ఆధిపత్యానికీ ఉన్నాయి హద్దులు | demonetisation is not play role in elections | Sakshi
Sakshi News home page

ఆధిపత్యానికీ ఉన్నాయి హద్దులు

Published Fri, Mar 17 2017 12:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆధిపత్యానికీ ఉన్నాయి హద్దులు - Sakshi

ఆధిపత్యానికీ ఉన్నాయి హద్దులు

బీజేపీ ఆధిపత్యం విధానపరంగా ప్రభుత్వానికి చాలా వెసులుబాటును కల్పిస్తుంది, నిజమే. పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాన్ని అప్పటికప్పుడు చేసేసిన ప్రభుత్వానికి విధాన నిర్ణయాల విషయంలో పగ్గాలుండవు. అలాగే ఫలితాలను చూపలేకపోవడానికి చెప్పగల సాకులూ ఉండవు. అయినా ఈ ఆధిపత్యం ప్రధానంగా మన ప్రజాస్వామ్యానికి సవాలే అవుతుంది. త్వరలోనే ప్రజాస్వామిక అవకాశాలు వేగంగా కుంచించుకుపోవడం జరగవచ్చు. భారత రిపబ్లిక్‌ మౌలిక విలువలపైనే దాడి జరిగే నిజ ప్రమాద అవకాశాన్ని మనం ఎదుర్కొంటాం. చేదు వాస్తవాన్ని అంగీకరిద్దాం.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన దిగ్భ్రాంతికరమైన ఫలితాలు జాతీయ రాజకీయాల్లో ఒక నూతన దశకు నాంది పలికాయి. బీజేపీ ఇప్పుడు కేంద్రంలోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ అధికా రంలో ఉన్న పార్టీ మాత్రమే కాదు. జాతీయ రాజకీయాలన్నిటినీ తన చుట్టూనే తిప్పుకునే కేంద్రంగా మారింది. ఒకప్పటి ఇందిరా గాంధీ స్థానం లోకి నేడు నరేంద్ర మోదీ ప్రవేశించారు. ఇది మింగుడు పడని కఠోర వాస్తవం. మోదీ ‘నూతన భారతావని’ దృక్పథాన్ని వ్యతిరేకించే వారికి ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం కూడా. ఈ రచయిత సైతం అదే కోవకు చెందినవాడు. భారతదేశం అన్న భావనకే మోదీ పూర్తి విరుద్ధమైన వారని నా బలమైన అభిప్రాయం. అయితే ఆయన రాజకీయాలను అంగీకరించడం లేదా వ్యతిరేకించడం  వేరు, ఆయన నేడు ఏ స్థానంలో నిలిచారనేదాన్ని అంచనా వేయడం వేరు.

ఈ విషయంలో మోదీ విమర్శకులు వాస్తవాన్ని గుర్తించ నిరాకరించడమనే తప్పు చేస్తున్నారు. గత రెండేళ్లుగా వారు బీజేపీ పరిపాలన తన బరువుకు తానే కుంగి, కుప్పకూలాలని ఆశిస్తూ వచ్చారు. 2015 ఢిల్లీ ఎన్నికల్లో, 2016 బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొన్న ఘోర పరాజయం వారికి గొప్ప ఊరట అయింది. పెద్దనోట్ల రద్దు ఆయన పాలిటి భస్మాసుర హస్తంగా మారు తుందని వారు జోస్యం చెప్పారు. అది జరగలేదనేది స్పష్టమే. బీజేపీని చిత్తశుద్ధితో వ్యతిరేకించేవారెవరైనా ఈ సత్యాన్ని అంగీకరించాల్సిందే.

బీజేపీ ఆధిపత్యం.. మూడు కోణాలు
ఆధిపత్యం అంటే ప్రబలశక్తి అని మాత్రమే కాదు, చట్టబద్ధ అధికారం అని కూడా అర్థం. బీజేపీ నేడు ఆదిపత్యవాద శక్తిగా ఉన్నదంటే అందుకు కార ణం... ప్రజామోదం ద్వారా ఆ పార్టీకి మంద బలం వంటి సంఖ్యా బలం గల అధికారం సమకూరినందువల్లనే. ప్రధాని కేవలం జనాదరణగల నేత మాత్రమే కారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలామంది ప్రధానులకు అది ఉండేదే. ఇటీవలి గతంలో అతి కొందరు నేతలు మాత్రమే చేయగలిగిన విధంగా ఆయన దేశ ప్రజల మనసులను గెలుచుకున్నారు. బీజేపీ నేడు ప్రజా బాహుళ్యపు ప్రాపంచిక జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోంది. బీజేపీ ఆధిపత్యంలో మూడు భాగాలున్నాయి. ఒకటి, కేంద్రంలో అతి కొన్ని ప్రభుత్వాలకు మాత్రమే ఉండిన భారీ సంఖ్యాబలం దానికి ఉంది. ఇందులో కొంత, ప్రభుత్వాధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకో వడం వల్ల సంక్రమించినది. కాంగ్రెస్‌కు భిన్నంగా, ప్రభుత్వ సంస్థలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోడానికి పాలనాధికారాన్ని బీజేపీ వాడుకుంటోంది.

విద్య నుంచి రక్షణ రంగం వరకు అన్ని మంత్రిత్వ శాఖలలోనూ తమ ఎజెం డాను అమలుచేస్తారని విశ్వసించగలిన వారినే మోదీ ప్రభుత్వం నియమిం చింది. బీజేపీ ప్రభుత్వం ఎంత మాత్రమూ తన పరిధిలోకి రాని నిర్ణయాలను తీసుకోడానికి సైతం తన చట్టబద్ధమైన అధికారాలను విస్తరింపజేసింది. అరు ణాచల్, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను కూలదోయడం, తాజాగా గోవా, మణి పూర్‌లలో బీజేపీ ప్రభుత్వాలను ప్రతిష్టించడానికి ప్రయత్నించడం, ప్రతి పక్షాలు బహుశా ఆమోదించే అవకాశం ఉన్న చట్టాలను సైతం రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా నేరుగా చట్టాలను చేసేయడం ఇందుకు ఉదాహరణలు. అధికార పార్టీ వీటన్నిటితోడు  హింసను కూడా ప్రయోగిస్తోంది. అత్యవసర పరిస్థితి కాలంలో సంజయ్‌ గాంధీ బ్రిగేడ్‌ సృష్టించిన భయోత్పాతాన్ని గుర్తుకు తెచ్చేలా వేధింపులకు పాల్పడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాలయాల క్యాంపస్‌లలో ఏబీవీపీ దాదాగిరి, మానవ హక్కుల కార్యకర్తల వ్యతిరేక హింస ఒక పద్ధతిగానే నేడు మారాయి.

బీజేపీ ఆధిపత్యంలోని రెండో భాగం ఆ పార్టీకి ఎన్నికలపరంగా ఉన్న ఆధిపత్యం. అది గతవారం నూతన శిఖరాలకు చేరింది. యూపీ, ఉత్తరాఖం డ్‌లలో బీజేపీ విజయం కేవలం అద్భుతమైనదేకాదు, సీట్ల పరంగా అపూ ర్వమైనది కూడా. 2014లో అది సాధించిన విజయం కూడా అంత అద్భు తమైనదే. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేని రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయి నాయకత్వంగా చూపడానికి తమకంటూ ఎవరూ లేని రాష్ట్రంలో అంతటి విజ యాన్ని అది పునరావృతం చేయగలిగింది. అదే లెక్కలోకి తీసుకోవాల్సిన కీలకాంశం. గోవాలో బీజేపీ పట్ల, పంజాబ్‌లో దాని  మిత్ర పక్షం పట్ల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను మోదీ తుడిచిపెట్టివేయలేకపోయిన మాట నిజమే. అస్సాం ఎన్నికల్లో  విజయం, ఒడిశాలో బలాన్ని పెంచుకోవడం జరి గిన తదుపరి వెనువెంటనే ఆ పార్టీ మణిపూర్‌లోకి ప్రబల శక్తిగా రంగప్రవేశం చేసింది. దక్షిణాదిలో అది తన ఉనికిని విస్తరంపజేసుకోగలిగింది. అంతకు ముందు హరియాణా, మహారాష్ట్రలలో విజయాలు సాధించింది. ఇవన్నీ కలసి బీజేపీని దేశవ్యాప్త రాజకీయ శక్తిగా మార్చాయనే వాస్తవాన్ని మనం గుర్తించాల్సిందే. కాంగ్రెస్‌ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది, వేగంగా దాని బలం కుచించుకుపోతోంది. గత పదేళ్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల స్థానాలు తారుమారయ్యాయి.

నోట్ల రద్దును నల్లధనంపై పోరుగా నమ్మించారు
ఇక మూడవ భాగానికి వస్తే, ఈ ప్రభుత్వ నైతికతకు, భావజాలానికి ప్రజా మోదం ఉన్నది. కొత్త ప్రభుత్వాలకు సాధారణంగా దొరికే ‘హనీమూన్‌’ రోజుల సుఖప్రదమైన కాలాన్ని దాటి ప్రధాని తన జనాదరణను విస్తరిం పజేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రహసనాన్ని తట్టుకుని నిలచి ఆయన తన శక్తిసామర్థ్యాలను చూపారు. ఇది, తప్పులను విస్మరించి సాధారణ ప్రజలు ఆయన పై నమ్మకం ఉంచేలా చేశాయి. బిర్లా–సహారా కేసులో వెలుగులోకి వచ్చిన సంచలనాత్మక విషయాలు ఇప్పటికింకా ఆయన ప్రతిష్టకు మచ్చను కలిగించలేకపోయాయనేది కూడా స్పష్టమే. జాతీయ ప్రయోజనాల కోసమే నిలిచానని, రాజకీయ పార్టీల పక్షపాతపూరితమైన పోరాటాలకు అతీతుడనని ప్రజలను ఆయన నమ్మింపజేయగలిగారు. పెద్ద నోట్ల రద్దు. బడా నల్లధన కుబేరులపైకి ఎక్కుపెట్టిన చర్య అనే తన కథనాన్ని ప్రజలు నమ్మేలా చేయ గలిగారు. అన్నిటికీ మించి బీజేపీ రేకెత్తించిన జాతీయవాద చర్చలో ప్రజా భిప్రాయాన్ని గెలుచుకోవడానికి సాగిన పోరాటంలో అదే విజయాన్ని సాధించింది. భారత స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధమూ లేని పార్టీయే నేడు జాతీయవాదంపై సాధారణ పౌరుల ప్రాపంచిక జ్ఞానాన్ని మలుస్తోంది.

పగ్గాలేసే పరిమితులూ ఉన్నాయి
బీజేపీ ఆధిపత్యానికి ఉన్న సామంజస్యానికి మూడు ప్రధాన పరిమితులు సైతం ఉన్నాయి. ఆ పార్టీ సామంజస్యపు పరిధిలోకి మొత్తం దేశమంతా రాదు. మైనారిటీలను అది బలంగానే దూరంగా నెట్టేస్తోంది. అలాఅని మైనా రిటీలు మోదీ పట్ల ఉత్సాహపూరితంగా స్పందించడం లేదని కాదు. కానీ నిజానికి మోదీ, తాను మైనారిటీలను, ప్రత్యేకించి ముస్లింలను, క్రైస్తవులను దూరంగా ఉంచుతున్న విషయాన్ని స్పష్టం చేశారు కూడా. ముస్లింలను తాను లెక్క చేసేది లేదని చూపడం ద్వారానే ఆయన అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులలో సామంజస్యాన్ని సంపాదించారు. ఈ జనామోదం అంతా దానికదే స్వచ్ఛందంగా లభించినదేం కాదు. ప్రజామోదాన్ని అనుకూలంగా మలుచుకోవడం కోసం చేపట్టిన ప్రచారం, మోదీకి అనుకూలమైన అభి ప్రాయాన్ని కలిగించే ఎత్తుగడలను ఉద్దేశపూర్వకంగా అనుసరించడం, మీడి యాను తమకు అనుకూలంగా మలుచుకోవడం పెద్ద ఎత్తున చేశారు. ఇవన్నీ ప్రధాని పట్ల జనామోదాన్ని సృష్టించడానికి తోడ్పడ్డాయి.

అత్యవసర పరిస్థితి తదుపరి కాలంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం నుంచీ ఎదుర్కోనంతటి ఒత్తిడికి నేడు మీడియా గురవుతోంది. ఇలాంటి ఆధిపత్యం స్వాభావికంగానే అత్యంత దుర్బలమైనది. ఇప్పటికైతే అది అబ్బురపరచేదిగానే ఉంటుందిగానీ, ఒక్క సారి కదలబారిందంటే పేకమేడలా కుప్ప కూలిపోవచ్చు. ఇక చివరగా, ఈ జనాదరణకు భౌతిక పునాది అంతగా లేదు. ఆర్థిక వృద్ధి సన్నగిల్లింది. గ్రామీణ పరిస్థితులు దైన్యంగా దిగజారిపోవడం అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. అలాగే నిరుద్యోగమూ ప్రబలిపోతూనే ఉంది. ప్రభుత్వం భారీ ఎత్తున అట్టహాసంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ లేదా ప్రధాని ఫసల్‌ బీమా యోజన వంటి ప్రభుత్వ పథకాల వల్ల కలుగుతాయన్న ప్రయోజనాలేవీ ప్రజలకు అందలేదు.

ప్రజాస్వామ్యానికి పెను సవాలే
ఇంతకూ మన ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ ఆధిపత్యం ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది? విధానపరంగా ఇది ప్రభుత్వానికి చాలా వెసులు బాటును కల్పిస్తుందనేది నిజమే. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాన్ని అప్పటి కప్పుడు చేసేసిన ప్రభుత్వానికి విధాన నిర్ణయాల విషయంలో పగ్గాలుండవు. అయితే అది, ఫలితాలను చూపడంలోని వైఫల్యాలకు కారణాలుగా  ప్రభు త్వం చూపగలిగిన సాకులన్నిటినీ లేకుండా చేసేస్తుంది. కానీ ఈ ఆధిపత్యం ప్రధానంగా మన ప్రజాస్వామ్యానికి సవాలే అవుతుంది. ప్రజాస్వామిక అవ కాశాలు వేగంగా కుంచించుకుపోవడం త్వరలోనే సంభవం కావచ్చు. బీజేపీ ప్రభుత్వానికి ఉన్న తలబిరుసుతనమనే రుగ్మతను ఈ ఆధిపత్యం మరింతగా పెంచగలుగుతుంది. భారత రిపబ్లిక్‌ మౌలిక విలువలపైనే దాడి జరిగే నిజ ప్రమాద అవకాశాన్ని మనం ఎదుర్కొంటాం.

అయితే మరి ఈ ఆధిపత్యాన్ని మనం ఎలా ప్రతిఘటించగలం? దీన్ని ఎదుర్కొనడానికి ఏదో యథాలాపంగా తెలిపే వ్యతిరేకత సరిపోదు. అది  గుర్తుచేయడం కోసమే బీజేపీ ఆధిపత్యం గురించి ఇంతగా చర్చించినది. వెంటనే రంగంలోకి దిగి, వీధి పోరాటాలకు తలపడటం వల్ల ఉపయోగం లేకపోవచ్చు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఓ బృహత్తర కూటమిని నిర్మించడం బహుశా ప్రతి కూలంగానే పరిణమించవచ్చు. ఈ ప్రభుత్వాన్ని, దాని భావ జాలపరమైన, నైతికపరమైన సామంజస్యం విషయంలోనే సవాలు చేయడం అవసరం. అందుకు కావాల్సిన సాంస్కృతిక ఉపకరణాలను అభివృద్ధి చేయ డంతోనే ఈ ప్రతిఘటనను ప్రారంభించాలి. నేడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన రాజకీయ సవాలు ఇదే.


యోగేంద్ర యాదవ్‌

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986, Twitter : @_YogendraYadav

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement