Sadhvi Pragya
-
బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తనను చిత్రహింసకు గురిచేసిందని, ఏటీఎస్ కస్టడీకి పంపిందని ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నదని ఆమె తెలిపారు. తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపిస్తోంది.2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞ నిందితురాలు. వైద్య కారణాలతో ఆమె గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయని, ఆమె కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. #कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024 ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై వారి పేర్లను రాయాలని కోరారు. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల దుకాణదారులు వారిపేర్లను వెల్లడించాలని ఆమె కోరారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సాధ్వి ప్రజ్ఞా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఇది కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత -
నెహ్రూపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేరస్తుడని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 అమలుచేశారని నెహ్రూను క్రిమినల్‌గా అభివర్ణించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ప్రజ్ఞా సింగ్ సమర్ధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేశమాతను బాధించేవారు, దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునే వారెవరైనా నేరస్తులేనని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370, 35 ఏను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఆమె ప్రశంసలు కురిపించారు. మోదీ, అమిత్ షా దేశభక్తులని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దును దేశభక్తులు స్వాగతిస్తుంటే..దీన్ని స్వాగతించలేనివారు ఎన్నటికీ దేశభక్తులు కాలేరని స్పష్టం చేశారు. కాగా గతంలో మహాత్మా గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి పార్టీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. -
అ‘ప్రజ్ఞా’వాచాలత్వం!
గత అయిదేళ్లకాలంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలకు ప్రత్యర్థులు కూడా చేయలేకపోయిన భంగపాటును సొంత పార్టీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దిగ్విజయంగా కలిగించారు. గాంధీ హంతకుడు దేశభక్తిపరుడు అంటూ ఆమె చేసిన పదప్రయోగం మోదీ, అమిత్ షాలను వారి ప్రజాజీవితం మొత్తంలో ఏ రకంగానూ సమర్థించుకోలేని స్థితిలోకి నెట్టివేసింది. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ, సైద్ధాంతిక శక్తి అయిన ఆరెస్సెస్ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. బీజేపీకి ఓట్లు రాబట్టే సమర్థత విషయంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావించిన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ దానికి భిన్నంగా తన ప్రధానమంత్రి, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సాధించిన ఒక విజ యాన్ని మాత్రం మనం గుర్తించాల్సి ఉంది. నరేంద్రమోదీ, అమిత్ షాల విషయంలో ఎవరూ చేయలేని పని ఆమె చేసిపడేశారు. అదేమిటంటే ఒక్కసారిగా వాళ్లను ఆత్మరక్షణలో పడేశారు. అంతేకాకుండా తన పార్టీ అగ్రనాయకత్వం నిజంగా ద్వేషించే మరో పనిని కూడా చేయడంలో ఆమె విజయం పొందారు. పతాక శీర్షికలను నిర్ణయించే వారి శక్తిని కోల్పోయేలా చేశారామె. గత అయిదేళ్లుగా పత్రికల్లో పతాక శీర్షికలను మార్చడంలో, తమకు అనుకూలంగా నియంత్రించడంలో తమ వ్యూహాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న బీజేపీ, తాము కోరుకోని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ప్రజా జీవితంలో మొట్టమొదటిసారిగా ఏరకంగానూ సమర్థించుకోలేని వ్యవహారంలో చిక్కుకున్నారు. గాంధీ, నాథూరాం గాడ్సేల వ్యవహారంపై తాజాగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ లేవనెత్తిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే, బీజేపీ ఐటీ సెల్ విభాగాధిపతి అమిత్ మాలవీయతో పాటు బీజేపీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాపీ అనుయాయులు వెనువెంటనే ఆమెకు సమర్ధనగా ముందుకురికారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వమ్మయిపోయాయి. గత అయిదేళ్లుగా వ్యక్తులపై లేక సామాజికవర్గంపై బీజేపీకి చెందిన వ్యక్తి ఎలాంటి అసందర్భోచితమైన దాడికి తలపెట్టినా సరే వారిని కాపాడటానికి లేక వారిపై ఆరోపణలను తోసిపుచ్చడానికి ఆ పార్టీ శరవేగంగా పావులు కదపడాన్ని మనందరం చూస్తూ వచ్చాం. కానీ మహాత్మా గాంధీ విషయంలో మాత్రం బీజేపీ ఇలాంటి సాహసాలకు పూనుకోలేదు. పార్టీకి చెందిన కొందరు గాంధీ తప్పులు, దేశ విభజన సమయంలో ఆయన పాత్ర వంటి అంశాలపై తమ తమ డ్రాయింగ్ రూమ్‌లలో, గోష్టులలో లేక శాఖా సమావేశాల్లో మాత్రమే వ్యాఖ్యానించి ఉండవచ్చు కానీ బహిరంగంగా మాత్రం వారెవ్వరూ గాంధీపై వేలెత్తి చూపిన పాపాన పోలేదు. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. కానీ, కాషాయాంబరధారి అయిన అభ్యర్థి, ఉగ్రవాద కేసులో ముద్దాయిగా ఉన్న హిందూత్వ మూర్తి ఇప్పుడు గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా పిలుస్తోంది. జాతిపితగా మీరు ప్రశంసించిన వ్యక్తి వారసత్వాన్ని మీరు బోనులో నిలబెట్టకూడదు. ఆయన 150వ జయంతి సందర్భంగా ఆ పని అసలు చేయకూడదు. కానీ బీజేపీకి ఓట్లు రాబట్టడంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావిం చిన ప్రజ్ఞా ఠాకూర్ దానికి భిన్నంగా తన ప్రధాని, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. స్వయానా సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశపూర్వకంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వారే కాబట్టి మోదీ–షా ద్వయం ఆమె చేసిన నిర్వాకానికి నిరుత్తరులైపోయారు. కాషాయ ఉగ్రవాదం అనే పదబంధాన్ని సృష్టించి హిందువులకు హాని తలపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారానికి వ్యతిరేకంగా తమ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహమే సాధ్వీ ప్రజ్ఞ రాజకీయ ప్రవేశమంటూ మోదీతో కలిసి అమిత్ షా తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరించారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఒకటి. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ నుంచి దూరంగా జరగడం మోదీ–షాల పార్టీకి ఇప్పుడు అసాధ్యం అనడానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ ద్వయం దూకుడుతో తీసుకొచ్చిన స్వయం ఎంపిక ఆమె. రెండు, పై రాజకీయ ప్రకటనను వివరించడానికి అమిత్ షా గాంధీ ట్రేడ్ మార్క్ అయిన సత్యాగ్రహ భావనను ఉపయోగించారు. గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా ప్రశంసించిన వ్యక్తిని సమర్థించడానికి అదే గాంధీ మానవజాతికి బహుకరించిన విశిష్టమైన అహింసా పోరాటాన్ని మీరు అరువుతెచ్చుకుంటున్నప్పుడు మీరు ఎటువైపు వెళుతున్నారో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. సరైన కారణాలతో కూడా ఎన్నడూ తప్పు పనులకు పాల్పడవద్దన్నది జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ సత్ప్రమాణ సూత్రం. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను బీజేపీ వివాదాల్లోకి లాగడం గురించి మనకు తెలుసు. హిందూ ఉగ్రవాదంపై తీవ్రాతితీవ్రంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో అగ్రగణ్యుడు దిగ్విజయ్ సింగ్. న్యూఢిల్లీలో బాట్లా హౌస్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ గురించి, మోహన్ చంద్ శర్మ అనే పోలీసు అధికారి ధీరోదాత్త త్యాగం గురించి దిగ్విజయ్ వ్యంగ్యంగా ప్రకటనలు చేశారు. అది చాలదన్నట్లుగా 26/11 అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా దాన్ని ఆరెస్సెస్ కుట్రగా కూడా అభివర్ణించారు. బీజేపీ ఉద్దేశం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణకు గురై అరెస్టైన హిందూ రాడికల్ కార్యకర్తలు దిగ్విజయ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకోవలసి ఉండింది. కానీ గత నెల చివరలో ప్రజ్ఞ్నా ఠాకూర్ తొలిసారిగా పతాక శీర్షికల్లోకి వచ్చి హేమంత్ కర్కరేని, ఆయన కుటుంబాన్ని తాను శపించిన కారణంగానే అతడు చనిపోయాడని ప్రకటించారు. (హేమంత్ కర్కరే చనిపోయిన ఆరేళ్లకు ప్రత్యేకించి సెప్టెంబర్ 29న మాలెగావ్ బాంబు దాడి వార్షికోత్సవం రోజునే హేమంత్ కర్కరే భార్య కూడా మరణించారని మనం గుర్తించాలి). తర్వాత బాబ్రీమసీదును కూలగొట్టడానికి తాను స్వయంగా ఆ మసీదుపైకి ఎక్కానని సాధ్వీ ప్రజ్ఞా ప్రకటించారు. ఈ రెండు సందర్భాల్లోనూ బీజేపీ సత్వరం స్పందించి నష్టనివారణ చర్యలకు పూనుకొంది. సాధ్విని మౌనవ్రతం పాటించాల్సిందిగా ఆదేశించడమే కాకుండా మోహన్ చంద్ శర్మపై గతంలో అదేరకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది కూడా. కానీ ఇప్పుడు గాడ్సేని ప్రశంసించడానికి సాహసించిన సాధ్వీని కాపాడే అవకాశమే బీజేపీకి లేకుండా పోయింది. 1989 నుంచి, బీజేపీ నిదానంగానే అయినా, నియంత్రిత విధానంలో ముందుకెళ్లే వ్యూహాన్ని అవలంబిస్తూ వచ్చింది. అద్వాణీ తలపెట్టిన అయోధ్య ఉద్యమం ప్రారంభ దినాల నుంచి మొదలుకుని ఆ పార్టీ మరింత దూకుడు చర్యలకు తావిస్తూ పోయింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు, నేతలను అది పక్కనబెడుతూ వచ్చింది కూడా. సాధ్వి రితంబర, ప్రవీణ తొగాడియా, వినయ్ కతియార్ వంటి వారిని గుర్తుంచుకోండి. అదేసమయంలో ఉమా భారతి, సాక్షి మహరాజ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి (రంజాదే, హరాంజాదే ఫేమ్), యోగి ఆదిత్యనాథ్ వంటి మిలిటెంట్ స్వభావం కలిగిన వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకొచ్చింది. ఇది మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. కానీ, తెలివిగా సాగింది. మనలో కొందరం దీన్ని ముందే ఊహించాం. దాద్రిలో గోరక్షకులు అక్లాక్‌ను చంపిన వెంటనే నేను నా జాతి హితం కాలమ్‌లో రాసిన ‘మూక సంస్కృతి ప్రధాన స్రవంతి’ వ్యాసాన్ని పరిశీలించవచ్చు. ప్రజ్ఞా కేవలం ఓ తాజా ఉదాహరణ మాత్రమే, చాలా అవమానకరమైన ఉదాహరణ. ఇదేదో పొరపాటున జరిగిందని కూడా అనుకోలేం. ఇది ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించి చేసిన పని అని పార్టీ అధ్యక్షుడే స్వయంగా మనకు చెప్పాడు. ఇది పూర్తిగా దురభిప్రాయంతో కూడిన తెలివితక్కువ ప్రకటన. భారత జాతీయత ఎదిగిన తీరుపై తప్పుడు అవగాహన నుంచి అది వెలువడింది. భారత దేశాన్ని ఐకమత్యంగా ఉంచుతున్నది ప్రాథమికంగా హిందూయిజమే (హిందూత్వ) అనే తప్పుడు అవగాహనలో ఇదంతా ఉంది. తర్వాత ఆ హిందూయిజం, హిందూత్వ అనేవి ఒకే మతం, ఒకే ప్రజ, ఒకే భాష, ఒకే జాతి అనే ఆర్ఎస్ఎస్ స్థాయికి కుదించుకుపోయాయి. ఈ ఎన్నికల్లో మోదీ మెజారిటీ సాధించినప్పటికీ నాలుగు దక్షిణాది రాష్ట్రాలు(ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ)లోని 103 స్థానాలకు గాను కనీసం రెండు స్థానాలు గెలుచుకునే పరిస్థితి కూడా లేదని మోదీ గుర్తుంచుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా హిందూయిజాన్ని వ్యాపింపజేసి దాన్ని ఇరుసుగా మార్చుకున్నారు. స్వేచ్ఛాయుత రాష్ట్రాల స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఒక మతం నుంచి ఒకే దృక్పథం, ఒకే ఆలోచనా విధానం, ఒకే గ్రంథం నుంచి ఒకే దార్శనికత ఏర్పడే అవకాశం లేదు. అందువల్లే మన దేశం ఐకమత్యంగా ఉండటమే కాదు, ప్రతి దశాబ్దానికీ మరిత బలమైనదిగా, సురక్షితమైనదిగా ఎదుగుతోంది. అదే సమయంలో ఒకే సిద్ధాంతం కలిగిన పాక్ ముక్కలవు తోంది. వైవిధ్యతతో కూడిన సౌఖ్యం భారత్ ఆధునిక ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుక. ప్రపంచంలో మరెక్కడా వేర్వేరు సంస్కృతులు సంయమనంతో లేవు. విభిన్నతకు భారత్ ఒక బ్రాండ్ అయితే, స్విస్ తత్వవేత్త కార్ల్ జంగ్ అన్నట్టు దాని మూల బిందువు మహాత్మా గాంధీ. నెహ్రూ విధానాలతో పోరాడటం, వాటిపై బురద చల్లడం, దూషిం చటం సులభమే. ఇప్పటికే కొందరు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హంతకులను కూడా హీరోలుగా పిలవడం మొదలెట్టారు. కానీ మహా త్మాగాంధీని ముస్లింలను బుజ్జగించే రాజకీయాల సంస్థాపకుడిగా భావించే అత్యంత హిందూ మత ఛాందసవాదులకు కూడా గాంధీని లక్ష్యంగా చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశంగానే కనిపించేది. అందుకే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ని ఎన్నటికీ క్షమించబోనని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో నిజాయితీ ఉండవచ్చు. వచ్చే గురువారం ఎన్నికల కౌంటింగులో ఆమె ఓడిపోవాలని మోదీ ప్రార్థించవచ్చు. లేక గాంధీ పేరుతో గత అయిదేళ్లుగా ప్రమాణం చేస్తూవచ్చిన పార్టీకి ఆ గాంధీ హంతకుడినే హీరోగా ప్రశంసిస్తున్న వ్యక్తిని అదే పార్టీలో కొనసాగించడం కలవరపెట్టవచ్చు కూడా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞాసింగ్
భోపాల్ : మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ప్రజ్ఞాసింగ్ భోపాల్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ప్రభాత్ ఝా, నరోత్తమ్ మిశ్రా, రామ్ లాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను అధికారికంగా బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. మంగళవారమే తాను బీజేపీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్లు చెప్పిన ఆమె పార్టీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమన్నారు. తాను పోటీ చేయడం ఖాయమని, గెలుస్తానని కూడా ప్రజ్ఞాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజ్ఞాసింగ్ లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం ఆమె పేరును అధికారికంగా ప్రకటించమే మిగిలి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై ప్రజ్ఞాసింగ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. సుమారు ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆమె ఈ కేసులో ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు. -
సాధ్వి ప్రగ్యాకు ఊరట
సాక్షి, ముంబై : 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు అనూహ్యమైన తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాధ్వి ప్రగ్యాసింగ్ థాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌లకు ఈ కేసు నుంచి పాక్షిక ఉపశమనం కల్పించేలా ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలవరించింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) కింద సాధ్వి ప్ర్ర్రజ్ఞ సింగ్, రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహికర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు విముక్తి కల్పించింది. ఇదిలావుండగా 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రగ్యాసింగ్, కల్నల్ పురోహిత్‌లపై సెక్షన్ 18తో పాటు వివిధ ఐపీసీ సెక్షన్ల ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింనదుకు విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం బెయిలుపై విడుదలైన నిందులకు అదేబెయిల్ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణ జనవరి 15న జరగనుందని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. పేలుళ్ల కోసం మోటార్ సైకిల్‌ను వినియోగిస్తున్న విషయం సాధ్వి ప్రగ్యాకు ముందే తెలుసునని, అందువల్ల ఆమెను కుట్ర ఆరోపణల నుంచి విముక్తి కల్పించడం అసాధ్యమని కోర్టు తెలిపింది. ఇదిలావుండగా.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసునుంచి తమకు విముక్తి కల్పించాలంటూ.. సాధ్వి ప్రగ్య, సమీర్ కులకర్ణి తదితరులు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మాలేగావ్‌లోని హమిదియా మసీద్ వద్ద 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుడులో ఆరుమంది మరణించడగా.. 101 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన మసీదు ప్రాంతం నాసిక్‌లో అత్యంత సున్నితమైంది. -
చిదంబరం కుట్రకు బలయ్యాను
భోపాల్: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి చిదంబరంలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, చిదంబరం కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో చికిత్స పొందుతున్న సాధ్వి.. బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటానని తెలిపారు. '2008లో అక్టోబర్ 10న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నన్ను చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకున్నారు. ఏటీఎస్ అధికారులు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. చరిత్రలో నా మాదిరిగా ఏ మహిళ కూడా చిత్రహింసలు అనుభవించలేదు. ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరె, ఖాన్విల్కర్, ఇతర అధికారులు నన్ను తీవ్రంగా హింసించారు. ఐదు రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాను. నేను ఎలాంటి నేరం చేయలేదు. అప్పటి హోం మంత్రి చిదంబరం కుట్రకు బలయ్యాను. దాదాపు 9 ఏళ్లు జైలులో గడిపాను' అని సాధ్వి అన్నారు. -
సాధ్వీ ప్రజ్ఞ కు చుక్కెదురు
ముంబై: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ముంబై స్పెషల్ కోర్టు నిరాకరించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణ నుంచి తప్పు కోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే బెయిల్ ఇస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని సాధ్వి కుటుంబ సభ్యులు తెలిపారు. 2008లో మహారాష్ట్ర్రలోని మాలెగావ్ లో బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో నిందితులుగా పేర్కొంటూ సాధ్వితో పాటు మరికొంత మందిపై మోకా చట్టం కింద కేసును విచారిస్తున్నజాతీయదర్యాప్తు సంస్థ సరైన సాక్షాదారాలు లేవనే కారణంతో కేసునుంచి విత్ డ్రా అయింది. -
మాలెగావ్ కేసులో ప్రజ్ఞాసింగ్ కు క్లీన్ చీట్!
న్యూఢిల్లీ: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ లభించనుంది. కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసులో యూటర్న్ తీసుకుంది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆక్ట్(మోకా) చట్టం ప్రకారం ఆమెపై విచారణ జరుగుతోంది. చట్టవిరుద్ధ చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగానికి అవకాశం ఉన్నా మోకా కింద విచారణకు అర్హత లేదని, మోకాను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ఎన్ఐఏ అభిప్రాయపడింది. దీంతో సాధ్వి త్వరలోనే జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. సాధ్వీతో పాటే ఆర్మీ లెఫ్టనెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ పైనా ఎన్ఐఏ విత్ డ్రా తీసుకుంది. సాధ్వి, పురోహిత్ లతో సహా మరో 12 మందిపై ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారని కేసు నమోదైంది. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే దాఖలు చేసిన చార్జిషీట్ లోపాలున్నాయని ఎన్ఐఏ అభిప్రాయపడింది. పురోహిత్ పైన దాఖలు చేసిన అభియోగాలు కల్పితంగా ఉన్నాయని, బలప్రయోగంతో చేసినవిగా ఉన్నాయాని ఎన్ఐఏ తెలిపింది. ఈకేసును రెండు బృందాలు విచారణ చేస్తున్నాయి. మొదటి బృందానికి ఐజీ సంజయ్ సింగ్, రెండో బృందానికి ఐజీ జీపీసింగ్ నేతృత్వం వహిస్తున్నారు. వీరు సైతం ఈ కేసులో ఆధారాలు బలహీనంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాజీ కేంద్రహోంమంత్రి చిదంబరం ఎన్ఐఏ కేసును ఉపసంహరించుకోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 29న మాలెగావ్ లోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంతో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా వంద మంది గాయపడ్డారు.