కళ్లు తెరవకముందే.. కాలు విరిచారు
♦ బలవంతంగా బయటకు తీయడంతో విరిగిన పాప కాలు
♦ సుల్తాన్‌బజార్ ఆసుపత్రిలో దారుణం
హైదరాబాద్: కాలుకు కట్టుతో కనిపిస్తున్న ఈ నవజాత శిశువు శుక్రవారమే కళ్లు తె రిచింది. ఆపరేషన్ చేసి పాపను బయటకు తీస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాప కాలు విరిగి పోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసేపటి వరకు చెప్పలేదు. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టారు. దీంతో కన్నీరుమున్నీరవుతూ పాప తండ్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కాలుకు కట్టు కట్టించారు. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన లింగస్వామి భార్య లక్ష్మి రెండో కాన్పు కోసం ఈ నెల 13న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.
ప్రసవానికి ముందు ఆమెకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సహా ఇతర పరీక్షలు చేశారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం 10.15 నిమిషాలకు లక్ష్మికి సిజేరియన్ చేయగా.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డను చూపించేందుకు సిబ్బంది నిరాకరించారు. లింగస్వామికి అనుమానం వచ్చి సిబ్బందిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ప్రసవ సమయంలో శిశువు కాలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. పాపను తొలుత చికిత్స కోసం నిలోఫర్‌కు పంపగా అక్కడ ఆర్థోపెడిక్ వైద్యులు లేకపోవడంతో చేర్చుకోలేదు. చివరికి ఉస్మానియా అర్థోపెడిక్ ఓపీకి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు శిశువు కాలుకు సిమెంట్ పట్టీ వేసి తిప్పి పంపారు. శుక్రవారం తమ ఇంట లక్ష్మి జన్మించిందనే ఆనందం అంతలోనే ఆవిరైపోయిందని తల్లిదండ్రులు తల్లడిల్లారు.
ఉమ్మనీరు ఎక్కువ కావడం వల్లే..: ఆర్‌ఎంవో విద్యావతి
తల్లి కడుపులో ఉమ్మనీరు ఎక్కువ కావడం వల్లే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. కడుపులో ఉన్న శిశువును బలవంతంగా బయటికి తీసే సమయంలో కాలు ఎముక విరిగింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శిశువు ప్రాణానికి ఎలాంటి హాని లేదు. వైద్యుల నిర్లక్ష్యం లేదు. ఒకవేళ ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.