దూకుడుతో శిశురక్షణ | Baby Jumping Festival may seem strange to new listeners | Sakshi
Sakshi News home page

దూకుడుతో శిశురక్షణ

Published Sun, Feb 9 2025 2:30 AM | Last Updated on Sun, Feb 9 2025 2:30 AM

Baby Jumping Festival may seem strange to new listeners

కార్పస్‌ క్రిస్టీ కేథలిక్‌ పండుగగా చెప్పుకునే ‘బేబీ జంపింగ్‌ ఫెస్టివల్‌’ కొత్తగా వినేవారికి, చూసేవారికి వింతగా అనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లోని కాంటాబ్రియన్‌ పర్వతాల దిగువన ఉన్న ‘కాస్ట్రిలో డి ముర్సియా’ అనే కుగ్రామంలో ఏటా ఈ పండుగను జరుపుకొంటారు. వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు. సుమారు రెండువందల సంవత్సరాలుగా తమకు ఈ ఆచారముందని అక్కడి వారు చెబుతారు. ‘ఎల్‌ కొలాచో’ (ది డెవిల్‌) అని పిలుచుకునే పసుపురంగు ముసుగులాంటి దుస్తులు ధరించిన కొందరు యువకులు, దయ్యాలను తలపిస్తూ ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తారు.

పసుపు రంగు దుస్తులు వేసుకున్న ‘ఎల్‌ కొలాచో’లు స్థానికంగా ఈ వేడుకను చూడటానికి వచ్చిన వారిని కూడా హడలెత్తిస్తుంటారు. భయపెడుతూ, తరుముతూ పరుగులెత్తిస్తుంటారు. వారు తమ చేతిలో గంటలాంటి ఒక వస్తువుని పట్టుకుని, విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ, ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పెద్ద పెద్ద డప్పులు, అరుపులు భయపెట్టేలా ఉంటాయి. నల్లటి కోట్లు, టోపీలు ధరించిన మరికొందరు వ్యక్తులు గంభీరంగా, ఈ ‘ఎల్‌ కొలాచో’లతో పాటు ఊరేగింపులో నడుస్తారు. 

ఈ వేడుకలో రోడ్డు పొడవునా పరుపులు, తలదిళ్లు పరిచి, వాటిపై ఏడాదిలోపు పసిపిల్లలను వరుసగా పడుకోబెడతారు. వారి మీద నుంచి ‘ఎల్‌ కొలాచో’ అనే యువకులను, పిల్లల పైనుంచి దూకిస్తారు. అలా దూకితే పిల్లలపై భూత ప్రేత పిశాచాల పీడ పడదని, దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారి నమ్మకం.

అలా పిల్లల మీద నుంచి దూకిన తర్వాత మతపెద్దలు ప్రార్థనలు జరిపి, ఆ పసివాళ్లను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల నుంచి, గులాబీ రేకులతో పిల్లలకు దీవెనలు అందుతాయి. ఇదంతా వేడుక రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపే ముగుస్తుంది. అయితే, ఈ వేడుకపై పలు విమర్శలున్నాయి. చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తున్నా, కొందరు మాత్రం తమ పిల్లల క్షేమం కోసం ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement