broken leg
-
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్‌లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
బ్యాండేజీ కనబడాలంటే షార్ట్స్ వేసుకోండి...
కోల్‌కతా: విరిగిన కాలు మరింత బాగా ప్రదర్శించేందుకు మమతా బెనర్జీ బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలన్న బీజేపీ బెంగాల్ నేత దిలీప్‌ఘోష్ ఒక వీడియోలో చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఇది అత్యంత హేయమైన వ్యాఖ్యగా టీఎంసీ నిప్పులు చెరగగా, పలువురు మహిళలు సైతం సోషల్‌మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోలో దిలీప్ ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అది మమత గురించేనని భావిస్తున్నారు. ‘చీర కట్టిన ఆమె ఒక కాలు కవర్ చేస్తూ, కట్టుకట్టిన కాలు మాత్రం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చీరకట్టు ఎక్కడా చూడలేదు. దీనిబదులు కాలుబ్యాండేజీ ప్రదర్శన కోసం బెర్ముడా షార్ట్స్ ఆమె ధరించడం మంచిది. షార్ట్స్‌తో మంచి ప్రదర్శన చూపవచ్చు’ అని వీడియోలో ఉన్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఇలాంటి నీచమైన మాటలు దిలీప్ నుంచే వస్తాయని టీఎంసీ ఒక ట్వీట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ఇంతగా వివాదాస్పదం చేయాల్సిన పనిలేదని బీజేపీ ప్రతినిధి షమిక్ అన్నారు. మీటింగుల్లో మమతాబెనర్జీ తమ పార్టీనేతలపై ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. -
కాలికి నూనె రాస్తే.. ప్రాణం పోయింది!!
చావు రాసిపెట్టి ఉంటే.. అది ఏ రూపంలోనైనా రావచ్చు. ఢిల్లీలో 23 ఏళ్ల యువకుడికి అలాగే జరిగింది. కాలు నొప్పిగా ఉందని తల్లితో కాలికి నూనె రాయించుకుంటే.. కాసేపటికల్లా అతడు ప్రాణాలు కోల్పోయాడు! అతడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా కాలి మడమకు గాయమైంది. దాంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కట్టు వేశారు. దానివల్ల అతడి కాలి నరాల్లో రక్తం గడ్డ కట్టింది. గాయం మానే సమయానికి ప్లాస్టర్ తీసేసినా.. ఆ గడ్డకట్టిన రక్తం కారణంగా కాలి వాపు, నొప్పి అలాగే ఉన్నాయి. దాంతో అతడి తల్లి కాలికి నూనె రాసి కొద్దిగా మర్దనా చేస్తే తగ్గుతుందని భావించి.. అలాగే చేశారు. కానీ, దానివల్ల గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల వరకు వెళ్లి, కొద్ది సేపటికే అతడు మరణించాడు. దాదాపు 5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ రక్తపు గడ్డ తొలుత కాలి నరంలోనే ఉండిపోయిందని, అయితే మసాజ్ కారణంగా అది ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మనరీ ఆర్టెరీ వరకు వెళ్లి అతడు అక్కడికక్కడే మరణించాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యలు తెలిపారు. ఇంటి దగ్గర స్పృహ తప్పి పడిపోగానే అతడిని ఎయిమ్స్‌కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. 'డీప్ వెయిన్ త్రాంబోసిస్' అనేది అరుదుగా సంభవిస్తుందని, అది ఒకోసారి ప్రాణాంతంకంగా మారుతుందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. కాలికి వేసిన కట్టు తొలగించిన తర్వాత కూడా వాపు, నొప్పి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలని, వాళ్లు అవసరమైతే వాస్క్యులర్ సర్జన్ వద్దకు పంపుతారని ఆయన చెప్పారు. లక్ష మందిలో సుమారు 70 మందికి ఈ సమస్య ఉంటుందని, ఎక్కువ సేపు కాళ్లు కదిలించకుండా ఉంచేయడం, సుదూర ప్రయాణాల లాంటి సందర్భాల్లో ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పుడైనా ఫ్రాక్చర్ల లాంటివి జరిగినప్పుడు అక్కడ మసాజ్ చేయకూడదని, కావాలంటే నూనె పోయడం లేడా వాపును అరికట్టే క్రీములు రాయడం లాంటివి చేయొచ్చు గానీ పొరపాటున కూడా ఒత్తిడి కలిగించకూడదని డాక్టర్ గుప్తా చెప్పారు. ఈ కేసు గురించి తాజాగా వెలువడిన మెడికో లీగల్ జర్నల్‌లో వివరించారు. వైద్యులు కూడా మసాజ్ చేయొద్దని సలహా ఇవ్వడం లేదని.. తప్పనిసరిగా ఇలాంటి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. -
కళ్లు తెరవకముందే.. కాలు విరిచారు
♦ బలవంతంగా బయటకు తీయడంతో విరిగిన పాప కాలు ♦ సుల్తాన్‌బజార్ ఆసుపత్రిలో దారుణం హైదరాబాద్: కాలుకు కట్టుతో కనిపిస్తున్న ఈ నవజాత శిశువు శుక్రవారమే కళ్లు తె రిచింది. ఆపరేషన్ చేసి పాపను బయటకు తీస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాప కాలు విరిగి పోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసేపటి వరకు చెప్పలేదు. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టారు. దీంతో కన్నీరుమున్నీరవుతూ పాప తండ్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కాలుకు కట్టు కట్టించారు. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన లింగస్వామి భార్య లక్ష్మి రెండో కాన్పు కోసం ఈ నెల 13న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సహా ఇతర పరీక్షలు చేశారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం 10.15 నిమిషాలకు లక్ష్మికి సిజేరియన్ చేయగా.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డను చూపించేందుకు సిబ్బంది నిరాకరించారు. లింగస్వామికి అనుమానం వచ్చి సిబ్బందిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ప్రసవ సమయంలో శిశువు కాలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. పాపను తొలుత చికిత్స కోసం నిలోఫర్‌కు పంపగా అక్కడ ఆర్థోపెడిక్ వైద్యులు లేకపోవడంతో చేర్చుకోలేదు. చివరికి ఉస్మానియా అర్థోపెడిక్ ఓపీకి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు శిశువు కాలుకు సిమెంట్ పట్టీ వేసి తిప్పి పంపారు. శుక్రవారం తమ ఇంట లక్ష్మి జన్మించిందనే ఆనందం అంతలోనే ఆవిరైపోయిందని తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఉమ్మనీరు ఎక్కువ కావడం వల్లే..: ఆర్ఎంవో విద్యావతి తల్లి కడుపులో ఉమ్మనీరు ఎక్కువ కావడం వల్లే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. కడుపులో ఉన్న శిశువును బలవంతంగా బయటికి తీసే సమయంలో కాలు ఎముక విరిగింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శిశువు ప్రాణానికి ఎలాంటి హాని లేదు. వైద్యుల నిర్లక్ష్యం లేదు. ఒకవేళ ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.