మీడియాతో మాట్లాడుతున్న వినేశ్ ఫొగాట్, బజరంగ్, సాక్షి మలిక్
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు.
కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది.
మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్‌ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment