contraversiol coments
-
నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నారాయణ్ రాణె మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేనెవరికీ భయపడను. నా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదు. దేశానికి స్వాతంత్యం ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోలేని ఒక ముఖ్యమంత్రిపై నేను చేసిన వ్యాఖ్యలు.. నాలోని ఆగ్రహానికి అక్షరరూపాలు. నేనేమన్నానో మీడియా మిత్రులకూ తెలుసు. చదవండి: చిన్న పార్టీల జోరు..అధిక సీట్ల కోసం బేరసారాలు అదెలా నేరమవుతుంది?. నిజానికి ఠాక్రే.. కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఇంతకంటే దారుణమైన మాటలతో విమర్శించారు. అమిత్ షాను ‘సిగ్గులేని వాడు’ అని, సీఎం యోగిని చెప్పులతో కొట్టాలని ఠాక్రే గతంలో దుర్భాషలాడారు’’ అని రాణె విమర్శించారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయాలని చూసే వారి దవడలు పగలగొట్టాలని పార్టీ కార్యకర్తలకు ఠాక్రే గతంలో ఆదేశించారని రాణె గుర్తుచేశారు. నాసిక్ కేసులో అరెస్ట్ చేయబోం నాసిక్‌లో నమోదైన ‘రాణె వ్యాఖ్యల’ కేసులో ఆయనపై సెప్టెంబర్ 17తేదీ వరకు అరెస్ట్ లాంటి ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసుల నుంచి రక్షణ కల్పించాలంటూ రాణె పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమిత్ దేశాయ్ హాజరయ్యారు. కాగా, అరెస్ట్ సమర్థనీయమేనని మంగళవారం రాత్రి బెయిల్ సందర్భంగా మహాడ్ కోర్టు జడ్జి ఎస్ఎస్ పాటిల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ నిమిత్తం సెప్టెంబర్ రెండున తమ ముందు హాజరవ్వాలని రాణెను నాసిక్ పోలీసులు నోటీసులు జారీచేశారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ -
బ్యాండేజీ కనబడాలంటే షార్ట్స్ వేసుకోండి...
కోల్‌కతా: విరిగిన కాలు మరింత బాగా ప్రదర్శించేందుకు మమతా బెనర్జీ బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలన్న బీజేపీ బెంగాల్ నేత దిలీప్‌ఘోష్ ఒక వీడియోలో చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఇది అత్యంత హేయమైన వ్యాఖ్యగా టీఎంసీ నిప్పులు చెరగగా, పలువురు మహిళలు సైతం సోషల్‌మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోలో దిలీప్ ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అది మమత గురించేనని భావిస్తున్నారు. ‘చీర కట్టిన ఆమె ఒక కాలు కవర్ చేస్తూ, కట్టుకట్టిన కాలు మాత్రం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చీరకట్టు ఎక్కడా చూడలేదు. దీనిబదులు కాలుబ్యాండేజీ ప్రదర్శన కోసం బెర్ముడా షార్ట్స్ ఆమె ధరించడం మంచిది. షార్ట్స్‌తో మంచి ప్రదర్శన చూపవచ్చు’ అని వీడియోలో ఉన్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఇలాంటి నీచమైన మాటలు దిలీప్ నుంచే వస్తాయని టీఎంసీ ఒక ట్వీట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ఇంతగా వివాదాస్పదం చేయాల్సిన పనిలేదని బీజేపీ ప్రతినిధి షమిక్ అన్నారు. మీటింగుల్లో మమతాబెనర్జీ తమ పార్టీనేతలపై ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. -
‘పాకిస్తాన్ వెళ్లిపోండి!’
మీరట్: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను ‘పాకిస్తాన్ వెళ్లిపోండి’ అని మీరట్‌లోని ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. సీఏఏకి వ్యతిరేకంగా మీరట్‌లో డిసెంబర్ 20న లిసారీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆందోళనకారులను ఉద్దేశించి మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ‘నిరసన సందర్భంగా పాక్‌కు మద్దతుగా కొందరు నినాదాలు చేస్తున్నారు. భారత్‌లో ఉండి పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేసే వారు ఆ దేశానికే వెళ్లిపోండి’అని తాను వారికి సలహా ఇచ్చానని సింగ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం తీవ్రంగా తప్పుబడ్డారు. -
అక్బర్ మహిళల్ని వేధించేవాడు
జైపూర్: రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ సరికొత్త వివాదానికి తెరలేపారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ మారువేషంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆయన ఆరోపించారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా గురువారం జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘అక్బర్ మహిళలు మాత్రమే పనిచేసే మీనా బజార్లను ఏర్పాటు చేశాడని ప్రపంచమంతటికీ తెలుసు. అందులోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం. కానీ అక్బర్ మాత్రం మారువేషంలో మీనాబజార్లలోకి ప్రవేశించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే బికనీర్ రాణి కిరణ్‌దేవిని కూడా వేధించడంతో ఆమె అక్బర్ గుండెలపైకి కత్తి దూసింది. వెంటనే అక్బర్ తన ప్రాణాల కోసం వేడుకున్నాడు. అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన తన మతం, సంస్కృతి, గౌరవం కోసం పోరాడాడు. ఇతరుల భూములను లాక్కోలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అర్చనా శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సైనీ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాలను దేశమంతా గౌరవిస్తోందనీ, కానీ చరిత్రకు ఇలాంటి తప్పుడు వక్రీకరణల కారణంగా సమాజంలో విద్వేషాలు వేళ్లూనుకుంటాయనీ, అంతిమంగా దేశసమగ్రతకు నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. -
రాహుల్ ఓ మూర్ఖుడు: హెగ్డే
సాక్షి, బెంగళూరు: రాహుల్ మూర్ఖుడు అంటూ కేంద్ర సహాయ మంత్రి, కర్ణాటకకు చెందిన అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్య కొత్త వివాదం రేపింది. ‘మోదీలైస్’ (మోదీ అబద్ధాలు) అనే కొత్తపదం ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీల్లోకి వచ్చిందంటూ రాహుల్ గురువారం ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. ఇంగ్లిష్‌లోనే మోదీలైస్ అనే పదం లేకున్నా ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉందంటూ రాహుల్ నకిలీ ఫొటో పోస్ట్చేయడంపై హెగ్డే స్పందిస్తూ రాహుల్ గాంధీ మూర్ఖుడని, ప్రపంచంలో బుద్ధిహీనులుగా పేరొందిన వారిలో ఆయన ఒకరని వ్యాఖ్యానించారు. కాగా, మోదీలైస్ అనే పదం తమ డిక్షనరీల్లో దేంట్లోనూ లేదని ఆక్స్ఫర్డ్ స్పష్టంచేసింది. గాడ్సేను పొగుడుతూ హెగ్డే ట్వీట్ చేíసినా దానిని కొద్దిసేపటికే తొలగించారు. తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందనీ, ఆ ట్వీట్ తాను చేయలేదని ఆయన చెప్పారు. రాజీవే పెద్ద హంతకుడు: బీజేపీ ఎంపీ గాడ్సేను ప్రస్తావిస్తూ కర్ణాటకకే చెందిన మరో బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘గాడ్సే చంపింది ఒకరిని. ఉగ్రవాది అజ్మల్ కసబ్ చంపింది 72 మందిని. కానీ రాజీవ్ గాంధీ ఏకంగా 17 వేల మందిని హత్య చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు అత్యంత క్రూరుడు?’ అని మంగళూరు ఎంపీ నళిన్ కుమార్ ట్వీట్ చేశారు. నెటిజన్లు, కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు చెబుతూ నళిన్ మరో ట్వీట్ చేశారు. గాంధీ.. పాక్ జాతిపిత: బీజేపీ ప్రతినిధి గాంధీజీ.. పాకిస్తాన్ జాతిపిత అంటూ బీజేపీ మీడియా వ్యవహారాల బాధ్యతలు చూసే అనిల్ సౌమిత్ర తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. భారత్‌లో గాంధీ వంటి వారు కోట్ల మంది పుట్టారని, వారిలో కొందరు దేశానికి ఉపయోగపడగా, మరికొందరు పనికిరానివారని సౌమిత్ర పేర్కొన్నారు. దీనిపై బీజేపీ తక్షణమే స్పందించింది. సౌమిత్రను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. -
ప్రజ్ఞ అప్పట్లో ఒకరిని పొడిచింది
జబల్పూర్: మాలేగావ్ కేసులో నిందితురాలు, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001లో ఆమె ఒక వ్యక్తిని పొడిచారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రజ్ఞా ఠాకూర్‌కు ఛత్తీస్‌గఢ్‌తో ఒక సంబంధం ఉంది. ఆమె మరిది బిలాయ్‌గఢ్‌లో పనిచేసేవారు. అప్పట్లో ఆమె దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉండేది. 2001లో బిలాయ్‌గఢ్‌లో శైలేంద్ర దేవ్‌గణ్ అనే వ్యక్తి ఛాతీపై ఆమె కత్తితో పొడిచింది. ఆమె తరచూ గొడవల్లో తలదూర్చేది. ఆమెది నేర స్వభావం. అంతేతప్ప, సాధ్వి మాదిరిగా మాత్రం కాదు’ అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి హితేశ్ బాజ్‌పేయి తీవ్రంగా స్పందించారు. ‘సీఎం సారీ చెప్పాలి. లేదంటే మేం వేసే పరువునష్టం కేసుకు సిద్ధపడాలి’ అని హెచ్చరించారు. -
నా శాపంతోనే కర్కరే బలి
భోపాల్/న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(48) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించినందునే ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని చెప్పారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ..‘మాలేగావ్ పేలుడు కేసులో ముంబై జైలులో ఉన్న నన్ను విచారించడానికి హేమంత్ కర్కరే వచ్చారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరక్కుంటే దానిని సృష్టించేందుకు ఎందాకైనా వెళ్తానన్నాడు. అప్పటిదాకా జైలు నుంచి బయటకు వదిలేది లేదన్నాడు. దుర్భాషలాడుతూ తీవ్రంగా హింసించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నాకేమీ తెలియదు, అంతా ఆ దేవుడికే తెలుసని బదులిచ్చా. తెల్సుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్లాలా? అని ప్రశ్నించాడు. కావాలనుకుంటే వెళ్లాలన్నాను. నువ్వు నాశనమైపోతావని శపించా. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆయన్ను ఉగ్రవాదులు చంపేశారు’ అని అన్నారు. మోసకారి, దేశద్రోహి, మత వ్యతిరేకి అంటూ కర్కరేను ఆమె దూషించారు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు అందిందని, విచారణ చేయిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ తను శపించడంతోనే కర్కరే చనిపోయారన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరేను ద్రోహిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ నేతలు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్‌సభ స్థానంలో ఆమె ప్రత్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన్ను చూసి మనమంతా గర్వపడాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించింది. ‘అశోక్ చక్ర అవార్డు గ్రహీత కర్కరే త్యాగాన్ని అందరూ గౌరవించాలి. ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలి’ అని ట్విట్టర్లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది’అని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆమె వంటి వ్యక్తులతో జరిగిన పోరాటంలోనే కర్కరే చనిపోయారు. ఆయన మృతికి ఉగ్రదాడి కేసు నిందితురాలు శాపం కారణం కాదు. ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనకున్న హక్కులను కాపాడే క్రమంలోనే ఆయన పోరాడుతూ చనిపోయారు. వీర జవాన్లను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంతధైర్యం?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం: బీజేపీ తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. ‘నేను వ్యక్తిగతంగా అనుభవించిన బాధతో ఆ వ్యాఖ్యలు చేశా. నా మాటలను దేశ వ్యతిరేకులు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ వ్యాఖ్యలతో బాధ కలిగితే క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపారని ఆమె సహాయకుడు తెలిపారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జైలులో ఉండగా శారీరకంగా, మానసికంగా అనుభవించిన వేదనతో ప్రజ్ఞా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ తెలిపింది. ‘ఉగ్రవాదులను సాహసంతో ఎదుర్కొని పోరాడుతూ కర్కరే ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆయన్ను వీర జవానుగానే భావిస్తుంది’ అని పేర్కొంది. -
నేనెందుకు క్షమాపణ చెప్పాలి?
‘‘నేనెప్పుడూ ఎవర్నీ క్షమించమని అడగలేదు. అది మా రక్తంలోనే లేదు. అయినా నేనెందుకు క్షమాపణ అడగాలి. నేనేమైనా హత్య చేశానా’’ అని విరుచుకుపడ్డారు రాధారవి. నయనతారపై ఆ మధ్య ‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాధారవి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో చాలామంది రాధారవిని తప్పు పట్టారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజులకు ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను (నయనతార) బాధపెట్టి ఉంటే పశ్చాత్తాపపడుతున్నా’’ అని పేర్కొన్నారు రాధారవి. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో రాధారవి మాట్లాడుతూ – ‘‘ఒకవేళ ఆరోజు నేను మాట్లాడింది తప్పయితే అక్కడున్నవాళ్లు సపోర్ట్ చేసేవాళ్లు కాదు. ఇప్పుడు నా నుంచి క్షమాపణ ఎదురు చూస్తే చెప్పడానికి రెడీగా లేను. నటుడిగా నాకు అవకాశాలు రావంటున్నారు. అయితే నన్నెవరూ ఆపలేరు. సినిమాలు కాకపోతే నాటకల్లో నటిస్తాను’’ అన్నారు. -
ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం
ముంబై: తాము అధికారంలోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండ్రోజులు జైలులో పెడతామని దళిత నేత, ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా దిగ్రాస్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..‘పుల్వామా దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయినా మనం మౌనంగా ఎందుకు కూర్చోవాలి? పుల్వామా ఘటనపై మాట్లాడవద్దని మనకు చెప్పారు. అలా చెప్పే అధికారం ఈసీకి ఎక్కడిది? రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. మేం బీజేపీ కాదు. ఈ ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తే ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే రద్దుచేసిన పెద్దనోట్లను చలామణిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రకాశ్ అంబేడ్కర్ ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. యావత్మల్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో దిగ్రాస్ పోలీసులు ఐపీసీ 503, 505, 189 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేశారు. కాగా, తాను మామూలుగానే మాట్లాడానని, తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకాశ్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఏప్రిల్ 11 నుంచి 29 వరకూ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. -
మాయావతి హిజ్రా కన్నా అధ్వానం
చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. -
సిద్ధూపై మంత్రుల గుస్సా
చండీగఢ్/జైపూర్: తన కెప్టెన్ రాహుల్ గాంధీయే తప్ప, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాదంటూ పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ సలహా మేరకే పాక్‌లో కర్తార్‌పూర్ కారిడార్ పనుల ప్రారంభానికి వెళ్లినట్లు సిద్ధూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీటిపై సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడంతో సిద్దూ కాస్తంత వెనక్కి తగ్గి..‘పాక్‌లో నా పర్యటన విషయంలో రాహుల్‌గాంధీ జోక్యం ఏమీ లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే’ అంటూ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిద్ధూపై తోటి మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం తగ్గలేదు. దీనిపై మంత్రులు తృప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్మీత్ సింగ్ సోధి మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మా నేత. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. పంజాబ్‌లో మా ప్రభుత్వ కెప్టెన్ అమరీందర్. ఆయన కెప్టెన్సీలోని మంత్రి వర్గంలో సిద్ధూయే కాదు సీఎం అమరీందర్‌ను కెప్టెన్‌గా అంగీకరించని వారెవరైనా మంత్రి వర్గం నుంచి వెంటనే తప్పుకోవాలి. లేదా క్షమాపణ చెప్పి పంజాబ్‌లో సీఎం అమరీందరే కెప్టెన్ అన్న విషయం అంగీకరించాలి’ అని అన్నారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యల వ్యవహారం సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
మీటూ : బీజేపీ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మీటూ ఉద్యమంపై మరో మధ్యప్రదేశ్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు, ఎదుగుదల కోసం కొందరు మహిళలు తమ విలువలు, సిద్ధాంతాలతో రాజీపడతారని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ అన్నారు. దీంతోనే మహిళలు ఇబ్బందుల పాలవుతారని, మీటూ క్యాంపెయిన్‌ను దుర్వినియోగపరుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఉషా ఠాకూర్ వివాదాస్పద ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. నవరాత్రి ఉత్సవ వేదికల వద్దకు ముస్లిం యువకులను అనుమతించరాదని 2014 సెప్టెంబర్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందూ యువతులను వారు లోబరుచుకుని తర్వాత వారిని ఇస్లాంలోకి మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భా వేడుకల్లో పాల్గొనే యువతులు సంప్రదాయక దుస్తులు వేసుకునేలా చూడాలని ఆమె నిర్వాహకులను కోరారు. గత రెండు వారాలుగా పలు రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడిస్తూ బాహాటంగా ముందుకు రావడంతో మీటూ ఉద్యమం ఊపందుకుంది. -
బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను
-
‘కూర్చుంటావా లేదా కాళ్లు విరగ్గొట్టాలా..?’
కోల్‌కతా : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మరోసారి నోరు జారారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాబుల్ ‘మీ కాళ్లు విరగొట్టాలా’ అంటూ అక్కడికి వచ్చిన వారిని బెదిరించాడు. వివరాల ప్రకారం.. అసన్సోల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు, ఇతర పరికారాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబుల్ సుప్రీయో అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ సభ నిర్వాహకుడు అతన్ని అడ్డగించి కూర్చోవాల్సిందిగా కోరాడు. దీన్ని గమనించిన బాబుల్ తన ప్రసంగాన్ని ఆపి.. సదరు వ్యక్తితో ‘నీ సమస్య ఏంటీ.. ఎక్కడికి వెళ్తున్నావ్.. కూర్చో, లేదంటే నీ కాళ్లు విరగొట్టి స్ట్రెచర్ మీద పడుకోబెడతాను. నేను ఒక్క మాట చెబితే సెక్యూరిటీ వాళ్లు నీకు తగిన శాస్తి చేస్తారం’టూ సదరు దివ్యాంగున్ని హెచ్చరించారు. దివ్యాంగులు కార్యక్రమానికి వచ్చిన మంత్రి వారినే ఇలా బెదిరించడంతో అక్కడున్న వారు విస్తు పోయారు. అయితే బాబుల్ ఇలా దురుసుగా మాట్లాడటం ఇదే ప్రథమం కాదు. ఈ ఏడాది మార్చిలో శ్రీరామ నవమి ఏర్పాట్లలో భాగంగా అల్లర్లు చెలరేగాయి. అసన్సోలో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పర్యటించిన బాబుల్ సుప్రియో చుట్టూ జనాలు గుమికూడారు. దాంతో సుప్రియో వారి మీద చిరాకు పడుతూ ‘నేను తల్చుకుంటే బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను’ అంటూ వారిపై మండి పడ్డారు -
రాహుల్‌పై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పట్నా : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం నేపథ్యంలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చూబే వ్యాఖ్యానించారు. బిహార్‌లోని ససరాంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌తో రాఫెల్ డీల్‌పై ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ చేస్తున్న దాడి అర్ధరహితమని అన్నారు. ఆకాశం వంటి సమున్నత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్న రాహుల్‌ను మానసిక వ్యాధుల ఆస్పత్రిలో చేర్చాలని అన్నారు. రాహుల్ తనకు తాను గొప్ప వ్యక్తిగా, మేధావిగా, సరైన వ్యక్తిగా ఊహించుకుంటూ రఫేల్ ఒప్పందంలో మోదీ అవాస్తవాలు చెబుతున్నారని రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. స్కీజోఫ్రెనియా వ్యాధితో బాధపడే వ్యక్తులే ఇలా వ్యవహరిస్తారని, ఆయనను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని మంత్రి సూచించారు. అవినీతి మాతగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ బిహార్‌లో మహా కూటమిని మహా అవినీతి కూటమిగా మార్చిందని ఆరోపించారు. దేశానికి నరేంద్ర మోదీ వంటి పురోగామి ప్రధాని అవసరమని, దేశమంతా తిరిగి మోదీని ప్రధానిని చేసేందుకు ఏకమవుతోందన్నారు. కాగా రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూబేకు ఇదే తొలిసారి కాదు. ఎవరో రాసిన స్ర్కిప్ట్‌ను చదివే చిలక రాహుల్ గాంధీ అని 2015లో ఆయన ఆరోపించారు. -
క్షమాపణ ఎందుకు చెప్పాలన్న శశి థరూర్..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారత్‌ను హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందన్న తన వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించుకున్నారు. హిందూ రాజ్య భావన పట్ల బీజేపీకి విశ్వాసం లేకుంటే ఆ విషయం స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని తాను నేరుగా తన వ్యాఖ్యల్లో చెప్పానని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామిక రాజ్యాంగం మనం అర్ధం చేసుకున్న విధంగా ఉండదని, వారి ఇష్టానుసారం అందులోని అంశాలను మార్చివేస్తారని, దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తారని శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. థరూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను శశి థరూర్ తోసిపుచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మూల సిద్ధాంతాన్నే తాను ప్రస్తావించానని, హిందూ రాష్ట్ర భావనపై వారికి విశ్వాసం లేదని స్పష్టంగా ప్రకటిస్తే చర్చ ముగుస్తుందని అన్నారు. వారి సిద్ధాంతానికి అనుగుణంగా తాను వ్యాఖ్యానిస్తే క్షమాపణ చెప్పడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. -
సుప్రీం అంటే దళితులకు భయం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నివారణ చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేయడం, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన జడ్జీలకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల వెల్లువెత్తిన నిరసనలు సుప్రీంకోర్టు అంటే దళితుల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఎగువ న్యాయ వ్యవస్థలో దళితులు, పేదలకు న్యాయబద్ధ ప్రాతినిధ్యం దక్కేలా ఆయన పార్టీ, ఎన్డీయే భాగస్వామి అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గురువారం ‘హల్లా బోల్, దర్వాజా ఖోల్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కుష్వాహ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థే మూల స్తంభం లాంటిదని, కానీ న్యాయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. ‘టీ అమ్మే వ్యక్తి ప్రధాని కావొచ్చు. దినసరి కూలీ బిడ్డ ఐఏఎస్ అధికారి కావొచ్చు. పేద కుటుంబాల నుంచి ఎంత మంది జడ్జీలు వచ్చారో సుప్రీంకోర్టు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కోరారు. -
మహిళా జర్నలిస్ట్ పై మంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు. సమావేశం విషయమై పార్టీ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తుందనీ, దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. అయినా ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నలు అడగటం మానకపోవడంతో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని మంత్రి మరోసారి చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగడంతో విజయభాస్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునే క్రమంలోనే తానలా అన్నట్లు చెప్పారు. వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. -
‘మీసం, తోక వెంట్రుకలకు ఉన్నంత తేడా’
శివ్‌పురి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ నేతలకు మధ్య...మీసాల్లో ఉండే వెంట్రుకలకు, తోకలో ఉండే వెంట్రుకలకు ఉన్నంత తేడా ఉందంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పేశ్ ఠాకూర్ల మద్దతుతో కాంగ్రెస్ బీజేపీపై పోరాడటాన్ని ప్రస్తావిస్తూ తోమర్ ఈ మాటలన్నారు. ఈ విషయంపై పీటీఐ సోమవారం మంత్రిని వివరణ కోరగా ‘నేను ఏ కాంగ్రెస్ నేత పేరునూ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ నేతలు, మోదీ వ్యక్తిత్వాల మధ్య తేడాను మాత్రమే ప్రస్తావించాను’ అని చెప్పారు. -
అమలాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవల తీరుపై అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయన్నారు. 'డబ్బు సంపాదన కోసం వైద్య విలువలు మరిచి.. సిగ్గూ ఎగ్గూ వదిలేసే స్థాయికి దిగజారే ఆస్పత్రులు పుట్టుకురావడం దురదృష్టకరం. చనిపోయినవారికి కూడా వెంటిలేటర్ అమర్చి డబ్బులు గుంజుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయి' అని రవీంద్రబాబు అన్నారు. ప్రభుత్వాస్పత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ ఆస్పత్రులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. దిక్కూమొక్కూలేని అనాథలు మాత్రమే ధర్మాస్పత్రులకు వెళుతున్నారు' అని ఎంపీ వ్యాఖ్యానించారు. మెజారిటీ వర్గంవారు నిర్వహించే పండుగలు, ఆర్మీ జవాన్లను ఉద్దేశించి కూడా రవీంద్రబాబు గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.