కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మోస్తరు ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ అనుమతించనున్నట్లు తెలిపారు. మొత్తం ఓటింగ్ శాతాన్ని శుక్రవారం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. భవానీపూర్‌లో టీఎంసీ తరఫున సీఎం మమత, బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్, సీపీఎం తరఫున శ్రిజిబ్ బిశ్వాస్‌లు బరిలోకి దిగారు.
ముర్షిదాబాద్‌లోని సంసేర్ గంజ్‌లో 78.60 శాతం, జంగిపూర్‌లో 76.12శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ టీఎంసీ, బీజేపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ వద్దకు 97 ఫిర్యాదులు రాగా, వాటిలో 91 ఫిర్యాదులను అధికారులు కొట్టేశారు. 97 ఫిర్యాదుల్లో 85 ఫిర్యాదులు సీఎం పోటీ చేస్తున్న భవానీపూర్‌లోనే రావడం గమనార్హం. మేలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ తన పదవిని నిలబెట్టుకొనేందుకు ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది.
ఒడిశా ఉప ఎన్నికలో 68.40 శాతం ఓటింగ్..
పిపిలి: ఒడిశాలోని పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల సమయానికి 68.40శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్‌కే లోహని తెలిపారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ 19 నియమావళి ప్రకారం ఓటింగ్ జరిగిందని, భద్రతబలగాలు అందుకు సాయపడ్డాయని చెప్పారు. అక్టోబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద మమత
Comments
Please login to add a commentAdd a comment