మాలెగావ్ కేసులో ప్రజ్ఞాసింగ్ కు క్లీన్ చీట్!
Published Fri, May 13 2016 12:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM
న్యూఢిల్లీ: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ లభించనుంది. కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసులో యూటర్న్ తీసుకుంది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆక్ట్(మోకా) చట్టం ప్రకారం ఆమెపై విచారణ జరుగుతోంది. చట్టవిరుద్ధ చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగానికి అవకాశం ఉన్నా మోకా కింద విచారణకు అర్హత లేదని, మోకాను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ఎన్ఐఏ అభిప్రాయపడింది. దీంతో సాధ్వి త్వరలోనే జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది.
సాధ్వీతో పాటే ఆర్మీ లెఫ్టనెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ పైనా ఎన్ఐఏ విత్ డ్రా తీసుకుంది. సాధ్వి, పురోహిత్ లతో సహా మరో 12 మందిపై ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారని కేసు నమోదైంది. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే దాఖలు చేసిన చార్జిషీట్ లోపాలున్నాయని ఎన్ఐఏ అభిప్రాయపడింది. పురోహిత్ పైన దాఖలు చేసిన అభియోగాలు కల్పితంగా ఉన్నాయని, బలప్రయోగంతో చేసినవిగా ఉన్నాయాని ఎన్ఐఏ తెలిపింది. ఈకేసును రెండు బృందాలు విచారణ చేస్తున్నాయి. మొదటి బృందానికి ఐజీ సంజయ్ సింగ్, రెండో బృందానికి ఐజీ జీపీసింగ్ నేతృత్వం వహిస్తున్నారు. వీరు సైతం ఈ కేసులో ఆధారాలు బలహీనంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన మాజీ కేంద్రహోంమంత్రి చిదంబరం ఎన్ఐఏ కేసును ఉపసంహరించుకోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 29న మాలెగావ్ లోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంతో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా వంద మంది గాయపడ్డారు.
Advertisement