ముడా కేసులో సస్పెన్స్
బనశంకరి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన మైసూరు ముడా ఇళ్ల స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది, మరికొందరిపై కేసు నమోదు కావడం తెలిసిందే. ఇందులో విచారించిన రాష్ట్ర లోకాయుక్త.. సీఎంకు, ఆయన సతీమణి పార్వతికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. లోకాయుక్త పోలీసులు సీఎంతో పాటు ఇతరులను పిలిచి విచారించారు. ఆ నివేదికను రూపొందించి సోమవారం మైసూరులో కోర్టుకు సమర్పించారు. అందులో సీఎం దంపతులకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపాయి. ఏదేమైనా నివేదిక అధికారికంగా బయటకు వస్తేనే పూర్తి వివరాలు తేటతెల్లమవుతాయి.
నాకు తెలియదు: స్నేహమయి
ఈ కేసులో ఫిర్యాదిదారు స్నేహమయి కృష్ణ స్పందిస్తూ క్లీన్‌చిట్ ఇవ్వడం గురించి తనకు తెలియదన్నారు. ఇది తన పోరాటానికి ఎలాంటి అడ్డంకి కాదని, సీఎం హస్తం లేకుండా అధికారులు అక్రమాలకు పాల్పడటం సాధ్యం కాదని, ఇందులో సిద్దరామయ్య పాత్ర ఉందని ఆరోపించారు.
నాకు కూడా తెలియదు: సీఎం
ముడా కేసులో తనకు, భార్యకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చారనేది తెలియదని సీఎం సిద్దరామయ్య అన్నారు. గురువారం విధానసౌధలో విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా ఇంకా తెలియదన్నారు. తాను ఐదేళ్లు పదవిలో ఉండాలా అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయమని అన్నారు. బడ్జెట్ పనుల వల్ల దావోస్ టూర్‌కి వెళ్లలేదని, గత ఏడాది కూడా వెళ్లలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment