
ఉపేంద్ర కుష్వాహ
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నివారణ చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేయడం, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన జడ్జీలకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల వెల్లువెత్తిన నిరసనలు సుప్రీంకోర్టు అంటే దళితుల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
ఎగువ న్యాయ వ్యవస్థలో దళితులు, పేదలకు న్యాయబద్ధ ప్రాతినిధ్యం దక్కేలా ఆయన పార్టీ, ఎన్డీయే భాగస్వామి అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గురువారం ‘హల్లా బోల్, దర్వాజా ఖోల్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కుష్వాహ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థే మూల స్తంభం లాంటిదని, కానీ న్యాయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. ‘టీ అమ్మే వ్యక్తి ప్రధాని కావొచ్చు. దినసరి కూలీ బిడ్డ ఐఏఎస్ అధికారి కావొచ్చు. పేద కుటుంబాల నుంచి ఎంత మంది జడ్జీలు వచ్చారో సుప్రీంకోర్టు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment