పట్నా : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం నేపథ్యంలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చూబే వ్యాఖ్యానించారు. బిహార్‌లోని ససరాంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌తో రాఫెల్ డీల్‌పై ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ చేస్తున్న దాడి అర్ధరహితమని అన్నారు. ఆకాశం వంటి సమున్నత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్న రాహుల్‌ను మానసిక వ్యాధుల ఆస్పత్రిలో చేర్చాలని అన్నారు. రాహుల్ తనకు తాను గొప్ప వ్యక్తిగా, మేధావిగా, సరైన వ్యక్తిగా ఊహించుకుంటూ రఫేల్ ఒప్పందంలో మోదీ అవాస్తవాలు చెబుతున్నారని రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. స్కీజోఫ్రెనియా వ్యాధితో బాధపడే వ్యక్తులే ఇలా వ్యవహరిస్తారని, ఆయనను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని మంత్రి సూచించారు.
అవినీతి మాతగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ బిహార్‌లో మహా కూటమిని మహా అవినీతి కూటమిగా మార్చిందని ఆరోపించారు. దేశానికి నరేంద్ర మోదీ వంటి పురోగామి ప్రధాని అవసరమని, దేశమంతా తిరిగి మోదీని ప్రధానిని చేసేందుకు ఏకమవుతోందన్నారు. కాగా రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూబేకు ఇదే తొలిసారి కాదు. ఎవరో రాసిన స్ర్కిప్ట్‌ను చదివే చిలక రాహుల్ గాంధీ అని 2015లో ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment