‘నర్మదా బచావ్‌’ ఓడిపోలేదు | narmada bachavo not defeated | Sakshi
Sakshi News home page

‘నర్మదా బచావ్‌’ ఓడిపోలేదు

Published Thu, Aug 3 2017 2:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

‘నర్మదా బచావ్‌’ ఓడిపోలేదు

‘నర్మదా బచావ్‌’ ఓడిపోలేదు

విశ్లేషణ
నర్మదా ఉద్యమం ప్రజా కార్యాచరణకు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరించింది. మన నైతిక ఊహాత్మకతను విస్తరింపజేసి, అభివృద్ధి బాధితులను బాధితులుగా మన చేత గుర్తింపజేసింది. రాజ్యాంగబద్ధమైన మన ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అర్హతేలేని వారికి గొంతునిచ్చింది. మన ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యీకరించింది. అంతిమ పోరాటంలో అది ఓడిపోతున్నట్టు కనిపించవచ్చు. కానీ అది ఇప్పటికే మనల్నందరినీ గెలుచుకుంది. ఆ ఉద్యమ అపజయాలు మన గతం, విజయాలు మనందరి సమష్టి భవితకు చెందుతాయి.

నర్మదా బచావ్‌ ఆందోళన్‌(ఎన్‌బీఏ) అంతిమ పోరాటానికి దిగింది. అలాంటి ఈ సమయంలో నేను ఒక తరం కార్యకర్తలకు ఆదర్శమూర్తి మేధా పాట్కర్‌ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో, శ్యామా భారత్‌ గురించి కూడా అంతగా ఆలోచిస్తున్నానని అనుకుంటాను. శ్యామా, ధార్‌ జిల్లాలోని బిద్వానీ తెహసిల్‌ పిచ్చోది గ్రామంలోని జాలరి మహిళ. నర్మదా పోరు చివరి దశలోకి ప్రవేశించింది. సర్దోవర్‌ డ్యాం ప్రతిపాదిత ఎత్తుకు చేరుకుంది. కొందరికి కల, ఇతరులకు పీడకల వంటి ఆ ప్రాజెక్టు వాస్తవమైంది. చివరకు, గేట్లను కూడా మూసేశారు. ఇక రిజర్వాయరు నీటి మట్టం పెరిగి... ప్రభుత్వం ‘‘ప్రాజెక్టు ప్రభావిత ప్రజలు’’గా పిలుస్తున్న వారి ఇళ్లూ, వాకిళ్లూ సర్వస్వాన్నీ ముంచేస్తుంది. వారా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి పెట్టిన తుది గడువు జూలై 31. ప్రభుత్వం ఇక ఏ రోజునైనా బలవంతంగా వారిని ఖాళీ చేయించడాన్ని ప్రారంభించవచ్చు. ఇక అంతా ముగిసిపోయినట్టే అనిపించవచ్చు. నర్మదను కాపాడటానికి చేస్తున్న 32 ఏళ్ల చరిత్రాత్మక పోరాటం పూర్తయిందని అనిపించవచ్చు.

వెనకడుగు... కొత్త పోరు
దుస్సాధ్యమైన ప్రతిఘటనా పోరాటాన్ని ఇంకా నడుపుతున్న మేధా పాట్కర్‌ మీదికి నా ఆలోచనలు పోతున్నాయి. ఖాళీ చేసి వెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వేలాది కుటుంబాలు ఇంకా తమ ఇళ్లలోనే ఉంటున్నాయి. వందలాది మంది గ్రామస్తులు చివరి దఫా జల సత్యాగ్రహంలో చేరారు. జూలై 27 నుంచి మేధాపాట్కర్‌ సహా ఓ డజను మంది కార్యకర్తలు చికల్దా గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆసియాలో మొట్టమొదట వ్యవసాయం చేసినది ఇక్కడేనని తెలిపే ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారని మేధా పాట్కర్‌ తెలిపారు. ఈ వానా కాలంలోనే బహుశా ఆ గ్రామం సైతం డ్యామ్‌ రిజర్వాయర్‌లో మునిగిపోతుంది.

ఏళ్ల తరబడి నర్మదా బచావ్‌ ఆందోళన్‌ను గమనిస్తున్నవారు ఎవరైనా... ప్రతి కొత్త పోరాటమూ ఒక వెనుకడుగేనని గుర్తిస్తారు. మొదట అసలా డ్యామ్‌ను నిర్మించడానికి అనుమతించేది లేదని, దాన్ని అడ్డుకోడానికి చేసిన పోరాటం. తర్వాత డ్యామ్‌ ఎత్తు గురించి పోరాటం. ఇప్పుడిక ఈ ఆఖరు పోరాటం, డ్యామ్‌ వల్ల మధ్యప్రదేశ్‌లో నిర్వాసితులైన వారి సహాయ, పునరావాసాలా గురించి జరుగుతున్నది. డ్యామ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సుప్రీం కోర్టు.. నిర్మాణానికి ముందే ప్రభావిత ప్రజలకు పునరావాసాన్ని కల్పించడం తప్పనిసరి అని షరతును విధించింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం, పునరావాస షరతులను వేటినీ పరిపూర్తి చేయకుండానే నిర్మాణాన్ని కొనసాగించి, డ్యామ్‌ ఎత్తును పెంచే మార్గాలను కనిపెట్టింది.

వాగ్దానాల కాలరాచివేత
డ్యామ్‌ నిర్మాణాన్ని కొనసాగించడంతో పాటూ ప్రభుత్వం వాస్తవాలను తారుమారు చేయడమూ సాగించింది. వాటిని ఎన్‌బీఏ నిర్విరామంగా ఎండగడుతూ వచ్చింది. చాలా వరకు వాగ్దానాలు పరిపూర్తి కాకుండానే మిగిలిపోయాయి. భూమికి బదులుగా భూమి అనే సూత్రాన్ని విడనాడారు. అర్హతగల చాలా కుటుంబాలకు నగదు పరిహారాన్ని సైతం ఎగవేశారు. ప్రత్యామ్నాయ గృహ వసతి వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. ప్రత్యామ్నాయ గృహం వాగ్దానం చివరకు ప్రభుత్వం హడావుడిగా వేసిన రేకుల షెడ్డుకు కుదించుకుపోయింది. రైతులు వాటిలోకి తమ నివాసాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. కోర్టు ఆదేశాలను అనుసరించి పునరావాసం పూర్తయ్యేవరకు గేట్లను మూసివేయకూడదని చికల్దాలోని ఆందోళనకారులు, దేశవ్యాప్తంగా ఉన్న వారి మద్దతుదార్లు డిమాండు చేస్తున్నారు. పాలకులు అదేమీ వినిపించుకునే ధోరణిలో లేరని స్పష్టంగానే కనిపిస్తోంది. గుజరాత్‌ ఎన్నికల్లోగా ప్రాజెక్టు పూర్తయిందని వాళ్లు ప్రకటించుకోవాలి.
ఈ దశలో కోర్టులు దీన్ని అడ్డుకున్నాగానీ, ఆందోళనకారుల ఎజెండా బాగా కుదించుకుపోయిందనే విషయాన్నే అది గుర్తుచేçస్తూనే ఉంటుంది. నిరాశావాదులైన పరిశీలకులు నర్మదా ఉద్యమం అసలు లక్ష్యాన్నే కోల్పోయిందని మీకు చెప్పొచ్చు.

ఎనలేని ఉద్యమ విజయాలు
నేను మాత్రం అంగీకరించను. ఈ ఉద్యమం వల్ల నిర్వాసిత ప్రజలకు స్పష్టంగా కళ్లకు కనిపించే పలు లాభాలు సమకూరాయని భావిస్తున్నాను. ఈ పోరాటం, మహారాష్ట్ర, గుజరాత్‌లలో నిర్వాసిత కుటుంబాలకు దేశంలో మనం ఇంతవరకు ఎరుగనంత మంచి పునరావాస ప్యాకేజీని సాధించిపెట్టింది. అంతకు మించి అది ‘పర్యావరణ ప్రభావ నివేదిక’ను ప్రభుత్వ విధివిధానాలలో భాగం చేసింది. 2013 భూసేకరణ బిల్లును తెచ్చిన ప్రతిష్ట ఎవరికి చెందుతుంది అనేట్టయితే, నిస్సందేహంగా నర్మదా బచావ్‌ ఆందోళనకే. ఈ ప్రయోజనాలు కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చే బాధ్యతల నుంచి ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకుంది. భారీ డ్యామ్‌ ప్రాజెక్టులకు ఆర్థికసహాయం అందించడాన్ని సమీక్షించింది.

ఎన్‌బీఏ నిర్వాసితులకు సాధించిపెట్టిన ప్రయోజనాలు ప్రత్యక్షంగా కంటికి కనిపించే వాటి పరిధికి మించి విస్తరించాయి. ‘నిర్వాసిత ప్రజలు’ అనే వర్గీకరణను తెచ్చినది అనేక విధాలుగా ఎన్‌బీఏనే. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు ముందు దేశంలో పలు డ్యామ్‌లు వచ్చాయి. బాక్రా డ్యామ్, హిరాకుడ్‌ డ్యాం వంటివి వాటిలో కొన్ని. చండీగఢ్‌ నగరం కూడా అలాంటి భారీ ప్రాజెక్టే. ఇవన్నీ భారీ ఎత్తున ప్రజలను విస్థాపితులను చేశాయి.

అయినా, ఈ శరణార్థులకు ప్రభుత్వ పత్రాలలో తప్ప గుర్తింపే లేదు. వారి కడగండ్లు, బాధ, విషాదం సమంజసమైనవిగా పరిగణించేవారే కారు. వారిది దేశ నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకమైన ఆందోళనగా కనిపించేది. మన నైతిక ఊహాత్మకతను విస్తరింపజేసి, అభివృద్ధి బాధితులను బాధితులుగా మన చేత గుర్తింపజేయడం ఎన్‌బీఏ సాధించిన విజయం. అది ఎన్నటికీ నిలిచి ఉండేది. ఎన్‌బీఏ, మనందరికీ పర్యావరణ, జీవావరణ స్పృహ కల్పిం చిందనడం సర్వసాధారణమే. కానీ అంతకు మించి అది చాలానే చేసింది. మనకు చూపుతున్న అభివృద్ధి నమూనాను... ఆధునికవాద సాంప్రదాయకత మూసల పరి ధిని దాటి పునరాలోచించడానికి అది మనల్నందర్నీ ఆహ్వానించింది.

నర్మదా ఉద్యమం ప్రజా కార్యాచరణకు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరించింది. గాంధేయవాదం ఆకర్షణను కోల్పోతూ, వివ్లవ హింస మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా అనిపిస్తున్న సమయంలో... మేధాపాట్కర్, ఆమె సహచరులు కలసి అహింసకు కట్టుబడి ఉంటూనే పోరాటం, ప్రతిఘటన అనే రాడికల్‌ గాంధేయవాదాన్ని పునరుద్ధరించారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి, వాటిని ఆక్రమించడం మొదలు నీటిలో నిలబడటం వరకు కొత్త పోరాట రూపాలను ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలోని మరే ఉద్యమం కన్నా, ఎక్కువగా ఎన్‌బీఏ పోరాటమే... పాటలు, వాద్య బృందాలు, సినిమాలు, కథలు వగైరా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. పూర్తి డొల్ల రాజకీయాల యుగంలో, ఎన్‌బీఏ మనకు లోతైన రాజకీయాలకు అర్థం చెప్పింది.

‘నర్మదా బచావ్‌’ సాధించిన అసలు విజయం
నేను, శ్యామా భారత్‌ గురించి ఆలోచిస్తున్నాను. గత నెలలో ఎన్‌బీఏ, మా కిసాన్‌ ముక్తి యాత్రకు బద్వానీ వద్ద స్వాగతం పలికింది. ఆ సందర్భంగానే నేను మొదటిసారిగా ఆమెను కలుసుకున్నాను, ఆమె మాటలు విన్నాను. మా యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత సభలో శ్యామా మాట్లాడారు. ఆ ప్రాంతపు నిమదీ భాషలో మాట్లాడిన ఆమె ఉపన్యాసాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అయితే, ఆమె, తన మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంటే అందులోని ప్రతి మాటా అర్థం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆ సాధారణ గ్రామీణ జాలరి మహిళ భారత రాజ్యాన్ని సవాలు చేయడానికి సాహసించింది. తనను తన ఇంటిని వదిలి పొమ్మనే హక్కు ఎవరిచ్చారని ముఖ్యమంత్రిని, జిల్లా కలెక్టర్‌ను, ఎస్‌డీఎమ్‌ను నిలదీస్తోంది. ఆమె ధిక్కారం తెలుపుతోంది. మూర్తీభవించిన సాహసమై నిలిచింది. నర్మదా బచావ్‌ ఆందోళన సాధించిన నిజమైన ప్రయోజనం ఆమే.

రాజ్యాంగబద్ధమైన మన ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అర్హతేలేని వారికి ఈ ఉద్యమం గొంతునిచ్చింది. మన ప్రజాస్వామ్యాన్ని అది ప్రజాస్వామ్యీకరించింది. ఎన్‌బీఏ, తన అంతిమ పోరాటంలో ఓడిపోతున్నట్టుగా కని పించవచ్చు. కానీ అది ఇప్పటికే మనల్నందరినీ గెలుచుకుంది. ఆ ఉద్యమం ఎదుర్కొన్న అపజయాలు మన గతం, విజయాలు మనందరి సమష్టి భవి తకు చెందుతాయి.

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు, యోగేంద్ర యాదవ్‌
మొబైల్‌ : 98688 88986  Twitter: @_YogendraYadav

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement