‘మాలెగావ్’ నిందితులు నిర్దోషులు
ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు
ముంబై: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులైన 8మంది ముస్లిం యువకులకు వ్యతిరేకంగా ఆధారాల్లేవంటూ ముంబై ప్రత్యేక కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిని వె ంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 2006 సెప్టెంబర్ 8న మాలెగావ్‌లోని మసీదు దగ్గరున్న ముస్లిం శ్మశానం వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా 100కు పైగా గాయాల పాలయ్యారు.
రయిస్ అహ్మద్, ఫరోగ్ మగ్దుమి, ఆసీఫ్ ఖాన్, అబ్రర్ అహ్మద్, నురుల్ హుడా, శబ్బీర్ అహ్మద్, సల్మాన్ ఫార్సీ, శేఖ్ మహ్మద్ అలీ, మహ్మద్ జాహిద్‌లు మొత్తం 9 మందిని ఉగ్రవాద వ్యతిరేక విభాగం(ఏటీఎస్) అరెస్టు చేసి చార్జిషీట్ న మోదు చేసింది. వీరిలో ఒకరు కేసు దర్యాప్తులో ఉండగా మృతి చెందాడు. 2011లో వీరందరికి బెయిల్ మంజూరైంది. వారు నేరం చేశారని చెప్పినా సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించ లేకపోయింది. ఆ 8 మంది నేరం చేశారని నిరూపించేలా సీబీఐ, ఏటీఎస్‌లు ఆధారాలు సంపాదించలేకపోయాయని, తాము జరిపిన విచారణలో లభించిన ఆధారాలకు సీబీఐ, ఏటీఎస్‌లు ఇచ్చిన ఆధారాలకు చాలా వ్యత్యాసముందని పిటిషన్ విచారణ సమయంలో కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది.