దేశాన్ని రక్షించేందుకు బీజేపీని గెలిపించాలి | Dilip Ghosh On Why BJP Is Confident Of Victory In West Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ గెలుపు బీజేపీకి కీలకం

Mar 17 2021 3:05 AM | Updated on Mar 17 2021 3:31 AM

Dilip Ghosh On Why BJP Is Confident Of Victory In West Bengal - Sakshi

‌కోల్‌కతా: పార్టీ సైద్ధాంతిక భావజాల వ్యాప్తికే కాక, దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు కూడా బీజేపీ బెంగాల్‌లో గెలిచి తీరాలని, బీజేపీ బెంగాల్‌ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవడంపై ఘోష్‌ మాట్లాడుతూ కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇతర రాజకీయ పార్టీల నుంచి చేరికలు అవసరమని అంగీకరించారు. బీజేపీ భావజాలం, ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ బీజేపీకి బలమని, అయితే వివిధ స్థాయిల్లో పాపులర్‌ వ్యక్తులు లేకపోవడం రాష్ట్రంలో పార్టీ ఎదుర్కొంటోన్న లోపమని దిలీప్‌ ఘోష్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలోని పలు అంశాలు ఆయన మాటల్లోనే..

తృణమూల్‌ విఫలం..
జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఈ గడ్డపై పుట్టినవాడు కనుక పశ్చిమబెంగాల్‌లో గెలుపు బీజేపీకి కీలకం. దేశ భద్రత గెలుపుతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చాలాకాలం ఎదురుచూశాం. ఇక్కడ గెలుపు మా లక్ష్యం, అదే మాకు సవాల్‌ కూడా. కశ్మీర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం శాంతిని స్థాపించగలిగింది. అయితే దేశంలో అశాంతిని సృష్టించే ఉగ్రవాదుల చొరబాటుకి తూర్పుసరిహద్దులు కేంద్రంగా మారాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. 2011 ఎన్నికల్లో ఓటు వేసి, గెలిపించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ వైఫల్యం చెందింది. తృణమూల్‌ పార్టీ ప్రజలకు ద్రోహం చేసింది. 

పాపులర్‌ ఫేసెస్‌ కావాలి..
వందలాది మంది పార్టీ కార్యకర్తల త్యాగాలూ, రాష్ట్రంలో కార్యకర్తల తిరుగులేని స్ఫూర్తి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి. అయితే పార్టీలో వివిధ స్థాయిల్లో పాపులర్‌ ముఖాలు లేకపోవడం పార్టీకి లోపం. రాష్ట్రంలో అధికార పార్టీకి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అయితే అది ఆ పార్టీ సమర్థత మాత్రం కాదు, గత పదేళ్ళుగా వారు అధికారంలో ఉన్నందువల్లనే. పార్టీలో పాత తరం వారికీ, కొత్తవారికీ మధ్య విభేదాలు పార్టీని ప్రభావితం చేయవు. పార్టీ నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. 

రాజకీయాల్లో కొన్ని తప్పవు..
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ రోజు రోజుకీ బలోపేతం అవుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి చేరుతున్నారని, ఒకవేళ మేం వారిని చేర్చుకోకపోతే, మేం ఎలా పురోగతిని సాధిస్తాం. అందరికీ టిక్కెట్‌రాదు. కొందరు మాత్రమే అభ్యర్థులుగా నిలబడతారు, మిగిలిన వారు వారికి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. అయితే ఏ ఒక్కరూ పార్టీకన్నా గొప్ప వాళ్ళు కాదు. ఎన్నికల రాజకీయాల్లో కొన్ని తప్పవు. ప్రజాస్వామ్యంలో నంబర్‌ కీలకపాత్ర పోషిస్తుంది. మేం ఆ సంఖ్యను పొందాలంటే పార్టీలో చేరికలు అవసరం, వారి మద్దతుదారులు కూడా మా పార్టీలోకి వస్తారు.

టీఎంసీ అవినీతి పార్టీ...
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ కంటే కేవలం నాలుగు సీట్లు తక్కువగా బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి 26 మంది శాసన సభ్యులు, ఇద్దరు ఎంపీలు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌)నుంచి ముగ్గురు శాసన సభ్యులు పార్టీలో చేరారు. పార్టీలో చేరికలు పార్టీ అవినీతి రహిత పోరాటంపై ఎటువంటి ప్రభావం చూపవు. గతంలో వారున్న పార్టీ అవినీతి పార్టీ, అందుకనుగుణంగానే వారు ఆ పార్టీలో పని చేశారు. అయితే బీజేపీలో చేరాక, మా పార్టీ సూత్రాలకనుగుణంగా వారు పనిచేస్తారు. పార్టీలో చేరిన వాళ్ళందరికీ టిక్కెట్టు ఇవ్వరు. వారి గెలుపు అంచనాలను బట్టి మాత్రమే పార్టీ టిక్కెట్టు ఇస్తారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులం దరికీ టిక్కెట్టు ఇవ్వాలని ఏమీ లేదు.

కేవలం పార్టీ సిద్దాంతాలను, భావజాలాన్ని, బీజేపీ విధానాలను చూసే ప్రజలు పార్టీకి ఓటేస్తారు తప్ప, పార్టీలో చేరిన వారిని చూసి కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కారణంగా రాష్ట్రంలో మత రాజకీయాలు పెరిగాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. అయితే మాకు బలమున్న రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించం, ఎక్కడైతే మేం బలహీనంగా ఉంటామో అక్కడ కొన్నిసార్లుసీఎం అభ్యర్థిని ముందుకు తెస్తాం, యిప్పుడు పశ్చిమబెంగాల్‌లో మాది బలమైన పార్టీ.

మిథున్‌ చక్రవర్తి సీఎం అభ్యర్థి కాదు
‘ఇటీవల పార్టీలో చేరిన మిథున్‌ చక్రవర్తి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. నేను బీజేపీలో నమ్మకస్తుడైన సైనికుడిని, నాకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. పశ్చిమ బెంగాల్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే చర్చపై టీఎంసీకి మాట్లాడేందుకు ఏమీ లేదు. మాది ఒక జాతీయ పార్టీ, మాకు సాయం చేయడానికి మా నాయకులు ఇక్కడకు వస్తారు’ అని ఘోష్‌ సర్దిచెప్పుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement