కరుగుతున్న లౌకికవాద స్వప్నం | YogendraYadav article on secular politics | Sakshi
Sakshi News home page

కరుగుతున్న లౌకికవాద స్వప్నం

Published Fri, Mar 24 2017 12:59 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

కరుగుతున్న లౌకికవాద స్వప్నం - Sakshi

కరుగుతున్న లౌకికవాద స్వప్నం

మతతత్వ రాజకీయాలు తమ లక్ష్యసాధన పట్ల దృఢ సంకల్పంతో ఉండటం నిజం. కానీ ఆత్మబలం, సంకల్పం లోపించిన సెక్యులర్‌ రాజకీయాలు అర్ధసత్యాలను ఆశ్రయించే దుస్థితిలో ఉన్నాయి. మతతత్వం దూకుడు మీద ఉండగా, సెక్యులరిజం ఆత్మరక్షణ స్థితిలో ఉంది. మతతత్వం వీ«ధుల్లో బరిగీసి నిలబడుతుంటే, సెక్యులరిజం పుస్తకాల్లో, సెమినార్లలో బందీయై ఉంది.  మెజారిటీవాదం నగ్నంగా నాట్యమాడుతుండగా, సెక్యులరిజం అలసి సొలసి కాళ్లూ చేతులూ ఆడిస్తుండటం మన కాలపు విషాదం.

యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఒక సెక్యులర్‌ మిత్రుడు నాకు తారసపడ్డాడు. అతని ముఖంపై విషాదం, నిరాశ, విచారం అన్నీ స్పష్టంగా పరచుకొని ఉన్నాయి. కలవడంతోనే ఆయన అన్న మాటలివి: ‘దేశంలో పచ్చి మతతత్వం గెలుపు సాధించింది. ఇలాంటి సమ యంలో మీలాంటి వారు కూడా సెక్యులరిజాన్ని విమర్శిస్తుంటే బాధగా ఉంది.’  నేను ఒకింత ఆశ్చర్యంలో పడిపోయాను: ‘అభిమానం నుంచే విమర్శ పుడుతుంది. మీరేదైనా భావజాలానికి కట్టుబడి ఉన్నట్టయితే, అది ఎదు ర్కొంటున్న సంక్షోభం గురించి నిజాయితీగా ఆలోచించడం మీ బాధ్యతే. సెక్యులరిజం (లౌకికవాదం) ఈ దేశపు పవిత్ర సిద్ధాంతం. సెక్యులరిజం పేరుతో సాగే కుటిల రాజకీయాలను ఎండగట్టడం ఈ సిద్ధాంతంపై నమ్మకం ఉన్న వారు నిర్వర్తించాల్సిన బాధ్యత’ అని నేనన్నాను. దీనికి ఆయన సంతృప్తి చెందలేదు.

‘మీరు విషయాన్ని చుట్టూ తిప్ప కండి. నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి. యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్య మంత్రి అయినందుకు మీకేమీ భయం కలుగలేదా?’ అని అడిగాడు. నేను కూడా సూటిగానే జవాబివ్వడానికి ప్రయత్నించాను: ‘భయం కాదు గానీ, బాధ మాత్రం కలిగింది. ఇలాంటి నేత ఒకరు ఇంత ఎత్తులో ఉండే పీఠంపై కూర్చుంటే ఈ దేశం పట్ల గర్వించే నా లాంటి వ్యక్తి సిగ్గు పడకుండా ఉండగలడా? యోగంలో సమ్యక్‌ దృష్టిని కాంక్షించే నా వంటి వ్యక్తి ఆదిత్యనాథ్‌ను యోగిగా ఎలా భావించగలడు? మతాన్ని కట్టుకునే బట్టల్లో కాకుండా ఆత్మలో శోధించే వ్యక్తి విద్వేషపు వ్యాపారాన్ని మతవిశ్వాసంగా ఎలా భావించగలడు?’  ఆయన ముఖంలో కాస్తంత ఆత్మీయత విరిసింది: ‘మరి స్పష్టంగా చెప్ప డానికి సంకోచం దేనికి? మోదీ, అమిత్‌ షా, సంఘ్‌ పరివార్‌లు దేశాన్ని ముక్కలు చేయడానికి తెగబడ్డారని ఎందుకు అనలేరు?’

సంక్షోభంలో సెక్యులరిజం
నేను ఆయనతో ఏకీభవించలేదు: ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ దుష్ప్ర చారం, సంఘ్‌ పరివార్‌ విద్వేష వ్యాప్తి, బీజేపీ రాజకీయాలు... ఇవే సెక్యుల రిజాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయని సెక్యులరిస్టులు భావిస్తారు. చరిత్రలో పరాజిత శక్తులెప్పుడూ తమ ఓటమికి వైరి వర్గానిదే బాధ్యత అని ఆడిపోసు కుంటాయి. వాస్తవం ఏమిటంటే సెక్యులరిజం స్వయంగా సెక్యులరిజపు ఒంటెత్తు పోకడ ఫలితంగా, సెక్యులరిస్టుల (లౌకికవాదుల) బలహీన, కుటిల రాజకీయాల కారణాల వల్లా సంక్షోభంలో పడిపోయింది.’  ఆయన ముఖంలో అయోమయాన్ని గమనించిన నేను దీన్ని మరి కాస్త వివరంగా చెప్పాను: ‘ఈ సంక్షోభ సమయంలో సెక్యులర్‌ రాజకీయాలు దారీ తెన్నూ లేకుండా ఉన్నాయి. అవి భయాందోళనల్లో పడిపోయాయి.

మత తత్వాన్ని ప్రజాక్షేత్రంలో, వీధుల్లో ప్రతిఘటించడానికి బదులుగా అవి అధి కారానికి అడ్డదారులు వెదుకుతున్నాయి. బీజేపీకి ఎదురయ్యే ప్రతి చిన్నా, పెద్దా ఓటమిలో అవి తమ విజయాన్ని చూసుకుంటున్నాయి. మోదీని వ్యతిరేకించే ప్రతి వ్యక్తినీ తమ హీరోగా మల్చుకునేందుకు తహతహలాడుతు న్నాయి. మతతత్వ రాజకీయాలు తమ దుష్ట లక్ష్యాలను ఈడేర్చుకోవడానికి పట్టుదలతో ఉన్నాయన్నది అక్షర సత్యం. కానీ ఆత్మబలం, సంకల్పం లోపిం చిన సెక్యులర్‌ రాజకీయాలు అర్ధసత్యాలను ఆశ్రయించే దుస్థితిలో ఉన్నాయి.  మతతత్వం ప్రతి నిత్యం కొత్త కొత్త వ్యూహాల్ని చేపడుతోంది. తాను నిలబడి ఉన్న నేలపై అది పోరాడుతోంది. సెక్యులరిజం గిరిగీసి కూర్చొని ఉంది. పరుల నేలపై ఓటమి పాలవ్వడం దానిని పట్టి పీడిస్తున్న శాపం. మతతత్వం ఆక్రమణ స్వభావంతో దూకుడుగా ఉండగా, సెక్యులరిజం ఆత్మరక్షణ స్థితిలో ఉంది.

మతతత్వం క్రియాశీలంగా ఉండగా, సెక్యులరిజం కేవలం ప్రతి క్రియకు మాత్రమే పరిమితమై ఉంది. మతతత్వం వీధిలో బరిగీసి నిలబడు తుంటే సెక్యులరిజం పుస్తకాల్లో, సెమినార్లలో బందీయై ఉంది. మతతత్వం ప్రజాభిప్రాయంగా మారిపోతుంటే సెక్యులరిజం చదువుకున్న అభిజాత్య వర్గాల అభిమతంగానే మిగిలిపోతోంది. మన కాలపు విషాదం ఏమిటంటే, ఓ వైపు మెజారిటీవాదం నగ్నంగా నాట్యమాడుతుంటే మరోవైపు సెక్యుల రిజం అలసి సొలసి కాళ్లూ చేతులూ ఆడిస్తోంది.’ ఇప్పుడా మిత్రుడు ‘మహా గొప్పగా చెబుతున్నాడులే’ అన్నట్టుగా నా వైపు చూస్తున్నాడు. ఇంతకూ నేను తన మిత్రుడినా లేదా శత్రువునా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. దాంతో నేను కొంత చరిత్రను కూడా తడమడం మంచిదని భావించాను.

చేదు నిజం..ఇది ఓటు బ్యాంకు రాజకీయం
‘స్వాతంత్య్రానికి ముందు సెక్యులర్‌ ఇండియా అనేది జాతీయోద్యమంలో భాగంగా కొనసాగిన స్వప్నం. అన్ని మతాల్లోనూ సామాజిక సంస్కరణలు రావాల్సిందేనన్న సంకల్పం ఆనాటిది. స్వాతంత్య్రం తర్వాత సెక్యులరిజం క్షేత్రస్థాయి వాస్తవాలతో వేరుపడిపోయింది. రాజ్యాంగంలో రాసుకున్న సూక్తులతోనే దేశంలో సెక్యులరిజం వేళ్లూనుకుంటుందని సెక్యులరిస్టులు భావించారు. వాళ్లు అశోకుడు, అక్బర్, గాంధీల భాషను వదిలేసి విదేశీ నుడి కారాలను ఆలాపించసాగారు. లౌకికవాదానికి ‘ధర్మనిరపేక్షత’ అనే ప్రభుత్వ అనువాదం ఈ అరువు ఆలోచన ఫలితమే. మతానికి సంబంధించిన వివిధ నిర్మాణాలు, వేర్వేరు దృక్పథాల మధ్య తటస్థంగా ఉండాలన్న విధానం కాస్తా మెల్లమెల్లగా మతం పట్ల నిరపేక్షతగా మారిపోయింది. సెక్యులరిజం అంటే అర్థం నాస్తికత్వంగా, సగటు భారతీయుడి విశ్వాసాల పట్ల విముఖతగా మారిపోయింది. సెక్యులరిజపు భావన దేశప్రజల మనస్సుల్లోంచి తొలగి పోతూ వచ్చింది.’

ఆయనిక ఆగలేకపోయారు: ‘అంటే, లౌకికవాదం అంటే ఓటు బ్యాంకు రాజకీయమని మీరు కూడా నమ్ముతారా?’ ‘ఇదొక చేదు నిజం. స్వాతంత్య్రోద్యమంలో సెక్యులరిజం ఒక ప్రమాదకరమైన సిద్ధాంతంగా ఉండేది. స్వాతంత్య్రం తర్వాత అది ఒక సౌలభ్యం గల రాజకీయంగా మారి పోయింది. ఓట్ల రాజకీయాల్లో అది మైనారిటీ మతస్థుల ఓట్లు రాబట్టుకునే నినాదంగా మారిపోయింది. కాంగ్రెస్‌ అధికార పీఠానికి ప్రమాదం పెరుగు తున్న కొద్దీ అల్పసంఖ్యాకుల ఓట్లపై కాంగ్రెస్‌ ఆధారపడడం కూడా పెరు గుతూ వచ్చింది. ఇప్పుడు అల్పసంఖ్యాకులను, ప్రత్యేకించి ముస్లింలను ఓటు బ్యాంకులా నిలబెట్టి ఉంచడం కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహంలో ఒక అనివా ర్యతగా మారిపోయింది.’

ముల్లాల బుజ్జగింపుతో ముస్లింలకు దూరమై...
‘అంటే మీరిప్పుడు ముస్లింల బుజ్జగింపు కూడా ఒక చేదు నిజమేనని అంటారా?‘ ఆయన చూపు కాస్త వక్రంగా మారింది. ‘కాదు. బుజ్జగింపు ముస్లింల పట్ల కాదు, పిడికెడు మంది ముల్లాల పట్ల జరిగింది. స్వాతంత్య్రం తర్వాత ముస్లిం సముదాయం నిర్లక్ష్యానికీ, వెనుక బాటుతనానికీ, వివక్షకూ గురైంది. దేశ విభజనతో అకస్మాత్తుగా నాయకత్వం లేకుండా పోయిన ఈ సముదాయానికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పిం చాల్సి ఉండింది. కానీ వారి ప్రాథమిక అవసరాలను తీర్చకుండా వాళ్ల ఓట్లను మాత్రం రాబట్టుకునే రాజకీయాలు లౌకికవాదం అనే ముసుగులో చలామణీ అయ్యే క్రమం మొదలైంది. దీని ఫలితం ఏమిటంటే, లౌకికవాద రాజకీ యాలు ముస్లింలను కట్టి ఉంచే రాజకీయాలుగా మారిపోయాయి–ముస్లిం లను భయాందోళనల్లో ఉంచడం, హింస, అల్లర్లతో భయపెట్టడం, వాళ్ల ఓట్లను బుట్టలో వేసుకోవడం. ఫలితంగా ముస్లిం రాజకీయాలు ముస్లింల మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టి, కేవలం భద్రతకు సంబంధించిన సమస్యలు, కొన్ని మత–సాంస్కృతిక చిహ్నాలకు (ఉర్దూ, అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, వివాహ చట్టాలు) వంటి సమస్యలకు మాత్రమే పరిమిత మైపోయాయి.

మొదట కాంగ్రెస్‌ ప్రారంభించిన ఈ ఆటను ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్‌ యునైటెడ్, లెఫ్ట్‌ పార్టీలు సైతం చేప ట్టాయి. భయాందోళనల మూలంగా ముస్లింలు సెక్యులర్‌ పార్టీలకు బందీ లుగా మారిపోయారు. క్రమంగా ముస్లింలలో వెనుకబాటుతనం పెరుగుతూ పోగా సెక్యులర్‌ రాజకీయాలు ఎదుగుతూ వచ్చాయి. ముస్లిం సముదాయం పట్ల నిర్లక్ష్యం, వివక్ష కొనసాగుతూ ఉండగా, వాళ్ల ఓట్లను గుత్తకు తీసుకున్న కాంట్రాక్టర్లు మాత్రం లాభపడ్డారు. అసహ్యకరమైన ఈ ఓటు బ్యాంకు రాజ కీయాలే సెక్యులర్‌ రాజకీయాలుగా చెలామణీ కాసాగాయి. ఆచరణలో సెక్యు లర్‌ రాజకీయం అంటే అర్థం, అల్ప సంఖ్యాకుల వైపు నిలబడ్డట్టుగా కనిపించ డంగా మారిపోయింది. సెక్యులరిజం మొదట న్యాయమైన ప్రయోజనాల పరిరక్షణతో మొదలైంది. క్రమక్రమంగా న్యాయబద్ధమైనవీ, కానివీ అన్ని రకాల ప్రయోజనాలను సమర్థించడాన్ని సెక్యులరిజం అని పిలవసాగారు. క్రమక్రమంగా సగటు హిందువు కంటికి సెక్యులరిస్టులు మత వ్యతిరేకులు గానో లేక మతభ్రష్టులుగానో కనిపించసాగారు.

వాళ్ల దృష్టిలో సెక్యులరిజం ముస్లిం సమర్థింపు లేక అల్పసంఖ్యాకుల బుజ్జగింపు సిద్ధాంతంగానో కనిపిం చసాగింది. మరోవైపు ముస్లింలు సెక్యులర్‌ రాజకీయాలను తమను ఓటు బ్యాంకుకు కట్టి పడేసే కుట్రగా చూడసాగారు. దీనికి బదులు తామే బాహా టంగా తమ సముదాయానికి సంబంధించిన విడి పార్టీని ఏర్పాటు చేసుకో వడం మెరుగని భావించసాగారు. ఈ విధంగా దేశపు పవిత్ర సిద్ధాంతం దేశంలోనే అతి పెద్ద బూటకత్వంగా మారిపోయింది.’
‘అంటే మా కళ్లు తెరిపించినందుకు యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఇదే కదా మీరు చెప్పేది?’ అంటూ ఆయన నా జవాబు కోసం కూడా చూడకుండా ముందుకు కదిలాడు. ఇప్పుడతని ముఖంలో నిరాశ అంతగా లేనట్టు అనిపించింది. నడకలో చురుకుదనం కనిపించింది.


యోగేంద్ర యాదవ్‌,
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986, Twitter : @_YogendraYadav

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement