సర్కారు లక్ష్యం.. రైతుకు రొక్కం | CM YS Jagan Releasing YSR Sunna Vaddi Scheme Funds For Farmers | Sakshi
Sakshi News home page

సర్కారు లక్ష్యం.. రైతుకు రొక్కం

Published Tue, Nov 17 2020 3:30 AM | Last Updated on Tue, Nov 17 2020 12:19 PM

CM YS Jagan Releasing YSR Sunna Vaddi Scheme Funds For Farmers - Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారు త్వరితగతిన సహాయం అందించడంలోనూ రికార్డు సృష్టిస్తోంది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ రాయితీ (వైఎస్సార్‌ సున్నా వడ్డీ సహాయం), గత నెలలో వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ మొత్తాలను మంగళవారం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, పెట్టుబడి రాయితీ మొత్తాలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో రూ.642.94 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

ఇప్పటికే ఈ రెండు పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ నంబరు, ఇతర వివరాలను అధికారులు తీసుకుని నిధులు వారికి బదలాయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు నెల రోజుల్లోపే పెట్టుబడి రాయితీ అందిస్తుండటం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు కావడం గమనార్హం. ఇదివరకెన్నడూ పెట్టుబడి రాయితీని ఇంత త్వరితగతిన ఇచ్చిన దాఖలాలు లేవు. 2019 ఖరీఫ్‌ పంట రుణాలకు సంబంధించి దాదాపు 14.58 లక్షల మంది రైతులకు రూ.510.32 కోట్ల వడ్డీ రాయితీ, గత నెలలో ఖరీఫ్‌ పంటలు దెబ్బ తినడం వల్ల నష్టపోయిన రైతులకు రూ.132.62 కోట్ల పెట్టుబడి రాయితీ కలిపి మొత్తం రూ.642.94 కోట్లు  నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

రైతులకు అండగా నిలిచేందుకు..
– పంటల సాగు కోసం రుణం తీసుకున్న రైతులకు వడ్డీ భారం తప్పించాలనే ఉదాత్త లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకం ప్రకటించారు. 
– ఇందులో భాగంగానే గత ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకుల నుంచి రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులందరికీ ప్రభుత్వం వడ్డీ రాయితీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. – గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లను కూడా జగన్‌ సర్కారు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. 

రైతు సంక్షేమమే ధ్యేయం 
– ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు ఇప్పించడం, నిర్ణీత వ్యవధిలో అప్పులు తీర్చేలా ప్రోత్సహించడం ద్వారా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా అర్హులైన రైతులందరూ లబ్ధిపొందేలా జగన్‌ సర్కారు రైతులకు అండగా నిలుస్తోంది.
– ఈ పథకం లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించడం పారదర్శకతకు నిదర్శనం. ఏటా ప్రతి రైతు కుటుంబానికి (అర్హులైన కౌలు రైతులకు కూడా) రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం కూడా నిర్ధిష్ట కాలంలోనే ప్రభుత్వం చెల్లిస్తుండటం గమనార్హం. 
  
నష్టపోయిన సీజన్‌లోనే సాయం
– దురదృష్టవశాత్తు విపత్తుల వల్ల పంట నష్టం వాటిల్లితే బాధిత రైతులకు అదే సీజన్‌లో పెట్టుబడి రాయితీ చెల్లించడం ద్వారా.. వచ్చే సీజన్‌లో పంటలు వేసుకునేందుకు బాసటగా నిలవాలన్నది సీఎం జగన్‌ ఆశయం. ఇందులో భాగంగానే నేడు రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ చేయనున్నారు. 
– అక్టోబర్‌లో పంట నష్టం జరిగితే నవంబర్‌లోనే (నెల లోపే) పెట్టుబడి రాయితీ జమ చేస్తుండటం గమనార్హం. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టాలకు సంబంధించి రైతులకు నయాపైసా కూడా పెట్టుబడి రాయితీ బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లిస్తున్నారు. 

కేంద్రం నుంచి సాయం రాకముందే..
– గత పాలకులు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా విపత్తు బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ జమ చేయలేదు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అప్పటి వరకూ బకాయి ఉన్న రూ. 2,250 కోట్ల పెట్టుబడి రాయితీ మొత్తాన్ని రైతులకు ఎగనామం పెట్టారు. దిగిపోయే నాటికి మళ్లీ రైతులకు పెట్టుబడి రాయితీ బకాయిలు పెట్టారు. ఈ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. 
– ఇటీవలే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి ఈ ఏడాది ఆగస్టు – అక్టోబర్‌ మధ్య భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి వెళ్లింది. విపత్తు బాధిత రాష్ట్రానికి ఉదారంగా సాయం అందించాలని సీఎం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. 
– ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పంట నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడి రాయితీ చెల్లించగా, అక్టోబర్‌లో నష్టపోయన రైతులకు మంగళవారం (నేడు) జమ చేయనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement