సాక్షి, అమరావతి: ‘దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అవి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. భూమినే నమ్ముకొన్న కౌలు రైతులకు కూడా అవి పూర్తి స్థాయిలో అందాలి. ఈ విషయమై త్వరలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వివరిస్తాను’ అని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకురాలు మేధా పాట్కర్ చెప్పారు.
రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడే రైతుల్లో 90 శాతం కౌలు రైతులేనని చెప్పారు. విజయ్ మాల్యా లాంటి వారు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతుంటే భూమినే నమ్ముకున్న రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రకృతి, నేలపై ఆధారపడి జీవించే వారిని ఆదుకోకపోతే అధోగతి తప్పదని చెప్పారు.
దేశంలో సంపన్నుల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయని, రైతులు మాత్రం భూములమ్ముకొని కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రైతుల సాగులో ఉన్న భూములు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, అటవీ భూములనూ వదలడంలేదని తెలిపారు. మోదీ సర్కారు చట్టాలు అమలులో మాయ చేస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, దేశవ్యాప్తంగా రుణ విముక్తి, కనీస మద్దతు ధరల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ ఒక్క సంతకం వల్ల కౌలు రైతులు నష్టపోతున్నారు
2019 లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. భూ యజమాని సంతకం చేస్తేనే కౌలుదారులకు పంట సాగుదారు హక్కు పత్రం (సీసీఆర్సీ) ఇస్తున్నారని తెలిపారు. కానీ 90 శాతం భూయజమానులు సీసీఆర్సీలపై సంతకం చేయడంలేదన్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు కౌలుదారులకు అందడం లేదని వివరించారు.
ఈ ఫలాలన్నీ సాగు చేయని భూ యజమానుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. అందువల్ల వారికి భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి అధికారుల సిఫారసుతో సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు న్యాయం చేయాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలోనే ధ్రువీకరించి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులివ్వాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
దేవదాయ, ఈనాం, వక్ఫ్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మికుల సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్‌కుమార్ రాష్ట్రంలోని 12 జిల్లాలో 4,154 మంది కౌలు రైతులను సర్వే చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులుంటే, 5.47లక్షల మందికి (8.8 శా తం) మాత్రమే సీసీఆర్సీ కార్డులిచ్చారని తెలిపారు. కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏడు తీర్మానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment