చిదంబరం కుట్రకు బలయ్యాను
భోపాల్: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి చిదంబరంలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, చిదంబరం కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో చికిత్స పొందుతున్న సాధ్వి.. బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటానని తెలిపారు.
'2008లో అక్టోబర్ 10న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నన్ను చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకున్నారు. ఏటీఎస్ అధికారులు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. చరిత్రలో నా మాదిరిగా ఏ మహిళ కూడా చిత్రహింసలు అనుభవించలేదు. ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరె, ఖాన్‌విల్కర్, ఇతర అధికారులు నన్ను తీవ్రంగా హింసించారు. ఐదు రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాను. నేను ఎలాంటి నేరం చేయలేదు. అప్పటి హోం మంత్రి చిదంబరం కుట్రకు బలయ్యాను. దాదాపు 9 ఏళ్లు జైలులో గడిపాను' అని సాధ్వి అన్నారు.