గత అయిదేళ్లలో బీజేపీ అస్సాం వలస సమస్యను మతతత్వ సమస్యగా మార్చడంలో విజయవంతం కావడమే కాకుండా, భాషాపరమైన, జాతిపరమైన సమస్యకు మతం రంగు పులిమింది. అస్సాంలో బీజేపీ రాజకీయాలు ప్రధానంగా బెంగాలీ హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డాయి. కాబట్టి ఈ పార్టీకి రెండంచెల అజెండా ఉంది. బెంగాలీ హిందువులకు పౌరసత్వ స్థాయిని కల్పించడం, బెంగాలీ ముస్లింలకు ఆ స్థాయిని నిరాకరించడం. ఈ విభజనే అస్సాంను ప్రమాదకరమైన విస్ఫోటక స్థాయికి చేరుస్తోంది.
అస్సాం నేడు ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. రాష్ట్రంలో అనిశ్చితమైన జాతుల సమ్మేళనం విస్ఫోటించడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ సంక్షోభంలో అవకాశం కోసం రాజకీయపార్టీలు వేచి చూస్తున్నాయి. ఇక మిగిలిన దేశం మొత్తంగా, ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది అనే విషయమై పట్టించుకోకుండా ఉంటోంది.
అస్సాంలో సాగుతున్న జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సీ) సన్నాహక చర్యలు పాత గాయాన్ని రేపాయి. దశాబ్దాలుగా అస్సాం రాజకీయాల్లో ‘వలస’ సమస్య ఆధిపత్యం చలాయిస్తోంది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా రాష్ట్రం భారీస్థాయిలో ‘బయటి వ్యక్తుల’ చొరబాటుకు సాక్షీభూతమై నిలిచింది. దేశం లోపలి నుంచి హిందీ భాష మాట్లాడేవారు, జార్ఖండ్ నుంచి గిరిజనులు, పశ్చిమ బెంగాల్ నుంచి బెంగాలీ హిందువులతో పాటు నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు కూడా ఈ వలసల్లో ఉన్నారు. జనాభాలో గణనీయ నిష్పత్తిలో–ఎంతమంది అనేది పూర్తి వివాదాస్పద ప్రశ్నగా ఉంటోంది–బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చిన హిందూ, ముస్లిం వలస ప్రజలున్నారు. వీరు మతపరమైన పీడనవల్లో లేక జీవిక కోసమో భారత్‌కు వలస వచ్చేశారు. విభజన సమయంలో బంగ్లాదేశ్‌లో (నాటి తూర్పు పాకిస్తాన్), 24 శాతం మంది హిందువులు ఉండేవారని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ వీరి జనాభా 9 శాతానికి పడిపోయింది. ఇంత జనాభా ఎక్కడికి వెళ్లివుంటుందో అంచనా వేస్తే బహుమతులు రావు మరి.
జాతుల సమతుల్యతను చెరిపేసిన వలసలు
భారీస్థాయి వలసలు అస్సాంకి కొత్త కాదు. రాష్ట్ర చరిత్ర మొత్తంగా వలసల వెల్లువల చరిత్రే. అయితే స్వాతంత్య్రానంతరం సాగిన భారీ వలస రాష్ట్రం లోని జాతుల సమతుల్యతను చెరిపివేసింది. 2011 నాటి భారత జనాభా గణనకు చెందిన భాషాపరమైన సంఖ్యను ప్రభుత్వం ఇంకా విడుదల చేయనప్పటికీ, 2001 జనాభా లెక్కలు పరిశీలిస్తే సొంత రాష్ట్రంలోనే అస్సామీ భాష మాట్లాడే ప్రజలు మైనారిటీగా మారిపోయారని స్పష్టమవుతుంది. 1991 నుంచి 2001 మధ్య కాలంలో అస్సామీ భాషను మాట్లాడే జనాభా 58% నుంచి 48 శాతానికి పడిపోయింది. కాగా, బెంగాలీ మాట్లాడే జనాభా మాత్రం 21 నుంచి 28%కి పెరిగింది. ఈ ధోరణిని గమనిస్తే, అస్సామీ భాషని మాట్లాడే జనాభా ప్రస్తుతం 40 శాతం వరకు ఉండగా, బెంగాలీ మాట్లాడే వారు రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతుగా ఉన్నారు. మతపర కమ్యూనిటీలుగా చూస్తే అస్సాంలో ముస్లిం జనాభా 1951లో 25 శాతం నుంచి 2011 నాటికి 34 శాతానికి పెరిగింది.
జనాభా పొందికలో ఈ భాషాపరమైన, మతపరమైన మార్పులు చాలా ఎక్కువగా బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండే జిల్లాల్లోనే చోటుచేసుకున్నాయి. అస్సాం ముస్లిం ఆధిక్యతా రాష్ట్రంగా మారేందుకు తక్కువ అవకాశమే ఉన్నప్పటికీ అహోమియా, బోడోలు, ఇతర గిరిజన కమ్యూనిటీలు వంటి భూమిపుత్రుల ఆందోళనలను మాత్రం తోసిపుచ్చలేం. ఏదో ఒక సమయంలో రాష్ట్రంలో జాతుల సంఘర్షణ, హింస పెరిగే అవకాశం పొంచుకుని ఉంది.
నేడు, ఈ భూకంపం మరొకసారి పేలడానికి సిద్ధంగా ఉంది. 1971 మార్చి 25 తర్వాత అస్సాంలో ప్రవేశించిన వలస ప్రజలందరినీ గుర్తించి, రాష్ట్రం నుంచి పంపించివేయాలన్నది 1985లో కుదిరిన అస్సాం ఒడంబడికలోని ప్రధాన షరతుల్లో ఒకటి. అస్సాం గణ పరిషత్ రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇది సాధ్యం కాలేదు. 2005లో ఆందోళనకు దిగిన విద్యార్థులతో కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా పై వాగ్దానాన్నే మళ్లీ పొందుపర్చడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లగా, 1951లో రూపొందించిన జాతీయ పౌరుల నమోదు –ఎన్‌ఆర్‌సి–ని తాజాగా మెరుగుపర్చి అసలైన పౌరులను గుర్తించవలసిందిగా కోర్టు ఆదేశించింది. ఈ పని గత మూడేళ్లుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. 2017 డిసెంబర్ 31కి ఇది పూర్తి కావలసి ఉంది. పొడిగింపుకోసం రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ, గడువు తేదీలోపల తొలి ముసాయిదా జాబితానైనా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
తొలి ముసాయిదాతో భయాందోళనలు
అలా విడుదలైన తొలి ముసాయిదా జాబితా గందరగోళానికి, భయాందోళనలకు దారితీసింది. జాతీయ పౌరుల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న 3.29 కోట్లమందిలో 1.9 కోట్లమంది పేర్లు ఈ తొలి ముసాయిదాలో ఉన్నాయి. ఇది తొలి జాబితాయే కావచ్చు. పైగా ఇది ముసాయిదా మాత్రమే. కానీ అంచనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారిలో జాబితానుంచి గల్లంతైన వారు ఎవరు అనేది తేల్చడంలో ఇది సహాయపడదు. జాబితాలో లేని వారిని మూడు కేటగిరీలుగా చేయవచ్చు: మూలవాసుల నుంచి పత్రాలు పూర్తి చేయని వారికి చెందిన సాధారణ ఉదంతాలు. సందేహాస్పదమైన కేసులు, పంచాయతీ జారీచేసిన సమర్పిత పత్రాలకు చెందిన ప్రత్యేక కేటగిరీ. ప్రస్తుత వివాదం ఈ మూడో కేటగిరీకి చెంది నదే. ఈ ధ్రువపత్రాలను హైకోర్టు తిరస్కరించగా, రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చింది కూడా. ఈ కేటగిరీలో 27 లక్షల మంది ముస్లిం మహిళలు ఉన్నారు. వీరి వివాçహాలను నమోదు చేయనందున వీరికి కాగితపు రూపంలో ఎలాంటి రుజువూ లేదు. పైగా వీరికి ఎలాంటి విద్యాపరమైన డిగ్రీలు కూడా లేవు. వీరి పౌరసత్వ హక్కులు రద్దు కావచ్చు.
ఇక్కడే రాజకీయ నాయకత్వం లెక్కలేసుకుంటోంది. విషాదమేమంటే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల లెక్కపక్కాలపైనే దృష్టి సారిస్తున్నాయి. సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినందుకు అపరాధభావంతో ఉంది. విదేశీ వలసప్రజలకు ఈ పార్టీ ఉచితప్రవేశం కల్పించి తర్వాత వారిని తన ఓటుబ్యాంకుగా మల్చుకుంది. దురదృష్టవశాత్తూ ఉదారవాద, ప్రగతిశీల మేధావుల్లో ప్రధానభాగం ఈ పరిస్థితి తీవ్రతను నిర్లక్ష్యం చేశారు. ఇక వామపక్షాలు బెంగాలీ వలసప్రజల పట్ల మౌనం పాటించడమే కాకుండా ఈ సమస్యను లేవనెత్తిన వారిని బహిరంగంగానే ఖండించాయి.
1977 నుంచి 1985 వరకు కొనసాగిన అస్సాం ఉద్యమం ద్వారా విద్యార్థి, యువజనులు భూమిపుత్రులకు సంబంధించిన చట్టబద్ధమైన ఆందోళనను వ్యక్తపర్చారు. ఈ విదేశీ వ్యతిరేక ఉద్యమానికి బెంగాలీ వ్యతిరేకత కూడా ఛాయామాత్రంగా తోడైంది. కాని ఈ ఉద్యమం ముస్లిం వ్యతిరేక రాజకీయాలను స్పష్టంగానే ప్రదర్శించింది. వలస ప్రజల సమస్యను లేవనెత్తడంలో ఉద్యమం విజయవంతమైనప్పటికీ సమర్థ పరిష్కార విషయంలో విఫలమైంది. ఇతర పార్టీలకు మల్లే, అస్సాం గణ పరిషత్‌కి చెందిన రెండు ప్రభుత్వాలు కూడా ఈ అంశంలో అసమర్థంగా ఉండిపోయాయి.
ఈ వైఫల్యమే వికృతమైన మతతత్వ రాజకీయాలకు దారి చూపింది. గత అయిదేళ్లలో బీజేపీ ఈ సమస్యను మతతత్వ సమస్యగా మార్చడంలో విజయవంతం కావడమే కాకుండా, భాషాపరమైన, జాతిపరమైన సమస్యకు మతం రంగు పులిమింది. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ప్రధానంగా బెంగాలీ హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డాయి. కాబట్టి ఈ పార్టీకి రెండంచెల అజెండా ఉంది. బెంగాలీ హిందువులకు పౌరసత్వ స్థాయిని కల్పించడం, బెంగాలీ ముస్లింలకు ఆ స్థాయిని నిరాకరించడం. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నందున, తన అజెండాను అమలు చేయడానికి ఈ పార్టీ చట్టపరమైన, పాలనా పరమైన మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర స్థాయిలో, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పంచాయతీలు జారీ చేసిన సర్టిఫికెట్ల రద్దును సంతోషంగా సమర్థించింది.
ఇక కేంద్ర స్థాయిలో బీజేపీ 1955 పౌరసత్వ చట్టానికి ప్రమాదకరమైన సవరణను తీసుకొస్తోంది. పార్లమెం టులో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ సవరణ, నేపాల్ మినహా ఇతర దేశాలనుంచి వలస వచ్చినవారికి వారు ముస్లింలు కాదు అన్న ప్రాతిపదికన భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చే ప్రక్రియను సరళతరం చేస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు ప్రత్యేక స్థాయిని పొందనుండగా అక్కడి నుంచే వచ్చిన ముస్లింలు దానికి దూరమవనున్నారు. ఈ సవరణకు చట్టరూపం కల్పిస్తే, భారతీయ పౌరసత్వానికి మతపరమైన అర్హతను ప్రవేశపెట్టినట్లవుతుంది. మహమ్మదాలీ జిన్నా సూత్రీకరించి రెండు దేశాల సిద్ధాంతానికి ఇది యథాతథంగా సరిపోలుతుంది.
మత ప్రాతిపదికన విభజన ప్రమాదకరం
ముందే ఊహించినట్లుగా, అస్సాం ఈ సమస్యపై విభజితమవుతుంది. హిందూ మతతత్వ రాజకీయ శక్తులు స్థానికులు/బయటివారు అనే విభజనను హిందూ/ముస్లింలుగా మార్చడానికి జాతీయ పౌరసత్వ నమోదును కవచంగా ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపున, పలు ముస్లిం సంస్థలు ఎన్‌ఆర్‌సీనే వ్యతిరేకిస్తున్నాయి. ఈ విభజనే ప్రమాదకరంగా విస్ఫోటక స్థాయికి చేరువవుతోంది. అదృష్టవశాత్తూ, హీరేన్ గొహెయిన్, అపూర్వ బారువా వంటి ప్రముఖ అస్సాం మేధావులు కొందరు మూడవ, ఆరోగ్యకరమైన పంథాను చేపట్టారు. వీరి ప్రతిపాదన మైనారిటీలకు రక్షణ కల్పిస్తూనే, జాతీయ పౌరసత్వ నమోదుకు మద్దతిస్తోంది.
అస్సాంలో ముందునుంచి ఉంటున్న వారి భాషాపరమైన, సాంస్కృతికపరమైన, జాతిపరమైన ఆందోళనలు చట్టబద్ధమైనవేనని వీరు గుర్తిస్తూనే, విదేశీయుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరముందని వీరు చెబుతున్నారు. కాబట్టి ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను కొనసాగించాలి, మద్దతు ఇవ్వాలి కూడా. అదేసమయంలో ఈ ప్రక్రియలో మతపరమైన వివక్షను పాటించరాదు. ముస్లిం మహిళల పరిస్థితి దృష్ట్యా, పంచాయతీలు జారీచేసిన సర్టిఫికెట్లు చెల్లుతాయని గుర్తించాలి. అంతిమంగా ప్రతిపాదించిన పౌరసత్వం సవరణను ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగానికి, భారత జాతీయోద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది.
ఈ వైఖరికి సంబంధించి అస్సాంలోనూ, వెలుపల కూడా మనం కచ్చితంగా జాతీయ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. కాని దీనిని ఎవరైనా ఆలకిస్తున్నారా? లేక మనం మరొక నెల్లి తరహా జాతి ఊచకోత ఘటనకు సిద్ధపడుతున్నామా?
యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులు
మొబైల్ : 98688 88986
Comments
Please login to add a commentAdd a comment