
‘‘నేనెప్పుడూ ఎవర్నీ క్షమించమని అడగలేదు. అది మా రక్తంలోనే లేదు. అయినా నేనెందుకు క్షమాపణ అడగాలి. నేనేమైనా హత్య చేశానా’’ అని విరుచుకుపడ్డారు రాధారవి. నయనతారపై ఆ మధ్య ‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాధారవి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో చాలామంది రాధారవిని తప్పు పట్టారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజులకు ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను (నయనతార) బాధపెట్టి ఉంటే పశ్చాత్తాపపడుతున్నా’’ అని పేర్కొన్నారు రాధారవి. అయితే ఇటీవల ఓ ఈవెంట్‌లో రాధారవి మాట్లాడుతూ – ‘‘ఒకవేళ ఆరోజు నేను మాట్లాడింది తప్పయితే అక్కడున్నవాళ్లు సపోర్ట్ చేసేవాళ్లు కాదు. ఇప్పుడు నా నుంచి క్షమాపణ ఎదురు చూస్తే చెప్పడానికి రెడీగా లేను. నటుడిగా నాకు అవకాశాలు రావంటున్నారు. అయితే నన్నెవరూ ఆపలేరు. సినిమాలు కాకపోతే నాటకల్లో నటిస్తాను’’ అన్నారు.