
కోల్‌కతా: విరిగిన కాలు మరింత బాగా ప్రదర్శించేందుకు మమతా బెనర్జీ బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలన్న బీజేపీ బెంగాల్ నేత దిలీప్‌ఘోష్ ఒక వీడియోలో చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఇది అత్యంత హేయమైన వ్యాఖ్యగా టీఎంసీ నిప్పులు చెరగగా, పలువురు మహిళలు సైతం సోషల్‌మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోలో దిలీప్ ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అది మమత గురించేనని భావిస్తున్నారు.
‘చీర కట్టిన ఆమె ఒక కాలు కవర్ చేస్తూ, కట్టుకట్టిన కాలు మాత్రం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చీరకట్టు ఎక్కడా చూడలేదు. దీనిబదులు కాలుబ్యాండేజీ ప్రదర్శన కోసం బెర్ముడా షార్ట్స్ ఆమె ధరించడం మంచిది. షార్ట్స్‌తో మంచి ప్రదర్శన చూపవచ్చు’ అని వీడియోలో ఉన్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఇలాంటి నీచమైన మాటలు దిలీప్ నుంచే వస్తాయని టీఎంసీ ఒక ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ఇంతగా వివాదాస్పదం చేయాల్సిన పనిలేదని బీజేపీ ప్రతినిధి షమిక్ అన్నారు. మీటింగుల్లో మమతాబెనర్జీ తమ పార్టీనేతలపై ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.