26/11 హీరో హేమంత్ కర్కరే భార్య కన్నుమూత
హేమంత్ కర్కరే.. ఈ పేరు వినగానే ఒక్కసారి ఒళ్లు గగుర్పొడుస్తుంది. 26/11 దాడులు గుర్తుకొస్తాయి. గుండెలు తీసిన బంటులా ధైర్యంగా ముందుకెళ్లి కొంతమంది ఉగ్రవాదులను హతమార్చి, మిగిలిన వాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర కిశోరం హేమంత్ కర్కరే. ఆయన భార్య కవితా కర్కరే బ్రెయిన్ హెమరేజితో మరణించారు. హిందూజా ఆస్పత్రిలో శనివారం చేరేసరికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు ఆమె పరిస్థితిని బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. ఆమెకు జూయి, సయాలీ అనే ఇద్దరు కూతుళ్లు, ఆకాశ్ అనే ఒక కొడుకు ఉన్నారు. ఆమె మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, చర్మం.. ఇలా ఉపయోగపడే అన్ని అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు.
మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్గా వ్యవహరించిన హేమంత్ కర్కరే ఒకేసారి పదిమంది ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. మరికొందరు పోలీసు అధికారులతో పాటు ఆయన్ను కూడా కామా ఆస్పత్రి సమీపంలో ఉగ్రవాదులు హతమార్చారు. అయితే.. సరైన బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాలు లేకపోవడం వల్లే ఆయన మరణించారంటూ కవితా కర్కరే అప్పట్లో ఆరోపించారు. కనీసం మిగిలిన సిబ్బందికైనా వాటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు.