ప్రకాశ్ అంబేడ్కర్
ముంబై: తాము అధికారంలోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండ్రోజులు జైలులో పెడతామని దళిత నేత, ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా దిగ్రాస్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..‘పుల్వామా దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయినా మనం మౌనంగా ఎందుకు కూర్చోవాలి? పుల్వామా ఘటనపై మాట్లాడవద్దని మనకు చెప్పారు. అలా చెప్పే అధికారం ఈసీకి ఎక్కడిది? రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. మేం బీజేపీ కాదు.
ఈ ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తే ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే రద్దుచేసిన పెద్దనోట్లను చలామణిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రకాశ్ అంబేడ్కర్ ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. యావత్మల్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో దిగ్రాస్ పోలీసులు ఐపీసీ 503, 505, 189 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేశారు. కాగా, తాను మామూలుగానే మాట్లాడానని, తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకాశ్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఏప్రిల్ 11 నుంచి 29 వరకూ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment