలో సంఘటితం పర్చుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. 1940లలో హిందూ–ముస్లిం హింసకు కేంద్రబిందువుగా ఉన్న మతపరమైన గతంలోకి బెంగాల్ మరో సారి వెళ్లిపోనుందని దీనర్థం. మనీ, మెషిన్ సరికొత్త పాత్ర బెంగాల్ రాజకీయాల్లో పార్టీల భుజబల ప్రదర్శనకు ఈసారి డబ్బు, ఎన్నికల యంత్రాంగం తోడై నిలిచాయి. భుజబల ప్రదర్శన బెంగాల్ రాజకీయాలకు కొత్త కాదు. 1960లలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణలు, ఆ తర్వాత కమ్యూనిస్టుల మధ్య అంతర్గత ఘర్షణలలో దీని పునాదులు మనకు కనిపిస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థులపై వామపక్ష కూటమి పాలన సాగించిన హింసా ప్రయోగం బహిరంగ రహస్యమే. ఈ వారసత్వాన్ని మమతా బెనర్జీ కొనసాగించడమే కాకుండా మరింత వేగవంతం చేసింది. 2018 పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ నాయకులు సాగించిన మితిమీరిన హింసాకాండ పాలకపార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు వామపక్ష సానుభూతిపరుల్లో బలమైన వర్గం తమ విధేయతను బీజేపీవైపు మళ్లించడంతో బీజేపీ ఇప్పుడు అదే హింసను కొనసాగిస్తోంది. ఇకపోతే, రాష్ట్ర చరిత్రలో ఇంత అత్యధికంగా డబ్బు వెదజల్లిన ఎన్నిక ఇదేనని స్పష్టమవుతోంది. బెంగాల్ మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో డబ్బు వెదజల్లుతున్నారు. ఒకసారి ఈ ధోరణి మొదలైందంటే ఇక వెనక్కు పోవడం ఉండదు. పైగా బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత పక్షపాత దృష్టిని ఎన్నికల కమిషన్ ప్రదర్శించడం గమనార్హం. కేంద్రంలోని అధికార పార్టీకి సహాయపడటంతో ఎన్నికల కమిషన్ హద్దులు మీరిపోయింది. చివరగా ఎన్నికల విషయంలో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది రాష్ట్ర చరిత్రలో కొత్త మలుపుగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న మమత ప్రశాంత్ కిషోర్ టీమ్‌ని ఆహ్వానిం చింది. పీకే టీఎంసీ పార్టీలో సమాంతర వ్యవస్థను సృష్టించారు. కొత్త, పాపులర్ విధానాల రూపకల్పనతో పార్టీకి సరికొత్త ఇమేజీ తేవడంలో పీకే టీమ్ తోడ్పడింది. ఇది మమతను మూడో సారి కూడా అధికార పీఠంపై నిలబెడుతుందా అనేది చెప్పలేం కానీ, బెంగాల్లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. వ్యాసకర్త: యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
‘దాంతో మా నాన్న మాకు ముస్లిం పేర్లు పెట్టారు’
న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు యోగేంద్ర యాదవ్ తన జీవితంలోని చీకటి కోణాన్ని తొలిసారి బహిరంగంగా ఆవిష్కరించారు. తన తాతపై కొందరు ముస్లింలు దాడి చేసి దారుణంగా హత్య చేశారని తెలిపారు. అదంతా కూడా తన తండ్రి కళ్ల ఎదుటే జరిగిందని.. దాంతో తన తండ్రి తమకు ముస్లిం పేర్లు పెట్టారని పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ చేసిన ఆరోపణల ఫలితంగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఇంతకు విషయం ఏంటంటే.. మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బీజేపీ తరఫున భోపాల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాంతో ఆమె అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇండియా టుడే చానెల్లో ప్రజ్ఞా సింగ్ అభ్యర్థిత్వంపై డిబేట్ జరిగింది. దీనికి బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియా కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అమిత్.. యోగేందర్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన మత రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. దీనిపై స్పందించిన యోగేంద్ర యాదవ్ తన జీవితంలో జరిగిన విషాదాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘గాంధీ గారి కాలంలో కొందరు ముస్లిం వ్యక్తులు మా కుటుంబంపై దాడి చేశారు. మా నాన్న కళ్లెదుటే ఆయన తండ్రి అంటే మా తాతను అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దాడితో మా నాన్నకు గాంధీ మార్గం మీద నమ్మకం పోయింది. ఆయన తన మనసు మార్చుకున్నాడు. తన తండ్రి హత్యను కళ్లారా చూసిన ఆయన.. తన పిల్లలకు తన తండ్రిని చంపిన మతం వారి పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు. అంతేకాక ‘ఇదే సంఘటన వేరే ఏ దేశంలో జరిగినా ఇపాటికే దీని గురించి నవలలు, బుక్స్ రాసేవారు. కానీ మా తండ్రి చర్యల వల్ల వచ్చిన పేరు ప్రతిష్టలను నేను తీసుకోవాలనుకోవడం లేదు. ఈ క్రెడిట్ 90 ఏళ్ల మా నాన్న గారికే దక్కాల’ని యోగేంద్ర తెలిపారు. అంతేకాక తనను మత రాజకీయాలు చేస్తాడని ఆరోపించిన అమిత్ మాలావియాకు ఒక సవాల్ కూడా విసిరారు. తాను రాజకీయాల్లో లబ్ది పొందడం కోసం గతంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఈ సంఘటన గురించి మాట్లాడినట్లు ఆడియో కానీ, వీడియో కానీ చూపిస్తే ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. అమిత్ మాలవియా అలా రుజువు చేయలేకపోతే.. నోరు ముసుకుని ఉంటే మంచిదని హెచ్చరించారు. -
విస్ఫోటనకు చేరువగా అస్సాం
గత అయిదేళ్లలో బీజేపీ అస్సాం వలస సమస్యను మతతత్వ సమస్యగా మార్చడంలో విజయవంతం కావడమే కాకుండా, భాషాపరమైన, జాతిపరమైన సమస్యకు మతం రంగు పులిమింది. అస్సాంలో బీజేపీ రాజకీయాలు ప్రధానంగా బెంగాలీ హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డాయి. కాబట్టి ఈ పార్టీకి రెండంచెల అజెండా ఉంది. బెంగాలీ హిందువులకు పౌరసత్వ స్థాయిని కల్పించడం, బెంగాలీ ముస్లింలకు ఆ స్థాయిని నిరాకరించడం. ఈ విభజనే అస్సాంను ప్రమాదకరమైన విస్ఫోటక స్థాయికి చేరుస్తోంది. అస్సాం నేడు ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. రాష్ట్రంలో అనిశ్చితమైన జాతుల సమ్మేళనం విస్ఫోటించడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ సంక్షోభంలో అవకాశం కోసం రాజకీయపార్టీలు వేచి చూస్తున్నాయి. ఇక మిగిలిన దేశం మొత్తంగా, ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది అనే విషయమై పట్టించుకోకుండా ఉంటోంది. అస్సాంలో సాగుతున్న జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) సన్నాహక చర్యలు పాత గాయాన్ని రేపాయి. దశాబ్దాలుగా అస్సాం రాజకీయాల్లో ‘వలస’ సమస్య ఆధిపత్యం చలాయిస్తోంది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా రాష్ట్రం భారీస్థాయిలో ‘బయటి వ్యక్తుల’ చొరబాటుకు సాక్షీభూతమై నిలిచింది. దేశం లోపలి నుంచి హిందీ భాష మాట్లాడేవారు, జార్ఖండ్ నుంచి గిరిజనులు, పశ్చిమ బెంగాల్ నుంచి బెంగాలీ హిందువులతో పాటు నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు కూడా ఈ వలసల్లో ఉన్నారు. జనాభాలో గణనీయ నిష్పత్తిలో–ఎంతమంది అనేది పూర్తి వివాదాస్పద ప్రశ్నగా ఉంటోంది–బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చిన హిందూ, ముస్లిం వలస ప్రజలున్నారు. వీరు మతపరమైన పీడనవల్లో లేక జీవిక కోసమో భారత్‌కు వలస వచ్చేశారు. విభజన సమయంలో బంగ్లాదేశ్‌లో (నాటి తూర్పు పాకిస్తాన్), 24 శాతం మంది హిందువులు ఉండేవారని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ వీరి జనాభా 9 శాతానికి పడిపోయింది. ఇంత జనాభా ఎక్కడికి వెళ్లివుంటుందో అంచనా వేస్తే బహుమతులు రావు మరి. జాతుల సమతుల్యతను చెరిపేసిన వలసలు భారీస్థాయి వలసలు అస్సాంకి కొత్త కాదు. రాష్ట్ర చరిత్ర మొత్తంగా వలసల వెల్లువల చరిత్రే. అయితే స్వాతంత్య్రానంతరం సాగిన భారీ వలస రాష్ట్రం లోని జాతుల సమతుల్యతను చెరిపివేసింది. 2011 నాటి భారత జనాభా గణనకు చెందిన భాషాపరమైన సంఖ్యను ప్రభుత్వం ఇంకా విడుదల చేయనప్పటికీ, 2001 జనాభా లెక్కలు పరిశీలిస్తే సొంత రాష్ట్రంలోనే అస్సామీ భాష మాట్లాడే ప్రజలు మైనారిటీగా మారిపోయారని స్పష్టమవుతుంది. 1991 నుంచి 2001 మధ్య కాలంలో అస్సామీ భాషను మాట్లాడే జనాభా 58% నుంచి 48 శాతానికి పడిపోయింది. కాగా, బెంగాలీ మాట్లాడే జనాభా మాత్రం 21 నుంచి 28%కి పెరిగింది. ఈ ధోరణిని గమనిస్తే, అస్సామీ భాషని మాట్లాడే జనాభా ప్రస్తుతం 40 శాతం వరకు ఉండగా, బెంగాలీ మాట్లాడే వారు రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతుగా ఉన్నారు. మతపర కమ్యూనిటీలుగా చూస్తే అస్సాంలో ముస్లిం జనాభా 1951లో 25 శాతం నుంచి 2011 నాటికి 34 శాతానికి పెరిగింది. జనాభా పొందికలో ఈ భాషాపరమైన, మతపరమైన మార్పులు చాలా ఎక్కువగా బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండే జిల్లాల్లోనే చోటుచేసుకున్నాయి. అస్సాం ముస్లిం ఆధిక్యతా రాష్ట్రంగా మారేందుకు తక్కువ అవకాశమే ఉన్నప్పటికీ అహోమియా, బోడోలు, ఇతర గిరిజన కమ్యూనిటీలు వంటి భూమిపుత్రుల ఆందోళనలను మాత్రం తోసిపుచ్చలేం. ఏదో ఒక సమయంలో రాష్ట్రంలో జాతుల సంఘర్షణ, హింస పెరిగే అవకాశం పొంచుకుని ఉంది. నేడు, ఈ భూకంపం మరొకసారి పేలడానికి సిద్ధంగా ఉంది. 1971 మార్చి 25 తర్వాత అస్సాంలో ప్రవేశించిన వలస ప్రజలందరినీ గుర్తించి, రాష్ట్రం నుంచి పంపించివేయాలన్నది 1985లో కుదిరిన అస్సాం ఒడంబడికలోని ప్రధాన షరతుల్లో ఒకటి. అస్సాం గణ పరిషత్ రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇది సాధ్యం కాలేదు. 2005లో ఆందోళనకు దిగిన విద్యార్థులతో కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా పై వాగ్దానాన్నే మళ్లీ పొందుపర్చడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లగా, 1951లో రూపొందించిన జాతీయ పౌరుల నమోదు –ఎన్ఆర్సి–ని తాజాగా మెరుగుపర్చి అసలైన పౌరులను గుర్తించవలసిందిగా కోర్టు ఆదేశించింది. ఈ పని గత మూడేళ్లుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. 2017 డిసెంబర్ 31కి ఇది పూర్తి కావలసి ఉంది. పొడిగింపుకోసం రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ, గడువు తేదీలోపల తొలి ముసాయిదా జాబితానైనా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తొలి ముసాయిదాతో భయాందోళనలు అలా విడుదలైన తొలి ముసాయిదా జాబితా గందరగోళానికి, భయాందోళనలకు దారితీసింది. జాతీయ పౌరుల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న 3.29 కోట్లమందిలో 1.9 కోట్లమంది పేర్లు ఈ తొలి ముసాయిదాలో ఉన్నాయి. ఇది తొలి జాబితాయే కావచ్చు. పైగా ఇది ముసాయిదా మాత్రమే. కానీ అంచనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారిలో జాబితానుంచి గల్లంతైన వారు ఎవరు అనేది తేల్చడంలో ఇది సహాయపడదు. జాబితాలో లేని వారిని మూడు కేటగిరీలుగా చేయవచ్చు: మూలవాసుల నుంచి పత్రాలు పూర్తి చేయని వారికి చెందిన సాధారణ ఉదంతాలు. సందేహాస్పదమైన కేసులు, పంచాయతీ జారీచేసిన సమర్పిత పత్రాలకు చెందిన ప్రత్యేక కేటగిరీ. ప్రస్తుత వివాదం ఈ మూడో కేటగిరీకి చెంది నదే. ఈ ధ్రువపత్రాలను హైకోర్టు తిరస్కరించగా, రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చింది కూడా. ఈ కేటగిరీలో 27 లక్షల మంది ముస్లిం మహిళలు ఉన్నారు. వీరి వివాçహాలను నమోదు చేయనందున వీరికి కాగితపు రూపంలో ఎలాంటి రుజువూ లేదు. పైగా వీరికి ఎలాంటి విద్యాపరమైన డిగ్రీలు కూడా లేవు. వీరి పౌరసత్వ హక్కులు రద్దు కావచ్చు. ఇక్కడే రాజకీయ నాయకత్వం లెక్కలేసుకుంటోంది. విషాదమేమంటే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల లెక్కపక్కాలపైనే దృష్టి సారిస్తున్నాయి. సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినందుకు అపరాధభావంతో ఉంది. విదేశీ వలసప్రజలకు ఈ పార్టీ ఉచితప్రవేశం కల్పించి తర్వాత వారిని తన ఓటుబ్యాంకుగా మల్చుకుంది. దురదృష్టవశాత్తూ ఉదారవాద, ప్రగతిశీల మేధావుల్లో ప్రధానభాగం ఈ పరిస్థితి తీవ్రతను నిర్లక్ష్యం చేశారు. ఇక వామపక్షాలు బెంగాలీ వలసప్రజల పట్ల మౌనం పాటించడమే కాకుండా ఈ సమస్యను లేవనెత్తిన వారిని బహిరంగంగానే ఖండించాయి. 1977 నుంచి 1985 వరకు కొనసాగిన అస్సాం ఉద్యమం ద్వారా విద్యార్థి, యువజనులు భూమిపుత్రులకు సంబంధించిన చట్టబద్ధమైన ఆందోళనను వ్యక్తపర్చారు. ఈ విదేశీ వ్యతిరేక ఉద్యమానికి బెంగాలీ వ్యతిరేకత కూడా ఛాయామాత్రంగా తోడైంది. కాని ఈ ఉద్యమం ముస్లిం వ్యతిరేక రాజకీయాలను స్పష్టంగానే ప్రదర్శించింది. వలస ప్రజల సమస్యను లేవనెత్తడంలో ఉద్యమం విజయవంతమైనప్పటికీ సమర్థ పరిష్కార విషయంలో విఫలమైంది. ఇతర పార్టీలకు మల్లే, అస్సాం గణ పరిషత్‌కి చెందిన రెండు ప్రభుత్వాలు కూడా ఈ అంశంలో అసమర్థంగా ఉండిపోయాయి. ఈ వైఫల్యమే వికృతమైన మతతత్వ రాజకీయాలకు దారి చూపింది. గత అయిదేళ్లలో బీజేపీ ఈ సమస్యను మతతత్వ సమస్యగా మార్చడంలో విజయవంతం కావడమే కాకుండా, భాషాపరమైన, జాతిపరమైన సమస్యకు మతం రంగు పులిమింది. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ప్రధానంగా బెంగాలీ హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డాయి. కాబట్టి ఈ పార్టీకి రెండంచెల అజెండా ఉంది. బెంగాలీ హిందువులకు పౌరసత్వ స్థాయిని కల్పించడం, బెంగాలీ ముస్లింలకు ఆ స్థాయిని నిరాకరించడం. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నందున, తన అజెండాను అమలు చేయడానికి ఈ పార్టీ చట్టపరమైన, పాలనా పరమైన మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర స్థాయిలో, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పంచాయతీలు జారీ చేసిన సర్టిఫికెట్ల రద్దును సంతోషంగా సమర్థించింది. ఇక కేంద్ర స్థాయిలో బీజేపీ 1955 పౌరసత్వ చట్టానికి ప్రమాదకరమైన సవరణను తీసుకొస్తోంది. పార్లమెం టులో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ సవరణ, నేపాల్ మినహా ఇతర దేశాలనుంచి వలస వచ్చినవారికి వారు ముస్లింలు కాదు అన్న ప్రాతిపదికన భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చే ప్రక్రియను సరళతరం చేస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు ప్రత్యేక స్థాయిని పొందనుండగా అక్కడి నుంచే వచ్చిన ముస్లింలు దానికి దూరమవనున్నారు. ఈ సవరణకు చట్టరూపం కల్పిస్తే, భారతీయ పౌరసత్వానికి మతపరమైన అర్హతను ప్రవేశపెట్టినట్లవుతుంది. మహమ్మదాలీ జిన్నా సూత్రీకరించి రెండు దేశాల సిద్ధాంతానికి ఇది యథాతథంగా సరిపోలుతుంది. మత ప్రాతిపదికన విభజన ప్రమాదకరం ముందే ఊహించినట్లుగా, అస్సాం ఈ సమస్యపై విభజితమవుతుంది. హిందూ మతతత్వ రాజకీయ శక్తులు స్థానికులు/బయటివారు అనే విభజనను హిందూ/ముస్లింలుగా మార్చడానికి జాతీయ పౌరసత్వ నమోదును కవచంగా ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపున, పలు ముస్లిం సంస్థలు ఎన్‌ఆర్‌సీనే వ్యతిరేకిస్తున్నాయి. ఈ విభజనే ప్రమాదకరంగా విస్ఫోటక స్థాయికి చేరువవుతోంది. అదృష్టవశాత్తూ, హీరేన్ గొహెయిన్, అపూర్వ బారువా వంటి ప్రముఖ అస్సాం మేధావులు కొందరు మూడవ, ఆరోగ్యకరమైన పంథాను చేపట్టారు. వీరి ప్రతిపాదన మైనారిటీలకు రక్షణ కల్పిస్తూనే, జాతీయ పౌరసత్వ నమోదుకు మద్దతిస్తోంది. అస్సాంలో ముందునుంచి ఉంటున్న వారి భాషాపరమైన, సాంస్కృతికపరమైన, జాతిపరమైన ఆందోళనలు చట్టబద్ధమైనవేనని వీరు గుర్తిస్తూనే, విదేశీయుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరముందని వీరు చెబుతున్నారు. కాబట్టి ఎన్ఆర్సీ ప్రక్రియను కొనసాగించాలి, మద్దతు ఇవ్వాలి కూడా. అదేసమయంలో ఈ ప్రక్రియలో మతపరమైన వివక్షను పాటించరాదు. ముస్లిం మహిళల పరిస్థితి దృష్ట్యా, పంచాయతీలు జారీచేసిన సర్టిఫికెట్లు చెల్లుతాయని గుర్తించాలి. అంతిమంగా ప్రతిపాదించిన పౌరసత్వం సవరణను ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగానికి, భారత జాతీయోద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఈ వైఖరికి సంబంధించి అస్సాంలోనూ, వెలుపల కూడా మనం కచ్చితంగా జాతీయ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. కాని దీనిని ఎవరైనా ఆలకిస్తున్నారా? లేక మనం మరొక నెల్లి తరహా జాతి ఊచకోత ఘటనకు సిద్ధపడుతున్నామా? యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులు మొబైల్ : 98688 88986 -
‘నర్మదా బచావ్’ ఓడిపోలేదు
విశ్లేషణ నర్మదా ఉద్యమం ప్రజా కార్యాచరణకు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరించింది. మన నైతిక ఊహాత్మకతను విస్తరింపజేసి, అభివృద్ధి బాధితులను బాధితులుగా మన చేత గుర్తింపజేసింది. రాజ్యాంగబద్ధమైన మన ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అర్హతేలేని వారికి గొంతునిచ్చింది. మన ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యీకరించింది. అంతిమ పోరాటంలో అది ఓడిపోతున్నట్టు కనిపించవచ్చు. కానీ అది ఇప్పటికే మనల్నందరినీ గెలుచుకుంది. ఆ ఉద్యమ అపజయాలు మన గతం, విజయాలు మనందరి సమష్టి భవితకు చెందుతాయి. నర్మదా బచావ్ ఆందోళన్(ఎన్బీఏ) అంతిమ పోరాటానికి దిగింది. అలాంటి ఈ సమయంలో నేను ఒక తరం కార్యకర్తలకు ఆదర్శమూర్తి మేధా పాట్కర్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో, శ్యామా భారత్ గురించి కూడా అంతగా ఆలోచిస్తున్నానని అనుకుంటాను. శ్యామా, ధార్ జిల్లాలోని బిద్వానీ తెహసిల్ పిచ్చోది గ్రామంలోని జాలరి మహిళ. నర్మదా పోరు చివరి దశలోకి ప్రవేశించింది. సర్దోవర్ డ్యాం ప్రతిపాదిత ఎత్తుకు చేరుకుంది. కొందరికి కల, ఇతరులకు పీడకల వంటి ఆ ప్రాజెక్టు వాస్తవమైంది. చివరకు, గేట్లను కూడా మూసేశారు. ఇక రిజర్వాయరు నీటి మట్టం పెరిగి... ప్రభుత్వం ‘‘ప్రాజెక్టు ప్రభావిత ప్రజలు’’గా పిలుస్తున్న వారి ఇళ్లూ, వాకిళ్లూ సర్వస్వాన్నీ ముంచేస్తుంది. వారా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి పెట్టిన తుది గడువు జూలై 31. ప్రభుత్వం ఇక ఏ రోజునైనా బలవంతంగా వారిని ఖాళీ చేయించడాన్ని ప్రారంభించవచ్చు. ఇక అంతా ముగిసిపోయినట్టే అనిపించవచ్చు. నర్మదను కాపాడటానికి చేస్తున్న 32 ఏళ్ల చరిత్రాత్మక పోరాటం పూర్తయిందని అనిపించవచ్చు. వెనకడుగు... కొత్త పోరు దుస్సాధ్యమైన ప్రతిఘటనా పోరాటాన్ని ఇంకా నడుపుతున్న మేధా పాట్కర్ మీదికి నా ఆలోచనలు పోతున్నాయి. ఖాళీ చేసి వెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వేలాది కుటుంబాలు ఇంకా తమ ఇళ్లలోనే ఉంటున్నాయి. వందలాది మంది గ్రామస్తులు చివరి దఫా జల సత్యాగ్రహంలో చేరారు. జూలై 27 నుంచి మేధాపాట్కర్ సహా ఓ డజను మంది కార్యకర్తలు చికల్దా గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆసియాలో మొట్టమొదట వ్యవసాయం చేసినది ఇక్కడేనని తెలిపే ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారని మేధా పాట్కర్ తెలిపారు. ఈ వానా కాలంలోనే బహుశా ఆ గ్రామం సైతం డ్యామ్ రిజర్వాయర్‌లో మునిగిపోతుంది. ఏళ్ల తరబడి నర్మదా బచావ్ ఆందోళన్‌ను గమనిస్తున్నవారు ఎవరైనా... ప్రతి కొత్త పోరాటమూ ఒక వెనుకడుగేనని గుర్తిస్తారు. మొదట అసలా డ్యామ్‌ను నిర్మించడానికి అనుమతించేది లేదని, దాన్ని అడ్డుకోడానికి చేసిన పోరాటం. తర్వాత డ్యామ్ ఎత్తు గురించి పోరాటం. ఇప్పుడిక ఈ ఆఖరు పోరాటం, డ్యామ్ వల్ల మధ్యప్రదేశ్‌లో నిర్వాసితులైన వారి సహాయ, పునరావాసాలా గురించి జరుగుతున్నది. డ్యామ్ నిర్మాణానికి అనుమతినిస్తూ సుప్రీం కోర్టు.. నిర్మాణానికి ముందే ప్రభావిత ప్రజలకు పునరావాసాన్ని కల్పించడం తప్పనిసరి అని షరతును విధించింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం, పునరావాస షరతులను వేటినీ పరిపూర్తి చేయకుండానే నిర్మాణాన్ని కొనసాగించి, డ్యామ్ ఎత్తును పెంచే మార్గాలను కనిపెట్టింది. వాగ్దానాల కాలరాచివేత డ్యామ్ నిర్మాణాన్ని కొనసాగించడంతో పాటూ ప్రభుత్వం వాస్తవాలను తారుమారు చేయడమూ సాగించింది. వాటిని ఎన్బీఏ నిర్విరామంగా ఎండగడుతూ వచ్చింది. చాలా వరకు వాగ్దానాలు పరిపూర్తి కాకుండానే మిగిలిపోయాయి. భూమికి బదులుగా భూమి అనే సూత్రాన్ని విడనాడారు. అర్హతగల చాలా కుటుంబాలకు నగదు పరిహారాన్ని సైతం ఎగవేశారు. ప్రత్యామ్నాయ గృహ వసతి వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. ప్రత్యామ్నాయ గృహం వాగ్దానం చివరకు ప్రభుత్వం హడావుడిగా వేసిన రేకుల షెడ్డుకు కుదించుకుపోయింది. రైతులు వాటిలోకి తమ నివాసాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. కోర్టు ఆదేశాలను అనుసరించి పునరావాసం పూర్తయ్యేవరకు గేట్లను మూసివేయకూడదని చికల్దాలోని ఆందోళనకారులు, దేశవ్యాప్తంగా ఉన్న వారి మద్దతుదార్లు డిమాండు చేస్తున్నారు. పాలకులు అదేమీ వినిపించుకునే ధోరణిలో లేరని స్పష్టంగానే కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల్లోగా ప్రాజెక్టు పూర్తయిందని వాళ్లు ప్రకటించుకోవాలి. ఈ దశలో కోర్టులు దీన్ని అడ్డుకున్నాగానీ, ఆందోళనకారుల ఎజెండా బాగా కుదించుకుపోయిందనే విషయాన్నే అది గుర్తుచేçస్తూనే ఉంటుంది. నిరాశావాదులైన పరిశీలకులు నర్మదా ఉద్యమం అసలు లక్ష్యాన్నే కోల్పోయిందని మీకు చెప్పొచ్చు. ఎనలేని ఉద్యమ విజయాలు నేను మాత్రం అంగీకరించను. ఈ ఉద్యమం వల్ల నిర్వాసిత ప్రజలకు స్పష్టంగా కళ్లకు కనిపించే పలు లాభాలు సమకూరాయని భావిస్తున్నాను. ఈ పోరాటం, మహారాష్ట్ర, గుజరాత్‌లలో నిర్వాసిత కుటుంబాలకు దేశంలో మనం ఇంతవరకు ఎరుగనంత మంచి పునరావాస ప్యాకేజీని సాధించిపెట్టింది. అంతకు మించి అది ‘పర్యావరణ ప్రభావ నివేదిక’ను ప్రభుత్వ విధివిధానాలలో భాగం చేసింది. 2013 భూసేకరణ బిల్లును తెచ్చిన ప్రతిష్ట ఎవరికి చెందుతుంది అనేట్టయితే, నిస్సందేహంగా నర్మదా బచావ్ ఆందోళనకే. ఈ ప్రయోజనాలు కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చే బాధ్యతల నుంచి ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకుంది. భారీ డ్యామ్ ప్రాజెక్టులకు ఆర్థికసహాయం అందించడాన్ని సమీక్షించింది. ఎన్బీఏ నిర్వాసితులకు సాధించిపెట్టిన ప్రయోజనాలు ప్రత్యక్షంగా కంటికి కనిపించే వాటి పరిధికి మించి విస్తరించాయి. ‘నిర్వాసిత ప్రజలు’ అనే వర్గీకరణను తెచ్చినది అనేక విధాలుగా ఎన్బీఏనే. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ముందు దేశంలో పలు డ్యామ్‌లు వచ్చాయి. బాక్రా డ్యామ్, హిరాకుడ్ డ్యాం వంటివి వాటిలో కొన్ని. చండీగఢ్ నగరం కూడా అలాంటి భారీ ప్రాజెక్టే. ఇవన్నీ భారీ ఎత్తున ప్రజలను విస్థాపితులను చేశాయి. అయినా, ఈ శరణార్థులకు ప్రభుత్వ పత్రాలలో తప్ప గుర్తింపే లేదు. వారి కడగండ్లు, బాధ, విషాదం సమంజసమైనవిగా పరిగణించేవారే కారు. వారిది దేశ నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకమైన ఆందోళనగా కనిపించేది. మన నైతిక ఊహాత్మకతను విస్తరింపజేసి, అభివృద్ధి బాధితులను బాధితులుగా మన చేత గుర్తింపజేయడం ఎన్బీఏ సాధించిన విజయం. అది ఎన్నటికీ నిలిచి ఉండేది. ఎన్బీఏ, మనందరికీ పర్యావరణ, జీవావరణ స్పృహ కల్పిం చిందనడం సర్వసాధారణమే. కానీ అంతకు మించి అది చాలానే చేసింది. మనకు చూపుతున్న అభివృద్ధి నమూనాను... ఆధునికవాద సాంప్రదాయకత మూసల పరి ధిని దాటి పునరాలోచించడానికి అది మనల్నందర్నీ ఆహ్వానించింది. నర్మదా ఉద్యమం ప్రజా కార్యాచరణకు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరించింది. గాంధేయవాదం ఆకర్షణను కోల్పోతూ, వివ్లవ హింస మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా అనిపిస్తున్న సమయంలో... మేధాపాట్కర్, ఆమె సహచరులు కలసి అహింసకు కట్టుబడి ఉంటూనే పోరాటం, ప్రతిఘటన అనే రాడికల్ గాంధేయవాదాన్ని పునరుద్ధరించారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి, వాటిని ఆక్రమించడం మొదలు నీటిలో నిలబడటం వరకు కొత్త పోరాట రూపాలను ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలోని మరే ఉద్యమం కన్నా, ఎక్కువగా ఎన్బీఏ పోరాటమే... పాటలు, వాద్య బృందాలు, సినిమాలు, కథలు వగైరా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. పూర్తి డొల్ల రాజకీయాల యుగంలో, ఎన్బీఏ మనకు లోతైన రాజకీయాలకు అర్థం చెప్పింది. ‘నర్మదా బచావ్’ సాధించిన అసలు విజయం నేను, శ్యామా భారత్ గురించి ఆలోచిస్తున్నాను. గత నెలలో ఎన్బీఏ, మా కిసాన్ ముక్తి యాత్రకు బద్వానీ వద్ద స్వాగతం పలికింది. ఆ సందర్భంగానే నేను మొదటిసారిగా ఆమెను కలుసుకున్నాను, ఆమె మాటలు విన్నాను. మా యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత సభలో శ్యామా మాట్లాడారు. ఆ ప్రాంతపు నిమదీ భాషలో మాట్లాడిన ఆమె ఉపన్యాసాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అయితే, ఆమె, తన మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంటే అందులోని ప్రతి మాటా అర్థం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆ సాధారణ గ్రామీణ జాలరి మహిళ భారత రాజ్యాన్ని సవాలు చేయడానికి సాహసించింది. తనను తన ఇంటిని వదిలి పొమ్మనే హక్కు ఎవరిచ్చారని ముఖ్యమంత్రిని, జిల్లా కలెక్టర్‌ను, ఎస్‌డీఎమ్‌ను నిలదీస్తోంది. ఆమె ధిక్కారం తెలుపుతోంది. మూర్తీభవించిన సాహసమై నిలిచింది. నర్మదా బచావ్ ఆందోళన సాధించిన నిజమైన ప్రయోజనం ఆమే. రాజ్యాంగబద్ధమైన మన ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అర్హతేలేని వారికి ఈ ఉద్యమం గొంతునిచ్చింది. మన ప్రజాస్వామ్యాన్ని అది ప్రజాస్వామ్యీకరించింది. ఎన్బీఏ, తన అంతిమ పోరాటంలో ఓడిపోతున్నట్టుగా కని పించవచ్చు. కానీ అది ఇప్పటికే మనల్నందరినీ గెలుచుకుంది. ఆ ఉద్యమం ఎదుర్కొన్న అపజయాలు మన గతం, విజయాలు మనందరి సమష్టి భవి తకు చెందుతాయి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు, యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter: @_YogendraYadav -
ఓటరు మెచ్చని వ్యతిరేకతావాదం
మోదీ ప్రాబల్యం పెరగడాన్ని మోదీ వ్యతిరేకతతో ఎదుర్కొనలేరు. నరేంద్ర మోదీ కేవలం ఒక వ్యక్తి కాదు... సాధారణ ఓటర్లలో బలమైన, నిర్ణయాత్మకమైన నేత కావాలని ఉన్న కాంక్షకు ప్రతీక. తమ సొంత సంస్కృతి అంటే గౌరవం, భౌతిక సంక్షేమం పట్ల ఆశలూ వారిలో ఉన్నాయి. మోదీ ఆ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ తదితర పార్టీలు సృష్టించిన శూన్యంలోకి ఆయన ప్రవేశించారు. నూతన సూత్రాలు, తాజాశక్తులతో ఈ శూన్యాన్ని నింపడం తప్ప, మోదీని ఎదుర్కొనే దారి మరేదీ లేదు. ఉదారవాద భారతాన్ని నరేంద్ర మోదీ అనే భూతం వెంటాడు తోంది. గత మూడేళ్లుగా మోదీ ప్రతిష్ట, బలం, ప్రభావం ఇనుమ డించాయి. ప్రత్యర్థులు నిరంతరం ఆయనతో పోరాడుతూనే ఉన్నారు, పరాజయాల పాలవుతూనే ఉన్నారు. ఆయనతో తలపడటాన్ని నివా రించడం లేదా తప్పించుకోవడం సైతం వారు చేయలేరు. ప్రతి పోరాటంలోనూ ఆయన మరింత బలవంతునిగా మారుతున్నారు. మోదీ జన సమ్మోహక శక్తులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన డానికి ఇటీవలి శాసనసభ ఎన్నికలే నిదర్శనం. ఆ నడుమ ఈ విష యంలో సందేహాలు కలుగకపోలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోని ఆయన విజయయాత్రకు మొదట ఢిల్లీలోనూ, ఆ తర్వాత బిహార్ లోనూ గండి పడింది. ఆ రెండు ఎదురుదెబ్బలూ కలసి పరిస్థితుల కారణంగానే మోదీ ప్రాబల్యం పెరిగిందనీ, ప్రతిపక్షాల అనైక్యతే దానికి ప్రాతిపదికనీ భ్రమింపచేశాయి. కేరళ నుంచి మణిపూర్ వరకు బీజేపీ చొచ్చుకుపోవడమూ, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పరాజయమూ హఠాత్తుగా ఆ భ్రమను పటాపంచలు చేశాయి. మోదీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటారనే ఆశలు సైతం మటుమా యమయ్యాయి. ఊహించని ఈ పరిణామానికి ప్రతిపక్షం తనకు తెలిసిన ఒకే ఒక్క పద్ధతిలో ప్రతిస్పందించింది. మోదీ వ్యతిరేకతావాదాన్ని ఆశ్ర యించింది. అది పలు రూపాలలో సాగింది. మోదీ తప్పులు చేయడం మొదలై, ఆ తప్పులు పేరుకుపోతుండటంతో ఇక ఆ గాలిబుడగ తనంతట తానుగానే బద్ధలై పోతుందని ప్రతిపక్షాలు కొన్నిసార్లు భావించాయి. ఆయ నను ఆవరించి ఉన్న నైతికతా కవచాన్ని ఊడిపోయేలా చేయాలని ఆయనపై వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు లేదా ఆయనను ఓడించే లక్ష్యంతో మోదీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఒక్కటి చేశారు. వీటిలో ఏదీ పని చేస్తున్నట్టు కనిపిం చడంలేదు. మోదీ వ్యతిరేక రాజకీయాలు ప్రజల కళ్లకు ఉత్త మోదీ వ్యతి రేకతగా మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రతికూలతలుగా మారని తప్పులు అలా అని ఆయన ఏ తప్పులూ చేయలేదని కాదు. అధ్వానంగా రూపొం దించి, అడ్డగోలుగా అమలుచేసిన పెద్ద నోట్ల రద్దు... ప్రధానిగా ఎవరైనాగానీ చేయగలిగిన అతి పెద్ద తప్పు. దీని వలన విశాల ప్రజానీకం లెక్కగట్ట లేనం తటి, నివారించదగిన బాధలను అనుభవించాల్సి వచ్చింది. అయినా, ఘోరమైన ఈ తప్పును తట్టుకుని మరీ మోదీ ప్రజాకర్షణ శక్తి మనగలిగింది. ఈ వైఫల్యాన్ని ఆయన, పేదల మిత్రునిగా తన ప్రతిష్టను పెంపొందించు కోవడానికి వాడుకుని ఉండటం మాత్రమే జరిగి ఉండొచ్చు. అలాగే, పాకిస్తాన్ పట్ల మోదీ విధానం ఒక కొస నుంచి మరొక కొసకు కొట్టుకుపోతూ వచ్చింది, పలు తొందరపాటు చర్యలను చేపట్టడం జరిగింది. ఫలితంగా మన సరిహద్దులు, భద్రతా బలగాలు మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొ నాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రజలు ఆయనను దేశ భద్రతా పరి రక్షకునిగా చూస్తూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోన్ని దుర్భర దైన్య పరిస్థితి వరుసగావచ్చిన కరువులతో మరింత అధ్వానమైంది. అయినా మోదీ ప్రభు త్వం వారి కోసం చేసింది దాదాపుగా ఏమీ లేదు. స్వతంత్ర భారత చరిత్ర లోనే ఆయన అత్యంత రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తు న్నారనేది నిస్సందేహం. కానీ ఆయన పార్టీకి గ్రామీణ ఓటర్లు ఒకదాని తర్వాత ఒకటిగా విజయాలను అందిస్తున్నారు. మోదీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న ‘స్వచ్ఛ భారత్ మిషన్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ఆచరణాత్మక పథకాలు చెప్పుకోదగినంతటి ఫలితాలను సాధించింది లేదు. అయినా ఈ ఉద్యమాలను చేపట్టిన ప్రతిష్టను ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. మోదీ చేసిన తప్పులు సైతం రాజకీయ ప్రతికూలతలుగా మారలేదు. బెడిసికొడుతున్న ప్రతిపక్షాల దాడులు ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకతను కలిగించడంలో సఫలం కాలేదు. అలా అని ఆయ నను లక్ష్యంగా చేసుకుని దాడి చేయదగిన అంశాలేవీ లేవనీ కాదు. రాజకీయ అవినీతిపై ఇంత వరకు ఏ ప్రధానిపైనా లభించనంతటి బలమైన ఆధారా లుగా బిర్లా–సహారా పత్రాలు మోదీకి వ్యతిరేకంగా నిలుస్తాయి. ఒకప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా నడిచిన సుప్రసిద్ధమైన నగ ర్వాలా కేసులో ఎంతో నిగూఢత ఉంది. కానీ నగర్వాలాకు ఇందిరాగాంధీతో సంబంధాలున్నాయనడానికి బహిరంగ ఆధారాలు లభించలేదు. ఇక బోఫోర్స్ కేసులో మధ్యవర్తులకు చెల్లించిన ముడుపులకు పత్ర రూప ఆధా రాలను సంపాదించలేకపోయారు. ఆ దర్యాప్తు రాజీవ్ గాంధీ వద్దకు వచ్చాక అక్కడే నిలిచిపోయింది. ప్రధానికి రాజకీయపరమైన చెల్లింపులు జరిగి నట్టుగా దస్తావేజుల రూపంలో ప్రత్యక్ష అవినీతి ఆధారాలు దొరికిన మొట్ట మొదటి కేసు బిర్లా–సహారా పత్రాలదే. అయినా కోర్టు కదలలేదు, మీడియా ఆ కేసు విషయంలో విముఖత చూపింది. ఇక ప్రజలు ఆ ఆరోపణను పూర్తిగా అంగీకరించలేదు. రఫేల్ ఒప్పందం విషయంలో, అంబానీ సోదరులలో ఒక రికి భారీ మేళ్లను చేకూర్చినట్టు వచ్చిన ఆరోపణల విషయంలోనూ అదే జరి గింది. మోదీ విద్యార్హతలపై వచ్చిన ప్రశ్నలను ఎలా అణగదొక్కారనేది ఇబ్బం దికరమైన పలు ప్రశ్నలు తలెత్తేలా చేసింది. కానీ బహిరంగంగా ఈ ప్రశ్నలను లేవనెత్తడానికి ఇష్టపడేవారు ఎందరో లేరు. మోదీని లక్ష్యంగా చేసుకుని చేసే దాడి ఏదైనా ప్రతిపక్షాలకే బెడిసి కొడుతుంది. కుల కూటముల పాత ఎత్తుగడలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయవు. సమాజ్‌వాదీ పార్టీ యాదవ్–ముస్లిం సమ్మేళనం, బీఎస్పీ దళితుల సమీకరణ కూటములకు వ్యతిరేకంగా ప్రతి కూటములను నిర్మించడంలో అమిత్ షా పరిపూర్ణ ప్రావీణ్యాన్ని సంపాదించారు. 2014లోలాగా బీజేపీ తన సంప్ర దాయక ఎగువ కులాల పునాదితో పాటూ దిగువనున్న ఓబీసీలను, మహా దళితులను సైతం సమీకరించింది. ఆ కుల కూటమికి మోదీ అదనపు ఉత్సా హోత్తేజాలను చేకూర్చారు. మోదీకి వ్యతిరేకంగా కుల కూటమి వ్యూహం ఉత్తరప్రదేశ్‌లో పనిచేయలేదంటే మరెక్కడా పనిచేయకపోవచ్చు. గత్యంతరం లేని స్థితిలో ప్రతిపక్షాలు బృహత్ కూటమి వ్యూహాన్ని చేపట్టాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ప్రధాన వ్యూహం బహుశా ఇదే కావచ్చు. కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బీజేపీ యేతర పార్టీలన్నిటి జాతీయ స్థాయి బృహత్ కూటమిని డిమాండు చేస్తున్నారు. కనీసం లోక్‌సభ ఎన్నికల వరకైనా ఎస్పీ, బీఎస్పీల మధ్య కూటమిని తోసిపుచ్చలేకపోవచ్చు. ఒడిశాలో బీజేపీ ఎదుగుదలకు భయపడి నవీన్ పట్నాయక్ కాంగ్రెస్‌తో చెయ్యి కలపాలని కోరు కోవచ్చు. వామపక్షాలను మినహాయించిన కూటమి కోసం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలపరంగా తుడిచిపెట్టుకు పోకుండా ఉండాలని వామపక్షాలు ఆ కూటమితో కలవడానికి మొగ్గు చూప వచ్చు. ఆర్జేడీ, జేడీయూ కూటమి ఇంతవరకు మనగలిగింది. కాబట్టి బీజేపీ వ్యతిరేక జాతీయ బృహత్ కూటమికి అందిరికీ ఆమోదయో గ్యుడైన నేత నితీష్ కుమార్ కావచ్చు. అలాంటి కూటమికి 2019 ఎన్నికల్లో ఉన్న అవకాశాలపై ఇప్పుడే జోస్యం చెప్పే పని మరీ ఇంత తొందరగా చేయలేం. అయినా 1971లో ఏం జరిగిందో గుర్తుచేసుకోవడం సందర్భోచితమే కావచ్చు. పెరుగు తున్న ఇందిరాగాంధీ జనాకర్షణ శక్తిని ఎదుర్కోవాల్సివచ్చిన మొత్తం ప్రతిపక్షాలు–జనసంఘ్, సోషలిస్టు పార్టీలు, కాంగ్రెస్ (ఓ), బీకేడీలు బృహత్ కూటమిగా ఒక్కటయ్యాయి. ఆ ఎన్నికల్లో ఘన విజయం ఆ కూటమికి గాక, ఇందిరా కాంగ్రెస్‌కు లభించింది. తన ప్రత్యర్థులను మట్టికరిపించడానికి ఆమె ఒకే ఒక్క సరళమైన వాక్యాన్ని ప్రయోగిం చారు ‘‘యే కెహెతేహై ఇందిరా హఠావో, మై కెహెతేహూం గరీబీ హఠావో’’ (వాళ్లు ఇందిరను తొలగించండి అంటున్నారు, నేను పేదరికాన్ని తొలగిం చండి అంటున్నాను). మోదీ ఇప్పటికే అలాంటి జవాబును సంకేతించారు. అలాంటి కూటమి మోదీ పట్ల ప్రజల సానుభూతి మొగ్గేట్టు చేయడం పూర్తిగా సాధ్యం. బాధితుని పాత్రను పోషించడంలో ప్రవీణుడైన మోదీ సైతం ఇంది రాగాంధీలా ఆలాంటి నినాదం ఒక దానితో ముందుకు రావచ్చు. ఫలితాలు అప్పటికంటే అంత భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. జాతీయ బృహత్ కూటమి మోదీకి వరమా? ఈ నేపథ్యంలో ఆర్జేడీ–జే డీయూల బృహత్ కూటమి బిహార్‌లో సఫలం కావడం తప్పుడు సంకేతాన్ని పంపిందనేది స్పష్టమే. బిహార్‌లోని ఒకటి, రెండు స్థానాల్లోని పార్టీలు రెండూ, మూడో స్థాయిలో ఉన్న ఒక పార్టీని ఓడిం చడానికి ఒక్కటయ్యాయి. ఆ పరిస్థితి మరో చోట పునరావృతమయ్యే అవ కాశం లేదు. మోదీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో బీజేపీయేతర పార్టీల న్నిటితో కూడిన అతుకుల బొంత కూటమిని ఏర్పరచినా ఆది భారత ఓట ర్లను ఉత్తేజితులను చేయలేదు. ప్రతిపక్షపార్టీల రాజకీయం ఈ నిరాకరణలో బతకడానికి స్వస్తి పల కాల్సిన సమయమిది. మోదీ ప్రాబల్యం పెరగడాన్ని మోదీ వ్యతిరేకతతో ఎదుర్కొనలేరు. నరేంద్ర మోదీ కేవలం ఒక వ్యక్తి కాదు. తమ సొంత సంస్కృతిపట్ల గౌరవం, భౌతిక సంక్షేమం పట్ల ఆకాంక్షలు గల బలమైన, నిర్ణయాత్మకమైన నేత కావాలన్న సాధారణ ఓటర్ల వాంఛకు ఆయన ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ తదితర పార్టీలు సృష్టించిన శూన్యంలోకి ఆయన ప్రవేశించారు. నూతన సూత్రాలు, తాజా శక్తులతో ఈ శూన్యాన్ని నింపితే తప్ప మోదీని ఎదుర్కొనే మార్గమే లేదు. వ్యవస్థితమైన ప్రతిపక్ష పార్టీ లకు అది చాలా పెద్ద కర్తవ్యమనే అనిపిస్తోంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav -
కరుగుతున్న లౌకికవాద స్వప్నం
మతతత్వ రాజకీయాలు తమ లక్ష్యసాధన పట్ల దృఢ సంకల్పంతో ఉండటం నిజం. కానీ ఆత్మబలం, సంకల్పం లోపించిన సెక్యులర్ రాజకీయాలు అర్ధసత్యాలను ఆశ్రయించే దుస్థితిలో ఉన్నాయి. మతతత్వం దూకుడు మీద ఉండగా, సెక్యులరిజం ఆత్మరక్షణ స్థితిలో ఉంది. మతతత్వం వీ«ధుల్లో బరిగీసి నిలబడుతుంటే, సెక్యులరిజం పుస్తకాల్లో, సెమినార్లలో బందీయై ఉంది. మెజారిటీవాదం నగ్నంగా నాట్యమాడుతుండగా, సెక్యులరిజం అలసి సొలసి కాళ్లూ చేతులూ ఆడిస్తుండటం మన కాలపు విషాదం. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఒక సెక్యులర్ మిత్రుడు నాకు తారసపడ్డాడు. అతని ముఖంపై విషాదం, నిరాశ, విచారం అన్నీ స్పష్టంగా పరచుకొని ఉన్నాయి. కలవడంతోనే ఆయన అన్న మాటలివి: ‘దేశంలో పచ్చి మతతత్వం గెలుపు సాధించింది. ఇలాంటి సమ యంలో మీలాంటి వారు కూడా సెక్యులరిజాన్ని విమర్శిస్తుంటే బాధగా ఉంది.’ నేను ఒకింత ఆశ్చర్యంలో పడిపోయాను: ‘అభిమానం నుంచే విమర్శ పుడుతుంది. మీరేదైనా భావజాలానికి కట్టుబడి ఉన్నట్టయితే, అది ఎదు ర్కొంటున్న సంక్షోభం గురించి నిజాయితీగా ఆలోచించడం మీ బాధ్యతే. సెక్యులరిజం (లౌకికవాదం) ఈ దేశపు పవిత్ర సిద్ధాంతం. సెక్యులరిజం పేరుతో సాగే కుటిల రాజకీయాలను ఎండగట్టడం ఈ సిద్ధాంతంపై నమ్మకం ఉన్న వారు నిర్వర్తించాల్సిన బాధ్యత’ అని నేనన్నాను. దీనికి ఆయన సంతృప్తి చెందలేదు. ‘మీరు విషయాన్ని చుట్టూ తిప్ప కండి. నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్య మంత్రి అయినందుకు మీకేమీ భయం కలుగలేదా?’ అని అడిగాడు. నేను కూడా సూటిగానే జవాబివ్వడానికి ప్రయత్నించాను: ‘భయం కాదు గానీ, బాధ మాత్రం కలిగింది. ఇలాంటి నేత ఒకరు ఇంత ఎత్తులో ఉండే పీఠంపై కూర్చుంటే ఈ దేశం పట్ల గర్వించే నా లాంటి వ్యక్తి సిగ్గు పడకుండా ఉండగలడా? యోగంలో సమ్యక్ దృష్టిని కాంక్షించే నా వంటి వ్యక్తి ఆదిత్యనాథ్‌ను యోగిగా ఎలా భావించగలడు? మతాన్ని కట్టుకునే బట్టల్లో కాకుండా ఆత్మలో శోధించే వ్యక్తి విద్వేషపు వ్యాపారాన్ని మతవిశ్వాసంగా ఎలా భావించగలడు?’ ఆయన ముఖంలో కాస్తంత ఆత్మీయత విరిసింది: ‘మరి స్పష్టంగా చెప్ప డానికి సంకోచం దేనికి? మోదీ, అమిత్ షా, సంఘ్ పరివార్లు దేశాన్ని ముక్కలు చేయడానికి తెగబడ్డారని ఎందుకు అనలేరు?’ సంక్షోభంలో సెక్యులరిజం నేను ఆయనతో ఏకీభవించలేదు: ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దుష్ప్ర చారం, సంఘ్ పరివార్ విద్వేష వ్యాప్తి, బీజేపీ రాజకీయాలు... ఇవే సెక్యుల రిజాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయని సెక్యులరిస్టులు భావిస్తారు. చరిత్రలో పరాజిత శక్తులెప్పుడూ తమ ఓటమికి వైరి వర్గానిదే బాధ్యత అని ఆడిపోసు కుంటాయి. వాస్తవం ఏమిటంటే సెక్యులరిజం స్వయంగా సెక్యులరిజపు ఒంటెత్తు పోకడ ఫలితంగా, సెక్యులరిస్టుల (లౌకికవాదుల) బలహీన, కుటిల రాజకీయాల కారణాల వల్లా సంక్షోభంలో పడిపోయింది.’ ఆయన ముఖంలో అయోమయాన్ని గమనించిన నేను దీన్ని మరి కాస్త వివరంగా చెప్పాను: ‘ఈ సంక్షోభ సమయంలో సెక్యులర్ రాజకీయాలు దారీ తెన్నూ లేకుండా ఉన్నాయి. అవి భయాందోళనల్లో పడిపోయాయి. మత తత్వాన్ని ప్రజాక్షేత్రంలో, వీధుల్లో ప్రతిఘటించడానికి బదులుగా అవి అధి కారానికి అడ్డదారులు వెదుకుతున్నాయి. బీజేపీకి ఎదురయ్యే ప్రతి చిన్నా, పెద్దా ఓటమిలో అవి తమ విజయాన్ని చూసుకుంటున్నాయి. మోదీని వ్యతిరేకించే ప్రతి వ్యక్తినీ తమ హీరోగా మల్చుకునేందుకు తహతహలాడుతు న్నాయి. మతతత్వ రాజకీయాలు తమ దుష్ట లక్ష్యాలను ఈడేర్చుకోవడానికి పట్టుదలతో ఉన్నాయన్నది అక్షర సత్యం. కానీ ఆత్మబలం, సంకల్పం లోపిం చిన సెక్యులర్ రాజకీయాలు అర్ధసత్యాలను ఆశ్రయించే దుస్థితిలో ఉన్నాయి. మతతత్వం ప్రతి నిత్యం కొత్త కొత్త వ్యూహాల్ని చేపడుతోంది. తాను నిలబడి ఉన్న నేలపై అది పోరాడుతోంది. సెక్యులరిజం గిరిగీసి కూర్చొని ఉంది. పరుల నేలపై ఓటమి పాలవ్వడం దానిని పట్టి పీడిస్తున్న శాపం. మతతత్వం ఆక్రమణ స్వభావంతో దూకుడుగా ఉండగా, సెక్యులరిజం ఆత్మరక్షణ స్థితిలో ఉంది. మతతత్వం క్రియాశీలంగా ఉండగా, సెక్యులరిజం కేవలం ప్రతి క్రియకు మాత్రమే పరిమితమై ఉంది. మతతత్వం వీధిలో బరిగీసి నిలబడు తుంటే సెక్యులరిజం పుస్తకాల్లో, సెమినార్లలో బందీయై ఉంది. మతతత్వం ప్రజాభిప్రాయంగా మారిపోతుంటే సెక్యులరిజం చదువుకున్న అభిజాత్య వర్గాల అభిమతంగానే మిగిలిపోతోంది. మన కాలపు విషాదం ఏమిటంటే, ఓ వైపు మెజారిటీవాదం నగ్నంగా నాట్యమాడుతుంటే మరోవైపు సెక్యుల రిజం అలసి సొలసి కాళ్లూ చేతులూ ఆడిస్తోంది.’ ఇప్పుడా మిత్రుడు ‘మహా గొప్పగా చెబుతున్నాడులే’ అన్నట్టుగా నా వైపు చూస్తున్నాడు. ఇంతకూ నేను తన మిత్రుడినా లేదా శత్రువునా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. దాంతో నేను కొంత చరిత్రను కూడా తడమడం మంచిదని భావించాను. చేదు నిజం..ఇది ఓటు బ్యాంకు రాజకీయం ‘స్వాతంత్య్రానికి ముందు సెక్యులర్ ఇండియా అనేది జాతీయోద్యమంలో భాగంగా కొనసాగిన స్వప్నం. అన్ని మతాల్లోనూ సామాజిక సంస్కరణలు రావాల్సిందేనన్న సంకల్పం ఆనాటిది. స్వాతంత్య్రం తర్వాత సెక్యులరిజం క్షేత్రస్థాయి వాస్తవాలతో వేరుపడిపోయింది. రాజ్యాంగంలో రాసుకున్న సూక్తులతోనే దేశంలో సెక్యులరిజం వేళ్లూనుకుంటుందని సెక్యులరిస్టులు భావించారు. వాళ్లు అశోకుడు, అక్బర్, గాంధీల భాషను వదిలేసి విదేశీ నుడి కారాలను ఆలాపించసాగారు. లౌకికవాదానికి ‘ధర్మనిరపేక్షత’ అనే ప్రభుత్వ అనువాదం ఈ అరువు ఆలోచన ఫలితమే. మతానికి సంబంధించిన వివిధ నిర్మాణాలు, వేర్వేరు దృక్పథాల మధ్య తటస్థంగా ఉండాలన్న విధానం కాస్తా మెల్లమెల్లగా మతం పట్ల నిరపేక్షతగా మారిపోయింది. సెక్యులరిజం అంటే అర్థం నాస్తికత్వంగా, సగటు భారతీయుడి విశ్వాసాల పట్ల విముఖతగా మారిపోయింది. సెక్యులరిజపు భావన దేశప్రజల మనస్సుల్లోంచి తొలగి పోతూ వచ్చింది.’ ఆయనిక ఆగలేకపోయారు: ‘అంటే, లౌకికవాదం అంటే ఓటు బ్యాంకు రాజకీయమని మీరు కూడా నమ్ముతారా?’ ‘ఇదొక చేదు నిజం. స్వాతంత్య్రోద్యమంలో సెక్యులరిజం ఒక ప్రమాదకరమైన సిద్ధాంతంగా ఉండేది. స్వాతంత్య్రం తర్వాత అది ఒక సౌలభ్యం గల రాజకీయంగా మారి పోయింది. ఓట్ల రాజకీయాల్లో అది మైనారిటీ మతస్థుల ఓట్లు రాబట్టుకునే నినాదంగా మారిపోయింది. కాంగ్రెస్ అధికార పీఠానికి ప్రమాదం పెరుగు తున్న కొద్దీ అల్పసంఖ్యాకుల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడడం కూడా పెరు గుతూ వచ్చింది. ఇప్పుడు అల్పసంఖ్యాకులను, ప్రత్యేకించి ముస్లింలను ఓటు బ్యాంకులా నిలబెట్టి ఉంచడం కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంలో ఒక అనివా ర్యతగా మారిపోయింది.’ ముల్లాల బుజ్జగింపుతో ముస్లింలకు దూరమై... ‘అంటే మీరిప్పుడు ముస్లింల బుజ్జగింపు కూడా ఒక చేదు నిజమేనని అంటారా?‘ ఆయన చూపు కాస్త వక్రంగా మారింది. ‘కాదు. బుజ్జగింపు ముస్లింల పట్ల కాదు, పిడికెడు మంది ముల్లాల పట్ల జరిగింది. స్వాతంత్య్రం తర్వాత ముస్లిం సముదాయం నిర్లక్ష్యానికీ, వెనుక బాటుతనానికీ, వివక్షకూ గురైంది. దేశ విభజనతో అకస్మాత్తుగా నాయకత్వం లేకుండా పోయిన ఈ సముదాయానికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పిం చాల్సి ఉండింది. కానీ వారి ప్రాథమిక అవసరాలను తీర్చకుండా వాళ్ల ఓట్లను మాత్రం రాబట్టుకునే రాజకీయాలు లౌకికవాదం అనే ముసుగులో చలామణీ అయ్యే క్రమం మొదలైంది. దీని ఫలితం ఏమిటంటే, లౌకికవాద రాజకీ యాలు ముస్లింలను కట్టి ఉంచే రాజకీయాలుగా మారిపోయాయి–ముస్లిం లను భయాందోళనల్లో ఉంచడం, హింస, అల్లర్లతో భయపెట్టడం, వాళ్ల ఓట్లను బుట్టలో వేసుకోవడం. ఫలితంగా ముస్లిం రాజకీయాలు ముస్లింల మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టి, కేవలం భద్రతకు సంబంధించిన సమస్యలు, కొన్ని మత–సాంస్కృతిక చిహ్నాలకు (ఉర్దూ, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, వివాహ చట్టాలు) వంటి సమస్యలకు మాత్రమే పరిమిత మైపోయాయి. మొదట కాంగ్రెస్ ప్రారంభించిన ఈ ఆటను ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, లెఫ్ట్ పార్టీలు సైతం చేప ట్టాయి. భయాందోళనల మూలంగా ముస్లింలు సెక్యులర్ పార్టీలకు బందీ లుగా మారిపోయారు. క్రమంగా ముస్లింలలో వెనుకబాటుతనం పెరుగుతూ పోగా సెక్యులర్ రాజకీయాలు ఎదుగుతూ వచ్చాయి. ముస్లిం సముదాయం పట్ల నిర్లక్ష్యం, వివక్ష కొనసాగుతూ ఉండగా, వాళ్ల ఓట్లను గుత్తకు తీసుకున్న కాంట్రాక్టర్లు మాత్రం లాభపడ్డారు. అసహ్యకరమైన ఈ ఓటు బ్యాంకు రాజ కీయాలే సెక్యులర్ రాజకీయాలుగా చెలామణీ కాసాగాయి. ఆచరణలో సెక్యు లర్ రాజకీయం అంటే అర్థం, అల్ప సంఖ్యాకుల వైపు నిలబడ్డట్టుగా కనిపించ డంగా మారిపోయింది. సెక్యులరిజం మొదట న్యాయమైన ప్రయోజనాల పరిరక్షణతో మొదలైంది. క్రమక్రమంగా న్యాయబద్ధమైనవీ, కానివీ అన్ని రకాల ప్రయోజనాలను సమర్థించడాన్ని సెక్యులరిజం అని పిలవసాగారు. క్రమక్రమంగా సగటు హిందువు కంటికి సెక్యులరిస్టులు మత వ్యతిరేకులు గానో లేక మతభ్రష్టులుగానో కనిపించసాగారు. వాళ్ల దృష్టిలో సెక్యులరిజం ముస్లిం సమర్థింపు లేక అల్పసంఖ్యాకుల బుజ్జగింపు సిద్ధాంతంగానో కనిపిం చసాగింది. మరోవైపు ముస్లింలు సెక్యులర్ రాజకీయాలను తమను ఓటు బ్యాంకుకు కట్టి పడేసే కుట్రగా చూడసాగారు. దీనికి బదులు తామే బాహా టంగా తమ సముదాయానికి సంబంధించిన విడి పార్టీని ఏర్పాటు చేసుకో వడం మెరుగని భావించసాగారు. ఈ విధంగా దేశపు పవిత్ర సిద్ధాంతం దేశంలోనే అతి పెద్ద బూటకత్వంగా మారిపోయింది.’ ‘అంటే మా కళ్లు తెరిపించినందుకు యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఇదే కదా మీరు చెప్పేది?’ అంటూ ఆయన నా జవాబు కోసం కూడా చూడకుండా ముందుకు కదిలాడు. ఇప్పుడతని ముఖంలో నిరాశ అంతగా లేనట్టు అనిపించింది. నడకలో చురుకుదనం కనిపించింది. యోగేంద్ర యాదవ్, వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986, Twitter : @_YogendraYadav -
ఆధిపత్యానికీ ఉన్నాయి హద్దులు
బీజేపీ ఆధిపత్యం విధానపరంగా ప్రభుత్వానికి చాలా వెసులుబాటును కల్పిస్తుంది, నిజమే. పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాన్ని అప్పటికప్పుడు చేసేసిన ప్రభుత్వానికి విధాన నిర్ణయాల విషయంలో పగ్గాలుండవు. అలాగే ఫలితాలను చూపలేకపోవడానికి చెప్పగల సాకులూ ఉండవు. అయినా ఈ ఆధిపత్యం ప్రధానంగా మన ప్రజాస్వామ్యానికి సవాలే అవుతుంది. త్వరలోనే ప్రజాస్వామిక అవకాశాలు వేగంగా కుంచించుకుపోవడం జరగవచ్చు. భారత రిపబ్లిక్ మౌలిక విలువలపైనే దాడి జరిగే నిజ ప్రమాద అవకాశాన్ని మనం ఎదుర్కొంటాం. చేదు వాస్తవాన్ని అంగీకరిద్దాం. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన దిగ్భ్రాంతికరమైన ఫలితాలు జాతీయ రాజకీయాల్లో ఒక నూతన దశకు నాంది పలికాయి. బీజేపీ ఇప్పుడు కేంద్రంలోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ అధికా రంలో ఉన్న పార్టీ మాత్రమే కాదు. జాతీయ రాజకీయాలన్నిటినీ తన చుట్టూనే తిప్పుకునే కేంద్రంగా మారింది. ఒకప్పటి ఇందిరా గాంధీ స్థానం లోకి నేడు నరేంద్ర మోదీ ప్రవేశించారు. ఇది మింగుడు పడని కఠోర వాస్తవం. మోదీ ‘నూతన భారతావని’ దృక్పథాన్ని వ్యతిరేకించే వారికి ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం కూడా. ఈ రచయిత సైతం అదే కోవకు చెందినవాడు. భారతదేశం అన్న భావనకే మోదీ పూర్తి విరుద్ధమైన వారని నా బలమైన అభిప్రాయం. అయితే ఆయన రాజకీయాలను అంగీకరించడం లేదా వ్యతిరేకించడం వేరు, ఆయన నేడు ఏ స్థానంలో నిలిచారనేదాన్ని అంచనా వేయడం వేరు. ఈ విషయంలో మోదీ విమర్శకులు వాస్తవాన్ని గుర్తించ నిరాకరించడమనే తప్పు చేస్తున్నారు. గత రెండేళ్లుగా వారు బీజేపీ పరిపాలన తన బరువుకు తానే కుంగి, కుప్పకూలాలని ఆశిస్తూ వచ్చారు. 2015 ఢిల్లీ ఎన్నికల్లో, 2016 బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొన్న ఘోర పరాజయం వారికి గొప్ప ఊరట అయింది. పెద్దనోట్ల రద్దు ఆయన పాలిటి భస్మాసుర హస్తంగా మారు తుందని వారు జోస్యం చెప్పారు. అది జరగలేదనేది స్పష్టమే. బీజేపీని చిత్తశుద్ధితో వ్యతిరేకించేవారెవరైనా ఈ సత్యాన్ని అంగీకరించాల్సిందే. బీజేపీ ఆధిపత్యం.. మూడు కోణాలు ఆధిపత్యం అంటే ప్రబలశక్తి అని మాత్రమే కాదు, చట్టబద్ధ అధికారం అని కూడా అర్థం. బీజేపీ నేడు ఆదిపత్యవాద శక్తిగా ఉన్నదంటే అందుకు కార ణం... ప్రజామోదం ద్వారా ఆ పార్టీకి మంద బలం వంటి సంఖ్యా బలం గల అధికారం సమకూరినందువల్లనే. ప్రధాని కేవలం జనాదరణగల నేత మాత్రమే కారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలామంది ప్రధానులకు అది ఉండేదే. ఇటీవలి గతంలో అతి కొందరు నేతలు మాత్రమే చేయగలిగిన విధంగా ఆయన దేశ ప్రజల మనసులను గెలుచుకున్నారు. బీజేపీ నేడు ప్రజా బాహుళ్యపు ప్రాపంచిక జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోంది. బీజేపీ ఆధిపత్యంలో మూడు భాగాలున్నాయి. ఒకటి, కేంద్రంలో అతి కొన్ని ప్రభుత్వాలకు మాత్రమే ఉండిన భారీ సంఖ్యాబలం దానికి ఉంది. ఇందులో కొంత, ప్రభుత్వాధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకో వడం వల్ల సంక్రమించినది. కాంగ్రెస్‌కు భిన్నంగా, ప్రభుత్వ సంస్థలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోడానికి పాలనాధికారాన్ని బీజేపీ వాడుకుంటోంది. విద్య నుంచి రక్షణ రంగం వరకు అన్ని మంత్రిత్వ శాఖలలోనూ తమ ఎజెం డాను అమలుచేస్తారని విశ్వసించగలిన వారినే మోదీ ప్రభుత్వం నియమిం చింది. బీజేపీ ప్రభుత్వం ఎంత మాత్రమూ తన పరిధిలోకి రాని నిర్ణయాలను తీసుకోడానికి సైతం తన చట్టబద్ధమైన అధికారాలను విస్తరింపజేసింది. అరు ణాచల్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కూలదోయడం, తాజాగా గోవా, మణి పూర్లలో బీజేపీ ప్రభుత్వాలను ప్రతిష్టించడానికి ప్రయత్నించడం, ప్రతి పక్షాలు బహుశా ఆమోదించే అవకాశం ఉన్న చట్టాలను సైతం రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా నేరుగా చట్టాలను చేసేయడం ఇందుకు ఉదాహరణలు. అధికార పార్టీ వీటన్నిటితోడు హింసను కూడా ప్రయోగిస్తోంది. అత్యవసర పరిస్థితి కాలంలో సంజయ్ గాంధీ బ్రిగేడ్ సృష్టించిన భయోత్పాతాన్ని గుర్తుకు తెచ్చేలా వేధింపులకు పాల్పడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాలయాల క్యాంపస్‌లలో ఏబీవీపీ దాదాగిరి, మానవ హక్కుల కార్యకర్తల వ్యతిరేక హింస ఒక పద్ధతిగానే నేడు మారాయి. బీజేపీ ఆధిపత్యంలోని రెండో భాగం ఆ పార్టీకి ఎన్నికలపరంగా ఉన్న ఆధిపత్యం. అది గతవారం నూతన శిఖరాలకు చేరింది. యూపీ, ఉత్తరాఖం డ్లలో బీజేపీ విజయం కేవలం అద్భుతమైనదేకాదు, సీట్ల పరంగా అపూ ర్వమైనది కూడా. 2014లో అది సాధించిన విజయం కూడా అంత అద్భు తమైనదే. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేని రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయి నాయకత్వంగా చూపడానికి తమకంటూ ఎవరూ లేని రాష్ట్రంలో అంతటి విజ యాన్ని అది పునరావృతం చేయగలిగింది. అదే లెక్కలోకి తీసుకోవాల్సిన కీలకాంశం. గోవాలో బీజేపీ పట్ల, పంజాబ్‌లో దాని మిత్ర పక్షం పట్ల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను మోదీ తుడిచిపెట్టివేయలేకపోయిన మాట నిజమే. అస్సాం ఎన్నికల్లో విజయం, ఒడిశాలో బలాన్ని పెంచుకోవడం జరి గిన తదుపరి వెనువెంటనే ఆ పార్టీ మణిపూర్‌లోకి ప్రబల శక్తిగా రంగప్రవేశం చేసింది. దక్షిణాదిలో అది తన ఉనికిని విస్తరంపజేసుకోగలిగింది. అంతకు ముందు హరియాణా, మహారాష్ట్రలలో విజయాలు సాధించింది. ఇవన్నీ కలసి బీజేపీని దేశవ్యాప్త రాజకీయ శక్తిగా మార్చాయనే వాస్తవాన్ని మనం గుర్తించాల్సిందే. కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది, వేగంగా దాని బలం కుచించుకుపోతోంది. గత పదేళ్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల స్థానాలు తారుమారయ్యాయి. నోట్ల రద్దును నల్లధనంపై పోరుగా నమ్మించారు ఇక మూడవ భాగానికి వస్తే, ఈ ప్రభుత్వ నైతికతకు, భావజాలానికి ప్రజా మోదం ఉన్నది. కొత్త ప్రభుత్వాలకు సాధారణంగా దొరికే ‘హనీమూన్’ రోజుల సుఖప్రదమైన కాలాన్ని దాటి ప్రధాని తన జనాదరణను విస్తరిం పజేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రహసనాన్ని తట్టుకుని నిలచి ఆయన తన శక్తిసామర్థ్యాలను చూపారు. ఇది, తప్పులను విస్మరించి సాధారణ ప్రజలు ఆయన పై నమ్మకం ఉంచేలా చేశాయి. బిర్లా–సహారా కేసులో వెలుగులోకి వచ్చిన సంచలనాత్మక విషయాలు ఇప్పటికింకా ఆయన ప్రతిష్టకు మచ్చను కలిగించలేకపోయాయనేది కూడా స్పష్టమే. జాతీయ ప్రయోజనాల కోసమే నిలిచానని, రాజకీయ పార్టీల పక్షపాతపూరితమైన పోరాటాలకు అతీతుడనని ప్రజలను ఆయన నమ్మింపజేయగలిగారు. పెద్ద నోట్ల రద్దు. బడా నల్లధన కుబేరులపైకి ఎక్కుపెట్టిన చర్య అనే తన కథనాన్ని ప్రజలు నమ్మేలా చేయ గలిగారు. అన్నిటికీ మించి బీజేపీ రేకెత్తించిన జాతీయవాద చర్చలో ప్రజా భిప్రాయాన్ని గెలుచుకోవడానికి సాగిన పోరాటంలో అదే విజయాన్ని సాధించింది. భారత స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధమూ లేని పార్టీయే నేడు జాతీయవాదంపై సాధారణ పౌరుల ప్రాపంచిక జ్ఞానాన్ని మలుస్తోంది. పగ్గాలేసే పరిమితులూ ఉన్నాయి బీజేపీ ఆధిపత్యానికి ఉన్న సామంజస్యానికి మూడు ప్రధాన పరిమితులు సైతం ఉన్నాయి. ఆ పార్టీ సామంజస్యపు పరిధిలోకి మొత్తం దేశమంతా రాదు. మైనారిటీలను అది బలంగానే దూరంగా నెట్టేస్తోంది. అలాఅని మైనా రిటీలు మోదీ పట్ల ఉత్సాహపూరితంగా స్పందించడం లేదని కాదు. కానీ నిజానికి మోదీ, తాను మైనారిటీలను, ప్రత్యేకించి ముస్లింలను, క్రైస్తవులను దూరంగా ఉంచుతున్న విషయాన్ని స్పష్టం చేశారు కూడా. ముస్లింలను తాను లెక్క చేసేది లేదని చూపడం ద్వారానే ఆయన అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులలో సామంజస్యాన్ని సంపాదించారు. ఈ జనామోదం అంతా దానికదే స్వచ్ఛందంగా లభించినదేం కాదు. ప్రజామోదాన్ని అనుకూలంగా మలుచుకోవడం కోసం చేపట్టిన ప్రచారం, మోదీకి అనుకూలమైన అభి ప్రాయాన్ని కలిగించే ఎత్తుగడలను ఉద్దేశపూర్వకంగా అనుసరించడం, మీడి యాను తమకు అనుకూలంగా మలుచుకోవడం పెద్ద ఎత్తున చేశారు. ఇవన్నీ ప్రధాని పట్ల జనామోదాన్ని సృష్టించడానికి తోడ్పడ్డాయి. అత్యవసర పరిస్థితి తదుపరి కాలంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం నుంచీ ఎదుర్కోనంతటి ఒత్తిడికి నేడు మీడియా గురవుతోంది. ఇలాంటి ఆధిపత్యం స్వాభావికంగానే అత్యంత దుర్బలమైనది. ఇప్పటికైతే అది అబ్బురపరచేదిగానే ఉంటుందిగానీ, ఒక్క సారి కదలబారిందంటే పేకమేడలా కుప్ప కూలిపోవచ్చు. ఇక చివరగా, ఈ జనాదరణకు భౌతిక పునాది అంతగా లేదు. ఆర్థిక వృద్ధి సన్నగిల్లింది. గ్రామీణ పరిస్థితులు దైన్యంగా దిగజారిపోవడం అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. అలాగే నిరుద్యోగమూ ప్రబలిపోతూనే ఉంది. ప్రభుత్వం భారీ ఎత్తున అట్టహాసంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ లేదా ప్రధాని ఫసల్ బీమా యోజన వంటి ప్రభుత్వ పథకాల వల్ల కలుగుతాయన్న ప్రయోజనాలేవీ ప్రజలకు అందలేదు. ప్రజాస్వామ్యానికి పెను సవాలే ఇంతకూ మన ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ ఆధిపత్యం ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది? విధానపరంగా ఇది ప్రభుత్వానికి చాలా వెసులు బాటును కల్పిస్తుందనేది నిజమే. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాన్ని అప్పటి కప్పుడు చేసేసిన ప్రభుత్వానికి విధాన నిర్ణయాల విషయంలో పగ్గాలుండవు. అయితే అది, ఫలితాలను చూపడంలోని వైఫల్యాలకు కారణాలుగా ప్రభు త్వం చూపగలిగిన సాకులన్నిటినీ లేకుండా చేసేస్తుంది. కానీ ఈ ఆధిపత్యం ప్రధానంగా మన ప్రజాస్వామ్యానికి సవాలే అవుతుంది. ప్రజాస్వామిక అవ కాశాలు వేగంగా కుంచించుకుపోవడం త్వరలోనే సంభవం కావచ్చు. బీజేపీ ప్రభుత్వానికి ఉన్న తలబిరుసుతనమనే రుగ్మతను ఈ ఆధిపత్యం మరింతగా పెంచగలుగుతుంది. భారత రిపబ్లిక్ మౌలిక విలువలపైనే దాడి జరిగే నిజ ప్రమాద అవకాశాన్ని మనం ఎదుర్కొంటాం. అయితే మరి ఈ ఆధిపత్యాన్ని మనం ఎలా ప్రతిఘటించగలం? దీన్ని ఎదుర్కొనడానికి ఏదో యథాలాపంగా తెలిపే వ్యతిరేకత సరిపోదు. అది గుర్తుచేయడం కోసమే బీజేపీ ఆధిపత్యం గురించి ఇంతగా చర్చించినది. వెంటనే రంగంలోకి దిగి, వీధి పోరాటాలకు తలపడటం వల్ల ఉపయోగం లేకపోవచ్చు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఓ బృహత్తర కూటమిని నిర్మించడం బహుశా ప్రతి కూలంగానే పరిణమించవచ్చు. ఈ ప్రభుత్వాన్ని, దాని భావ జాలపరమైన, నైతికపరమైన సామంజస్యం విషయంలోనే సవాలు చేయడం అవసరం. అందుకు కావాల్సిన సాంస్కృతిక ఉపకరణాలను అభివృద్ధి చేయ డంతోనే ఈ ప్రతిఘటనను ప్రారంభించాలి. నేడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన రాజకీయ సవాలు ఇదే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986, Twitter : @_YogendraYadav -
ఈ నెల 20లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం:ఆప్
ఢిల్లీ: ఈ నెల 20 లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఈ నెల15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. మార్చిలో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. హర్యానాలోని 10 లోక్‌సభ, 90 శాసనసభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని యోగేంద్ర యాదవ్ చెప్పారు.